సాహితి

సహజాతాలకు సంస్కార పరిమళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శారీరక వాంఛల్ని లేదా లైంగిక వాంఛల్ని సహజాతాలు అన్నాడు ఫ్రాయిడ్. అసలు మనిషి సుఖం కోసమే ప్రవర్తిస్తాడు. మనిషే ఎందుకు జీవరాశులన్నీ సుఖం కోసమే ప్రవర్తిస్తాయని అనుకోవచ్చు. మరి సుఖమంటే ఏమిటి? శరీరంలో ఏర్పడే సహజాత సంబంధమైన టెన్షన్ తగ్గించటమే సుఖం. దైహిక పాశవిక వాంఛలు తృప్తి చెందాలని కోరుతాయి. అంటే అవి సంతృప్తి కోసం వెంపర్లాడతాయి. వాటికి సంతృప్తి లభించకపోతే టెన్షన్ పెరుగుతుంది. ఫ్రాయిడ్ మనో విశే్లషణ సిద్ధాంతాన్ని వివరిస్తూ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సహజాత మంటే నేర్చుకోకుండానే అబ్బే ప్రవర్తన అని స్థూలంగా చెప్పవచ్చు అంటారు. పిచ్చుకగూడు కట్టడం, బాతు ఈదడం సహజాతాలు మనిషికి సెక్స్ కూడా అంతే. ఈ సహజాతాలు శరీరంలో అంతర్గతంగా ఉండి తగు సమయంలో యథార్థ రూపం పొందుతాయి. సహజాతాలు పాశవికమైనవి, మొరటైనవి. వీటికి మంచీ చెడు, నీతీ నియమాలు ఉండవు. తమ సుఖం తప్ప మరొకటి పట్టదు. ఇవి అదుపులో ఉండనప్పుడే మానభంగాలు, హత్యలు జరుగుతుంటాయి.
సుడిగాలిలో ఎటుపడితే అటు కొట్టుకుపోయేలా చేసే ఈ సహజాతాల పట్ల అవగాహన కలిగించి మనిషిని అదుపులో వుంచటానికి అనేక ధార్మిక గ్రంథాలు, నైతిక సూత్రాలు ఉన్నాయి. మనిషిని సంఘజీవిగా, మానవుడిగా మలచడానికి కథా సాహిత్యం కూడా తన వంతు కృషి చేసింది, చేస్తోంది.
సహజాతాల పట్ల ప్రత్యేకమైన దృష్టితో కథలల్లినవారు వి.రాజా రామమోహనరావు. వీరి కథలు సంస్కారవంతమైన పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. రచనకి నిజాయితీ ముఖ్యం. దాని తర్వాతే మిగిలిన అన్ని విలువలూ అనే రాజారామమోహనరావు ‘తెల్లటి చీకటి’లోని కొన్ని కథల్ని పరిశీలించటం ఈ వ్యాస ఉద్దేశం.
పిగిలిపోయిన రవికెలో కనిపించే నగ్నత్వంతో కోరికను పెంచుకుని, అతి పేదరికపు చిరుగని గ్రహించలేని తన పరిస్థితికి కుమిలిపోయిన ఓ యువకుడి కథ ‘చిరుగు’. పల్లెలో బతకలేక భార్యాభర్తలు పట్నానికొస్తారు. భర్త కూలికిపోతే పడుచు భార్య ఒక బుక్‌షాప్ కెదురుగా ఉండే అరుగుమీద గోనెసంచిలోని సామానుతో కూర్చుని ఉంటుంది. ఎడం చేతి భుజం కింద, కొంత వీపు మీదికి కొంత గుండెల వేపుకి చిరిగిన జాకెట్టుని, పెద్దగా లేని నేత చీర పవిట కొంగుతో యెంత కప్పుకున్నా ఆమె నల్లటి వొళ్ళు నగ్నత్వాన్ని దాచలేక పోతోంది. యెదురుగా వున్న బుక్‌షాప్‌లో పనిచేస్తున్న ఇరవై రెండేళ్ల సత్యం చిరుగులో కనిపించే నగ్నత్వాన్ని కళ్లార్పకుండ చూస్తాడు. చిన్నతనంలోనే నా అన్నవాళ్లు కరువై ఆ పంచనా ఈ పంచనా వుంటూ అందరి చిరాకులు విసుగులు భరిస్తూ ఇంటర్ పూర్తిచేసుకున్న సత్యం, పరిస్థితులకి లొంగి బతకటం తప్ప మరో గతేం లేదని నిర్ణయించుకుని, చిన్న జీతానికి బుక్‌షాప్‌లో పనికి కుదురుకున్నాడు. చిరుగులో ఆమె బలమైన నల్లటి వొళ్ళు నగ్నంగా బైట పడుతుంటే సత్యం ఆలోచన సన్నటి మంటలా మండసాగింది. యవ్వనాన్ని కాలుస్తున్నట్లనిపించింది. అది రానురాను కోరికగా మారింది. ఆమెను ఆ సాయంత్రం తన రూముకు తీసుకుపోవాలని నిశ్చయించుకుంటాడు సత్యం. ఇలా అనుకున్న తర్వాత ఆమెతో ఎవరో మాట్లాడటం గమనించి సత్యం వాళ్ల దగ్గరకు పోతాడు. వాళ్ళ మాటల్ని వింటాడు. బతుకు కోసం వచ్చిన వాళ్లని తెలుసుకుని వెనక్కి తిరిగి వస్తున్న సత్యనికి ఆమె అన్న మాటలు చెవిన పడతాయి. ‘మావా, వున్న ఈ ఒక్క రవిక కూడా పిగిలిపోయింది. కొంగు ఎంత కప్పుకున్నా కుదరడం లేదు. సిగ్గుతో ఒళ్ళు చితికిపోతోంది’ అని చెబుతోంది. ఆ మాటల్ని వినలేక సత్యం గబగబా వెనక్కి వచ్చేశాడు. మనసు మొద్దుబారినట్లనిపించింది సత్యానికి. కోరిక తీరనందుకు కాదు. ఆ కోరిక తనలో తలెత్తినందుకే ఇబ్బందనిపించింది. సత్యం మనసులోని బాధను చెప్తూ రచయిత చెప్పిన మాటలు గమనించదగ్గవి. ‘తన లోపల మెలి తిరుగుతున్న బాధకి మూలమేమిటో అర్థం అయ్యేవరకు చాలా అసహనంగా గడిచింది సత్యానికి. అర్థం అయ్యాక ఆ చిరుగును చూసి ఉద్రేకపడిన తన వయసును తిట్టుకోలేదు సత్యం. చిరుగుని, ఆ పేదరికం చిరుగుని సరిగా వూహించే ప్రయత్నం చెయ్యలేకపోయిన తన పరిస్థితిని తిట్టుకున్నాడు సత్యం. సత్యంలోని సంస్కార పరిమళం పాఠకుని గుండెలనిండా నిండిపోతుంది.
స్ర్తి నగ్నత్వాన్ని చూసి తృప్తి పడాలనే బలహీనతగల మనసు పొరల్లో అణగియున్న సంస్కార పరిమళం వికసించిన ఓ యువకుడి కథ ‘చేరువ’.
ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న వుద్యోగం చేస్తూ దూరపు బంధువుల ఇంట్లో వుంటున్న సరోజ, ఆ యింట్లో వాళ్ళు లేచి పెరట్లోకి తలుపు తీసినప్పుడే పోయి స్నానాలు చేసేది. నాలుగడుగుల స్నానాల గదిలో బాగా ఎడెక్కాక స్నానం వెలుగు తన ఒళ్ళంతా పాకి... రక్కి, భయంకరంగా చీరుతున్నట్లనిపించేది ఆమెకి. వొంటి నిండా చీర చుట్టుకున్నా ఆ వెలుగు చీలుస్తున్నట్లే వుండేది. ఆ సమయంలో యెదురుగా మేడమీద ఇరవై ఎనిమిదేళ్ళ సత్యం, సరోజ నగ్నంగా స్నానం చేస్తున్న దృశ్యాన్ని కిటికీగుండా చిత్రమైన ఓ యిష్టంతో చూసేవాడు. ‘నేను చేస్తున్నదేమిటి?’ అని చాలాసార్లు సత్యానికి ఆలోచనొచ్చింది. అలా చూడ్డం అది తృప్తో, అసంతృప్తో తెలుసుకోలేని అనుభవంతో తన లోకి తను కుంచించుకుపోతున్నట్లే వుండేది సత్యానికి. అయినా రోజూ పొద్దునే్న కొన్ని గంటలు శ్రమపడి కొన్ని క్షణాలు అలా చూస్తూనే వున్నాడు. తనని తాను చంపుకుంటూనే వున్నాడు. ఆరోజు స్నానానికి సిద్ధపడి అటువైపు వున్నదల్ల సత్యం కిటికీవైపు తిరిగింది సరోజ. సత్యం చూపులు కంగారుపడ్డాయి. సరోజ సూటిగా కిటికీవైపు చూస్తోంది. అంతదూరంలో వున్నా సరోజ కళ్ళు స్పష్టంగా కనిపించాయి సత్యానికి. ఒక్క నిమిషం పాటు అదిరిన సరోజ బుగ్గలు... కదిలిన సరోజ పెదాలు... కనీ కనిపించని సన్నటి కన్నీటి తెర కనిపించాయి. వీటన్నిటికన్నా స్పష్టంగా సరోజ రెండు చేతులు గుండెలకడ్డంగా పెట్టుకుని పెట్టిన దణ్ణం కనపడింది... అర్థింపు కనపడింది. కిటికీ మూసేస్తూ కిందికి జారిపోయాడు సత్యం. తనపై తనకే అసహ్యం వేసింది. సాయంత్రానికల్లా వేసేసిన కిటికీ తలుపుకి అడ్డంగా పెద్ద చెక్క పెట్టి, అది రాకుండా మేకులు దిగ్గొట్టాడు. తన బలహీనతని మేకులతో అణగ్గొట్టిన మూడోనాడు, సరోజ కనబడి పలకరింపుగా నవ్వింది. ఆ నవ్వుతో ఆమె ఎన్నో విషయాలు చెప్పినట్టనిపించింది సత్యానికి. ఇద్దరు మనుషుల మధ్య వుండాల్సిన చేరువ వున్నట్టు తోచింది. మనుషులను దగ్గరకు చేర్చే పరిమళం విలువ పాఠకునితో గూడుకట్టుకుంటుంది.
కొంచెం భిన్నమైన ప్రవర్తనతో మరో మనిషి కలవరాన్ని తేలిగ్గా తుడిచేయగల విశాల హృదయం వెలుగులో స్ర్తి సౌందర్యాన్ని దర్శింపజేసిన కథ ‘కలిసి బతకటం’.
ఒకే ఆఫీసులో పనిచేస్తూ ప్రాయం అంచులు దాటుతున్న వారు సుధ, మోహన్. తక్కువ జీతంతో, అత్యవసరాలకి దిగువగా సర్దుబాటు స్వభావంతో చిన్న గదిలో జీవనాన్ని సాగిస్తోంది సుధ. ముప్పయి ఆరేళ్ల వయసులో, పెళ్లి కుదరని అక్కతో వుంటున్నాడు మోహన్. సుధ, మోహన్‌లు పరస్పరం ఆకర్షితులవుతారు. కొద్దిపాటి ఏకాంతం దొరికితే చాలు, ఒకరినొకరు స్పృశించాలన్న ఆతృత, శరీరాల తాలూకు బరువును దాటాలన్న తపన ఇద్దరికీ వుంది. నిగ్రహించుకోలేక హోటల్ రూముకి వెళ్లినప్పుడు చెప్పుకోలేని రకరకాల భయాలతో ఇద్దరూ హాయిగా ఉండలేకపోతారు. నిలువ లేని సమయంలో సుధ మోహన్‌ను తనున్న ఇంటికి తీసుకుపోతుంది. ఆ రాత్రి పనె్నండు వరకూ హాయిగా గడిపిన తర్వాత మోహన్ ఇంటికి పోతానంటాడు. ఇంట్లో అక్క ఒంటరిగా వుంటున్నందుకే కాదు, తెల్లారితే ఇంటివాళ్ల కళ్ళల్లో పడితే సుధకు ఇబ్బంది వుంటుందని కూడా చెప్తాడు. అంతకుముందే సిటీలో మూడిళ్లలోనూ మూడు రకాల హింస అనుభవించి, ఇప్పుడున్న ఇంటికి వచ్చింది సుధ. కానీ ఆమెకి నిజమైన జీవితంలా అనిపించే ఆ సమయాన్ని యే బరువూ లేనట్టు తేలిగ్గా అనిపించే హాయిని దూరం చేసుకోవాలనిపించలేదు. తెల్లారి మోహన్ వెళ్లిపోయాక, కలవరం మనసును ఆవరించకముందే సుధ ఇంటామె సీతమ్మ దగ్గరకు పోతుంది. ఆమె అంతా తెలుసన్నట్లు ‘అతడు వెళ్లిపోయాడా?’ అని అడుగుతుంది. ఏ వ్యంగ్యమూ కనిపించని ఆమె మాట తీరుకు సుధ ఆశ్చర్చపోతుంది. ‘కొంచెం భిన్నమైన ప్రవర్తనతో మరో మనిషి కలవరాన్ని అంత తేలిగ్గా తుడిచెయ్యగలుగుతారా’ అనుకుంటుంది సుధ. మొత్తంగా కరిగిపోతుంది. ‘నైతికం, అనైతికం సరసన అవసరమన్నది కూడా ఈనాటి స్ర్తి జీవితం... కాలమే కొన్నింటిని చక్కబరుస్తుంది. కానీ అప్పటిదాకా జీవితం మరింత జటిలం కాకుండా నువ్వు తీసుకోగలిగిన జాగ్రత్తలన్నీ తెసుకో... మా యింట్లో నువ్వు సుఖంగా, ధైర్యంగా, హాయిగానే వుండాలి’ అంది భుజం మీద చేతితో స్పర్శిస్తూ చిరునవ్వుతో సీతమ్మ. శారీరక అవసరాల పట్ల సంస్కార వంతమైన అవగాహనతో అరవై ఆరేళ్ల సీతమ్మగారి స్ర్తి హృదయ సౌందర్యంలో సుధ వొదిగిపోతుంది. పాఠకుని హృదయం కొత్త వెలుగుతో వికసిస్తుంది.
అదనపు సుఖం మీద, ఈజీ మనీ మీద ఆశ మనిషికి, మనిషికి సహజంగా వుండే బలహీనతలో అసందర్భంగా, అసహ్యంగా సాధ్యాసాద్యాలు వూహించకుండా తన మనసును కమ్మేసిన ఆలోచనల్లోని నైచ్యాన్ని తెలుసుకున్న వో సంస్కార హృదయుని కథ ‘పరస్పరం’.
రాఘవరావు, వసంత బాల్య స్నేహితులు. స్థితిమంతురాలయిన వసంత పెళ్లయి వెళ్లిపోతూ ‘నువ్వంటే ఇష్టమే రఘు. కానీ ఎందుకో ధైర్యం చేయలేకపోయాను. చేసుంటే నీకే దక్కి ఉండేదాన్ని’ అని అన్న మాటలు రాఘవరావుని వెంటాడుతూనే వుండిపోయాయి. భార్య కీళ్ళ నొప్పులతో అనారోగ్యం పాలయినప్పుడు ఆమెను చూడాలనే కోరికతో బయలుదేరినప్పుడు రాఘవరావులో ఎన్నో ఆలోచనలు. వసంత తండ్రి ఆస్తికి వారసురాలయినందున భర్తతో తన పుట్టింట్లో వుంటుందని ఆలోచిస్తాడు. అతనికి మరో భయంకరమైన ఆలోచన కూడా వస్తుంది. ఒకవేళ భర్త పోయి వైధవ్యం వచ్చుంటే పుట్టింటికి వచ్చేసి వుంటుందని - భార్య అనారోగ్యం వూహలో మెదిలేటప్పటికి వసంత మీద ఆశ మరింత పెరిగింది. వూహలు వూరిస్తున్నా తన ఆలోచనల్లో వున్న నైచ్యం కొద్దిగా ముల్లులా పొడుస్తూనే వుంది రాఘవరావుని. రాఘవరావుని చూసి వసంత ‘నీ గురించి విన్నాను. ఈ మధ్యే నీ హైదరాబాద్ అడ్రస్ కూడా తెలిసింది. మావారితో పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చి నిన్ను నీ సంసారాన్నీ చూద్దామనుకున్నాను. నువ్వే వచ్చావు’ అంటుంది. రాఘవరావుకి పిచ్చెక్కినట్టు అవుతుంది. వసంతకీ తనకీ మధ్య తేడా తెలిసి... అసందర్భంగా, అసహ్యంగా తన మనసుని కమ్మేసిన ఆలోచనల్లోని నైచ్యం తెలిసి... వసంతను గురించి ఛండాలంగా సాగిన వూహలు ఎంత అమానుషమైనవి - అని అనుకుంటాడు. ఆ సాయంత్రం వసంత కుటుంబంతో తృప్తిగా గడుపుతాడు.
సహజాతాల బాహ్యపొర చిరిగి, అంతఃపొరపై సంస్కారం వెలుగు ప్రసరించినప్పుడు పరిసరాల్ని పరిస్థితుల్ని పరిమళభరితం చేసిన తీరుకు పాఠకుడు కూడా తృప్తిపడతాడు.

- నందవరం కేశవరెడ్డి, 9885120878