సాహితి

తెలుగు భాషకు ‘బ్రహ్మరథం’!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయోధిక పాత్రికేయ సంఘం ఇటీవల హైదరాబాదులో ‘ప్రజా మాధ్యమాలలో తెలుగు’పై నిర్వహించిన సదస్సులో చేసిన ప్రసంగం.

తెలుగు పత్రికల భాష, శైలి చర్చించడానికి వయోధిక పాత్రికేయ సంఘం నిర్వహిస్తున్న గోష్ఠిలో పాల్గొంటున్నందుకు సంతోషం. ఇలాంటి ఆలోచనలు మాలాంటి వయోధికులకే వస్తాయనుకుంటా. భాష, శైలి తప్పులేకుండా చక్కగా ఉండాలన్న చాదస్తాలు ప్రచార మాధ్యమాల్లో నేటి నవతరానికి లేవు. వ్యాకరణ నియమాలు, భాషా ప్రమాణాలు, శైలీ శాస్త్రాలు పాత చింతకాయ పచ్చడిలా బూజుపట్టిపోయాయి. మా వరదాచారిగారు లాంటి కొద్దిమంది పెద్దలు మీడియా పలుకును సానపట్టాలని ఇంకా ఏదో తంటాలు పడుతున్నారు.
తెలుగు పత్రికల భాష, శైలి గురించి మాట్లాడడం తేలిక. దీనికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. ఈరోజు పేపర్లో, పాత పేపర్లో మీ చేతికందినవి రాండమ్‌గా తీసుకుని ఏరోజు ఏ పత్రికలో ఏ పేజీని తిరగేసినా ఆ పత్రిక స్థాయిని బట్టి మూడో, ముప్ఫయ్యో తప్పులు కనపడతాయి. అది మినిమం గ్యారంటీ. పత్రికలు ముందేసుకుని ఓ అరగంట కష్టపడితే కుప్పలకొద్దీ తప్పులు దొరుకుతాయి. వాటిని ఏకరువుపెట్టి ఇలాంటివి దొర్లకుండా ఇకముందు జాగ్రత్తపడండన్న నీతిబోధతో ఎంచక్కా ఉపన్యాసం ముగించవచ్చు.
నేను ఆ పని చెయ్యదలుచుకోలేదు. ఎందుకంటే నాకో ఈతిబాధ ఉంది. ఫలానాఫలానా తప్పుల్లాంటివి వస్తున్నాయని నేను వేలెత్తి చూపితే ఆ తప్పులు అన్నీ కాకపోతే కొన్నయినా నా దివ్య సంపాదకత్వంలోని దినపత్రికలో కూడా ధారాళంగా వస్తూనే ఉండొచ్చు. మరి వాటి విషయంలో తమరేమి చేస్తున్నారని ఎవరైనా కర్మం చాలక అడిగితే నా దగ్గర సమాధానం లేదు.
పోనీ తప్పులను ఎత్తి చూపించి ఇలాంటివి దిద్దుకోవాలని చెప్పినా ప్రయోజనం ఉంటుందన్న ఆశాభావం నాకు పూర్తిగా లేదు. ప్రపంచం, అందులో జర్నలిజం, అందునా తెలుగు జర్నలిజం ఇవాళ చాలా ముందుకు పోయాయి. ‘అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధౌ’ అని వెనకటికి ఎవరో అన్నట్టు ఇప్పుడు ‘అపశబ్ద భయం నాస్తి పత్రికాచార్య సన్నిధౌ’! అపశబ్దాల భయం మనకు ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే మనం పలికేవన్నీ నిక్కచ్చిగా తరచి చూస్తే చాలావరకు అపశబ్దాలే. ఇది అపశబ్దం అని ఎంచి చూపితే మిగిలిన మన పదపారిజాతాలను అవమానించినట్టు అవుతుంది. పైగా ఫలానా మాట తప్పు అని మనం అన్నామనుకోండి. అలా అనడమే తప్పు; మనకే తెలియదు అని అవతలివాళ్లు వాదులాడగలరు. మహా మహా వాళ్లే ఆ విధంగా రాస్తూండగా, వాటినే తప్పుబట్టేంత మొనగాడివా నువ్వు అని తగవు పడనూ గలరు. ఔనుమరి. ‘పదుగురాడు మాట పాడియైధరజెల్లు’ అన్నారు కదా పెద్దలు?
ఉదాహరణకు ‘ప్రెషర్’ అనే ఆంగ్ల పదాన్ని సాధారణంగా మనమందరం తెలుగులో ‘ఒత్తిడి’ అని రాస్తాం. ఆ మాట తప్పు-‘ఒత్తడి’ అనాలి అంటుంది నిఘంటువు. అది గుర్తుపెట్టుకుని నేను ‘ఒత్తడి’ అని రాశాననుకోండి. సారు తొందరలో చూసుకుని ఉండరని ఊహించి మావాళ్లే అచ్చులో ‘ఒత్తిడి’ అని కరక్టు చేస్తారు.
‘అధిగమించు’ అంటే అసలు అర్థం ‘చదువు’, ‘తెలియు’, ‘పొందు’-అని. మనం మాత్రం కష్టాలను, ఇబ్బందులను, అడ్డంకులను అవలీలగా ‘అధిగమిస్తూ’నే ఉంటాం.
‘సంయమనం’ అనగా ‘బంధనం’ లేక ‘వ్రతం’ అని చెబుతుంది ‘శబ్ద రత్నాకరం’. మనం చస్తే ఒప్పుకోం.
‘బ్రహ్మరథం’ అనే పదం ఉంది. నిఘంటువులో దాని అర్థం చూడండి. ‘మృతి చెందిన సన్యాసులను తీసుకుని పోయెడు వాహనము’ అని కనపడుతుంది. అంటే-ఎవరికైనా ‘బ్రహ్మరథం’ పట్టారు అంటే వారికి పాడెకట్టారు అని అసలు అర్థం. కాని ఎన్నికల్లో గెలిచినవాళ్లు, ఏదైనా ఘనకార్యం చేసినవాళ్లు, గొప్ప గౌరవం పొందినవాళ్లు తమకు జనాలు ‘బ్రహ్మరథం’ పట్టకపోతే ఊరుకోరు. తమకు చేయాల్సిన మర్యాద చేయనట్టే ఫీలవుతారు.
బండి‘ర’, అరసున్నలతోబాటే నిఘంటువులనూ ఎప్పుడో గుంటబెట్టి గంటవాయించాము. తెలుగు భాషలోని అక్షరాలనే సగానికి సగం మింగేసి, అదే అభ్యుదయం అని అనుకుంటున్న మనకు వాడుకలోని సంస్కృత పదాలకు అర్థం తెలియకపోవడం నేరం కాదు. పోనీ మామూలు మాటలనైనా సరిగా రాస్తున్నామా? పలుకుతున్నామా?
ఎన్నో పత్రికల దీపాలను వెలిగించి, ఎన్నో పత్రికల దీపాలను ఆర్పిన మోతుబరి సంపాదకుడు కూడా ‘్ధటుగా’ అని వత్తి పలుకుతాడే తప్ప ‘దీటుగా’ అని పొరపాటున అయినా అనడు.
మనకు ఏదైనా ‘వౌళిక’మే తప్ప ‘వౌలికం’ కాదు. ‘్భద’పడతామే తప్ప ‘బాధ’పడం.
‘నిజాయతీని’ కచ్చితంగా ‘నిజాయితీ’ అనే రాస్తాం. ‘బీభత్సం’ని ఎల్లవేళలా భీభత్సమే చేస్తాం. ఏదైనా అవలం‘్భ’స్తామే తప్ప అవలం‘బి’ంచం. ఎవరైనా వెళ్లటమే జరుగుతుంది. అనుకోవటమే జరుగుతుంది. భయపడడమే జరుగుతుంది. జరగటమే జరుగుతుంది. అంత తేలిగ్గా ఎవరూ వెళ్లరు. ఏదీ అనుకోరు. వట్టిగా భయపడరు. ఏదీ కేవలం జరిగి ఊరుకోదు.
అలాగే ‘సంఘటన చోటు చేసుకుంది’ అనకపోతే మనకు క్రైము వార్తలో, హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీలో వాక్యం పూర్తి కాదు.
మనం డెమోక్రసీలో ఉన్నాం. అందులో సంఖ్య ప్రధానం. బహుళ సంఖ్యాకులు ఎలా చెబితే అలాగే నడవాలి. మనలాంటి చాదస్తులు కొద్దిమంది ఫలానా మాట తప్పు అన్నంత మాత్రాన వినే స్థితిలో ఎవరూ లేరు. ‘మూలం’ నుంచి పుట్టిన మాట ‘వౌలికం’ అవుతుందే గాని ‘వౌళికం’ కాదు అన్న తెలివిడి పలువురు పండితులకే కొరవడినప్పుడు తాము పండితులన్న భ్రమ అసలేలేని మామూలు జర్నలిస్టులు - ‘బాధ్యత’ను భాధ్యత లేక భాద్యత - అనీ / ‘విద్య’ను ‘విధ్య’- అనీ / ‘విద్వాంసుడు’ని ‘విధ్వాంసుడు’ అనీ / యథావిధిని యధావిథి అనీ రాస్తున్నారంటే ఆశ్చర్యమెందుకు? ప్రతిష్ట - ప్రతిష్ఠ; స్తంభం - స్థంభం, విద్యార్థి - విధ్యార్ధి, ‘తీర్మానం - తీర్మాణం’, ‘దీక్ష - ధీక్ష’ ‘దాటు-్ధటు’ల్లో తప్పొప్పుల గోల మనకేల? వత్తులు, పొట్టలో చుక్కలు మనం పెడితే ఉంటాయి. పెట్టకపోతే పోతాయి. ఏదైనా మనం ఆడిందే మాట. రాసిందే రాత- అని ఏనాడో రూఢి అయింది. ‘శాస్ర్తీ’ని ‘శాస్ర్తి’ అని, ‘సీత’ను ‘సీతా’ అని, ‘నరసింహ’ను ‘నరసింహ్మ’ అని ‘ఎడిటర్’ని ‘ఏడిటర్’ అని రాయటమే ఇవాళ ఫ్యాషను. అలా రాయటమే రైటు అని మనందరం కష్టపడి స్థిరం చేశాము కాబట్టి ఇవాళ పత్రికల్లో, టీవీ పలుకుల్లో తప్పులెంచటం పనికిమాలిన పని!
నేను పత్రికారంగంలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు దాటింది. వేరే వృత్తి దేనికీ పనికిరాకపోవటంవల్లే నేను జర్నలిస్టును అయిన మాటా నిజమే అనుకోండి. నేను ఏ కాలేజీకీ పోలేదు. బి.సి.జె, ఎం.సి.జె లాంటి డిగ్రీలేవీ నాకు లేవు. ఈ రంగంలో నాకు గురువు అంటూ ప్రత్యేకంగా లేరు. ఏమి రాయాలో, ఎలా రాయాలో నన్ను కూచోబెట్టి ఎవరూ నేర్పలేదు. నలభైఏళ్లనుంచీ జర్నలిస్టుగా, ఏకధాటిగా ఇరవై ఒక్క ఏళ్లనుంచీ ఒకే దినపత్రికకు సంపాదకుడిగానూ ఉన్నానంటే ఎంతో కొంత అక్షరజ్ఞానం నాకూ ఉండే ఉండాలి. అది ఎలా అబ్బిందంటే- నేను ఈ వృత్తిలోకి ప్రవేశించిన కాలాన ఉన్న ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలాంటి పత్రికల్లో ఎవరు ఎలా రాస్తున్నారో గమనించి... వారు వాడుతున్న పదాల పొందికను, శైలీభేదాలను అధ్యయనం చేసి...‘ఆంధ్రపత్రిక’ నుంచి ‘విశాలాంధ్ర’ దాకా వివిధానేక పత్రికల సారస్వతానుబంధాలను జాగ్రత్తగా చదివి... శ్రీపాద, పానుగంటి, చెళ్లపిళ్ల, మల్లాది, విశ్వనాధ, శ్రీశ్రీ, గురజాడ, తిలక్ వంటి పెద్దల గ్రంథాలు పలుమార్లు నెమరువేయటంద్వారా!
ఈ సభలో ఉన్న జర్నలిజం విద్యార్థులు ఎవరైనా నేనన్నది పట్టుకుని నాలాగే చేయబోయారనుకోండి. వాళ్లు తమకు వచ్చిన భాషను కూడా మరచిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటి పత్రికల్లో, ఇప్పుడొస్తున్న ప్రసిద్ధుల పుస్తకాల్లో సర్వసాధారణంగా వాడుతున్న భాషను, అందులోని పదాలను, పదబంధాలను వారు ప్రామాణికంగా పరిగణించి తామూ అలాగే రాస్తూపోతే భాషకు కొంచెం ఇబ్బందే!
మనందరం తలా ఒక చెయ్యివేసి కష్టపడి దిక్కులేని అనాథను చేసిన తెలుగుతల్లి కాస్త నొచ్చుకుంటే మనకేమిటి? ‘నలుగురితో నారాయణ’ అనటం మనకూ మంచిదే. పత్రికలు, పుస్తకాలు చదివిచదివి, టీవీలూ సినిమాలూ చూసిచూసి ప్రజలుకూడా బాగానే ఎడ్యుకేట్ అయ్యారు. రాసేవాళ్లు, చదివేవాళ్లు ఒకేస్థాయిలో ఉన్నారు కాబట్టి ఏ మాట ఎలా రాసినా పట్టుకునేవారు లేరు. చాదస్తాలకుపోయి ప్రతిదీ సరిగ్గా రాయాలనుకుంటేనే చిక్కు.
కొమ్ములు తిరిగిన కొందరు ఎడిటర్లు రాసే సంపాదకీయాల్లోనే అక్షరదోషాలు, అవగాహనలోపాలు, అజ్ఞానపు ఛాయలు తొంగిచూసేటప్పుడు కుర్ర జర్నలిస్టులు తప్పులు రాస్తున్నారని గింజుకోవటం వృథా. ‘సరే’ అనే రెండక్షరాల తెలుగుపదం ఉన్నా ‘ఓకే’ అని ఇంగ్లీషులో అంటేగానీ మోడర్న్‌గా ఉండదనీ, లైనుకు మూడు ఇంగ్లీషు మాటలు వాడితేగాని తెలుగు భాషకు సొగసు కలగదనీ గొప్ప గొప్ప రచయితలే అనుకుంటున్నప్పుడు వర్ధమాన రచయితల లోటుపాట్లను ఎంచటం అనవసరం.
ఇప్పటిదాకా ప్రస్తావించింది తెలియనితనంవల్లో, అశ్రద్ధవల్లో, చేస్తున్నట్టి పరిహరించగలిగిన తప్పుల గురించి, భాషా సమస్యకు ఇంకో పార్శ్వంకూడా ఉంది. మన పెద్దలు పెద్దగా దృష్టిపెట్టని సీరియస్ ప్రాబ్లమ్ ఒకటుంది. తేనెలొలుకు తేట తెనుగు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అంటూ మన భాష అందం, చందం, గొప్పతనం గురించి ఏటా రెండుసార్లు వచ్చే భాషా ‘దినాల’నాడు కబుర్లు బాగానే చెబుతాము. కాని- తెలుగు వచనంమీద కాస్తోకూస్తో పట్టు, కొంచెం భాషా జ్ఞానం, రచనా వ్యాసంగంలో పత్రికారంగంలో తగుమాత్రం ప్రవేశం ఉన్నవాడిగా మొహమాటంలేకుండా చెబుతున్నా. మన భాష అనేక విషయాల్లో ‘వీకు’. దాని బలహీనతలు ఏమిటో ముఖ్యంగా పత్రికా రచయితలకు బాగా తెలుసు.
కాలమిస్టుగా, స్వతంత్ర రచయితగా నేను నా భావానికి కావలసిన మాటను ఎంచుకోగలను. ఒక ఇంగ్లీషు పదానికి, లేక పదబంధాలకు తెలుగులో అభివ్యక్తి సరిగా రాదనుకుంటే వాటిని వదిలేసి నా అవసరానికి, అభిరుచికి తగినట్టి పదాలను ఎంచుకోగలను. ఆ సౌలభ్యం సంపాదక విభాగంలో పనిచేసే జర్నలిస్టులకు ఉండదు. ఏ న్యూస్ ఏజెన్సీద్వారానో, రిపోర్టరునుంచో వారికి అదే వార్తలను అనువదించేటప్పుడు మూలంలో ఏ మాట ఉంటే దానికి సమానార్థకమైన తెలుగుపదం వారికి అవసరమవుతుంది. అర్ధరాత్రి దాటాక, ఎడిషన్ డెడ్‌లైను ముంచుకొస్తుండగా, సంప్రదించడానికి సీనియర్లూ అందుబాటులో లేని సమయాన వచ్చిపడిన వార్తను హుటాహుటిన తెలుగులోకి అనువదించాల్సి వచ్చినప్పుడు డెస్క్‌వాడికి మూలంలోని మాటకు సరైన సమానార్థక తెలుగు పదం కావాలి. కాని చాలా సందర్భాల్లో స్ఫురించదు. నిఘంటువుల్లోనూ, పారిభాషిక పదకోశాల్లోనూ దొరకదు. టెక్నికల్ పదాలకు సరిగ్గా ఆ అర్థం స్ఫురింపజేసే తెలుగు మాటలే కావలసి వస్తాయి. అలాంటి సమానార్థక పదాలు దొరకని దృష్టాంతాలు కొల్లలు.
ఉదాహరణకు ఇంగ్లిషులో Economic, Financial, Fiscal అనే పదాల మధ్య తేడావుంది. Association, Union, Society అన్నిటికీ ‘సంఘం’ అన్న మాట మనకు గతి. Company, Corporation, Institute, Institution లాంటి పదాలకు తెలుగులో సరైన మాటలు లేవు. Extremistకీ Militantకీ మధ్య... Militantకీ Terroristకీ నడుమ ఆంగ్లంలో ఉన్న తేడాను తెలుగులో చూపటం కష్టం. Rape, Molestation, Outraging modestyల వ్యత్యాసాన్ని సూఛించేందుకు తెలుగులో మాటలు ఉన్నాయా?Terrorకు తెలుగు మాట ఏమిటి?Prosecute, interrogate, news report, cult, article, section, clause, sub-clause, ballot, bureaucracy, bureaucrat, diplomacy, diplomat, revenue, theme, statesman, scam, scandal, miracle, mystery, entrepreneur, ideol లను తెలుగులో ఏమంటాం? waryకీ battleకీ మధ్య statementకీ announcementకీ declarationకీ మధ్య తేడా చూపగలమా?
శివలెంక శంభుప్రసాద్, సురవరం ప్రతాపరెడ్డి, నార్ల వెంకటేశ్వరావు, తాపీ ధర్మారావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, తిరుమల రామచంద్ర, రాంభట్ల కృష్ణమూర్తి వంటి ఉద్దండులు పత్రికా సంపాదకులుగా ఉన్న కాలాన అవసరానికి తగ్గట్టు తెలుగు పదాలను తయారుచేశారు. తలా ఒక చెయ్యివేసి తెలుగు పత్రికలకు కావలసిన పదకోశాన్ని సమకూర్చారు. అలీన విధానం, విబంధ విధానం, ఐక్యరాజ్యసమితి, సయోధ్య - అయోధ్య వంటి మాటలు ఆ రకంగా వచ్చినవే.
పత్రికల పరిధి, వ్యాప్తి, పాత్రికేయుల విద్యాస్థాయి, ఆర్థిక స్థితి ఊహాతీతంగా అభివృద్ధి అయి ప్రపంచం అన్ని రంగాల్లో జాంబవంతుని అంగల్లో ముందుకుపోయిన ఈ అధునాతన కాలంలో పత్రికల పదకోశమూ అదే స్థాయిలో పరిపుష్ఠం అయి ఉండాలి. కాని కాలేదు. దేశభక్తితో, త్యాగనిరతితో పత్రికారంగంలో అడుగుపెట్టిన పాత తరం పెద్దలకున్న వృత్తి నిబద్ధత, సృజనాత్మకత, ప్రయోగశీలత, పట్టుదల, దృఢదీక్ష కింగ్‌మేకర్లు, పవర్‌బ్రోకర్లు, రాజకీయ శకునులు, శకారులు మీడియా విధాతలైన ఆధునిక కాలంలో పత్రికారంగాన అంతగా కానరావు, ఈ కాలంలోనూ ప్రతిభావంతులు, సమర్థులు, విజ్ఞులు అయిన జర్నలిస్టులు ఎందరో ఉన్నారు. తమకున్న పరిమితుల్లోనే తెలివితేటలను ఉపయోగించి ‘ప్రపంచీకరణ’, ‘అంకురసంస్థలు’, ‘అంతర్జాలం’ ‘ముఖ పుస్తకం’, ‘చరవాణి’, ‘గుత్తేదారు’ వంటి పదాలను కనిపెడుతున్నారు. అయినా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనుదినం పెరుగుతున్న అవసరాలతో పోల్చితే అందుబాటులో ఉన్న పదాలు తక్కువే. ఈ లోటు పూడాలంటే విశ్వవిద్యాలయాలు, అకాడమీలు, భాషావేత్తలు, ఆయా రంగాల నిపుణులు కలిసి రావాలి. మరుగున పడిన ముత్యాల్లాంటి అచ్చతెనుగు పదాలను వెలికితీసి, ఆధునిక అవసరాలకు తగ్గట్టు వాటిని సానబెట్టి పరభాషా పదాలను తెలుగు పద్ధతిలో ఇమిడ్చుకుని, కొత్తపదాలను సృష్టించడానికి బృహత్తరయత్నం నిరంతరంగా సాగాలి. ఎటొచ్చీ ఆ దిశలో ఆలోచించే తీరిక, కోరిక ఆయా రంగాల్లోని పెద్దల్లో కనపడదు. తెలుగు భాషను దాని కర్మానికి వదిలేసిన ప్రభుత్వాల సంగతి చెప్పనే అక్కర్లేదు. అందుకే తెలుగు భాషకు ఈ గతి పట్టింది. దీన్ని కాస్త బాగు చేయాలని నిజంగా అనుకుంటే భాషతో సంబంధం ఉన్న పెద్దలు, సంస్థలు బద్ధకం వదిలి కలిసికట్టుగా ఒక పట్టుపట్టాలి. భాషను క్రమబద్ధంగా అవసరానుగుణ్యంగా అభివృద్ధి చేయటం మన చేత కానప్పుడు తప్పులు రాస్తున్నారని జర్నలిస్టులను నిందించటం దండుగ.

- ఎం.వి.ఆర్. శాస్ర్తి