సాహితి

సహజత్వం... శరత్‌చంద్ర సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగాలీ భాషలో ఉన్నా, ఇది తెలుగువారికథే అనిపించేలా సహజత్వానికి దగ్గరగా నవలలు రాసిన ప్రముఖుల్లో ఒకరు శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ అనబడే ‘శరత్‌బాబు’. దేవదాసు నవల వంగభాషలో రాసి సకల విజ్ఞ పాఠక ప్రేక్షకుల మెప్పుపొంది చరితార్థుడైన మధుర గాయకుడు, రాజకీయ మేధావి ఆయన.
అసలు శరత్‌బాబు జీవితమే ఒక విచిత్ర గాథ. శరత్ చదువు చిన్నతనంనుంచి సరిగా సాగలేదు. అప్పుడప్పుడూ ఇల్లువిడచి బైరాగుల వెంటపడి దేశమంతటా తిరిగేవాడు. ఆ పర్యటనల క్రమంలోనే జీవితమంటే ఏమిటో, వివిధ మానవ ప్రవృత్తులెలా ఉంటాయో ఆకళింపు చేసుకున్నాడు. శరత్ భవిష్యత్‌లో శరపరంపరగా చేసిన రచనలకు ఈ పర్యటనల క్రమంలోనే ఎంతో ముడి సరుకు లభించిందని చెప్పవచ్చు. దేశ దిమ్మరిగా తిరుగుతూ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన విద్యాభ్యాస కార్యక్రమం కొనసాగింది. ఆ రోజుల్లో తారసపడ్డ వ్యక్తులే దేవదాసులోని పార్వతి, శ్రీకాంత్‌లోని రాజ్యలక్ష్మి అయి ఉండవచ్చు.
శరత్ తండ్రి అయిన మోతిలాల్ కథలు, నవలలు, పద్యాలు మొదలైన సాహిత్య రంగంలో కృషిచేశాడేకాని, ఏ రచన పూర్తిచెయ్యలేకపోయేవాడు. తండ్రిగారి రచనలన్నీ చదివి పూర్తిచేసేందుకు ప్రయత్నించేవాడు శరత్. ఆ సమయంలో బెంగాల్ అంతట టాగూరు పేరుమ్రోగిపోతోంది. వారితో సమానంగా తాను రచన చేయగలిగినపుడే తన రచనలను వెలువరించాలని నిర్ణయించుకున్నాడు శరత్. తిన్నగా ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణుడైన శరత్ సాహిత్య గోష్టుల్లో పాల్గొంటూ, రవీంద్రుని రచనలను మధిస్తూ వాటిని తర్కించుకుంటుండేవాడు. వంగ కథల పోటీలో ‘సురేంద్రనాథ్ గంగోపాధ్యాయ’ పేరుతో పాల్గొన్నప్పుడు శరత్‌కు మొదటి బహుమతి లభించింది. పెద్దగా చదువు సంధ్యలేమీ వంటబట్టని శరత్ బ్రతుకుదెరువుకోసం పొట్టచేతబట్టుకుని తన 27వ ఏట 1903లో రంగూన్ చేరుకున్నాడు. అచట తనకు ఆశ్రయమిచ్చిన తన పినతల్లి భర్త అఘోరబాబు ఆకస్మిక మరణంతో తిరిగి నిరాశ్రయుడైనాడు.
1905లో రంగూన్‌లో మణీంద్రకుమార్ మైత్రి అనే బెంగాలీవద్ద శరత్ నెలకు 30 రూపాయల ఉద్యోగం సంపాదించాడు. రంగూన్‌లో శరత్ మధుర గాయకుడుగా పేరు పొందాడు. రంగూన్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు శరత్ రోగులకు రాత్రింబవళ్ళు సేవచేశాడు. మృత్యువాత పడిన వారికి అంత్యక్రియలు కూడా జరిపాడు. శరత్ రంగూన్‌లోనే ఉండగానే ఆయన జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక పెద్దమనిషి తన కుమార్తెను ఒక వృద్ధునికిచ్చి వివాహం చేయ సంకల్పించగా, ఆమె శరత్‌ను శరణుజొచ్చింది. విధిలేని పరిస్థితిలో శరత్ ఆ యువతిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి వారికి ఒక బిడ్డ కూడా జన్మించింది. అపుడు రంగూన్‌లో ప్లేగువ్యాధి విపరీతంగా ఉంది. అందువల్ల తల్లీబిడ్డా ప్లేగువ్యాధి సోకి మరణించారు. తర్వాత శరత్ బెంగాల్ వెళ్ళినపుడు ‘హిరణ్మరుూదేవి’ అనే నిరుపేద బ్రాహ్మణ స్ర్తిని వివాహం చేసుకుని బర్మాకు తీసుకొచ్చాడు. శరత్ రంగూన్‌లోనే ఉండగానే ఆయన చిన్నతనంలో రాసిన ‘బడదీదీ’ అనే నవల భారతి పత్రికలో ప్రచురితమయి వంగ సాహిత్య రంగంలో పెద్ద సంచలనం సృష్టించింది. రచయితగా శరత్‌కు మంచి పేరు లభించింది. అటు తర్వాత తన రచనా వ్యాసంగాన్ని ముమ్మరం చేశాడు. కథలు, నవలలు రాయనారంభించాడు. ఫణీంద్ర నాథ్ పాల్ సంపాదకత్వాన వెలువడిన సాహిత్య పత్రిక ‘యమున’లో శరత్ రచనలు అనేకం ప్రచురితమైనాయి. బర్మాలో 14 సంవత్సరాలు గడడిపిన శరత్ విశేషమైన ప్రపంచ అనుభవాన్ని సంతరించుకుని కలకత్తా ప్రచురణకర్త ఒకరు నెలకు వంద రూపాయలు ఆదాయం వచ్చే మార్గాన్ని చూపిస్తానని చెప్పడంతో 1916లో కలకత్తాకు తిరిగి వచ్చాడు.
అటు తర్వాత శ్రీకాంత్, గృహదహనం, శేషప్రశ్న వంటి అపురూప గ్రంథాలెన్నో రచించాడు. దేశబంధు చిత్తరంజన్‌దాస్ ‘నారాయణ’ అనే పత్రికను నడుపుతుండేవాడు. ఆ పత్రికకు ఒక కథను రాసి పంపమని శరత్‌ను కోరగా ‘స్వామి’ అనే కథను రాసి పంపాడు. దాన్ని చదివి ముగ్ధుడైన చిత్తరంజన్‌దాస్ ఆ కథకు తాను విలువకట్టేవాడనుకాదని తెలుపుతూ, ఒక ఖాళీ చెక్కును శరత్‌కు పంపి, ఆ కథకు తన ఇష్టం వచ్చినంత ప్రతిఫలం తీసుకోమని శరత్‌ను కోరాడు. కాని శరత్ తన కథకు ఒక వంద రూపాయలు మాత్రమే తీసుకుని తృప్తి చెందాడు. అంతేకాదు. తన రచనలపై వచ్చే ప్రతిఫలం మీద జీవితం గడిపిన రచయిత అప్పట్లో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క శరత్ మాత్రమే అంటే అతిశయోక్తికాదు.
శరత్‌చంద్ర దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. కాంగ్రెస్‌లో చేరాడు. సుభాస్‌చంద్రబోస్, చిత్తరంజన్‌దాస్ వంటి అభిమానాన్ని చూరగొన్నాడు. శరత్ హౌరా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా పనిచేశాడు. బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా కూడా కృషిచేశాడు. సమాజంలోని వితంతువుల, పతితల పాట్లను పరిశీలించి ‘నారీ మూల్యం’ అనే వ్యాసాన్ని రచించాడు. ఆయన రచనల్లో స్ర్తిల దుస్థితి పట్ల విశేషమైన సానుభూతి కన్పిస్తుంది. 1923లో కలకత్తా విశ్వవిద్యాలయంవారు శరత్‌కు ‘డిలిట్ సాహిత్యాచార్య’ బిరుదు ఇచ్చి సన్మానించారు. విద్యాభ్యాసంకోసం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అడుగిడని శరత్‌ను ఒకసారి కలకత్తా విశ్వవిద్యాలయంవారు బి.ఏ. తరగతి పరీక్షాధికారిగా కూడా నియమించారు. వీటన్నిటికన్నా గొప్ప ప్రశంసను రవీంద్రుడినుండి శరత్ పొందాడు. వంగ మహిళలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
శరత్ చేసిన కొన్ని రచనల్లో స్వాతంత్య్రోద్యమ ప్రతిధ్వనులతోపాటు టెర్రరిస్టు ఉద్యమ ధోరణులు కూడా కన్పిస్తాయి. గాంధీజీ అహింసా సమరం వైఫల్యం కారణంగా జనించిన నిరాశా నిస్పృహలు కన్పిస్తాయి. భారతదేశంలో పరిశ్రమలు ప్రారంభం కావడంతో నగరాల్లో కేంద్రీకరించబడిన పారిశ్రామిక కార్మికుల్లో ఎర్రజెండా నాయకత్వాన ప్రారంభమైన ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు, ఎర్రజెండా రెపరెపలు మనకి గోచరిస్తాయి. అలాగే జమీందారీ ప్యూడల్ బానిసత్వంలో మ్రగ్గుతున్న గ్రామీణ జీవితం, ముఖ్యంగా బ్రిటీష్ తొత్తులైన జమీందార్ల క్షుత్ర జీవితం వీరి రచనల్లో దర్శనమిస్తాయి. శరత్ రచనలన్నీ నిర్దిష్ట ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవే. సామ్రాజ్యవాదుల యుద్ధ దాహాన్ని ఖండిస్తూ, ప్రపంచ శాంతిని కోరుతూ ఆయన రచనల్లో వెలువడిన భావాలు ప్రత్యేకించి గమనార్హాలు.
శరత్ రచనల్లో సమస్యను ఆవిష్కరించడమే కాని, పరిష్కారాన్ని సూచించడం ఎక్కడా మనకు కనపడదు. శరత్ స్వీయ కథాత్మకమైన ‘శ్రీకాంత్’ చదివితే శరత్ వివిధ జీవిత దశలు వ్యక్తమవుతాయి. శరత్ రచనల్లో చాలా ముఖ్యమైనది ‘శేష ప్రశ్న’. దీనిలో అనేక సాంఘిక సమస్యల పై విపులమైన చర్చ ఉంది. ఇందులో కథాంశం చాలా తక్కువ. విమర్శలు, వాదోపవాదాలు ఎక్కువ. దాదాపుగా శరత్ రచనలన్నీ వెలుగులోకి వచ్చాయి. శరత్ రచనలు చదవని వారు ఒక దశలో ఆంధ్రలో లేరనే చెప్పవచ్చు.
శరత్ నవలల తెలుగు అనువాదకులు చాలామంది ఉన్నారు. ప్రప్రథమంగా శరత్ రచనలు తెనిగించినవారు జొన్నలగడ్డ సత్యనారాయణ, సహదేవ సూర్యప్రకాశరావు. కానీ వీరి అనువాదాలు ఎక్కువగా పాఠకులను ఆకర్షించలేకపోయాయి. అటు తర్వాత వేలూరి శివరామశాస్ర్తీ, చక్రపాణి బెంగాలీ మూలాలనుంచి చేసిన అనువాదాలు విశేషంగా పాఠకులను ఆకర్షించాయి. అనువాదకుల్లో శరత్‌ను కలుసుకున్నదీ, ఆయన నుంచి అనుమతి పొందినదీ వేలూరు శివరామశాస్ర్తీ గారే అయినా, శరత్ రచనలు దేవదాసు, బడదీదీ, పెంచిన ప్రేమ, పరిణీత మొదలైన రచనలు చక్కటి వాడుక భాషలోకి అనువదించి ప్రసిద్ధి చెందినది చక్రపాణి.
శరత్ పిన్నవయస్సులోనే దేవదాసు, బడదీదీ, విలాసి, మందిరం, బాల్యస్మృతి మొదలగు రచనలు చేశాడు. 1903-1916 మధ్య తీరని కోరికలు, చరిత్రహీన్, గర్వభంగం, రాగదీపం, శ్రీకాంత్ మొదలగు రచనలు చేశాడు. శరత్ 1916లో స్వదేశానికి తిరిగి వచ్చాక 1938 చనిపోయేలోగా రచించినవి గృహ దహనం, బ్రాహ్మణపిల్ల, భైరవి, నిష్కుృతి, హేమాంగిని, శేషప్రశ్న, భారతి, విప్రదాసు, గర్వభంగం మొదలైనవి. జాగరణ, రాగల రోజులు, మంచీ చెడూ అన్నవి ఆయన అసంపూర్తి రచనలు. తన నవలలనే కొన్నింటిని ఆయన నాటకాలుగా మలచాడు. పూజారిణి విజయ, ఇరుగు పొరుగు అనేవి శరత్ నాటకాలు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ‘శరత్‌ఛటోపాధ్యాయ’ అనబడే శరత్‌బాబు బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా దేవానందపురం అనే కుగ్రామంలో 1876 సెప్టెంబరు 15వ తేదీన ‘మోడీలాల్ ఛటోపాధ్యాయ’ అనే నిరుపేద బ్రాహ్మణునికి ద్వితీయ సంతానంగా జన్మించాడు. 1938 జనవరి 16వ తేదీన ఆదివారంనాడు అశేష పాఠకలోకాన్ని వీడి శరత్‌బాబు అస్తమించాడు. దేశ ప్రజలే కాకుండా, టాగూరు వంటి సాహిత్యకారులూ, సుభాస్‌చంద్రబోస్ వంటి రాజకీయ నాయకులూ శరత్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపి, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. తన మహత్తర రచనల ద్వారా సాహితీ సౌరభాలను దశదిశలు వెదజల్లిన శరత్ చంద్రుడు అందరి హృదయాల్లో అమరజీవిగా నిలిచిపోయాడు.

- కె.వి.నాగేశ్వరరావు, 9963662699