సాహితి

సాహిత్య రంగంలోనూ పైరవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వానికి, రచనలకు నూతనత్వ పరిపుష్టి, భావావేశ దృష్టితో నాటి కవులు, రచయతలు జీవం పోయడంతో శాశ్వతత్వం లభించేది. ఆ రచనలు చదివిన కవులు, పాఠకులూ అంతగానూ సహానుభూతిని పొందేవారు. ఇదంతా ఒకప్పటి మాట. కానీ నేడు కొందరు ‘కవుల కాపరులు’, ‘సాహితీ పెత్తందారులు’ బయలుదేరి తామే కవిత్వానికి, సాహిత్యానికి గుత్తేదార్లుగా, తమతో ముందుమాటలు వ్రాయించుకున్న వారిదే కవిత్వమని పురస్కారాలకు, అవార్డులకు ‘ప్రమోట్’ చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కాదు అసహ్యం కలుగుతోంది.
కవుల (తమకు తామే కవులుగా ప్రకటించుకున్నవారు) విషయానికొస్తే తమకు తామే అభ్యుదయభావాలు గల కవులుగా, రచయితలుగా ప్రకటించుకొని పాలకుల బానిసత్వ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ దమన నీతికి అభిముఖంగా రచనలు చేస్తున్నామని, ఏ కించిత్ కవిత్వం లేని తమ రచనల ద్వారా తెలుపుతూనే ఆ పాలకులు, ఆ ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించే అవార్డులకు, పురస్కారాలకు బానిసలై, యాచకులై జీవితాంతం బ్రతుకు వెళ్లదీయడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కవితా సంకలనంలో ఏ అక్షరంలోనూ కవిత్వం లేకున్నా, తమ కవితా సంపుటాలకు అవార్డులు రావడమన్నది కేవలం బానిసత్వతత్త్వం సంపూర్ణంగా కలిగిన వారికి వస్తుండడం చూస్తున్నాం. సీనియర్ అకవులకు భజనపరులుగా మారిన వారిని అచ్చమైన కవులుగా, రచయితలుగా తెలుగు సాహిత్యానికి పరిచయం చేస్తుండటం భావి తరాలను మోసగించడమే అవుతుంది. కవిత్వం ఏమాత్రం లేని పుస్తకాలు సాహిత్య విలువలు లేని రచనలుగా దర్శనమిస్తుండటం భయం గొలిపే పరిణామమే.
ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ‘పైకి’ రచనలు చేస్తూ, ప్రభుత్వ అవార్డులను అవహేళన చేస్తూ ‘అభ్యుదయ (మేడిపండు)’ భావాలతో అప్పటివరకు సారం లేని నీరసం రచనలు చేసిన వ్యక్తికి ప్రభుత్వ అవార్డు రాగానే ‘ఇంతటి అత్యున్నతమైన అవార్డు వస్తుందని జీవితంలో ఏనాడూ ఊహించలేదని, ఈ అవార్డుల వల్ల ‘బాధ్యత మరింత పెరిగిందని’ సెలవివ్వడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రభుత్వ అవార్డులు విలువలు లేని రచనలకే వస్తాయని, ఆ రచనల్ని చదివిన వారికి తెలిసి, ప్రభుత్వ సభ్యులు ‘అమ్ముడు’ పోతున్నారని విని, అవినీతన్నది జనులకు జగతికి నీతులు చెప్పే సాహితీ రంగంలోనూ వున్నదన్న సత్యం తెలిసి భ్రుకుటి ముడివేసుకోవడం వినా చేయగలిగిందేమీ లేదని సాహితీపరులు వౌనం వహించడం చూస్తున్నాం.
నేడు తెలుగు సాహిత్యంలో అసలు సిసలైన కవిత్వం వ్రాసే వారందరూ వౌనంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. కవితా వాక్యం ఏమాత్రం వ్రాయడం చేతకాని వారందరూ డాంబికాలు పోతూ వారంవారం సాహితీ వేదికలపై దర్శనమిస్తున్నారన్నది ‘నేటి నిజం’.
కవితల పోటీ అనగానే కలాలు సంధించి, కాగితాలపై అంత్యప్రాసలతో పదాలు మోగించి, అక్షరాల జతులతో యతులతో మతులు పొగొట్టే వాక్యాలతో ‘వెంటనే’ కవితను పంపించి, ‘వెంటనే’ కవితల పోటీ నిర్వాహకులకి ఫోను చేస, తాము కవి సింహబలులమనీ, కవితల పులులమనీ తమకే ఆ అవార్డు ఇచ్చి తమరు తరించాలనీ మూడువేల రూపాయల నగదు బహుమతికి బదులుగా ఐదువేల నగదు, శాలువా, జ్ఞాపిక, సభ నిర్వహణ ఖర్చులు తదితరములన్నీ పదివేలుగా భరిస్తామని తెలిపి, కవితల పరిశీలనా న్యాయవాదులైన సీనియర్ కవులకి సీరియస్‌గా గొడుగు పట్టడం ఒకటేమిటి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటి ద్వారాలను పూర్తిచేయడం, చివరకు ఆ న్యాయ నిర్ణేతలు తమకు సలాములు చేసే కవితా గులాములకు అవార్డులిప్పించి, తాము అందులోను ద్రవ్యమారకాన్ని, ద్రవ్య రూపేణా సేవించి తరించడం జరుగుతుందన్నది నేడు తొంభై తొమ్మిది శాతం ఏ పోటీని చూసినా అందులో అవార్డు పొందిన పేర్లు చదివినా స్పష్టంగా అర్థమవుతుందన్నది వాస్తవం.
సాహిత్య రంగం నేడు ఇటువంటి దశలో ఏ దిశకు వెళ్తుందో అన్ని పార్శ్వాలను గమనించేవారికి విదితమవుతూనే ఉన్నా ఏమీ చేయలేని, ఎందుకులే మనకేమని తమకి తాము సర్దుబాటు చేసుకుంటూ ఆ విషయాల్ని దాటవేసుకుంటూ వెళ్ళడం అంతో ఇంతో కొంత సాహితీ విమర్శ చేసే వ్యక్తులు వౌనముద్ర దాల్చడం సాహిత్య రంగానికి ద్రోహం చేయడమే అవుతుంది. కనీసం ఏది సాహిత్యమో, ఏది సాహిత్యం కాదో, ఎందుచేత అవార్డు ఇవ్వబడిందో, లేదా ఇప్పించుకోబడిందో తెలపడం తమ కర్తవ్యంగా భావించిన నాడే రాజకీయ రంగం కంటే భ్రష్టుపట్టిన, పడుతున్న సాహిత్య రంగాన్ని దిశానిర్దేశంగా చేసిన వాళ్ళవుతారన్నది సత్యం. నేడు కవిత్వ, కథా, వ్యాసపరంగా వస్తున్న రచనలలో జీవం, జీవితం, బ్రతుకు సారాంశం వస్తువు పరంగా వస్తున్నా, చిత్రీకరణలో కవిత్వ తత్వం లేకపోవడంతో రచనలు ఎండిన మోడుల్లా అగుపిస్తున్నాయి. ఒక దృశ్యాన్ని చూసినప్పుడో, ఒక స్వప్నాన్ని నిదురలో మేల్కొలిపినప్పుడో, ఒక ఊహకు ఊపిరిలూదుతూ తను తన్మయం, స్పందన చెందినప్పుడే సహజమైన ‘చర్య’ జరిగి ఆ అనుభూతి రచనలద్వారా అందుతుంది. ప్రతిగా సాటి రచయిత, కవి, పాఠకుడు సహానుభూతి పొందుతాడు. నేడు చాలావరకు సాహితీ రచనలన్నీ నిర్వీర్యంగా మారడానికి కవులు, రచయితల్లో పఠనాలోపమే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. సునిశిత దృష్టితో, సాహిత్య తత్త్వంతో శోధించడం పూర్తిగా కొరవడింది. కవులు, రచయితలు అనబడేవారి దృష్టి కేవలం అవార్డులు, పురస్కారాలపై కేంద్రీకరించడం వల్ల కాలాలకతీతంగా నిలబడే సాహిత్యం కాలగమనంలో కొట్టుకుపోతోంది. ఒక్కో కవితను వంద రూపాయలకు అమ్ముకునే సంస్కృతి కూడా పెరిగిపోతోంది. దీంతో రెడీమేడ్ కవులు ఉద్భవించి అకవుల సంఖ్య తామరతంపరగా పెరుగుతూ సాహిత్య విలువలు కలిగిన సాహిత్యం అమాంతం తరిగిపోతూ వస్తోందన్నది చారిత్రక సత్యం. సాహిత్యం ఏమాత్రం లేని పుస్తకాలకి పురస్కారాలు ఎలా లభించాయో, కవితాతత్వం లేని కవితలనబడే అక్షరాలు అవార్డుకి ఏవిధంగా అర్హమయ్యాయో తెలియాలంటే ఒక నిర్దుష్టమైన విమర్శా విధానం కొనసాగాలి. అది జరిగితే కొన్నింటికే కాదు, కొందరికే కాదు, అన్నింటికీ అందరికీ ఒక స్పష్టమైన అవగాహన కలిగే సంపూర్ణమైన సాహితీ వాతావరణం నెలకొంటుంది. ఒక మల్లెపూల పొద వర్ణనని మనం చదువుతుంటే మల్లెల సువాసన మన నాసికల్లోని ఉచ్ఛ్వాసగా ఊపిరితిత్తుల్లోకి అగరొత్తుల పొగగా సాగి నెత్తురు అత్తరు నదిగా ప్రవహించినప్పుడే ఆ రచన సహజత్వాన్ని సంతరించుకుని, సార్థకత నింపుకుంటుంది. ‘నా అక్షరాలు వెనె్నల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అనగానే మనకు ఒక అద్భుతమైన చిత్రం కళ్లల్లో కదలాడుతుంది. ‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ అనగానే ఒక శాశ్వత సత్యం మన మనసులో మెదులుతుంది. ఒక అద్భుత భావనతో తాదాత్మ్యం చెందుతాం. కాలాతీతంగా నిరంతరం జీవం కలిగిన ఏ రచనైనా శాశ్వతత్వం పొంది తీరుతుంది. కవిత్వం, సాహిత్యం సృజిస్తున్నామనుకునే కవి లేదా రచయిత తాము వ్రాస్తున్న కవితల్లో, పంక్తుల్లో, అక్షరాల్లో ఎంతవరకు కవిత్వముందో మొదట తమకు తామే విశే్లషించుకోవడంతో తమనుంచి ఒక మంచి రచన రావడానికి అవకాశం ఉంది.
ఏ రచనైనా కాంతిని వెదజల్లే కాగడాలు కావాలే కానీ, కేవలం అక్షరాలు నింపిన కాగితాలుగా నిలిచిపోకూడదు. వాక్యాలన్నీ నిప్పులు విరజిమ్మే పర్వతాలుగా మిగలాలి కానీ, నీరుకారి నిర్వీర్యమైపోయే అభావ మురికి జలాలుగా మిగిలిపోకూడదు. ప్రతి రచనా చలివేంద్రంగా సాహిత్య దాహార్తిని తీర్చాలి గానీ, ముట్టుకుంటే మరక పడే మురికి గుంటలుగా ఉండకూడదు. అలాంటి రచనలు వెలువడిన నాడే సాహిత్య రంగం పరిమళ భరితమై సమాజానికి దిక్సూచిగా మారుతుంది.

- యక్కలూరి శ్రీరాములు, 09985688922