సాహితి

కొలంబస్ నుంచి బెర్లిన్ దాకా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ నేల
ఆకుపచ్చ భాషలోనే మాట్లాడుతుంది
కాకపోతే అపుడపుడు
గోధుమ రంగులోనో ఓట్స్ రంగులోనో హసిస్తుంది

ఒక్కొక్కప్పుడు పలుకే లేక
మట్టి దేహంతో నిరలంకారంగా విశ్రమిస్తుంది
అక్కడక్కడా ఎగుడుదిగుడుగా వున్నా
సౌందర్యరేఖ చిట్లిపోక కుడి యెడమనే కాదు
ఆకాశంవైపూ ఉప్పొంగుతూ వుంది
చెట్లు మరీ దగ్గర దగ్గరై అందమైన తెరై
వెనకాలి అనేక దూరాల్ని కప్పేస్తున్నాయి
వెళ్ళిచూస్తే తెర వెనుక కూడా అందం
హొయలు హొయలుగా విస్తరించి వుంది

ఈ దేవదారు బారుల్ని దర్శిస్తుంటే
హిమాలయాల దిగువలేనా
రసరేఖల సంజీవదేవూ గుర్తుకొస్తున్నాడు
పైన్ పైన శాఖావిష్కరణ
యే మహాచిత్రకారుడి రేఖాప్రతిభో!
ఇటు సోయాలు మాత్రం నేలకు ప్రియంగా దగ్గరై
గుసగుసలాడుతున్నాయి
ఏ ఆరోగ్య రహస్యాల్నో విప్పుతూ!
ఇన్నిన్ని ఇన్నిన్ని వివిధాకృతుల వృక్షాల
మనోజ్ఞ విశాల దయామయ సామ్రాజ్యంలో
అక్కడక్కడా విడిది చేసిన ఇళ్ళు
తలదాచుకున్న శరణార్థులే!

ఎత్తూపల్లాల వింతైన శృతిలో ఇక్కడి
చిక్కటి లావణ్య గీతికలు మనసును
ఇట్టే చుట్టేస్తున్నాయి మెత్తమెత్తని లతల్లా!
ఇంతలో ఇదుగో ఈ వాన చినుకులు
వాలుతున్నాయిక్కడ ఆశీర్వాదాల్లా!
ఆశీర్వాదాలే లేకుంటే ఈ నేలకు
నిండైన ఆకుపచ్చ భాగ్యాలు దక్కేవా
ధన్యతతో వినమ్రంగా చెట్లన్నీ రోజూ
చినుకులకు ప్రణమిల్లుతాయి కాబోలు!

కొలంబస్ నుంచి ఆమిష్ ‘బెర్లిన్’కు
ఈ యాత్ర పొడుగుతా
నా కళ్ళు చెట్లల్లో కలిసిపోయాయి
‘అందుకేనేమో! దేహంలోకి ఆకుపచ్చకాంతులు
ఇష్టమైన పానీయంలా ప్రవహిస్తున్నట్లుంది

ఇక ఇల్లు చేరాక నేనే ఒక చెట్టునైనట్లు
నాకు లక్షల చెట్ల బాంధవ్యమున్నట్లు
ఒక ఊహ!
ఊహ ఏ రంగులో వుందని తొంగిచూస్తే
ఒకటని కాదు పలు ఛాయల ఆకుపచ్చలగుపించాయి
అంతేనా! పై వాక్యాల్లోకి చూపు సారిస్తుంటే
వాటి ధమనుల్లో చెట్ల ఆకుపచ్చ సిరానే!
తెల్సిందిపుడు! చెట్లూ కవితలనల్లగలవని!

- దర్భశయనం శ్రీనివాసాచార్య 9440419039