సాహితి

అవధాన కవుల సాహిత్య సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ భాషా సాహిత్యాలలో మరే భాషకు లేని విలక్షణమైన స్థానాన్ని తెలుగు భాషా సాహిత్యాలకు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానం. పద్య విద్యకు పట్టంగట్టిన సాహిత్య ప్రదర్శన కళగా అవధాన ప్రక్రియ ప్రత్యేక గుర్తింపును పొందింది. నాటి తిరుపతి వెంకటకవులు, కొప్పరపు సోదర కవులు మొదలుకుని ఆధునిక కవుల వరకు పద్యాన్ని అవధాన వేదికలపై ఊరేగించిన మహాకవులెందరో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య చైతన్యానికి మారుపేరైన మెదక్ జిల్లాలో అవధానకవులెందరో పద్య విద్యావైభవాన్ని చాటుతూనే ఉన్నారు. కాళిదాసు కావ్యాలకు సంజీవనీ వ్యాఖ్య రాసి విశ్వవిఖ్యాతి గడించిన మల్లినాథసూరి మెదక్ జిల్లావాడే. వీరి తాతగారైన మల్లినాథుడు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని ఆస్థానంలో శతావధానం నిర్వహించి కనకాభిషేక సత్కారాన్ని పొందాడని ప్రతీతి. బహుశా వీరే మొట్టమొదటి అవధాని అయి ఉంటారు. ఈ విషయమై విస్తృతమైన పరిశోధన చేయవలసి ఉంది. కాగా అష్టకాల నరసింహరామశర్మ అష్టావధానాల ద్వారా లభించిన సన్మాన ద్రవ్యంతో మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ కొండల్లో సరస్వతీమాతకు భవ్యమైన ఆలయం నిర్మించారు. గౌరీభట్ల వంశస్థులు అనువంశిక అవధానులుగా సుమారు శతాబ్దకాలంగా సాహిత్యసేవ చేస్తున్నారు. గౌరీభట్ల నారాయణశాస్ర్తీ సంస్కృతాంధ్రాలలో అవధానాలు నిర్వహించగా వారి కుమారులు గౌరీభట్ల రామకృష్ణశాస్ర్తీ విరివిగా అవధానాలు నిర్వహించి ప్రక్రియా వికాసానికి పాటుపడడమే కాకుండా ఏకవీర కుమారీయమనే ద్వ్యర్తికావ్యాన్ని రచించి ఈ శతాబ్దంలోనే ఏకైక ద్వ్యర్థికావ్య రచయితగా పండితుల ప్రశంసలందుకున్నారు. అనేక మంది కవులను ప్రోత్సహించి అవధాన విద్యలో మెళకువలు నేర్పి అవధానులుగా తీర్చిదిద్దారు. వీరి కుమారులిద్దరూ అవధానులుగా రాణిస్తూ ఆనువంశిక ప్రతిభను నిలబెడుతున్నారు. జి.ఎం.రామశార్మగా విఖ్యాతులైన గౌరీభట్ల మెట్టురామశర్మ అష్టావధానాలు విరివిగా నిర్వహించడమే కాకుండా తొగుట గురుమదనంద శారదాపీఠంలో 2001లో శతావధానాన్ని అలవోకగా నిర్వహించారు. గౌరీభట్ల రఘురామశర్మ ఇప్పటివరకు 60కి పైగా అష్టావధానాలు నిర్వహించడమే కాకుండా తెలంగాణలో అవధానకళా వికాసంపై పరిశోధనచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్ పట్టా పొందారు. గత శతాబ్దికి చెందిన యామవరం రామశర్మ అష్టావధానాలు విరివిగా నిర్వహించడమే కాకుండా యమకస్తవరాజం, గురుస్తుతి వంటి కావ్యాలు రచించి శే్లష యమక చక్రవర్తిగా పేరొందారు. వీరి గురువు గజ్వేల్ పట్టణానికి చెందిన విఠాల చంద్రవౌళిశాస్ర్తి వరంగల్ జిల్లా మానకొండూరులో జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్ర్తీ చేసిన శతావధానంలో పృచ్ఛకులుగా పాల్గొని శతావధానాన్ని ధారణ చేసి వంద పద్యాలను అలవోకగా అప్పగించి అద్భుత ప్రతిభ కనబరిచి శతావధాని అన్న బిరుదు పొందారు. గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ ఊరూరా పద్య విద్యాసరస్వతికి పట్టంగట్టేందుకు అవిశ్రాంతంగా అవధానాలు నిర్వహించారు. కవితాకల్యాణి, పద్‌యోద్యానం వంటి వీరి రచనలు సాహిత్యలోకంలో మణిపూసలుగా నిలిచాయి. హిందోళ రాగంలో వారు పద్యాన్ని ఆశువుగా పరుగెత్తిస్తూ ఉంటే సభలోనివారు తన్మయులై పోయేవారు. గౌరీభట్ల రామకృష్ణశాస్ర్తీ, గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ, అష్టకాల నరసింహరామశర్మ అవధాన కవిత్రయంగా గుర్తింపుపొందారు. అష్టకాల నరసింహరామశర్మ అవధానిగానేకాక బహుగ్రంథకర్తగా సంస్కృతాంధ్రాలలో మేలిపూసల్లాంటి రచనలు చేసారు. 18 ఏళ్ల వయస్సులోనే పురుషోత్తముడు అనే ప్రౌఢ ప్రబంధాన్ని రచించి అసాధారణ ప్రతిభ కనబరిచారు. తుకారామస్వామి, శ్రీరామచంద్రిక, రామప్రభు శతకం, శిథిల విపంచి వంటి పద్య కావ్యాలతోపాటు ఏదిపాపం ఏది పుణ్యం (గేయ కావ్యం), ఆత్మవేదం (పద్య, వచన, గేయ కవితా సంపుటి) సారస్వతీంభావయే (అనుప్రాస సంస్కృత శతకం)మొదలైన అనేక కృతులు సాహితీ లోకానికి అందించారు. చిత్ర, బంధ, గర్భ కవితారీతులలో వీరందించిన రచనలు పండిత ప్రశంసలనందుకున్నాయి. ప్యారకశేషాచార్యులు అనే మరో అవధాని అవధానాలు విరివిగా నిర్వహించడంతోపాటు కాకతాళీయం, ప్రపత్తి నిర్వేదం తదితర పద్యకావ్యాలు వెలువరించారు. స్వర్గీయ త్రిగుల్ల రాధాకృష్ణశర్మ యాభైకి పైగా అష్టావధానాలు నిర్వహించారు. మూడు పదుల వయస్సు కూడా దాటని యువ కవులు ముత్యంపేట గౌరీశంకర్, ముదిగొండ అమర్‌నాథ్ జంట కవులుగా అష్టావధానాలు నిర్వహించడంతోపాటు తెలుగు, సంస్కృత భాషల్లో విరివిగా రచనలు చేస్తున్నారు. శాస్త్రుల రఘురామశర్మ అష్టావధానాలు నిర్వహించడంతోపాటు మెదక్, నిజామాబాద్ జిల్లాల సర్వస్వాలను వెలువరించారు. మల్లికార్జున శతకం, వరగంటి సరస్వతీ స్తవం, చాణుక్య వంటి పద్యకావ్యాలు రఘురామశర్మ ప్రతిభకు మచ్చుతునకలు. స్వర్గీయ శివంపేట విశ్వనాథశాస్ర్తీ, రాళ్ళబండి రాఘవశాస్ర్తీ గొబ్బూరి నరసింహాచార్యులు మొదలైన అర్వాచీన అవధానుల ప్రస్తావన గోల్కొండ కవుల సంచికలో చోటుచేసుకోవడం అవధాన కళారంగంలో మెదక్ జిల్లాకుగల చిరకాల కీర్తికి గుర్తుగా చెప్పవచ్చు. వీరేకాక ఆధునికులలో తల్లోజు యాదవాచారి అష్టావధానాలతోపాటు విరిసిన మల్లెలు, కవితాస్రవంతి, జన్మభూమి, సమస్యాపూరణం వంటి కావ్యాలను అందించారు. వర్ధమాన కవి అవుసుల భానుప్రకాష్ అష్టావధానాలు నిర్వహిస్తూ మెదక్ జిల్లా ప్రత్యేకతను నిలబెట్టే క్రమంలో కృషిచేస్తున్నారు.

- డా. చెప్పెల హరినాథశర్మ, 9963460399