సాహితి

ఆ అవార్డుల తీరే తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య ఆకాడమివారు తెలుగులో ఈ సంవత్సరపు ఉత్తమ పురస్కారం ప్రకటించిన తరువాత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. వ్యక్తిగతమైన ఇష్టానిష్టాలు, దూరాదూరాలుగా భావించవద్దని మనవి. ఎవరికో ఒకరికి ప్రతి సంవత్సరం ఒక గ్రంథానికి ఉత్తమ పురస్కారార్హత నిర్ణయిస్తారు. దానికేమి! అయితే వరుసగా ఈ మూడు సంవత్సరాలనుంచి మార్క్సిస్టు భావోద్వేగ రచయితలకే ఈ పురస్కారం లభించడం ఆశ్చర్య కారణం కాదా? మార్క్సిజాన్ని నేనేమీ తక్కువ చేయను. ఎందుకంటే నేను దాని గూర్చి పండితుణ్ణి కాను. నాకు కొన్ని విషయాలు తెలుసు. మార్క్సిస్టు రచయితలకు మాత్రం అన్ని విషయాలు తెలియాలని ఎక్కడుంది? ఈవిధంగా మూడు సంవత్సరాలు ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రచయితలను సాహిత్య అకాడమి అభిమానించడం కొంత సంశయగ్రస్తమూ, సందేహాస్పదమూ కాదా! కాదంటే ఇందుకు కారణాలేమిటో వారు చెప్పాలి. అవి ఈ విషయంలో శంకిస్తున్నవారు ఒప్పుకునేట్లు ఉండాలి? ఇక్కడ మార్క్సిజం తాదాత్మ్యం గూర్చి కాదు ప్రశ్న!
కన్వీనరు అంటే తెలుగు సాహిత్య సలహా మండలి సమావేశకర్త, తన కార్యనిర్వహణ కాలంలో సాహిత్య అకాడమి వారు అనుమతించనంతవరకు నిర్ణయాధికారి. వారు అనుమతించకపోతే, వేరే ఒత్తిళ్ళకు, స్వప్రయోజనాలకు, అక్రమాలకు, అవినీతికి లోబడితే కన్వీనరు ఏమీ చేయలేడు. అతడి చేతులనే కాదు, నోరును కూడా కట్టివేయగల సమర్థులు వారు. ఇదివరకంతా అట్లా జరుగుతూ వచ్చింది చాలాకాలం. అంటే ఈ నవతరం వచ్చినా మారలేదు.
ఆచార్య ఎన్.గోపిగారు ఇప్పటి కన్వీనరు. అంటే తెలుగు కార్యక్రమ పర్వం సహాధికార ప్రాజ్ఞుడు. వీరిని నేను బాగా ఎరుగకపోవడమేమిటి? ఆప్తులని అనృతమాడను కాని వీరు చదువుకున్నప్పటినుంచీ నాకు బాగా తెలిసినవారే. వీరిపట్ల నాకు మన్నన, నాపట్ల వీరికి ఆదరం ప్రశ్నించాల్సినవి కావు. ఆయన చాలా ప్రతిభావంతుడు. నవీన తెలుగు కవితా శాఖలలో ఒకదానిని ఆవిష్కరించి విశేష ప్రాచుర్యానికి తెచ్చినవారని ఆయన అభిమానులంటూ ఉంటారు. ఇప్పుడు ఆచార్య గోపీగారి గురించి ఇంత అధికమెందుకంటారా? సాహిత్య అకాడమి పురస్కార నిర్ణయంలో వీరి బాధ్యత, కర్తవ్యమూ ఇంతింతనరానివి. వీరు చెప్పినట్లు వారైనా వినాలి? వారు చెప్పినట్లు వీరైనా వినాలి. ఈ మూడు సంవత్సరాలు ఎవరు ఎవరికి చెప్పి పనులు చేయించుకున్నారో నావంటి అర్భకుడికి తెలిసే అవకాశం లేదు.
ఆచార్య ఎన్.గోపీగారికి ఈ వరుస త్రయో వర్ష పురస్కార గ్రహీతలు మార్క్సిస్టు పరాయణులనీ, అంతేకాక పారాయణులనీ వీరికి తెలియదా? నాకు తెలిసినంత వరకు ఈయన (గోపీగారు) మార్క్సిస్టు కాడు! కనుక ఈ మూడు సంవత్సరాలు అత్యున్నత భారతీయ ప్రభుత్వపర (జాతీయ అందామా పోనీ!) పురస్కార ప్రదానం వీరి ప్రమేయం లేకుండా ఎట్లా జరుగుతుంది? సాధ్యమా? సంభవమా? సాహిత్య అకాడమి వారికి జ్యూరీ సభ్యుల (పురస్కార అర్హత నిర్ణాయక) జాబితా వీరే సమర్పించాల్సి ఉంటుంది. ఈ జాబితాకు అర్హులైన కొందరి పేర్లు ఇంకా కొన్నిచోట్ల నుంచి సాహిత్య అకాడమి వారు సేకరిస్తారనుకోండి! కాని వీరే ఆ నిర్ణాయక సభ్యుల మంచి చెడ్డలకు బాధ్యత వహించవలసి వుంటుంది. 1913లో శ్రీమతి కాత్యాయనీ విద్మహే గారిని సాహిత్య అకాడమి వరించింది. వీరు గొప్ప విమర్శక విద్వాంసురాలని ప్రతీతి. చక్కగా మాట్లాడగలరు. మహిళా జన సంక్షేమ చైతన్యోద్బోధ దీక్షాపరురాలు. వీరిపట్ల నాకేమీ వ్యతిరేకత లేదు. ఉండాల్సిన పని లేదు. వీరు నా గురు మిత్రుల కూతురు. ఆయన కె.వి.రామకోటి శాస్ర్తీ. కాత్యాయనిగారు ఈమధ్య అంటే డిసెంబర్ 10వ తేదీన తలపెట్టిన ప్రగతిశీల విద్యార్థి సంఘం వారి ఆవుమాంస ఆస్వాదన స్వీయ హక్కు నిరసన ఉద్యమంలో పాల్గొన్నారు. అది జరిగిందో లేదో నాకు తెలియదు. పరుగులో కూడా పాల్గొనాలని వచ్చినట్లు పత్రిక వార్త. సరే! ఇప్పుడిదంతా ఎందుకు? ఆమెకు మనసు చివుక్కుమనవచ్చునేమో. కాని వీరి పురస్కార నిర్ణయ జ్యూరీ సభ్యులలో వీరితో కలిసి పనిచేసిన సహాచార్యుడి పేరు ఎందుకుండాలి? ఆచార్య గోపీగారికి ఈ విషయం తెలియదా?
రెండో పురస్కార సమ్మాన్యులు శ్రీ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. వీరు జగమెరిగిన మార్క్సిస్టు విద్వాంసులు. విమర్శక ప్రజ్ఞాశీలురు. అయితే సాహిత్య అకాడమి పురస్కార నిర్ణయంలో వీరి ఊరివారు ఇద్దరు ఎందుకుండాలి? మాన్య మహాశయ కె.వి.రెడ్డి (అంటే చాలామంది గుర్తుపట్టరేమో!) కేతు విశ్వనాథరెడ్డి, రహంతుల్లా అనే ఇంకొక వీరి అత్యంతాప్త సాహితీ సేవాభిలాషి ఎందుకుండాలి? పురస్కారం తెచ్చుకున్నవారు కడప వారైతే, కడపవారే జ్యూరీ సభ్యులులో ఇద్దరుండటంలో ఔచిత్యమేమిటి? ఇది తప్పు కదా! అంటే మేం చేసిందంతా ఒప్పే అని సాహిత్య అకాడమివారు, వీరూ సాగదీయవచ్చు.
ఇక మూడో పురస్కారిణి శ్రీమతి ఓల్గా. ఈమె స్ర్తివాద రచయిత్రులలో అత్యంత ప్రతిభావంతురాలని పత్రికలన్నీ ప్రశంసించాయి. కావచ్చు. వీరిపట్ల నాకెటువంటి అవజ్ఞ లేదు. ఉండవలసిన పనిలేదు. మార్క్సిస్టులమని, అది తప్ప ప్రపంచ సాహిత్యానికి సర్వరోగ నివారణోపాయం లేదని తీవ్ర రచనలు చేసే వారిని నెత్తికెత్తుకోవటం నాకు అభ్యంతరమే. ‘కృష్ణానది స్నానానికి కొండుభొట్ల ఆజ్ఞ కావాలా? వీరి పురస్కారాన్ని నిర్ణయించిన జ్యూరీ సభ్యులెవరో ప్రకటితం కాలేదు. ఆచార్య గోపీగారే చెప్పాలి. వారి నడగటం నాకు బోలెడు బిడియం. నేను తెలుగు ఇక్ష్వాకుల కాలంనాటి వాడినని ఆయన భావమేమోనని నా భయం!
జ్యూరీ సభ్యుల నిర్ణయంలో అవకతవకలున్నాయని నా ఆశంక. కాబట్టి ఈ పద్ధతి మార్చాలని నా విన్నపం. జ్ఞానపీఠ పురస్కారం, సరస్వతీ సమ్మాన్‌ల నిర్ణయం లాగా ఒక రచయిత స్థిర ప్రాతిపదిక సాహిత్య కృషిని పరిగణిస్తే మంచిదని నా వేడుకోలు. ‘వేడి’కోలు కాదు. కీ.శే. తిరుమల రామచంద్ర, కీ.శే. గడియారం రామకృష్ణశర్మ గారలకు మరణానంతర పురస్కారాలు లభించాయి. ఇది తెలుగు వారికి సంతాప కారణమే కాక తలవంపుల కారణం కూడాను. సంగీత సాహిత్య నిరుపమాన సేవావ్రతుడైన సామల సదాశివ ఈ అపచారం నుంచి ఏట్లానో బయటపడ్డారు. వీరి స్వచ్ఛశీలత, ఆర్జవం, ప్రతిభ నానృతో దర్శనీయం. వీరి ‘యాది’ వంటి రచన ఇంకోటి ఏదీ? వీరు నాలుగేళ్ల వ్యవధిలో రెండు పుస్తకాలు ప్రకటించారు కాబట్టి బ్రతికిపోయినారు. 85 సం. వయసు వచ్చినా వారిని సాహిత్య అకాడమి వారు కరుణించలేదు. ఇది ఎంత అపచారం.
నవ్విపోదురు గాక నాకేమి వెరపు! అనుకునే వారికి ఎన్ని నీతులు చెప్పి ఏం లాభం? ఈ వరస చూస్తుంటే ఆచార్య ఎం.నరేంద్రకు, ఆచార్యణి సి.మృణాళినికీ ఈ తరువాత రెండు సంవత్సరాలు ఈ పురస్కారం లభించవచ్చు. రామ రామ! వీరు అర్హులు కారని నేను కలలో కూడా అనుకోను.
సరే! ఇప్పుడు ఈ భేతాళ పంచవింశతి, తిలకాష్ఠ మహిష బంధనం కథా సరిత్సాగరం ఎందుకంటారా? నాకు సాహిత్య అకాడమి కథలు, లీలలు ఎన్నో తెలుసు! ఎట్లా తెలుసునయ్యా అంటే ఎందుకు తెలుసుకోగలిగారు? అంటే అదంతా ఒక పెద్ద కథ. ఆచార్య ఎన్.గోపీగారి కన్నా అవ్యవహిత పూర్వకంగా నేను సాహిత్య అకాడమి కన్వీనరును. ఇప్పటి సాహిత్య అకాడమి అధ్యక్షులు పరమ మాన్య విశ్వనాథ ప్రతాప తివారీగారూ, కార్యదర్శి కె.శ్రీనివాసరావుగారు నాకు బాగా తెలిసినవారే. అవకాశం వస్తే మరి కొన్ని విషయాలు చెబుతాను మీకు ఆసక్తి ఉంటే గింటే!

- అక్కిరాజు రమాపతిరావు