సాహితి

మధ్యతరగతి జీవన విలువల అస్తిత్వ కథా విహారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుషులందు పుణ్యపురుషులు వేరయా’ అని వేమన అన్నట్లు, ‘కథకులందు పుణ్యకథకులు వేరయా’ అనాలనిపిస్తుంది ‘మనవే’ అనిపించే విహారి కథలు చదివినప్పుడు. మానవీయ విలువల మహిత సంపదను మూటగట్టిన నిధులు వారి కథలు. విహారి కథల్లో -
విలక్షణత వుంది,
హాయిగా చదివించే పఠనీయత వుంది,
రిరంసవాటిల్లోది ప్రధానంగా జీవన మూల్యాలది.
రెండు ఏడుల వయసులో అడుగిడిన విహారి అర్ధశతాబ్దంపైగా కథారచనా విహారం చేస్తున్నారు. బ్రతుకు తాత్త్వికతనే జీవనాడిగా చేసుకున్న ఆయన కలం మనిషి ‘చలనం’ను ‘స్పృహ’లో ఉంచుకుని, జీవితపు ‘ఎత్తుపల్లాలు’ ‘సహజాతాలు’గా చిత్రించింది. కథారచనా వైశిష్ట్యంలో ఆయనను ఒక ‘శిఖరంమీద’ నిలబెట్టింది. ఆయన ‘అక్షరం’, అభివ్యక్తి ‘వలయం’ పాఠకుడు ఇది విహారి రచన అని ‘పోల్చుకోగల రాతే’.
యాభై ఏళ్ళ కథారచనా ప్రయాణంలోని పాతిక ప్రాతినిధ్య కథలతో నవచేతన ప్రచురణగా విడుదల చేసిన విహారి కథలు చదువుతూంటే ఈ విలక్షణ పుణ్య కథకునికి దక్కవలసిన విశిష్ట గౌరవం ఇంకా సశేషంగానే ఉందనిపిస్తుంది. ఇప్పటికి పధ్నాలుగు కథా సంపుటాలు విహారివి వెలువడ్డాయి. స్పృహ, గోరంత దీపం, అక్షరం, అమ్మ పేరు చీకటి, గుండెలో కోయిల, బొంగరం, కొత్తనీరు, ప్రాప్తం, చిరంజీవి ఆశ, వౌనలిపి, ‘వి’గతం, కిటికీ తెరిస్తే, మాయతెర, విహారి కథలు అనే ఈ కథానికల సంపుటులలోని కథలన్నీ క్రమక్రమాగత చైతన్య ధనుష్పాణులవలె పరివర్తనాశీలమైన మానవ జీవన వైఖరులకు ప్రతిబింబితాలుగా వున్నాయి. ఇంత విస్తృతితో, విలక్షణతతో, వైవిధ్యంతో కథలు రాసినవారు అరుదు. రాసిన ప్రతి కథా నాటి సమకాలీనతను సంతరించుకోవడం మాత్రమే కాక ఒక సార్వజనీనతా లక్షణాన్ని కూడా పొదుపుకోవడం విశేషం. విహారి కథలు పాఠకులను ఊహాల్లోకాల్లో తేలియాడించవు. భ్రమలలోకి నెట్టవు. అవాస్తవికతను ఆపాదించవు. జీవితం ఏది ఎప్పుడు ఇస్తుందో అప్పుడు దానిని స్వీకరించడమనే నేల విడచి సాము చేయని జీవన పథాన్ని నిర్దేశించి ముందుకు నడిపిస్తాయి. హేతువును, తార్కికతను విస్మరించకుండానే సమ్యక్ దృష్టిని కలిగించే స్థితప్రజ్ఞతవైపు పఠితను మేల్కొల్పుతాయి. ఆయన రచనా శైలి గొప్పది. భాషపట్ల మంచి పట్టుంది. వ్యక్తులను, సమాజాన్నీ నిశితంగా పరిశీలించడంలో నిష్ణాతులు. అందుకే ఆయన కథల్లోని సంఘటనలు గానీ, పాత్రలుగానీ, ఆ పాత్రల సంభాషణలు గానీ ఏవీ కృతకంగా వుండవు. సహజత్వం తొణికిసలాడుతూంటుంది. ఆయన కథల్లో ప్రయోగాలు ఎన్ని చేసినా అవి చెప్పదలుచుకున్న విషయానికి ప్రోద్బలంగానూ, పాఠకానుభవానికి సహాయకారిగానూ వుంటాయి తప్పితే ప్రయోగం కోసం ప్రయోగం అన్నట్లుండవు.
విహారి కథల్లోని మరో గుర్తించదగిన కోణం ఏమిటంటే ఆయన కథలు ‘మధ్యతరగతి’ వర్గ సమాజానికి చెందినవి. ‘‘అందరూ ఆడిపోసుకునే మధ్య తరగతి మందహాసాల వెనుక దాగిన సింబల్స్‌ని, ప్రతీకలని ఔపోసన పట్టిన కథకుడు విహారి’’ అని మునిపల్లె రాజుగారన్నా, ‘‘మధ్యతరగతిని ఒక ఇంటిపేరుగా తీసుకుని తెలుగు సమాజానికి కొత్తగా పరిచయం చేస్తారు విహారి. అవసరానికి ఆదుకునే బంధువులు, ఇంటిమొత్తానికి ఒకడే సంపాదనాపరుడిగా ఉండటం, ఆచారాలు- సంప్రదాయాల పేరిట ఆదాయాన్ని మించి ఖర్చులు పెట్టడం, అనవసర ఆర్భాటాల మధ్య జీవితాన్ని సంక్షుభితం చేసుకోవడం, తమ గురించి కాక, తమ చుట్టూ వున్న సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచనతో బతకడం లాంటి లక్షణాలు ఈ మధ్యతరగతికి అంటుకున్న ప్రవర. ఈ దశనుంచే విహారి ఇరవై ఒకటి శతాబ్దపు కొత్త వాకిలిని పరిచయం చేస్తాడు’’ అని నండూరి రాజగోపాల్ విశే్లషించినా అది యథార్థం.
‘మాయతెర’ కథనానికి సంపుటికి ‘అంతరంగ నాదం’ అని తన మాట రాస్తూ ‘‘అనివార్య పరిస్థితులు నెట్టుకుపోతే ఆ పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి, పోరులో, పోరుతో సతమతమై, కడకు సమసిపోతున్న త్రిశంకు వర్గం కథానికలు ఇవన్నీ. నేను రాసే కథానికల్లో ఎప్పుడూ ఎక్కువ భాగం ఈ వర్గానికి చెందినవే. ఆ వర్గంవారి పాత్ర పోషణలో మనస్తత్వ విశే్లషణకి నా నేర్చినంత ప్రాధాన్యతనిస్తాను. నా కథానికలు సమయాన్నీ సందర్భాన్నీ, నిర్మాణాన్నీ వాటికవే కూర్చుకుంటాయి. నా కథల్లో నేను మధ్యతరగతి బతుకుపోరులో మందహాసాల మాటున ఉబికే మూగ సంవేదనల్ని వ్యక్తావ్యక్తంగా పాఠకుల ముందుంచుతాను. వ్యక్తంనుండి అవ్యక్తం అందుకోవడమే రసోల్లాసం అని ఆనాటి లాక్షణికులు అన్నారు. దానే్న సాహిత్యంలో అనిర్వచనీయత అని నేను నా వివిధ వ్యాసాల్లో సోదాహరణంగా ప్రతిపాదిస్తూ ఉన్నాను. అదే సాహిత్యంలో జీవిత సౌందర్యము. జీవన తాత్త్వికత కూడా. సాహిత్యం చేసే అసలైన మేలు వీటిని గ్రహించగలగడమే!’’ అని పేర్కొన్నారు స్వయంగా. అందుకే విహారి కథలు కాలంతో నడుస్తూ, కాలంతో నిలుస్తూ, కాలంతో గెలుస్తూ పాఠకులను అలరిస్తూన్నాయి. ఆయన విరామ రచయిత కాకుండా, నిర్విరామ కథకునిగా రాణించగలుగుతున్నారు.
ప్రముఖ కథా రచయిత బుచ్చిబాబు గారు కూడా EXISTENTIALISM అంటే అస్తిత్వవాదానికి ప్రాధాన్యత ఇచ్చినవారే. మధ్యతరగతికి మనశ్శాంతినిచ్చే మహామంత్రం అదే అనిపిస్తారు విహారి గారు కూడా. ‘స్పృహ’ అన్న ఆ జీవన తాత్త్వికతనే చిత్రించారు. నాలుగంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో వుండే ఆఫీసులో పనిచేసే రెడ్డిగారు భవనం మొత్తం కుప్పకూలి వందల సంఖ్యలో జనం చచ్చిపోయినా బ్రతికి బట్టకడతారు. నోట్లో వెండి చెంచాతో పుట్టిన ఆయన జీవితం తిరిగిన మలుపులు, పక్షవాతపు భార్య, నోరూ కాలూ లేని కొడుకు వున్నా ఆయన అస్తిత్వం వదులుకోలేదు. తరుగులోనే మెరుగు ఉంటుంది బతుకులో. ‘‘జీవితం నీకు ఎప్పుడు ఏది ఇస్తుందో దాన్ని స్వీకరించు. అది రాలేదని బాధపడీ, ఇది కావాలని ఆరాటపడీ మనంగా సాధించగలిగేది చాలా స్వల్పం’’ అన్న రెడ్డిగారి మాటే విహారిగారి బతుకు ఫిలాసఫీ! మానవ అస్తిత్వానికి నిర్ణీత లక్ష్యమేమీ లేదని ఈ జీవితానికి విలువ, అర్థం మనం ఇచ్చుకునేవేనని బోధించే తత్త్వధోరణే అస్తిత్వవాదం. జీన్‌పాల్ సార్త్రే సిద్ధాంతమూ ఇదే!
‘చలనం’ కథలోని శ్రీనివాస్ ఒకచోట అంటాడు- ‘‘దౌర్భాగ్యాలు రెండు రకాలు. ఒకటి ఎవర్నీ నమ్మలేకపోవడం. రెండవది అందర్నీ నమ్మడం. అసలు జీవితం నటన, ఆత్మవంచన, కపట నాటకం కాదంటావా? హృదయం ఏదో కావాలని తహతహలాడుతుంది. శరీరం దేన్నో పొందాలని వాంఛిస్తూ వుంటుంది. అది అందదనీ, దీన్ని పొందలేమనీ తెలుసు. అయినా ఏదో తపన. ఆ అగ్ని చల్లారదు. ఈ కాంక్ష చావదు. ఏమీ చెయ్యలేము. అస్థిమితత్వం- అలసత్వం, ఆరాటం, అసహాయత, వీటన్నింటినీ ఛేదించుకుని బయటికి రాలేక, ఆశలు ఆశయాల పరిధిమీద ఒకే బిందువును పదే పదే పాదాలతో చుంబిస్తూ ఒకటే పరుగు. చివరికి భయంకరమైన యాతనాభారంతో మనిషి చీకటి కోణంలో కూరుకుపోతూనే వున్నాడు’’. మధ్యతరగతి జీవి ప్రధానంగా లోనయ్యే జీవన స్థితి అదే'Man is a useless passion' అనేది చలనంలోని సంచలనం!
అయితే కథల్లో నైరాశ్యము, పలాయనము వుంటాయనుకోవడం సరికాదు. అనవసరపు ఆర్భాటాల నడుమ బ్రతుకు సంక్షుభితం కాకూడదనే హెచ్చరికనే అందిస్తారు విహారి. ఉదాసీనతకు ఉద్రేకానికీ కూడా సహజీవనం నేర్పి డబ్బు జబ్బులో పడకుండా విలువలకై నిలబడే దిశా నిర్దేశనం వారి కథల్లో సూచితాలు. పిల్లల స్వేచ్ఛను గౌరవించడం ‘కిటికీ తెరిస్తే’ కథలో వృద్ధతరానికీ సుబోధకం చేశారు.
సృజనశీలి అయిన కథకుడు స్రష్ట మాత్రమే కాదు ద్రష్ట కూడా కాగలుగుతాడనిపిస్తుంది. ‘నీడ’ కథలో సమాజపు ఒక వౌలిక మార్పును ఆయన ఆనాడే పసిగట్టారు. ఉమ్మడి కుటుంబ జీవనాలు ఆర్థిక మూలాలపై ఎలా విచ్ఛిన్నమవుతూ వస్తాయో ఊహించారు. అలాగే తెలుగు సాహిత్యంలో స్ర్తివాదం అంకుర దశలో ఉన్నప్పుడే ‘నిప్పు’ కథ ద్వారా స్ర్తి సాధికారిక స్వరాన్ని తండ్రినయినా ధైర్యంగా ప్రశ్నించే తనయ వైఖరినీ చిత్రించారు. అలాగే సరళీకృత ఆర్థిక విధానాలంటూ ప్రవేశించిన తరుణంలో రైతు జీవనం ఎలా ఛిద్రమైందీ, ఒకప్పుడు భూమిని నమ్ముకుని దర్జాగా బతికిన బతుకులే అమ్ముకుని ఎలా వలస జీవాలై కూలీలుగా, రిక్షావాళ్ళుగా, బిచ్చగాళ్ళుగా మారుతూ వచ్చిందీ ‘భ్రష్టయోగి’ కథ చదివితే కరతలామలకమవుతుంది. ‘వాస్తవాన్ని నమ్మక తప్పదుగానీ, అది ఇంత కఠోరంగా, దారుణంగా వుంటే భరించడం కష్టం’ అనిపింపజేసే గుండెల్ని పిండే కథే అది. ‘్భ’మధ్యరేఖ కథలోనూ ఈ స్థితినే చెప్పినా రైతు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ప్రబోధిస్తూ ‘ప్రతి సమస్యకీ ప్రత్యామ్నాయం, పరిష్కారాలు వుండనే వుంటాయి’! అని ఆశావహ దృక్పథానే్న ఎగసన వేస్తారు. ‘అడుగులో కాలేసినవాడు తీసుకోవడమూ, కాలు కడుక్కోవడమూ కూడా తానే నేర్చుకుంటాడు. మనిషికి చరిత్ర నేర్పుతున్న పాఠం ఇదేనమ్మా’ అని అస్తిత్వ వాదానికి ఊపిరులూదుతారు. ‘ఇల్లు ఒక చేదు మాత్ర’ వంటి కథ ద్వారా మంచివారిని మోసం చేసిన ఉసురు ఊరికే పోదన్న సంగతినే సంఘటనాత్మకంగా అనిపింపజేసేలా చిత్రిస్తారు. నడి సముద్రంలో ఎత్తయిన గిరిశిఖరం మీద వెలుగు కిరణంలా మానవత్వం భాసిస్తుందనే నమ్మికకు ప్రోదునిస్తుందీ కథ.
ఉత్తరాలు రాసుకునే కాలం పోయి ఉత్తగా సెల్‌ఫోన్‌లో మాటాడుకోవటాలూ, ఆ మాటాడుకోవడాలూ మాని ఎస్సెమ్మెస్‌లు ఇచ్చుకోవడం, ఛాటింగ్‌లు కాలం వచ్చింది. వాట్సప్‌లో మాటల టైపింగూ పోయి ఈమోజీలతో భావప్రకటనం చేసే వైఖరీ ప్రబలుతోంది. ఈ మార్పులు, సాంకేతికత కూడా అనివార్యాలే. ‘ఇల్లు చేదుమాత్ర’ కథానికలోని వస్తువునీ, శిల్పాన్నీ అభినందించిన పలు ప్రాంతాల పాఠకుల పేర్లనూ, సెల్‌నెంబర్లనీ కూడా విహారిగారు తమ కథానికా సంపుటి ‘మాయతెర’లో నమోదు చేయడం చూసినపుడు కాలావధుల్లో ఒదిగే ఆయన ఎలా కాలాతీత కథకునిగా సార్వజనీనం కాగలుగుతున్నారో కదా అని వందన సమర్పణ చేయాలనిపిస్తుంది.
ఏమయినా విహారి విలక్షణ హాయిని అందించే రిరంసా మానవీయ భావనల కథకుడు. పాఠక హృదయాలను అస్తిత్వ తాత్త్వికతతో రసప్లావితం చేసే పుణ్య కథకుడు. ‘మాయతెర’లను చీల్చి ‘గోరంతదీపం’ కాంతి ‘వలయం’లో బ్రతుకుకి అవసరమైన ‘చిరంజీవి ఆశ’ను ఆవాహన చేయించే సత్యనారాయణుడు. ఆ కథావిహారికి అభినందనల కైమోడ్పులు.

- సుధామ