సాహితి

విషాద జీవన కథా శిల్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాథల ఆక్రందనలు, అన్నార్తుల ఆవేదనలు, అభాగ్యుల ఆర్తనాదాలు, అసమర్థుల ఆత్మకథలు, మోసపోయిన వారి బాధలు, కలలు కల్లలైన కన్నీటి గాథలు - వెరసి పెద్ద్భిట్ల సుబ్బరామయ్య కథలు. పెట్టుబడిదారీ సమాజం వికృత స్వరూపాన్ని, దయలేని దోపిడీదారులు, వారి పదఘట్టనల కింద నలిగిపోతున్న వారి జీవితాలను అక్షర చిత్రాల్లో ఆవిష్కరించిన అసామాన్య కథకులు పెద్ద్భిట్ల. నీళ్లు, పూర్ణాహుతి, కళ్లజోడు, అలజడి, చీకటి, ముసురు, గాలి, దగ్ధగీతం, ఏస్న్న్రర్, శుక్రవారం, వేలుబొమ్మ, చిలిపితనం, చుక్కమ్మ కథ, కోదండంగారి కల, చింపిరి, పీట, చిలకహంస వంటి కథలు సుబ్బరామయ్య పేరు వినగానే గుర్తుకొస్తాయి. ‘నీళ్లు’ కథలో జోగినాథం నీళ్లు దొరకని ప్రాంతం నుండి విజయవాడకు వస్తాడు. ఇక్కడ కృష్ణానదిలో పరవళ్లు తొక్కుతున్న నీళ్లను చూచి ఆశ్చర్యపోతాడు. ఆఫీసులో తనతో పనిచేస్తున్న కుసుమతో ‘రెణ్ణెల్ల కిందట నేను ఉద్యోగంలో జాయినయ్యేందుకు వచ్చేటప్పుడు రైలు కృష్ణానది మీదినుంచి పరిగెత్తుతూ వుండగా చూచి ఆశ్చర్యంతో బొమ్మలా అయిపోయాను. మీరు నమ్మరేమో! అన్ని నీళ్లు ఒకేచోట చూడటం అదే నాకు మొదటిసారి’ అని అంటాడు. ఇక్కడకు వచ్చాక ప్రతిరోజూ ఉదయం కృష్ణానదికి వెళ్లి తనివితీరా స్నానం చేస్తాడు. ఆఫీసులో పెట్టిన కూజాలో నీళ్లు తాగడం, సాయంత్రం ఇంటిదగ్గర బావిగట్టుమీద గంటల తరబడి స్నానం చెయ్యడం, హోటల్లో ఎక్కువ నీళ్లు తాగడం చేస్తుంటాడు. హోటల్లో సర్వర్లు అతనిని మంచినీళ్ల పంతులుగారు అనేవారు. అతని స్నేహితులంతా అతని నీళ్ల పిచ్చి గురించి చెప్పుకొని ఎగతాళి చేస్తుంటారు. అలాంటి జోగినాథం ఒకరోజు కృష్ణలో స్నానం చేస్తూ ఆ నీళ్ల ఉరవడికి కొట్టుకుపోతాడు.
నీళ్లు దొరకని ప్రాంతంనుంచి వచ్చి, చివరకు తాను ప్రాణప్రదంగా భావించే నీళ్లలోనే ప్రాణం పోగొట్టుకోవడం పాఠకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది.
‘కోదండం కల’లో ప్రపంచ ఛాంపియన్‌గా పేరుపొందిన గామా పహిల్వాన్ తన చివరి రోజుల్లో తిండికి గడవక చనిపోయాడని తెలిసి నిప్పుకోడి కథ రాశారు. దగ్ధగీతం, మిస్ భారతి బి.ఏ, సతీసావిత్రి అసహాయులైన స్ర్తిల కన్నీటి గాథలు. మిస్ భారతి బి.ఏ కథలో స్నేహితురాళ్ల పెళ్లిళ్లు అన్నీ వరసగా అయిపోతూ వుంటాయి. శ్రీమతులుగా మారిపోతుంటారు. ఆ శుభలేఖల్ని చూస్తూ తానూ శ్రీమతిగా మారాలని కలలు కంటుంది. ఎన్నో పెళ్లిచూపులు జరుగుతాయి. కానీ పెళ్లిదాకా ఎవరూ రారు. ఒకరోజు ఇంట్లో ఎవరూ వుండరు. ఆ రాత్రి తనని పెళ్లిచూపుల్లో చూసి తిరస్కరించిన శివం వస్తాడు. భారతి తనకి పెళ్లయిందని, ఇంట్లో అత్తగారున్నారని అబద్ధాలు చెప్తుంది. శివం కూడా పెళ్లయిందని అబద్ధాలు చెప్పి, తర్వాత పెళ్లి కాలేదని నిజం చెప్పాడు. ఇప్పటికీ వయసు దాటినా పెళ్లి కాని మిస్ భారతిలు మనకు కనిపిస్తూనే వుంటారు.
సినిమా రంగంలో ఎక్‌స్ట్రాలుగా నటించే నటుల బాధలను ప్రతిబింబిస్తుంది ‘ఎక్‌స్ట్రా’ కథ. దానాలు చేయడానికి, బావులు తవ్వించడానికి ధనవంతులే అక్కర్లేదు, మనసున్న మామూలు మనుషులు కూడా గొప్ప పనులు చేయవచ్చని చెప్తుంది ‘పేరయ్య బావి’ కథ. సమాజంలోని అసమానతలను ప్రతిబింబించిన కథ ‘గాలి’. డబ్బుతో గాలినీ కొనవచ్చు. డబ్బు లేకపోతే గాలిలాంటి కనీస అవసరాలు కూడా పేదవాళ్లకు తీరవు అని చెప్తుందీ కథ. శనిదానం పట్టే బ్రాహ్మణుల కథ ‘పూర్ణాహుతి’. షాపుల్లో పూజలు చేసే బ్రాహ్మణుల కథ ‘శుక్రవారం’. ‘కోరిక’, ‘కళ్లజోడు’ అల్పజీవుల కథలు.
దుర్దినం, కోరిక, తాతిగాడి చొక్కా, మరో వీధిపాప వంటి కథలు కేవలం తెలుగు భాషలోనే విలువైనవి కావు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలువగలిగిన సత్తావున్న కథలు. కుక్కపిల్ల, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నట్లు ‘నీళ్లు’ లాంటి కథ రాసిన పెద్ద్భిట్లగారు ఇంగువ కథ కూడా రాసి మెప్పించారు. పెద్ద్భిట్ల గారి కథలన్నీ హిందీ, ఆంగ్లంతోపాటు రష్యన్ భాషలో కూడా అనువదింపబడ్డాయి.
ఈయన కథా కథన కౌశలానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత పురస్కారం, గోపీచంద్ స్మారక సాహిత్య పురస్కారం, రావిశాస్ర్తీ స్మారక పురస్కారం, అప్పాజోశ్యుల విష్ణ్భుట్ల కందాళం ఫౌండేషన్‌వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి. సుబ్బరామయ్యగారి కథల్లో పాత్రలతో పాటు ప్రకృతి కూడా ఒక పాత్రగా మారి కథాగమనానికి దోహదం చేస్తుంది. ఆయన శైలి సరళ సుందరం. మాలలో పూలన్నీ ఒకే ఆకారంలో వున్నట్లు చక్కని లయతో వాక్యాలు గేయాల్లా అనిపిస్తాయి. ప్రతి కథలో కలలను వర్ణించడం పెద్ద్భిట్లవారి కథాకథన కౌశలం. ‘మిస్ భారతి బిఏ’లో ‘దిగంతాలను చుంబిస్తూ రొద చేస్తున్నది సముద్రం. తెల్లని వెండిపళ్లెంలా వెలుగులను చిమ్ముతున్న చంద్రబింబం ఆ అనంత జలరాశికి చిత్రవిచిత్రమైన రంగులను వేస్తున్నది. తీరాన తామిద్దరూ ఎన్నో జన్మల నాటి ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు’ అని వర్ణిస్తారు. పెద్ద్భిట్ల సుబ్బరామయ్యగారి కథలనిండా ఒక విషాదపు జీర అంతర్వాహినిగా ప్రతిఫలిస్తుంది. మానవ జీవితాలలోని భావోద్వేగాలను, గెలుపు ఓటములను అత్యంత సహజంగా చిత్రించిన కథాశిల్పి. తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన అపురూప కథకులు.

- మందరపు హైమవతి, 9441062732