సాహితి

అవధాన కవిత్వం - వ్యవధాన కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవధాన కవిత్వం అంటే ఆశుకవిత్వం. వ్యవధాన కవిత్వం అంటే తీరికగా రాసుకునే కవిత్వం. అవధాన, వ్యవధాన కవిత్వాలకు స్థూలంగా చెప్పే నిర్వచనం ఇది. ‘చితె్తైకాగ్య్రం అవధానమ్’ అని లాక్షణికుల మాట. అంటే మనస్సును ఏకాగ్రంగా మలచుకొని, ఎన్ని అవాంతరాలెదురైనా వాటిని, సమయస్ఫూర్తితో, సద్యఃస్ఫూర్తితో దాటుకుంటూ కవితా మార్గాన్ని సుగమంగా మలచుకొని సాగే కవిత్వం అన్నమాట. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియకు మూలాలు వేదాలే. వేదాన్ని రక్షించే పద్ధతులలో భాగంగా వేదాధ్యయనం సమయంలో గురువులు విద్యార్థులకు పదం, క్రమం, జట, ఘనం అనే పాఠభేదాలను క్రమపద్ధతిలో చెబుతూ, వేద మంత్రాలలోని ఆనుపూర్విని (వరుస క్రమాన్ని) చెడిపోకుండా కాపాడడాన్ని అవధానంగా పూర్వం వ్యవహరించేవారు. అందుకే మొదట వేద పండితులకే ‘అవధాని’ అనే బిరుదనామం ఉండేది. కాలక్రమంలో ఇది కవితా వినోదాత్మకమైన సారస్వతకేళిని అన్వర్థంగా మారింది.
ఈ ప్రక్రియ తెలుగు నేలలో ప్రారంభమైన తొలినాళ్లలో వేళ్లమీద లెక్కపెట్టేంత మాత్రంలోనే అవధానులు ఉండేవారు. కానీ నేడు అవధానుల సంఖ్య అసంఖ్యం. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు అవధానులు కనబడుతున్నారు. విద్యార్థుల స్థాయినుండి మొదలుకొని, పండు ముసళ్లవరకు అవధాన విద్యాప్రదర్శనలు చేస్తున్నవారు సాహిత్య లోకంలో వెలుగొందుతున్నారు.
ఆశుకవితా కళ అయిన అవధాన విద్యపై ఎన్నో అపవాదులున్నాయి. అవధానం గాలి కవిత్వమనీ, దానిలో పది కాలాలపాటు నిలిచే శక్తి ఉండదనీ, గట్టెక్కడం కోసం గంతులేసినట్లే ఏదో ఒకటి చెప్పేసి ముగించడంవల్ల కవిత్వం పలుచనైపోతుందని భావించేవాళ్లు చాలామంది. అందుకే అవధానం చేసేవాళ్లు తీరికగా కూర్చొని ఏదీ రాయలేరని అనేవాళ్లూ ఉన్నారు. ఇందులో సత్యాసత్యాలు రెండూ ఉన్నాయి. అయినా అవధానుల్లో సమర్థులైనవాళ్లు లేకపోలేదు. కనుక అవధానకళ ఒక అద్భుత కవిత్వావిష్కరణమే అనవచ్చు.
ఇక వ్యవధానకవిత్వం గురించి రెండు మాటలు. తీరికగా కూర్చొని బొమ్మను చెక్కితే ఎంతటి పనికిరాని రాయి అయినా అద్భుత కళాఖండం అవుతుందనడంలో సందేహం లేదు. అందుకే వ్యవధాన కవులే ఎక్కువగా ఉంటారు. అవధాన కవికైనా, వ్యవధాన కవికైనా మొదట ప్రతిభ ఉండాలి. ప్రతిభ లేకుంటే కవిత్వంలో రాణించడం కష్టం. ప్రతిభ మేధాజన్యం. మేధ పుట్టుకతో వచ్చేది కనుక దైవదత్తం. అందుకే కవిత్వం అనేది పుట్టుకతో వచ్చే కళ అనీ, అది సాధనతో ఎంతమాత్రం రాదనీ నమ్మేవాళ్లు ఉన్నారు. సాధనతో రాణిస్తున్న కవులు లేకపోలేదు. కానీ వారిది సహజ రీతిలో కొనసాగే ప్రజ్ఞకాదనీ, ప్లాస్టిక్ పువ్వులతో గృహాన్ని అలంకరించడం వంటిదనీ విమర్శకుల అభిప్రాయం. ఇది కావ్యశాస్తజ్ఞ్రుల మాటల్లో కూడా కనబడుతుంది. కొందరు చదువుకోనివారు కూడా అద్భుతంగా కవిత్వాన్ని చెప్పడం చూస్తే మాత్రం కవిత్వకళ జన్మలభ్యమే అనక తప్పదు. ఏదేమైనా కవిత్వం ఒక బ్రహ్మపదార్థం. అది ఎవరికీ అంతుబట్టదు. అంతా తెలిసినట్టే అనిపిస్తుంది. కానీ ప్రయోగానంతరమే తనకు తెలిసింది స్వల్పమే అనే జ్ఞానం కొమ్ములు తిరిగిన మహాకవులకు కూడా కలుగుతుంది.
అవధాన కవిత్వంలో ఎన్నో అంశాలుంటాయి. అష్టావధానాల్లో ఎనిమిదీ, శతావధానాల్లో నూరు, సహస్రావధానాల్లో వేలకొలది ప్రశ్నలు. ఇంతకూ అష్టావధానం కష్టమా? శత సహస్రావధానాలు కష్టమా? అంటే అష్టావధానమే అతి కష్టతరమైందని ఏ అవధానిని అడిగినా చెబుతాడు. ఇందుకు కారణం అష్టావధానానికి గల సమయ పరిమితి. స్వల్పాతి స్వల్పంగా గంటన్నర, అధికాధికంగా మూడు గంటలకాలం అష్టావధానానికి నిర్దిష్టం. ఈ గంటన్నరలో ఈ మూడు గంటల్లోనే అవధాని ఎనమండుగురు పృచ్ఛకుల ప్రశ్నల శరపరంపరలను ఎదుర్కోవాలి. ఆ శరాలకు బదులుగా పూలబాణాలు వదలాలి. విజయం సాధించాలి. ‘సెభాష్’ అనిపించుకోవాలి. లేకుంటే ఓడిపోయినట్లే. అవధానాల్లో జయాపజయాలు తప్పవు. అపజయాలన్నీ అవధానులకు గుణపాఠాలౌతాయి. చేసిన తప్పులకు చురకల వంటి శిక్షలు పడుతాయి. అయినా అవధాని చలించకుండా రాటుదేలాలి. అప్పుడే అవధానిగా నిలబడగలుగుతాడు. కొందరు అసమర్థులైన అవధానులను పృచ్ఛకులు దయతలచి దాటవేయిస్తారు. ఇలాంటివి అవధాన సభలలో అనివార్యాలు. పూర్వ కాలంలోవలె నేటి అవధానాలు విద్వత్పరీక్షలు కావడం లేదు. కేవల వినోదాలుగానే మిగిలిపోతున్నాయి. కనుక నిగ్గుదేలే అంశాలు స్వల్పంగానే ఉంటాయి. అసలే పద్యవిద్యకు ఆదరణ లేని రోజులు కదా, కనుక పద్య విద్యాప్రదర్శన చేయాలని సాహసించేవాళ్లను ప్రోత్సహించాలని కూడా సాహిత్యలోకం భావించడం అవధానంలో గుణాత్మకత తగ్గడానికి కారణం. ఈ కాలంలోనూ విద్వత్పరీక్షకు నెగ్గగలిగిన సామర్థ్యంగల అవధానులు లేకపోలేదు. కనుక ఈ అపవాదు వారికి వర్తించదు. ఇక ఈరోజుల్లో పేరు తెచ్చుకోవాలనే ‘కండూతి’ పెరిగిపోయి, సామర్థ్యాన్ని పెంచుకోవాలనే స్పృహ లేనందువల్ల ప్రచారార్భాటాలు మాత్రమే సర్వత్రా చోటుచేసుకోవడం గమనార్హం. ఈ పద్ధతి భవిష్యత్తుకు అంత మంచిది కాదు.
ఇక వ్యవధాన కవిత్వం రాసేవాళ్లు ఎందరో ఉన్నారు. వారిలోనూ సమర్థులూ, అసమర్థులూ కనబడుతారు. కవిత్వం ఎంత చెక్కితే అంత గొప్ప శిల్పంగా మారుతుంది. కానీ చెక్కడానికి తగిన సమయం, ఓపిక చాలామందిలో సన్నగిల్లాయి. ఏదో ఒక స్వార్థకారణంతో కవిత్వం రాస్తే, కవితాంశ మృగ్యమై, ఫలాపేక్ష ప్రధానమై కవిత్వం భ్రష్టుపడుతుంది. కనుక వ్యవధానకవులు ప్రలోభాలకు లొంగరాదు. నిజాయితీగా కవిత్వాన్ని రాయాలి. స్వేచ్ఛగా భావనలను ఆహ్వానించాలి. అప్పుడే కవిత్వం పాల మీగడలా జిగిదేరుతుంది.
పూర్వం భోజరాజుగారి కాలంలో డబ్బుకూ, సన్మానాలకూ ఆశపడి, రాని కవిత్వాన్ని దుశ్శాసనుడు జుట్టుపట్టి ఈడ్చుకొని వచ్చినట్లు ఈడ్చుకొని తెచ్చే కవులూ ఉండేవారట. అలాంటివారిలో ఒక విద్వాంసుడు తిండి దొరకక, కుటుంబాన్ని పోషించే దిక్కు కనబడక, కవితాప్రియుడైన భోజరాజు దగ్గరికి వచ్చి, ఇలా మొరపెట్టుకొన్నాడట- ‘్భజనందేహి రాజేంద్ర! ఘృతసూప సమన్వితమ్’ (ఓ మహారాజా! మంచి నెయ్యి, ముద్దపప్పుతో కూడిన భోజనం పెట్టి నన్నాదుకో!). అప్పుడు భోజరాజు ఓ కవీ! నీవు శ్లోకంలో పూర్వార్ధమే (సగమే) చెప్పావు. ఇంకా మిగిలిన సగం కూడా చెప్పు అన్నాడట. అప్పుడా పండితుడు రెండవ సగాన్ని చెప్పలేక తొట్రుబాటు పడుతుంటే, ప్రక్కనే ఉన్న కాళిదాస మహాకవి ‘మా హిషంచ శరచ్చంద్ర చంద్రికాధవళం దధి’ అని రెండవ పాదాన్ని పూర్తిచేశాడట. అంటే ‘శరత్కాలంలోని చిక్కని వెనె్నలవలె తెల్లని పెరుగుతో కలిపిన భోజనం పెట్టు’ అని అర్థం. అప్పుడు భోజరాజు కాళిదాసు పూరణకు సంతోషించి, పేదరికంతో అగచాట్లు పడుతున్న ఆ పండితుణ్ణి యథోచితంగా సత్కరించి పంపాడట. అందుకే పాండిత్యం వేరు. కవిత్వం వేరు. పండితులు కవులు కాకపోవచ్చు. కవులు పండితులు కాకపోవచ్చు. దేని దారి దానిదే. కానీ పాండిత్యంతో కలిస్తే కవిత్వానికి విలువ పెరుగుతుంది. అందుకే విద్వత్కవులే నిజమైన కవులనీ, కేవల కవులు కేవలం కవి నామమాత్రులే అని చెప్పడం తప్పుకాదు.

- అయాచితం నటేశ్వరశర్మ, 9440468557