సాహితి

సామాజిక వికృతిని సాహిత్యం పట్టుకోగలదా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్తమాన ఆధునికత స్థితిగతుల్లో వడి పెరిగింది. ఆలోచనా వాడి పెరిగింది. బతుకుతెరువు బహుముఖీనమైన అనే్వషణా వ్యాప్తమైంది. వర్తమాన ఆధునికత స్థితికి నిర్దిష్ట లక్ష్యం, లక్షణం లేదు కనుకనే దీన్ని ద్రవాధునికత అన్నాడు జిగ్మంట్ భౌమన్. ఒక స్థిరమైన ప్రశాంత వాతావరణంతో కూడిన, ఏ మార్పులు లేని విధంగా జీవించడం నేడు అసాధ్యమై కూర్చుంది. వెనుకటి జ్ఞాపకాలను దునే్నసుకుంటూ, నూతన ఒరవడితో చదునుచేసుకుంటూ నిరంతరం ఓ వినూత్న భావజాలాన్ని పెంచుకోవడం అనివార్యమైంది. వ్యక్తి సమాజంలో ఓ కొత్త గుర్తింపు కోసం వెతుక్కోవడమే ఆధునికతలో క్రియాశీలతగా పరిగణింపబడుతుంది. ఈ స్థితిలో జీవన విధానాలు ఆర్థికావగాహన, వినియోగము, ప్రయోజనము, బాహ్య అంతర్ ప్రపంచ దర్శనం తదితర వాటిల్లో వచ్చినంత క్రియాశీలకమైన మార్పులు సాహిత్యపరంగా రావడం లేదని చెప్పుకోక తప్పదు. సాహిత్య ప్రక్రియా విధానాలను ప్రక్కనబెడితే, విషయ శోధన, అభివ్యక్తి, శిల్పనిర్మాణం, పరిశోధనా పాటవాల్లో అనుకున్నంత వినూత్నత కనిపించడం లేదనే చెప్పుకోవాలి.
ఈ ఆధునికతలో వేళ్ళూనుకుంటున్న అస్తిత్వ వాదాలు వెనుకటి కుల, మత, ప్రాంతీయ భావాజాలాన్ని మించిన వెర్రితలలు వేస్తున్నాయి. అమానుషంగా మానవ సంబంధాల విఘాతానికి పురిగొల్పుతున్నాయి. ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. సామూహిక శక్తిని విచ్ఛిన్నం చేసే చిన్నచిన్న గ్రూపులు, ముఠాతత్వాన్ని పురిగొల్పుతున్నాయి. దీన్ని సాహిత్యం బలపరుస్తూ మానవ సంబంధాలను విడగొట్టటానికి కారణం కావడం శోచనీయమే. అస్తిత్వవాదాల ఆవిర్భావం, గొప్ప ఆదర్శనీయమైన భావజాలంతోనే జరిగింది. కనుమరుగైపోతున్న అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షించే విధంగానే జరిగినప్పటికీ; స్వార్థంతో, నాయకత్వపు కుసంస్కారంతో మానవ సంబంధాల ఐక్యతను ధ్వంసం చేయడంలో భాగస్వామ్యం కావడమే విచారించవలసిన అంశం. నిజం చెప్పాలంటే అస్తిత్వవాదాలైన స్ర్తివాదం, దళితవాదం, మైనారిటీవాదం, ముస్లింవాదం మొదలగునవి బలపడ్డాక, విప్లవ వాద కవిత్వపు ఊపు తగ్గిందనే చెప్పాలి. విప్లవవాద కవిత్వపు ఫాలోయింగ్ కూడా పలుచబడింది. సమాజం ఏక రీతిగా ఉండకుండా ఛిన్నాభిన్నమైన రీతుల్లో మనిషి తననుతాను తన మూల సంస్కృతి లోంచి నిర్మించుకోడానికి యత్నించడం మొదలెట్టాడు. ఇట్టి పరిస్థితుల్లో ఉన్నత వర్గాలు, అభివృద్ధి చెందిన పెత్తందారీ కులాలు, వారు ఉన్నతమైన విలువలతో కొలవబడుతున్న సంస్కృతి సంప్రదాయాలు, మార్పుకు లోనవడాన్ని సహంచలేకపోయారు. సమాజం ఆధునికమయ్యేకొద్ది ప్రగతిశీల భావాలతో ఎదిగేకొద్ది, కుల మతాలు కూలిపోతాయని ఆశించిన మేధావి వర్గాలకు, నానాటికి, బలోపేతవౌతున్న కుల మతాల కుదుళ్ళను చూసి నిరాశే ఎదురైంది. సాహిత్యపరంగా కథగా ఘోషించినా, కవితై పరితపించినా, నవలై విలువల పూర్వాపరాలను చర్చించినా, విమర్శ రూపంలో విషయాలను విప్పిచెప్పినా, అసమ అస్తిత్వాల మధ్య పోరు రాజుకుంటూనే ఉంది. వర్గ దృష్టితో సమాజాన్ని చర్చించడం, విశే్లషించడం, వివరించడంపోయి అస్తిత్వవాదాలు కుళ్లు రాజకీయాలతో హ్రస్వ దృష్టితో, కుల మతాల దృక్పథంతో కించిత్తు ఈర్ష్యాద్వేషాల వింగడములతో వర్గపోరాటాల్ని చైతన్యాన్ని నీరుగార్చడం గమనించాల్సి వుంది. వేగవంతమైన విప్లవాత్మకమైన మార్పుల్ని అంగీకరించలేకపోతున్నారు. మేధసంపత్తిగల మనిషి అనే్వషణశక్తి ఎక్కడ ఆగిపోతుందో అక్కడ తాను సముపార్జించిన అనుభవసారాన్ని, జ్ఞానాన్ని ఘనీభవింపచేస్తూ ఒక భావ సుస్థిరతకు స్థానం కల్పించే సైద్ధాంతిక భూమికను తయారుచేస్తున్నాడు. స్వస్థ సమాజం వృద్ధిచెందాలంటే, సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే, తన సిద్ధాంతాలే ఆసరా అంటున్నాడు. బాహ్య అంతర్ జీవితాల మధ్య సామరస్యానికి తన సిద్ధాంతమే ఏకైక మార్గమనే సంకుచిత భావంలోకి మనిషి నడుస్తున్నాడు. అక్కడ నుంచే కాలంతో కలసి నడిచే తత్వం కోల్పోతున్నాడు.
సాహితీవేత్తల్లో ఎప్పుడూ అనే్వషణ ఆగకూడదు. ఇది ఎప్పటికీ అనంతానే్వషణగానే కొనసాగుతూ ఉండాలి. నూతనత్వం చెడకూడదు. ఆత్మవిశ్వాసం జారకూడదు. సాధించిన దాన్ని సామాజికపరం చేస్తూ సమసమాజ స్థాపనకు వరంగా అందిస్తూ క్రొత్తదనం కోసం అనే్వషణాచిత్తులై ఆత్మవిశ్వాసంతో అప్రమత్తులై సాగిపోతుండాలి. ఒక స్థిరత్వం లేకుండా నిరంతరమైన గణనీయమైన మార్పుకు లోనవుతున్న ఆధునికత, ప్రపంచంలో ఏ శక్తి చైతన్యానికి ప్రభావితమై చలిస్తుందో మార్పుకు లోనౌతుందో ఆలోచించాల్సిన సందర్భం. సహజత్వాన్ని వౌలికతత్వాన్ని కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎందుకు నిలుపుకోలేకపోతోందో, ఏ దోపిడీ కార్పొరేట్ వ్యాపార వ్యవస్థ భావజాలం అంతర్భాగంగా, అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఆధునికతను వస్తువ్యామోహ స్థితిలోకి, అమానవీయ ఆర్థిక వ్యసనాల్లోకి దిగజార్చుతోందో సాహిత్యం గమనించాల్సి వుంది. మానవుడే కేంద్రం కాకుండా నైతిక భూమిక లేకుండా, సర్వకాలీనత, సర్వజనీనత, సర్వశ్రేయస్సు దృష్టి, దృక్పథం లేకుంటే, ఆధునిక సామాజిక ప్రవాహం దిశానిర్దేశం లేని నికృష్ట నిర్లిప్త లోతుల్లోకి దూకుతుంటుంది. అందుకే సాహితీవేత్తలు సమాజానికి దిక్సూచి కావాలి. చైతన్యవంతమైన పోరాట పటిమగల ఆలోచనలివ్వాలి. సామాజిక ఆధునిక వికృత వైఖరిని, గతిని, గమనాన్ని గ్రహించగలగాలి, ఎత్తిచూపించగలగాలి. నిబద్ధతగల సాహితీవేత్తలు ఎప్పుడూ తమకు తోచింది రాసి, వారు రాసిందే సమాజానికి అనుసరణీయమని కూర్చోకూడదు. ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజాసమూహాల వైఖరిని పరిశీలిస్తూ, మార్పుల్ని గమనిస్తూ క్రియాశీలకంగా ప్రజాపోరాటాల ఆంతర్యాన్ని పసిగడుతూ, సృజనాత్మకతను ఇనుమడింపజేసుకుంటూ, వారి రాతల్ని ఎప్పటికప్పుడు మూల్యాంకనం దిశగా ఆత్మానే్వషకులైపోతుండాలి. సమాజ పురోగమన వేగాన్ని పట్టుకుంటూ సామాజిక ధోరణులను ఆకళింపు చేసుకుంటూ కాలంతో కలసి పరుగెత్తే సాహితీవేత్తలే నిజమైన నిత్యవనశక్తితో విలసిల్లతుంటారు. వారి రాతలు సామాజిక చేతలవుతుంటాయి. వికృతమైన సామాజిక మార్పులకు కళ్లెం వేస్తుంటాయి. ఏ సాహితీవేత్త అయినా స్వార్థంతో, కీర్తికండూతితో, అవార్డు రివార్డుల కోసం అధికారపక్షంతో లాలూచిపడి ఆత్మవంచనకు లోనై సృష్టించిన సాహిత్యం పరవంచనకు మార్గదర్శకవౌతుంటుంది. సామాజిక క్షీణదశకు చేదోడు వాదోడై నిలుస్తుంది. సామ్రాజ్యవాద శక్తులు తమ సొంత ప్రయోజనాల కోసం సృష్టించే ఆధునికత, శ్రమజీవులను భోగలాలస విలాసాల వైపుకు నడిపిస్తూ సమసమాజాన్ని నిర్మాణాన్ని కాలరాస్తుంటుందనే భావనలను సాహితీవేత్తలు గుర్తెరిగి రచనలు చేయాల్సి వుంది.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, 9948774243