సాహితి

పేదరికంలో ప్రభవించిన పెద్ద మనసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సావిత్రి కూడా నవ్వగలిగినంతా నవ్వింది. నారాయుణ్ణి కలుసుకున్న కొత్తలో తను నవ్విన నవ్వులాగే ఉండాలి నవ్వు అని ఎంతగానో ప్రయత్నించింది. వాడికన్నా రెట్టింపు ఉత్సాహం చూపించింది. ఆ చిన్న అరుగుమీద, వాళ్లు పడుకున్న కొద్ది జాగాలోనే నారాయుడికి వీలుగా దొరక్కుండా అటూ యిటూ దొర్లి ఏడిపించింది. పొంగిపోతున్న వాడి ఒంటిలో నరనరాన్ని సవాలనే మెలేసింది. వాడితో తనూ మెలికిలు తిరిగింది’-
శ్రీ వి.రాజారామ మోహనరావు 1971లో వ్రాసిన ‘మనసుకు మరోవేపు’ కథానికలో వస్తుంది ఈ వర్ణన. కథలో పాత్రలు బిచ్చం ఎత్తుకు తిరిగే నారాయుడు. వాడికి తోడుగా తందనాలు ఆడుతూ పాటకు సరయిన పద్ధతిలో ఆడుతూ పాడుతూ నాట్యభంగిమలు ప్రదర్శించే ‘చంటి’ అనే కుర్రవాడు. వీళ్లిద్దరూ చిన్న చిన్న గ్రామాలలో పల్లె ప్రజలకు సంబరాలు చూపిస్తూ, చిల్లరపైసలు యేరుకుంటూ కాలం గడుపుతూ వుంటారు.
చంటి బొత్తిగా పసివాడు. నానా హైరానా పడుతూనే నారాయుడికి సహాయంగా పనిచేస్తూ రోజులు వెళ్లబుచ్చుకుంటున్నాడు. ‘తిరిగి వస్తోంటే సగం దూరం నడిచేటప్పటికి కాళ్లు లాగడం మొదలెట్టాయి. ముందు నారాయుడు కూనిరాగం తీస్తూ నడుస్తున్నాడు. పక్కనే ఓ ఎద్దుబండి కూడా వస్తోంది. దానితో సమానంగా నడవటానికి దానివేపే చూస్తూ నడిచాడు చంటి. ఎప్పుడేనా కాళ్లు లాగితే నొప్పి మరచిపోవటానికి ఇదివరకు ఇలాంటి ట్రిక్కులు చాలాసార్లు చేశాడు’. వాడి కాళ్లకు గజ్జెలు. అడుగులు వేస్తూ వున్నప్పుడు, గలగల శబ్దం చేస్తూ వుంటాయి. లయబద్ధంగా జరిగే ఆ చప్పుళ్లకు చిన్నవాళ్లు- పెద్దవాళ్లు కూడా మనసు పులకరించినట్లుగా నవ్వుతూ వుంటారు. ఆ నవ్వులతోనే ‘పైసలు’ గిరాటు వేస్తూ వుంటారు.
బస్‌స్టాప్ దగ్గర షెడ్‌లో వాళ్ల మకాం. దిక్కు దివాణం లేని బిచ్చగాళ్లందరూ రాత్రికి చేరుకునేది అక్కడికే. అక్కడే మకాం వేసి రోజులు వెళ్లదీస్తూ వుండగా, ప్రకృతి విలయంలాగ ఓ సంఘటన జరుగుతుంది. ఓ నల్లటి అమ్మాయి నారాయుడికి తారస పడుతుంది. బీదరికం అయినా వయసుకు, మనసుకు చాలనితనం లేదు. నారాయుడు ఆ అమ్మాయితో కాలం గడుపుతూ వుంటాడు రాత్రిళ్లు. చంటివాడికి యివేవీ అర్థం అయ్యే వయసు కాదు. క్రమంగా ఆ ముగ్గురూ మరో మకాంకు వీధి అరుగులో ఒక మూలకు మారుతారు. ఆ అమ్మాయి పేరు సావిత్రి. చంటి ఆమెను ‘అక్కా’ అని పిలవడం నేర్చుకుంటాడు. చంటిని చూచినప్పటినుంచీ సావిత్రికి ఒకటే దిగులు. అలసి సొలసిపోతున్న కుర్రవాడిని ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదించి రోజులు గడుపుతున్నాడు నారాయణుడు అని ఆమెకు ఒకే దిగులు. వొళ్ళు తెలియకుండా రాత్రిళ్ళు వసరాలోకి వచ్చిందే చాలనుకుని నిద్రకు పడిపోయే చంటి అంటే ఆమె మనసు ఒకరకంగా ద్రవిస్తూ వుంటుంది. ఎట్లాగయినా రుూ ‘చంటి’వాడిని నారాయుడి బానిసత్వం నుంచి విడదీసి రక్షించాలి. వాడి బతుకు వాడు బతికేట్టుగా చేయాలి.. అనేదే ఆ బీద పిల్ల కామితం.
గ్రామంలో సంబరం జరుగుతూ వుంటే మరిన్ని పైసలు పోగవుతాయి. ఎక్కువగా పైసలు చేరిన ప్రతి రాత్రీ సావిత్రిని నారాయుడు మరింత ఎక్కువగా, మక్కువగా పోషిస్తూ వుంటాడు. ఆమెకు అలాంటి ‘సుఖ జీవితం’పట్ల ఆప్యాయత వున్నా, ‘చంటి’ దీన స్థితిమీద వున్న కనికరం ఎక్కువ. చంటి అనేకమార్లు నారాయుడి దగ్గర్నుంచి పారిపోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. నారాయుడు చంటికి పిరికిమందు పోసి తన దగ్గర్నుంచి పారిపోకుండా జాగ్రత్తపడుతున్నాడు. అయినా చంటికి రుూ బాధ తప్పడంలేదు. ‘గుడ్డల మూటలా ముడుచుకుపోయి పడుకున్న చంటిని చూస్తే సావిత్రికి సహజంగా ఆడదాని గుండెలో వుండే మెత్తదనం పొంగుకొచ్చింది, జాలేసింది’. ఆ రోజు- ఆ రాత్రి నిర్ణయం తీసుకుంది సావిత్రి- చంటి చెర విడిపించాలని. నారాయుడితో మురిపెం చేసుకుంటూనే ‘మన యిద్దరం వీడిని యిక్కడే వదిలి వెళ్లిపోదాం. ఇదే మంచి సమయం. వాడికి మెళుకువ వస్తే మన వెంట వస్తాడు’ అన్నట్లుగా నారాయుడిని ప్రోత్సహించి గెలిపించి తనతో తీసుకుపోతుంది.
చంటి ఒంటరివాడైపోతాడు. అయినా ‘రంగి’ అనే మరో బీదరాలు వాడికి ఆసరా ఇస్తుంది. ‘ఆడదానిలాగా ఆ ఏడుపేంటి? వాళ్లు పోతే ఏం? మేం లేమా?.. ఇక్కడే షెడ్డులో వుండు. నీ బతుకు నువ్వు బతకలేకపోవు’ అంటుంది. చంటితో తను జనాన్ని పోగుచేసి ఆటపాటలతో మధ్యలో జేబులు కొట్టడం సులువుగా చేయవచ్చునని ఆలోచనలో పొంగిపోతుంది.
ఎవరి ఆలోచన వారిది. పక్కవాడిని ఆసరా చేసుకుని బతుకు వెళ్లమారించడం ప్రతివాడూ ఏదో రకంగా నిర్వర్తించే వ్యాపకమే! పేదరికంలోనూ, శరీర అవసరాల కోసం తాపత్రయం ఒక మనిషిని ఆక్రమించుకుంటే, మరో మనిషిలో ‘చంటి’ కుర్రాడిని తమకోసం బాధలకు భయాలకు గురిచేసి వాడుకోవడం ఇష్టం వుండదు. ఆ మనిషి (సావిత్రి) పెద్ద మనసు చేసి చంటిని తాత్కాలికంగా జీవితంలోని చిక్కుముడుల నుంచి విడిపిస్తుంది. ఈ మానసిక వైరుధ్యాన్ని సూటిగా చూపించే రుూ కథ పేదల బతుకులలో వున్న భోగభాగ్యాలను పరోక్షంగా చదువరులముందు పరుగులు తీసేట్లు చేస్తుంది.

-శ్రీవిరించి