సాహితి

అంతర్మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మ పరమాత్మల పరిశోధనకు
ఉపక్రమించటం లేదు
అంతర్ముఖ ఆలోచన్ల పాతర లోతుల్ని లెక్కించటం లేదు
వర్తమాన జీవన స్రవంతిపై జలతరంగిణి
వినిపించాలనీ లేదు
బాల్యం తప్పటడుగుల్ని తడిమి తడిమి
చూచుకుంటున్నాను
వయస్సు ఎక్కుతున్న నిచ్చెన మెట్లపై నుండి
వెనక్కి వెనక్కి ఆలోచించుకుంటున్నాను
ఎడారిలో పూల పరిమళాల సుగంధాలను
ఆస్వాదించలేమని ఆకళింపు లేనివాణ్ణి
ఒయాసిస్సు జాడల్ని వెతికి పట్టుకోవాలనే
బుద్ధి వికసించని వాణ్ణి!
చేయ పట్టుకు నడిపించే తోడు మాత్రమే
అడుగుల వక్రత్వాన్ని సరిచేయగలుగుతుందని
ఊహ తెలియనివాణ్ణి!

జాబిలమ్మ కథలు కలత నిద్రల్ని
దూరం చేస్తాయనే ఆకాంక్షను
అభివ్యక్తీకరించ లేనివాణ్ణి!
జోలపాటతో సేదతీర్చే
మురిపాల పాలబువ్వలు
కోరుకోలేనివాణ్ణి!
అంగుళం అంగుళం పెరుగుతున్న శరీరం
తనివి తీరా చూచుకుంటూ
తొందర పడుతున్నవాణ్ణి
భవిష్యత్తుకై ఆరాటపడుతున్నవాణ్ణి!

కాలం ఘనీభవించినప్పుడు నిస్తేజితుణ్ణి
కరిగి ప్రవహిస్తున్నప్పుడు
కలల కవిత్వాన్ని నెమరేసుకునేవాణ్ణి!

విశ్వాస తంతృవుల్ని శృతి చేయటం
నిశ్శబ్ద క్షణాల్ని లెక్కిస్తూ కూర్చోవటం
దుర్లభమని గుర్తించలేనివాణ్ణి!

ఎదుగుతున్న కొద్దీ ఎద లోతుల్ని
తట్టి లేపే స్పర్శకై పరితపిస్తున్నవాణ్ణి!
ఆడంబరాలకు ఆశయాలకు అత్యాసలకు
ఆలంబననై ఏదో సాధించాననుకుని
సంబరపడేవాణ్ణి!
చుట్టూ చుట్టచుట్టుకున్న చైతన్యం
నాలోని అంతర్వాహిననుకొని
అతిశయంతో విర్రవీగినవాణ్ణి!

నాలోనుంచి నేనే రోజురోజుకూ
దూరంగా జరిగిపోతున్నానని తెలిసేటప్పటికి
మనసు తరచే మాటలు లేక మూగబోయనవాణ్ణి!

అనుభవాల భోషాణం అరల బూజు
దులుపుకోవటానికి మాంత్రికుణ్ణి నమ్మి
మాయాదర్పణంలో చిక్కుకున్నవాణ్ణి

జీవన జలధి మధ్య మందర పర్వతంగా నిలిచినవాణ్ణి!
అమృత అనే్వషణలో నన్ను నేనే చిలుక్కుంటున్నవాణ్ణి
నాకు నేనే ప్రశ్నార్థకంగా మారినవాణ్ణి!

- బి. యస్. నారాయణ దుర్గ్భాట్టు 9346911199