సాహితి

శిల్ప నైపుణ్యమే కథానికకు గీటురాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సాహిత్యోదయం అయింది. ఇరవయ్యవ శతాబ్దంలో అయితే దానికి రంగాన్ని సిద్ధపరిచింది పంతొమ్మిదో శతాబ్ది. భారతీయ సాంస్కృతిక పునర్జీవనం ఆ శతాబ్దంలో బహుముఖాలుగా వికసించింది. దేశంలో మూడు ప్రెసిడెన్సీ కేంద్రాలలో మూడు విశ్వవిద్యాలయాల స్థాపన జరిగిన తరువాత పాశ్చాత్య భాషా సాహిత్య, విజ్ఞాన శాస్త్రాల అధ్యయనానికి అవకాశాలు పెరిగాయి. విమర్శనా దృష్టి ప్రబలింది. వాటి ప్రభావంతో కందుకూరి వీరేశం పంతులుగారు అనేక రచనలు చేశారు. వీరి సమకాలికులు కొక్కొండ వెంకటరత్నం, వేదం వెంకటరాయశాస్ర్తీ వంటి కవులు అనేకులున్నా వారు కథానిక మీద దృష్టి పెట్టలేదు. వీరందరూ కథలు రాశారు గాని కథానికలు రాయలేదు. తెలుగు సాహిత్యానికి సంబంధించిన వచన రచనా ప్రక్రియలో కథ, కథానికలు చోటుచేసుకున్నాయి. ప్రతి కథానికా ఒక కథే. ప్రతి కథా ఒక కథానిక కాదు. కథ విషయ ప్రధానం అయితే కథానిక శిల్ప ప్రధానం. రచయిత ఏం చెప్పాడన్నది రెంటికీ వర్తిస్తుంది. కాని ఎలా చెప్పాడన్నది కథానికకే వర్తిస్తుంది. కథ ముడి వజ్రం, కథానిక సానబెట్టిన వజ్రం. ఈ విషయాన్ని ముందుగా కనిపెట్టినవారు గురజాడ అప్పారావుగారు. తెలుగు కవిత్వంలో నవయుగ కర్తృత్వం ఆయనది. అలాగే కథానికకు ఆదిపురుషుడు కూడా ఆయనే. వీరు రాసిన 5 కథానికలు - దిద్దుబాటు, మీ పేరేమిటి? మెటిల్లా, పెద్దమసీదు, సంస్కర్త హృదయం. ఆధునిక కథానికలలో ‘దిద్దుబాటు’ ప్రప్రథమంగా గుర్తింపు పొందింది. అయితే కథానిక రచనా ప్రక్రియలో నిష్ణాతులు అని చెప్పడానికి మూడు అంశాలు ముఖ్య భూమికను పోషిస్తాయి. మొదటిది శిల్పం. ఎత్తుగడ మొదలు ముగింపు వరకు కథావిన్యాసంలో రచయిత చూపించే కళానైపుణ్యమే శిల్పం. కథానికకు అదే గీటురాయి.
ఎక్కడ ప్రారంభించాలి, ఎలా నడపాలి, ఏయే పాత్రలను ప్రవేశపెట్టాలి, ఎలా మాట్లాడించాలి, ఎలా మలుపు తిప్పాలి అనే వాటికన్నా కథకు ముందు కొంత ఉపోద్ఘాతం, దేశ కాల వర్ణన, పాత్రల పుట్టు పూర్వోత్తరాలు వంటివాటితో నిదానంగా నడిచేది కథ అయితే హఠాత్తుగా మొదలై చకచకా సాగుతూ అత్యవసరమైన పాత్రలను ప్రవేశపెడుతూ, అవసరమైన మేరకు సంభాషణలు చెప్పిస్తూ వర్ణిస్తూ ఏకసూత్రతను పాటిస్తూ సాగేది కథానిక. రెండో విషయం వస్తువు. సాధారణంగా కథలో చెప్పదలచుకున్న విషయం సమకాలీనులది అయి నేర్పుగా పాత్రలలో నడిపించగలిగింది అయి ఉండాలి. ఈ విషయంలో గురజాడవారు తన కథలలో ఎంచుకోవడంవల్లే అవి నేటికీ ఆదరించబడుతున్నాయి. ఇక మూడోది భాష. సకాలంలో జీవించేవాడు ఆ కాలపు భాషలో ఆలోచించడం, రాయడం అత్యంత సహజం. గురజాడ రచించిన కథా పంచరత్నాలలో కనీసం మూడింటిలో వస్తువు సంపూర్ణంగా సమకాలిక సమాజంలో పుట్టినదే. ‘దిద్దుబాటు, మెటిల్లా, సంస్కర్త హృదయం’ అనే కథలు రూపొందించాయి. ఈ సమకాలికతా దృక్పథమే అనంతర రచయితలకు అందరికీ మార్గదర్శకం అయింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు వితంతు వివాహాలనే చాలాకాలం కథా వస్తువుగా స్వీకరించారు. గుడిపాటి చలంగారు స్ర్తిల మానసిక సంఘర్షణను, సామాజిక ప్రతిఘటనలను కథా వస్తువులుగా తీసుకుని చక్కటి కథలు అందించారు. కొడవటిగంటి కుటుంబరావు గారు అంతకంటే వైవిధ్యంగా ఆర్థిక, సామాజిక కథాంశాలతో రచనలు చేశారు. గోపిచంద్ రాజకీయాలను కూడా జోడించారు. బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, మంజుశ్రీ సున్నితమైన మనోవృత్తుల్ని చిత్రీకరించారు. బలివాడ కాంతారావు, మధురాంతకం రాజారావు, హితశ్రీ, పెద్ద్భిట్ల, ఆర్.ఎస్.సుదర్శనం, నెల్లూరి కేశవస్వామి, తిలక్ వంటి వాళ్ళు మరింత వైవిధ్యం ప్రదర్శించారు. రాచకొండ, కాళీపట్నం, బీనాదేవి కింది తరగతి వాళ్ళకు జరిగే అన్యాయాలను, అక్రమాలనూ ప్రభావవంతంగా వెల్లడి చేశారు.
ఆధునిక సాహితీ మహోదయ పర్యంతం తెలుగు కథ నాలుగు కొమ్మలమీద గూళ్ళు కట్టుకున్నది. గేయ కథాశాఖ, ప్రాచీన కావ్యశాఖ, ప్రాచీన కథా కావ్య శాఖ, వచన కథా శాఖ- ఈ నాలుగు శాఖల్లోనూ ఏర్పడ్డ పరిణామ వికాసాలను అర్థం చేసుకోవచ్చు. మొదట బెంగాలిలో తరువాత హిందీలో, తెలుగు భాషల్లో ప్రక్రియాపరంగా కథానిక ఆకర్షించింది. తెలుగులో కథానిక ఆవిర్భావానికి 19వ శతాబ్దంలోనే రంగం సిద్ధం అయింది. అప్పటి సాంఘిక, రాజకీయ, మత విద్యా రంగాలలో వచ్చిన పరిణామాలు దేశీయుల అవగాహనను విస్తృతం చేశాయి. కొత్త వాకిళ్ళు తెరిచాయి. కొత్త చైతన్యం వెల్లివిరిసింది. తెలుగులో కథల పంటను పండించే కృషీవలురు శతాధికంగా ఉన్నారు. వీరందరి సమష్టి కృషి ఫలితమే ఈనాటి తెలుగు కథకు ఆధారపీఠం. నేటి రచయితలు ఈ కథ, కథానిక ప్రక్రియను ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

- బులుసు సరోజినీదేవి, 9866190548