సాహితి

సాహిత్యమే ఆయన వారసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1959 నవంబరు, డిశంబరు మధ్యకాలంలో కాకినాడ సూర్యకళామందిరంలో గురజాడ వర్ధంతి రెండుసార్లు జరిగింది. మొదటిసారి పాలగుమ్మి పద్మరాజు, ఆవంత్స సోమసుందర్, ఉషశ్రీ సభలో పాల్గొన్నారు. రెండవసారి సభ ఉషశ్రీ అధ్యక్షతన, కృష్ణశాస్ర్తీ, కాటూరి వెంకటేశ్వరరావు ఉపన్యాసాలతో రసవత్తరంగా సాగింది.
కృష్ణశాస్ర్తీగారు గొప్ప వక్త, సంభాషణ చతురుడు అని గొప్పగా చెప్పుకునేవారు. నేను కాలేజీ విద్యార్థిగా వుండగా శాస్ర్తీగారి ఉపన్యాసం వినడం అదే మొదలు, అదే ఆఖరు. అప్పటికే ఆయన గొంతు ‘గస’బారిపోయింది. అయినా ఆరోజు బసవరాజు అప్పారావుగారి పాటల రచన తీరు గురించి, అసలు తెలుగులో పాట రచనా సౌలభ్యం గురించి, శాస్ర్తీగారు అద్భుతంగా గంటకు పైగా మాట్లాడారు.
శాస్ర్తీగారి ప్రసంగ వైభవాన్ని ప్రస్తావించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి పూర్వరంగంగా ఆయన గురించి కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి. నా దృష్టిలో ఇప్పటికీ శాస్ర్తీగారి రచనా సంవిధానం గురించి సరిగా అర్థం చేసుకున్న వారికంటే, అపార్థం చేసుకున్నవారే ఎక్కువ. ఇందుకు కారణాలు లేకపోలేదు. కృష్ణశాస్ర్తీగారు యాభై ఏళ్ళకు పైగా గడిపిన ఉత్కృష్ట సాహిత్య జీవితాన్ని మూడు భాగాలుగా విభజించి, విశే్లషించుకుంటే అపార్థాలకు తావుండదు. 1920ల కాలం నుంచీ శాస్ర్తీగారి వ్యాసంగంపట్ల ఆశ్చర్యంతో, ఆసక్తితో, అబ్బురపాటుతో అభిమానించి చూసినవారూ వున్నారు. వెటకారం చేస్తూ, తప్పులెంచుతూ వ్యాసాలు, పుస్తకాలు వ్రాసిన పండిత విమర్శకులు, పండిత కవులు కూడా వున్నారు.
1911లో కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజీలో రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి ఆచార్య కత్వంలో, బ్రహ్మసమాజ గీతాలు వ్రాయడం దగ్గర ప్రారంభించి, 1925లో సాహితీ సమితి సభాపతి తల్లావఝల శివశంకరశాస్ర్తీ ప్రోద్బలంతో ‘కృష్ణపక్షం’ కవితా సంపుటి, 1929లో ‘జ్వాల’ పత్రిక సంపాదకుడు ముద్దుకృష్ణ ప్రోద్బలంతో ‘‘ప్రవాసం- ఊర్వశి’’ కవితా సంపుటి వరకు- పద్ధెనిమిది సంవత్సరాల కాలంలో కృష్ణశాస్ర్తీ, భావకవిగా ఒక విశిష్ట ముద్రతో తెలుగు కవిత్వంలో ఒక విప్లవం తీసుకొచ్చారు. ఏమిటా విప్లవం?
ఇది:- ఛందస్సుల పరంగా దేశిచ్ఛందాలని, గేయచ్ఛందాలని, కవిత్వంలోకి విరివిగా తీసుకురావడం. భావాన్నిబట్టి చ్ఛందస్సుల నిడివిని నిర్ణయించటం, అంతవరకు తెలుగు కవిత్వానికి పరిచయం లేని పద చిత్రాలను, భావ సమాసాలను, కవిత్వంలో ప్రవేశపెట్టడం.
మన తెలుగు కవిత్వ పండిత పాఠకులకి, లేదా పాఠక పండితులకి, కొన్ని వందల సంవత్సరాలనుండి ప్రబంధ కవిత్వం, అందులో ప్రణయం, వర్ణనలు, ఆస్వాదించటం అలవాటు. ఒక్కసారిగా, ఖండకావ్య ప్రక్రియలో, ఆత్మాశ్రయంగా, కృష్ణశాస్ర్తీ తీసుకొచ్చిన ఈ విప్లవం, తెలుగు రసికులకు ఒక పట్టాన మింగుడు పడలేదు. అందుకే ఆ విమర్శలు, వెటకారాలు. అయితే, అదే కాలంలో (1920-40) ఆధునిక ఆలోచనా ధోరణికి అలవాటుపడిన యువతరం కవిత్వ పాఠకులు, ఆయన కవిత్వాన్ని గాఢంగా అభిమానించారు. దీనికితోడు, ఆయన గిరజాల జుట్టు, బెంగాలీ పక్క మెడలాల్చీలు, ఆయన సాహిత్య యాత్రలు, ఆనాటి యువతరాన్ని ఉర్రూతలూగించాయి.
ఇప్పుడు, ఆయన సాహిత్య జీవితంలో ప్రధానమైన రెండవ ఘట్టాన్ని స్మరించుకోవాలి. సుమారుగా 1920ల నుంచి 1940 వరకు, బరంపురం నుంచి ఇటు బళ్ళారివరకు విస్తృతంగా ఆయన సాగించిన సాహిత్య పర్యటనలు, ఆధునిక కవిత్వానికి ఆయన చేసిన ప్రచారానికి సాక్ష్యాలు. వివిధ పట్టణాలలో సభలు ఏర్పాటుచేసి, ఆనాటి ప్రసిద్ధ కవుల అందరి సాహిత్య ఖండికలను వినిపిస్తూ, ఆధునిక కవిత్వం పట్ల ప్రజలలో గట్టి అభిమానాన్ని కలిగించారు.
ఇప్పుడు ప్రస్తావించదలచిన ప్రధాన విషయం - ఆయన జీవితంలో మూడవ ఘట్టం. ఇది ప్రధానంగా ఆయన వచన రచనల ప్రచారఘట్టం. అయితే ఈ ఘట్టంలో ఆయన అద్భుతమైన విడి పాటలూ వ్రాశారు; రసవంతమైన సంగీత రూపకాలూ వ్రాశారు. ఈ కాలంలో కృష్ణశాస్ర్తీగారి రచనల తీరే మారిపోయింది. అయితే ఆయనలో అంతర్గతంగా వుప్పొంగే కాల్పనిక వైభవం చెక్కుచెదరలేదు.
1938లో దక్షిణాది మొత్తానికి మద్రాసులో రేడియో కేంద్రం ఏర్పడింది. ఇది, దేశంలోనే సరికొత్త మాధ్యమం. ఇది పాఠకుల్ని కాక, శ్రోతల్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. కనుక- ఏమి వ్రాసినా, వినికిడి కోసం వ్రాయాలి. చాలా సరళంగా వ్రాయాలి. ప్రసంగం చేసినా, రూపకం వ్రాసినా, నాటకం వ్రాసినా, విన్నవెంటనే శ్రోత మనస్సుకు అందేలా వుండాలి.
ఆనాటి నుంచి (1938) కృష్ణశాస్ర్తీగారు శ్రోతల కవి అయిపోయారు. ఇతిహాస, చారిత్రక, సమకాలిక విషయాల గురించి, రూపకాలు వ్రాసినా, పాటలు వ్రాసినా, ప్రసంగాలు చేసినా, సంభాషణాశైలిని తన రచనకు ఆధారభూమి చేసుకున్నారు. అద్భుతమైన సంభాషణలు, శ్రోతతో చనువైన సాహిత్య ప్రసంగాలు, అలాగే కొన్ని సృజనాత్మక ప్రసంగాలు ఆయన చేశారు. సహజ సిద్ధంగా, ఆయన కబుర్ల పోగు, ఇంటాబయటా, చుట్టూ మిత్రుల్ని పెట్టుకుని, అనేక విషయాలను ఆకర్షకంగా ప్రసంగించటం ఆయన అలవాటు. ఇది ఆయన రేడియో రచనలకు ఎంతో ఉపకరించింది. 1938లోనే రేడియో కేంద్రం పెట్టిన వెంటనే, మద్రాసునుంచి ప్రసారమైన తొలి తెలుగు ప్రసంగం ఆయనదే- ఊర్వశి గురించి.
1964లో ప్రారంభించి 1996 వరకు ఆయన రచనలన్నీ- మధ్యమధ్య కొద్ది ఎడంతో ఇరవై మూడు (23) చిన్న సంపుటాలుగా ప్రచురణ పొందాయి. వాటిలో, వ్యాసావళి పేరిట ప్రచురితమైన ఆయన ప్రసంగాల సంపుటాల గురించి పరిమితమై, కొన్ని విశేషాలు ప్రస్తావిస్తాను. మన వినికిడిలో, ప్రసంగం (్ఘరీ) వేరు; ఉపన్యాసం (జళషఆఖూళ) వేరు. ప్రసంగం ఒక వ్యక్తిని లేదా కొద్దిమంది ఆత్మీయుల్ని ఉద్దేశించి చేస్తాం. ఉపన్యాసం, సమూహాన్ని వుద్దేశించి చేస్తాం. మొదటి దానిలో ఒక ఆత్మీయతా, చనువు, అప్పుడప్పుడు శాఖా చంక్రమణం వుండవచ్చు. ఉపన్యాసంలో ఒక ఏకాగ్రత, ఉపదేశ ముద్ర, జ్ఞానభారం కూడా వుండవచ్చు.
రేడియో ప్రవృత్తిలో, ప్రసంగం తప్ప ఉపన్యాసం వుండదు. ఇక్కడ వక్త, ఒకే ఒక శ్రోతని వుద్దేశించి ప్రసంగించటం ముఖ్యం. ఎంత ఎక్కువ జ్ఞానాన్ని పిండి పోశామన్న దానికంటే, ఏక దేశమైన ఒక అంశాన్ని, క్లుప్తంగా ఆకర్షకంగా, కొద్ది వ్యవధిలో రుచిమంతంగా చెప్పగలిగామనమేది ముఖ్యం. ఈ విషయంలో రేడియో ప్రసంగకర్తగా కృష్ణశాస్ర్తీగారు రారాజు.
కృష్ణశాస్ర్తీగారి ప్రసంగాలలో ప్రత్యేకత, స్వయంగా ఆయన వాటిని వినిపించిన తీరు. స్పష్టమైన ఆత్మీయమైన వ్యావహారిక భాషా, వాక్య నిర్మాణశైలి ఆయనవి. దీనికి తోడు ఒక్కొక్క ప్రసంగాన్ని వినిపించటంలో, ఆయన అనుసరించిన మాటవిరుపు, జాగాలు యిచ్చిన తీరు, శ్రోతల్ని పలకరించే ప్రసంగశైలి, ఆయనకు కలిసి వచ్చిన అదనపు అవకాశాలు. ముందే చెప్పినట్టుగా, ఆయన ‘‘పాఠకుల’’ కోసం ‘వ్యాసాలు’ వ్రాసిన రచయిత కాదు. పుస్తకాలు అచ్చు అక్షరాలలో కంటికి కనిపించే విధంగా ‘వ్యాసావళి’ అనే పేరుతో ఆయన చేసిన యాభై ప్రసంగాలను నాలుగు చిన్న సంపుటాలుగా కూర్చినప్పటికీ, సాంకేతికంగా వాటిని ‘ప్రసంగాలు’ అనే వ్యవహరించాలి. అచ్చయిన ఈ ప్రసంగాలలో కొన్ని, పత్రికలలో ‘వ్యాసాల’ పేరిట, కొన్ని పుస్తకాలకు వ్రాసిన ‘పీఠికల’ పేరిట, పేర్కోదగినవి. కొద్దిగా వున్నప్పటికీ, వాటి రచనాశైలి ప్రసంగశైలే.
ఆయన రేడియోలో ఎలా ప్రసంగించారో అనే సాక్ష్యానికి 1954లో కాకినాడ సూర్యకళామందిరంలో, సరస్వతీగానసభవారి వార్షికోత్సవంలో (నిజానికా సభ రజతోత్సవ సభ.) సంగీతం గురించి, సంగీత విద్వాంసుల గురించి, ఆయన చేసిన ప్రసంగం రికార్డింగ్. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పదిలంగా వుండి వుండాలి. అలాగే ఆయన కుమారుడు బుజ్జాయి దగ్గర కొన్ని రికార్డింగులు వున్నాయని విన్నాను. 1964లో ఆయనకు గొంతు ఆపరేషను జరిగి, మూగతనం ప్రాప్తించాక, ఆయన తనకు సహజమైన మాటకారితనంతో ఇంటాబయటా మిత్రులను కాగితాల మీద వ్రాసి పలకరించేవారు. అందువల్ల- ఆయన చేసిన ప్రసంగాల రికార్డింగులకి, నేటికి మరింత విలువ.
ఇక ఆయన ప్రసంగాలల్లో సుప్రసిద్ధ కవుల గురించి, సాహిత్యం గురించి, విశేషించి కవిత్వం గురించి- తన నాటి జాతిని మేల్కొలిపిన మహావ్యక్తుల గురించి, చెప్పిన విశేషాలను ప్రస్తావిస్తాను.
కృష్ణశాస్ర్తీగారికి ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం అంటూ గిరులు గీసి చూపించటం సుతరామూ యిష్టం లేదు. అందుకే, విశాలమైన ఆయన సాహిత్య దర్శనం, సామాజిక దర్శనం, ఆయన ప్రసంగాలలో కనిపిస్తాయి. శాస్ర్తీగారు ఒక కావ్యం గురించి మాట్లాడినా, కవి గురించి మాట్లాడినా, వారి రచనల్లోంచి పుంఖాను పుంఖాలుగా ఉదహరిస్తూ పోరు. ఒక కవి జీవ లక్షణాన్ని, ఒక తరహా కవిత్వంలో విశేషతని, తన అనుభవం ద్వారా సారాన్ని తీసి, సూత్రీకరించి చెప్తారు.
చివరిగా, వక్త, శ్రోత సంబంధం గురించి ఒక సూత్రీకరణ చేస్తూ, ఆయన ఇలా అంటారు- ‘‘స్థలాన్నిబట్టీ, కాలాన్నిబట్టీ, వక్త మనస్సు ఎలా మారుతుందో, అలాగే శ్రోతదీ మారుతుంది. గదిలో సభ ఒక పద్ధతి, ఆరుబయటిది ఒక పద్ధతి, సాయంకాలానిది ఒక ధోరణి. కొంత రాత్రి ముదిరాక, ఒక మాదిరి.సారాంశంగా, కృష్ణశాస్ర్తీగారి సాహిత్య వ్యక్తిత్వం, కల్పనాచాతుర్యం, సంభాషణాచారిమ, ఆయన ప్రసంగాలలో ప్రతిఫలించి కనిపిస్తాయి. విశేషించి, ఆయన భావుకత్వ ప్రతిభ, ఆయన ‘సృజనాత్మక’ ప్రసంగాలలోనూ, ‘వాక్ చిత్రాల’లోనూ మరింత విశేషంగా కనిపిస్తుంది. ప్రసంగ ధోరణిలో, వక్త నుంచి ఆయన ఆశించే విశేషాంశాలు ఇవి:- ‘‘ఎక్కువగా ఆప్త స్నేహితుడిలాగా, భారుూ, భారుూ లాగ మాట్లాడాలి. నవరసాలు ఒలికించాలి. ఎక్కువగా హాస్య రసం, సెటైర్- ఎత్తిపొడుపు ధోరణి వుండాలి. మామూలుగా మాట్లాడే ధోరణిలోనే, పుస్తకంలోంచి చదివేలా కాక, ‘‘ఇంటిమేట్’’ రీతిలో వుండాలి.
కవిగా, వక్తగా, కృష్ణశాస్ర్తీగారు అక్షరాలా భావకవిత్వ యుగకవి. ఆయన ప్రభావానికి లోనైన అనేకులు ఆయన లాగా వస్తధ్రారణ చేసి, విరహ కవిత్వం వ్రాసి, ప్రసిద్ధులయ్యారు.
కృష్ణశాస్ర్తీగారికి సాహిత్య వారసులు, స్పష్టంగా బాలాంత్రపు రజనీకాంతరావు, ఎస్.వి.్భజంగరాయశర్మ, దేవరకొండ బాలగంగాధర తిలక్, పిలకా గణపతిశాస్ర్తీ, ఇస్మాయిల్ అని నేను ధైర్యంగా చెప్పగలను. మనలో మన మాట - ‘మోడెస్టీ’ అడ్డురాకపోతే- నన్ను నేను వారి పక్కనే చేర్చుకుంటాను.

- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, 9848078079