సాహితి
మనాది కాలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎడారి ఆకాశానికి ఎండమావుల్ని అప్పజెప్పి
నెర్రల నేలకు అమృతస్తన్యమివ్వని
వట్టిపోయిన కార్తెల్ని కాడెద్దులకు బిగించి
నాగలి గొర్రుకు వేలాడుతున్న శవాలు!
వడిసెల దెబ్బకు రాలుతున్న పిట్టల్లా..
చెదలు పట్టిన అమృత హస్తాలకు అనంత దుఃఖం!
చేన్లు చెల్కలు వరి మొలకలు
కాటేసిన కాలంలో విముక్తి లేని శాపగ్రస్థలు!
మట్టి స్పర్శ మరణ మృదంగంలా..
ఇల్లిల్లూ దింపుడు కళ్ళాల గోసలు!
అచ్చిరాని మాయాజూదంలో ఓటికుండ బతుకులు
ఉడకని అన్నం మెతుకులు!
నాగేటి చాళ్ళలో మొలుస్తున్న ఉరికొక్కాలు!
మట్టి దిబ్బల్లో ఖననమవుతున్న గుండె చప్పుళ్లు!
పుచ్చిన తర్రల్లా.. వాకిలి తడిచేసిన గొడ్డు జల్లులు!
ఉప్పస మాటల్లో బరువెక్కుతున్న బతుకుముల్లె
ఊరి ఉసురు దీస్తున్న మనాది కాలం!
ముక్కిన పనిముట్లు,
కాగులో కమ్ముకున్న చీకట్లు!
గుమ్మరించిన ఖాళీలతో వెక్కిరించే గుమ్ములు!
పెద్దోళ్ల కడుపునింపే పెత్తర అమాసకు
వరుస కడుతున్న పిండప్రదానాల కడుపుకోతలు!
చిల్లుల చేదలతో తోడుకపోతున్న దుఃఖపు చినుకులు!
ఆనకట్టల్లేని కన్నీటి చెలిమెలు!
ఆపన్న హస్తాల నిరీక్షణలో చిగురించని ఆశలు..
ఊబిలో దిగబడుతున్న గతి తప్పిన గుండె లయలు!
ముల్లుకట్టెలా పొడుస్తున్న
బతుకు సుడిలో..
భవితవ్యం ఇక ప్రశ్నార్థ లోలకాలే!!
(ఉప్పస= పిచ్చాపాటి * మానాది = మనోవ్యాధి)