సాహితి

పద్యానికి పాలకడలి.. ముళ్లపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శ్రీలు పొంగునట్టి పాలకడలి బిడ్డ
తెలుగు గడ్డ మనకు వెలుగు గడ్డ
అఖిల భారతాంబ కందాల వీణరా
తెలివి కలిగి మెలగు తెలుగు బిడ్డా’’
- అంటూ తెలుగు నేల ఔన్నత్యాన్ని చిన్ని ఆటవెలది పద్యంలో ఎలుగెత్తి చెప్పిన కవి శ్రీ ముళ్ళపూడి సచ్చిదానందమూర్తిగారు. ప్రపంచ తెలుగు మహాసభల పుణ్యమా అని ప్రభుత్వమూ, ప్రపంచమూ ‘తెలుగు తెలుగు తెలుగే తెలుగు, తెలుగో తెలుగు’ అంటూ జపం చేస్తున్నాయి. మన తెలుగు వైభవం తేజరిల్లాలి, తెలంగాణ సాహిత్య వైభవం తెలియచెప్పాలి అని తహతహలాడుతున్న వేళ, తెలంగాణ ప్రాంతంలో సుమారు 50 సంవత్సరాల పాటు తన సాహిత్య పరిమళాలతో ప్రజను నిద్రలేపిన కవి ముళ్ళపూడి సచ్చిదానందమూర్తిగారు. ఈనాడు తెలుగు మహాసభల సందర్భమూ, డిసెంబర్ 2న వారి వర్థంతి కూడా కావటాన మరోసారి వారిని, వారి సాహిత్యాన్నీ స్మరించుకునే ప్రయత్నం ఈ చిన్న వ్యాసం.
1929 సెప్టెంబర్ 29, భాద్రపద అమావాస్యనాడు కృష్ణా జిల్లాలోని పెదముక్తేవిలో జన్మించారు వీరు. ముళ్ళపూడి అన్నపూర్ణమ్మ, లక్ష్మీ నరసింహంగారలు వీరి తల్లిదండ్రులు. ఆర్థికంగా చాలా ఇబ్బందులనుభవించిన కుటుంబం వీరిది. కానీ, ఆ భౌతిక దారిద్య్రం వీరి మనసులకి అంటుకోలేదు. ఇంటికి వచ్చిన వారిని అన్నం తినకుండా పంపేవారు కాదట వీరి తల్లి, సార్థక నామధేయురాలు అన్నపూర్ణమ్మ. వీరి హైస్కూల్ విద్య పెదముక్తేవిలోనే సాగింది. ఆ తరువాత చిన్న ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా చదువుకున్నారు. వివిధ కారణాంతరాలవల్ల తెలంగాణ ప్రాంతానికి వచ్చి స్థిరపడిపోయినారు. మోమిన్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా వృత్తి జీవితం మొదలుపెట్టిన వీరు శంషాబాద్, మానుకోట, నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి, నల్లగొండలలో తమ విధిని నిర్వర్తిస్తూ, చివరికి సంగారెడ్డిలోనే స్థిరపడినారు. స్వభావరీత్యా హాస్యశీలి, చతురులు. మామూలు సంభాషణల్లోనూ తమ చతురతతో నవ్విస్తూండేవారు. ఈ చతురత మనకి వారి రచనల్లోనూ వ్యక్తమవుతుంది.
బాల్యంలో పెదముక్తేవిలోని ముముక్షుజన మహాపీఠంతో వీరి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం, కుటుంబంలో సమాజంపట్ల ఉన్న సహాయానుభూతి, సంస్కారం, అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికత, వేదాంత దేశికుల శిష్యరికం, అనుభవించిన ఆర్థిక దారిద్య్రం వీరి వ్యక్తిత్వాన్ని చెక్కాయని చెప్పవచ్చు. ఎంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ లౌకిక బాధలేవీ ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు. అందరి యోగక్షేమాలు తెలుసుకుని ఆదరించటం, ఆదుకోవడం చాలా ‘సహజంగా’ చేసేవారు. ఇప్పటికీ ఎంతోమంది వారి విద్యార్థులమనీ, ఈ స్థితిలో ఉండడానికి కారణం వారేననీ చెప్తూంటారు. స్వర్గీయ శేషేంద్ర గారన్నట్లు ‘‘మార్దవానికి సొంత ఊరు, మాధుర్యానికి తేనెపట్టు, సత్యనిష్ఠురతకు శరణాలయము’’ వీరి వ్యక్తిత్వం.
పెదముక్తేవి శ్రీ కృష్ణాశ్రమ రెండవ గురువుగారైన శ్రీ సీతారామ యతీంద్రులవారితో కలిసి ఆటల్లోలా ఆశువుగా పద్యాలు చెప్పటంతోనే వీరి కవిత్వం మొదలైందని చెప్పవచ్చు. శ్రీ మూర్తిగారు, శ్రీ లక్ష్మణదాసుగారు, శ్రీ సీతారామ యతీంద్రులవారు కలిసి తమని తాము ‘సచ్చిదానంద లక్ష్మణస్వామి’ కవులుగా, కవిత్రయంగా పేర్కొంటూ పిన్నలను, పెద్దలను తమ పద్యాలతో ఆనందింపజేసేవారు. అలా.. మొదలైన వీరి సాహితీ ప్రస్థానం తన మనసులోని ప్రతి భావాన్నీ కావ్య రూపంలోనో, కథారూపంలోనో వ్యక్తం చేసేవరకూ వచ్చింది. వీరు వృత్తిరీత్యా అనేక ప్రదేశాలు మారుతూ వచ్చారు. ఎక్కడ జీవిస్తే అక్కడి సంస్కృతిని జీర్ణింపచేసుకొని, దానికి అనువుగా జీవితం సాగించారు. ఆయా ప్రాంతాలలో కొలువైన దేవీదేవతల పేరుమీద శతకాలు వెలయించారు కూడా. శంషాబాద్‌లో ఉండగా ‘వెండికొండ పావురాలు’, నల్లగొండలో ఉండగా ‘యాదగిరి పారిజాతం’, మానుకోటలో ఉన్నప్పుడు ‘కురవి వీరభద్ర శతకం’, ‘పనిమనిషి కథల సంపుటి’, చివరగా సంగారెడ్డిలో ‘్భవానీ సంస్తుతి’, ‘మూర్తిగారి మాట’, వచన కవితా సంపుటి ‘మహాభియానం’, సాహిత్య విమర్శకు కరదీపికగా ‘సుహృల్లేఖల సంగీత సాహిత్య సంచారిణీ’ వంటి గ్రంథాలను రచించారు. వీరి తొలి ముద్రిత రచన ‘తెలుగుబిడ్డ’ శతకం 1964లో వెలువడింది. తిరిగి 2006లో ద్వితీయ ముద్రణ పొందింది. ‘‘ఒక తెలుగు పిల్లవాడు నా దగ్గరికి వస్తే నేను ఏమి చెబుతాను?’’ అని ప్రశ్నించుకొని వ్రాసినది అని వారే చెప్పుకొన్నారు. ఆటవెలదిలో రచించిన తెలుగు బిడ్డను గురించి చెప్తూ- ‘అక్షరాస్యులైన తెలుగుబిడ్డలందరూ ఆనందించాలనే ఆకాంక్షతో, వారికే నా భావాలను ప్రత్యక్షము చేయాలనే ఆవేదనతో ఆటవెలది నొకతెను పిలుచుకొని తెలుగు సోదరుల యెదుట ఆడించాను, పాడించాను’’ అంటారీ కవి. 132 పద్యాలతో, ‘తెలివి కలిగి మెలగు తెలుగుబిడ్డ’ అనే మకుటంతో ఉన్నది ఈ శతకం. ఒక పద్య కావ్యం అని చెప్పవచ్చు. తెలుగు బిడ్డల్ని - ‘‘పాలమీద నురగ పసిపాప రావయ్య / కొట్టనయ్య నిన్ను తిట్టనయ్య / పంచదార కలిపి పాఠాలు చెప్పెద’’నంటూ పిలిచారు. ప్రపంచ తెలుగు మహాసభలకు మన రాష్ట్రం సమాయత్తమవుతున్న ఈ సందర్భంగా ఈ ‘తెలుగుబిడ్డ’ శతకాన్ని ఒకసారి అవలోకిద్దాం.
తెలుగు గడ్డను ప్రశంసించటంతో మొదలైన ఈ శతకంలో వీరు మొదట మాతృభూమికి వందనం చేస్తూ, తానెవరు? ఎలా ఎవరికి, ఏమి చెప్పాలనుకుంటున్నారో నాలుగు చిన్న పద్యాలతో చెప్పారు. మాతృదేశ కీర్తనతో ప్రారంభమైన ఈ శతకంలో సమాజ రీతులు, నీతులు, మారిన మారుతున్న సంస్కృతులూ, విషప్రభావాలు, రాజకీయాలు, మానవ మనస్తత్వాల చిత్ర విచిత్ర గతులూ.. ఈవిధంగా సాగిపోతుంది.
‘‘మాతృదేవిపైన - మాతృభూదేవిపై
మాతృభాష ఎడల - మమత పెంచు
కన్నవారలన్న - మిన్న స్వర్గము కన్న’’ అంటూ ఈ తెలివిని (గ్రహింపు) కలిగి ఉండమని ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అనే రామాయణ సూక్తిని తేటయైన తెలుగులో అందించారు. ఈ సూక్తిని తెలియజేస్తూనే-
‘రమణి భారతాంబ - రత్నగర్భయనెడి
పేరు మోసెనిపుడు బీదరాలు
ఎంతమంది దొంగ లీయిల్లు దోచిరో’ అంటూ బాధపడతారీయన. ఈ బాధను వ్యక్తం చేస్తూనే తన మనసులోని ఆవేదన-
‘‘కన్న నేలపైకి కాల్దువ్వు దుష్టుల / గత్తికొక్క కండ గాగ తరిగి /కాకి మూక కేసి కడుగుకో చేతులు’’ అంటూ శత్రు సంహారమే కాని, శిక్షలతో సరికాదని ఉద్బోధించారు. తెలుగు బిడ్డల్లో ధైర్యాన్ని నింపారు. మరో పద్యంలో వక్రీకరింపబడిన మన చరిత్ర, చరిత్ర పాఠాల్లో దర్శనమిస్తున్న వైనాన్ని-
‘‘ఆర్యులనుచు కొందరార్యేతరులంచు
కట్టుకథల గోడ - కట్టిరెవరో
ఇట్లు మనల చీల్చి - ఇల్లెల్ల దోచిరి’’ అంటూ ఆందోళన చెందారు. అందుకే-
భరత ఖండమనెడి బంగారు మేడలో
గదులు పది పదేను - గలవు గాని
ఉన్న వారలందరొక కుటుంబమువారె’’- తెలివి కలిగి మెలగుమని ఉద్బోధించారు. విడి విడి గదులలో ఉన్నంత మాత్రాన విడి కుటుంబాలు కావని, కాకూడదని, తెలివి కలిగి మసలుకోమని హెచ్చరించారు. ఇలా ఈనాటి పౌరులకు ఉద్బోధ చేస్తూనే, చిన్న చిన్న ఆటవెలది పద్యాలలో ఈనాటి సమాజంమీద, రాజకీయవేత్తలమీద, అవినీతిపరులమీద అధిక్షేపంతో కూడిన వ్యంగ్యోక్తులు విసిరారు. అందుకే శ్రీ గిడుగు వేంకట సీతాపతిగారు- దీన్ని గురించి చెప్తూ ‘‘ఈ శతకములోని పద్యములు బొత్తిగా చిన్న పిల్లలకు గాక కాస్త చదువు నేర్చిన బాల బాలికలకు సులువుగా బోధపడగలవు. అందులో గల భావము, హాస్యము, ధ్వని వారు తెలుసుకోగలరు’’ అన్నారు. ఈ పద్యం చూడండి.
‘‘గద్దెమీదనున్న గార్ద్భములనైన
పొట్టకొరకు జనులు పొగడుచుండ్రు
వేశ్య జాతి కంటె విలువేమి వారికి’’
అంటూ ఈనాటి సమాజంలో భట్రాజుల పొగడ్తలను, వాటితో పొద్దుపుచ్చేవారిని వేశ్యలతో పోల్చారు. పొగడ్తలంటే అంత అసహ్యం మరి. రాజకీయాలు, రాజకీయుల గుర్తించి చెప్తూ-
‘‘నమ్మబల్కవలయు- నమ్మరాదెవరిని
తండ్రిగాని - కన్నతల్లిగాని
ప్రథమ సూత్రమిద్ది రాజకీయాలలో’’ - ఈనాటి రాజకీయాలను కళ్ళకు కట్టినట్లే ఉంది కదూ అలాగే-
‘‘నేను రాజునగుదు - నీవు మంత్రివగుము
ప్రథమ పురుష మనకు బంటులనెడి’’- వింత స్వార్థం మెలిసింది అంటారు. నేటి స్వార్థపూరిత రాజకీయాలకు ప్రతీక ఈ పద్యం. సామ్యవాదం అంటూ ప్రజలను మభ్యపెట్టు సోషలిస్టులను గూర్చి, సోషలిజం గూర్చి కవి అభిప్రాయాలను చూడండి.
‘‘ఉన్నవాడు పెరిగె ఊరంత పొట్టతో
గంజి లేక నేల కఱచె నొకడు
సోషలిజము కంఠశోషాయె నిజముగా’’ - అంటూ సమాజంలో కనిపిస్తున్న సత్యాన్ని పద్యంలో మన కళ్ళముందు నిలబెట్టారు. ‘కవయః క్రాంత దర్శినః’ అంటారు. నేటి విశ్వవిద్యాలయాల తీరును 1960ల్లోనే ఎండగట్టారు వీరు- ‘‘విద్యలేదు విశ్వవిద్యాలయాలలో / నేతి బీరలోన నేయి లేదు / పేరు గొప్ప గాని యూరేమొ దిబ్బరా’’ అంటూ, ‘కవుల వ్రాతలెల్ల కాలానికెరుకరా’ అంటూ ఆ మాటని నిజం చేసుకున్నారు.
‘‘లోకమందు తిరిగి లోక ధోరణి చూడు
పుస్తకాలు చదువ - బోధపడదు’’ అంటూ అసలైన విద్యను లోకము కాలమే నేర్పగలవు, జీవన గమనంలో మనల్ని మనం వెతుక్కుంటూ వెళ్ళడమే అసలైన విద్య అని చెప్పకనే చెప్పారు. ఇదే బ్రహ్మచర్యాశ్రమము- దేశ సంచారము. ఆ తరువాతే స్నాతకోత్సవం. నేటి సమాజంలో వేళ్ళూనుకున్న అసమానతలను వెక్కిరిస్తూ- కులమువల్ల పోయేదీ, వచ్చేదీ ఏదీ లేదని తెలుసుకొమ్మని హితవు పలికారు.
‘‘ఎట్టి కులమునందు - పుట్టిననేమాయె
బుద్ధి వలయు నాత్మశుద్ధి వలయు
నందనారు శివుని- ముందుగా జేరడా’’ అంటూ కులములోని హెచ్చు తగ్గులు దేనికీ కారణాలు కావని, ‘‘గుణము బట్టి ధరణి- కులము లేర్పడు’’నని తెలిపినారు.
ఈనాటి వ్యవస్థలో మనకి కనిపిస్తున్న మరొక పెద్ద లోపం- విద్యావ్యవస్థది. ఈమధ్య ఒక కవి ‘గురుదోషం పట్టింది మన సమాజానికి’ అన్నారు. అలా- అసలు గురువంటే- ‘‘తనదు బ్రతుకు మాట- తలపెట్టకెపుడును / జాలి బ్రతుకు నిలుపు జ్యోతి గురువు / వాని గానకున్న బ్రతుకంధకారమె’’ అంటూ చెప్పిన పద్యం భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థలోని గురువులకి, నిజమైన గురువుమీద ఏ మాత్రం గౌరవముందని విద్యార్థులకి అందరికీ చురకయే.
ఈ విధంగా సాగిపోయిన ఈ ‘తెలుగుబిడ్డ’ శతకాన్ని స్థూలంగా పరిశీలిస్తే వ్యష్ఠి నుండి సమిష్టికి, పరమేష్ఠి వరకు ఎదిగిన తీరు గోచరమవుతుంది. ‘‘ఆటపాటలన్న ఆసక్తి గద నీకు / ప్రేమ తోడ నిపుడు పిలిచినాను / ఆటవెలదితోనే ఆడింతు పాడింతు’’ అంటూ మొదలుపెట్టి, లోకమంతా తిప్పి చూపి- చివరికి,
‘‘అన్ని బలములుండి ఏమాయె కర్ణుండు
దైవబలము లేక ధరను గూలె
బలములందు దైవబలమది గొప్పరా’’ అంటూ నిష్కామ కర్మ చేయమనే గీతాసారంతో శతకాన్ని ముగించారు.
‘‘పద్యాల మనుగడకే ముళ్ళబాటలేర్పడినపుడు మల్లెబాటలు కల్పించారు శ్రీ మూర్తిగారు’’ అన్న జివియస్ గారి వాక్కులు అక్షర సత్యాలు. వారి మాటల్లోనే-
‘‘తెలుగు భాష నాది - తెలుగువాడను నేను’’ అని గర్విద్దాం. తెలుగు గడ్డను ‘అఖిల భారతాంబ కందాల వీణను’ మోగిద్దాం.

- ఆర్. సరిత, 9032220412