సాహితి

అపూర్వ సాహితీ సృష్టి... ‘పరిపూర్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యం సమాజంపై ప్రభావం చూపించే విధానం అత్యంత సున్నితంగా ఉంటుంది. ఒక రచన పాఠకుడి మెదడులోకి భూమిలోకి నీరు ఇంకిన విధంగా ఇంకుతుంది. అలా ఇంకిన నీటికి మహావృక్షంగా ఎదగగల బీజం తారసపడితే నీరు ఆ బీజంలో కదలిక తెచ్చి మొక్కకు ప్రాణం పోసే విధంగా వ్యక్తిలోని ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది. ఆలోచనలకు దిశనిచ్చి నిర్ణయాలను పరోక్షంగా ప్రభావం చేస్తుంది. సాహిత్య ప్రభావం ప్రత్యక్షంగా కనిపించకున్నా పరోక్షంగా ఉంటుంది. ఈ నిజం గ్రహించిన మన సాహిత్యకారులు, విమర్శకులు సాహిత్యం వీలయినంతగా మంచిని ప్రదర్శించాలని, మంచి చెప్పాలని, పాఠకులకు జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల ఆశను కలిగించి, ఎలాంటి పరిస్థితినయినా ధైర్యంగా ఎదుర్కొనే విశ్వాసాన్ని ఇవ్వాలని భావించారు. మనిషికి చెడు చూపనక్కరలేదు. చెడు చెప్పాల్సిన పనిలేదు. మంచిని చూపిస్తూ, స్వతహాగా మంచి కానిది చెడు అని గ్రహించేట్టు చేయాలి కానీ, ‘చెడు’ను చూపించి ‘ఇది చెడు’ మంచి చేయాలని చెప్పకూడదు. ఎందుకంటే, చెడును ఎంత చెడ్డగా చూపినా దాని ఆకర్షణ శక్తి అమితం. నీరు ఎల్లప్పుడూ పల్లంవైపు ప్రవహించినట్టు మనిషి మనస్సు ఎప్పుడు నిషిద్ధంవైపే ఆకర్షితమవుతూంటుంది. మంచిని చూపుతూ పాఠకులలో సున్నితమైన భావనలను ఉద్దీపితం చేసే రచనలు చేయటం ద్వారా రచయిత పరోక్షంగా సమాజంలో మంచిని పెంచుతూ తన బాధ్యతను నిర్వహించిన వాడవుతాడు. సాహిత్య శక్తి తెలిసిన రచయితలు తమ రచనా శక్తితో సమాజానికి సక్రమమైన దిశను చూపి, మంచిని ప్రదర్శించటం వైపే దృష్టి పెడతారు. సాహిత్య ప్రపంచం ఎంతగా ‘చెడు’వైపు ఆకర్షితమవుతున్నా, వారు ఏటికి ఎదురీదే ప్రయత్నం చేస్తారు తప్ప తమ బాధ్యతను విస్మరించరు. విశ్వనాథ సత్యనారాయణ సృజించిన కథ ‘పరిపూర్తి’ ఇందుకు చక్కని నిదర్శనం.
భర్త అంటే దుష్టుడు. మహిళను వివాహ బంధంలో ఇమిడ్చి అణచివేసే ధూర్తుడు. దాంపత్యం అంటే సంకెళ్లు. వివాహమంటే ప్రేమరాహిత్య జీవితం. మహిళకు స్వేచ్ఛనివ్వని వివాహ బంధం తెంచుకోవాలి. ప్రేమ రాహిత్యపు సంసారం వదిలి ప్రేమను వెతుక్కోవాలి. ప్రేమ ఎప్పుడూ దాంపత్యేతర సంబంధాలలో దొరుకుతుంది. ఇలాంటి భావాలను ప్రదర్శిస్తూ, సున్నితంగా పఠితల మెదళ్లను ప్రభావితం చేసే రచనలను సాహిత్య ప్రపంచంలో ఆదరణ లభిస్తూ విమర్శకుల ప్రశంసలు, గుర్తింపు లభిస్తున్న సమయంలో దాంపత్య ధర్మాన్ని నీచంగా చూపిస్తున్న రచనలు చేయటమే ఆధునికతగా, అభ్యుదయంగా చలామణీ అవుతున్న సమయంలో దాంపత్య జీవితంలోని సున్నితత్వం, సౌకుమార్యం, ఔన్నత్యం వంటి అంశాలను ఎంతో మృదువుగా విశ్వనాథ ‘పరిపూర్తి’ కథలో ప్రస్తావించారు. స్ర్తి పురుషుల నడుమ సంబంధం హక్కుల పోరాటం, అహాల ఆరాటం, అణచివేతల చెలగాటం కాదని పరస్పర అవగాహన, సహకారం వంటివాటితో స్ర్తి పురుషులు సాగించే సహజీవనం సంసారం అని ‘పరిపూర్తి’ కథలో ఒక్క మాట స్పష్టంగా చెప్పకుండానే ఎంతో సున్నితంగా, మార్మికంగా ప్రదర్శించారు.
‘పరిపూర్తి’లో రెండు ప్రధాన పాత్రలు- చంద్రశేఖరరావు, రాధ. చంద్రశేఖరరావు ధనవంతుడి ఒకడే కొడుకు. రాధ పేద పిల్ల. కళ్లుండవు. అందరి చీదరింపులకు, అవహేళనకు గురవుతూంటుంది. బోలెడంత కట్నం ఇచ్చేవాళ్లని కాదని చంద్రశేఖరరావు రాధని ఇష్టపడి పెళ్లిచేసుకుంటాడు. అందరూ రాధ అదృష్టాన్ని పొగుడుతారు. ‘రుూ పిల్లకటువంటి మగడు దొరకటం అదృష్టమే’ అంటారు. ఇది రాధ మనస్సుని గాయపరుస్తుంది. ఆమె న్యూనతాభావానికి గురవుతుంది. ఇక్కడ రచయిత ఎంతో సున్నితంగా సంసార బంధంలోని వైశిష్ట్యాన్ని ప్రదర్శిస్తాడు. సంసారంలో ‘్భర్త అధికుడు, భార్య అతనికన్నా తక్కువ’ అని భావించేవారికి దాంపత్యం అంటే ఏమిటో తెలియదు. దాంపత్యమంటే కలసి ఎదగటం. కలిసి కష్ట సుఖాలను అనుభవించటం. పరస్పర అవగాహనతో సహజీవనం సాగించటం. భార్య న్యూనతాభావాన్ని గ్రహించిన చంద్రశేఖరుడు ‘నిన్నందగత్తెను కాదన్నదెవరు? వారలకేమి తెలియును? నా కన్నులకు నీవు దివ్యాంగన వలెనున్నావు. జగత్తులో స్ర్తిలకు సౌందర్యమెందులకు? భర్త సంతోషించను. నిన్ను కోరి పెళ్లిచేసుకొనుచున్న నాకు నీవన్న సంతోషము లేదని యెవరనగలరు?’ అని ఓదారుస్తాడు. ఇది భార్యాభర్తల సంబంధం. ఒకరి బలహీనతలను మరొకరు ఆధారం చేసుకొని దెబ్బతీయటం కాదు. బలహీనతలను అర్థం చేసుకుని దాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చాలి. సమానుల్లా నడవాలి. ఇందులో ‘స్ర్తిల సౌందర్యం భర్త కొరకు’ అనటం అనేక ఆధునికులకు అభ్యంతరకరంగా తోచవచ్చు. ఎందుకంటే వారి దృష్టిలో స్ర్తి సౌందర్యం ప్రపంచంలోని ఇతర పురుషుల కొరకు. భర్త పోరాటానికి, ఛీత్కారానికి మాత్రమే. ప్రపంచంలో ప్రతి విషయంలో స్ర్తి రాజీ పడవచ్చు కానీ భర్తతో మాత్రం సంసారం విషయంలో రాజీపడకూడదు. అలాంటి భావజాలం కల వారికి విశ్వనాథ చెప్పే ‘మంచి’ రుచించదు. ఇదే భర్త ఆమెని దూషిస్తే, బాధపెడితే, పరపురుషుడెవరో ఆమెకు స్వాంతననిస్తే? గొప్ప అభివృద్ధి కల ఆధునిక కథ! అయితే మంచి ఆలోచనలను సమాజానికి ఇచ్చే లక్ష్యంకల విశ్వనాథ తాను ప్రదర్శించాలనుకున్నది సున్నితంగా ప్రదర్శిస్తాడు. ఎవరి మెప్పును కోరడు.
భర్త మాటలు రాధకు ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. ఒక్క కళ్లు లేకపోవటం తప్ప తన అందానికి లోపం లేదని నమ్ముతుంది. అయితే తన అన్ని లోపాలను తీరుస్తున్న భర్త ఈ ఒక్క లోపాన్ని తీర్చలేడా? అని బాధపడుతుంది. ఈ నా సౌందర్య లోపమునకు పరిపూర్తి యున్నదా? అని రోదిస్తుంది. ఇంతవరకు కథ మామూలుగా నడుస్తుంది. ఇక్కడే కథారచన సంవిధానంలోని ఔన్నత్యం తెలుస్తుంది. రచయిత ‘పరిపూర్తి’ అనే ఒక ఆలోచనను అతి సామాన్యంగా పఠిత మొదట ప్రవేశపెట్టాడు. ఈ విషయం కథ పూర్తిగా చదివితే కానీ తెలియదు. కథ పూర్తయిన తరువాత ఆ విషయం గ్రహింపునకురాగానే అద్భుతం అనిపిస్తుంది. కథ మళ్లీ చదవాలనిపిస్తుంది. మళ్లీ చదువుతూంటే కథలో గొప్పతనం, కథనంలో గొప్పతనం, ఒక అద్భుతమైన సత్యాన్ని అతి సరళంగా, సున్నితంగా ప్రదర్శించి కథ స్థాయిని పెంచిన రచయిత ప్రతిభ పాఠకుడిని ముగ్ధుడిని చేస్తాయి.
రాధ గర్భవతి అవుతుంది. శిశువు జన్మిస్తాడు. శిశువుకు కళ్లు మావారిలా ఉంటాయి. అపుడు ‘శిశువు కళ్లు మీలాగే ఉన్నాయని అందరంటున్నార’ని రాధ అడిగితే, దానికి సమాధానంగా భర్త ‘అబ్బాయి, నీకు కళ్లు వచ్చినట్టని’ అంటాడు. కథ చివరి వాక్యం ఒక్కసారిగా మనస్సులో తటిల్లతలా మెరసి రచయిత కథలో పొందుపరచిన పరమాద్భుతమైన సత్యం మెదడు గ్రహించి వేస్తుంది. పాఠకుడిని విభ్రమకు గురిచేస్తుంది. రాధ కళ్లులేని లోపం సరితీర్చటంతో రాధ అందం పరిపూర్తి అయిందన్నమాట! భార్యాభర్తల ఆశ, లోపాలను తీర్చి వారిని పరిపూర్తి చేసేది సంతానం అన్నమాట. ప్రేమ వ్యక్తిగత అహాలు, వాంఛల కోసం కాదు. మానవ సమాజాభివృద్ధికి దోహదం చేసే చక్కని సంతానం కోసం. సంసారం సెక్స్‌కోసం కాదు, హక్కుల పోరాటం అణచివేతల ఆరాటం కాదు. ఇదొక సామాజిక బాధ్యత. సంసారం ఈ ప్రేమకు పోరాటాల మైదానం కాదు. వ్యక్తుల జీవితాలకు సంపూర్ణత్వం సంతానంతో సిద్ధిస్తుంది. జీవితం పరిపూర్ణం అవుతుందన్న సత్యాన్ని ఎంతో సున్నితంగా, ఉన్నతంగా ప్రదర్శిస్తుందీ కథ ‘పరిపూర్తి’. ఒక ఉన్నతమైన ఆలోచనను, అంతే ఉత్తమంగా మనస్సులో ముద్రితమై, ప్రభావితం చేసే రీతిలో ప్రదర్శించటాన్ని మించిన గొప్ప కథ లేదన్న సత్యాన్ని నిరూపిస్తుంది ‘పరిపూర్తి’ కథ. అయితే సంసార వ్యవస్థను కూలద్రోయటమే ‘ప్రగతి’, అదే ‘అభ్యుదయం’, అదే ‘స్ర్తి విముక్తి’ అనుకునేవారి దృష్టికి ఈ కథ అందకపోవటం వారి దృష్టిదోషం. వారి మెదడు దోషగుణం తప్ప రచయిత ప్రతిభలోపం కాదు. కథ దోషం అంతకంటే కాదు!

- కస్తూరి మురళీకృష్ణ, 9849617392