సాహితి

బ్రహ్మరథం-అర్థ పరిణామం (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగు భాషకు బ్రహ్మరథం’ అనే శీర్షికతో గత వారం (ఏప్రిల్ 10) సాహితిలో వచ్చిన ఎం.వి.ఆర్.శాస్ర్తీ ప్రసంగ వ్యాసానికి ఇది కొనసాగింపు.
‘బ్రహ్మరథం’ పదానికి నిఘంటువులో ‘మృతి చెందిన సన్యాసులను తీసుకుని పోయెడు వాహనము’ అని కనపడుతుంది. అంటే - ఎవరికైనా బ్రహ్మరథం పట్టారు అంటే వారికి పాడె కట్టారు అని అసలు అర్ధం’ అంటూ ఎం.వి.ఆర్ వెటకరించారు. తెలుగుభాషకు పట్టిన తెగులును చూసి గుండె మండిపోవడంతో నిఘంటువును ఆసరా చేసుకుని ఆయన ఈ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. తెలుగును ఉద్ధరిస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే పెద్దల పిల్లలకే తెలుగు రాదు. రాయడం మాట అటుంచితే చక్కగా తప్పులేకుండా మాట్లాడడం అసలు రాదు.
భాష ఎప్పుడూ ఒక రకంగానే ఉండదు. మార్పు చెందుతూ ఉంటుంది. భాష, పరిణామం రెండు రకాలు. పదస్వరూపం, నిర్మాణంలో జరిగే మార్పు ఒకటైతే అర్థంలో కలిగే మార్పు మరొకటి. పద స్వరూపం మారినపుడు అర్థం; అర్థ పరిణామం జరిగినపుడు పద స్వరూపం మరాలనే నియమం ఏదీ లేదు.
పదం, అర్థం పరస్పర ఆశ్రయాలు కావు. మహాకాళి సుబ్బారాయుడు రూపొందించిన 1905 నాటి ‘శబ్దార్థ చంద్రిక’ నిఘంటువు ప్రకారం కూడా బ్రహ్మరథం అంటే పాడె కట్టడమే. అర్థ పరిణామం మూలంగా బ్రహ్మరథం అర్థ మారింది. ఇప్పుడు బ్రహ్మరథం అంటే బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే రథం. మృతి చెందిన సన్యాసులు బ్రహ్మలో ఐక్యం చెందారని భావించడం వల్ల వారిని తీసుకుని పోయే వాహనాన్ని బ్రహ్మరథం అన్నారేమో. నన్నయ కాలంలో సభికులు అంటే జూద గాండ్రని అర్థం. సభలోని ప్రేక్షకులను ఇప్పుడు సభికులని అంటున్నారు. ఒక కాలంలో సామాన్యార్థంలో లేదా నిందార్థంలో వాడిన పదాలు అర్థ పరిణామం మూలంగా విశిష్టార్థాన్ని తెలుపుతాయి. సామాన్యార్థం ఇచ్చే పదం విశిష్టార్థాన్ని ఇచ్చే పదంగా మారడానే్న అర్థ గౌరవం అంటారు. అర్థ గౌరవం మూలంగానే బ్రహ్మరథం అనే పదానికి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే రథం అనే అర్థం ఏర్పడింది.
నేను ‘ఉదయం’ దినపత్రిక తిరుపతి ఎడిషన్‌లో పనిచేస్తున్నప్పుడు నాతోపాటే పనిచేస్తున్న జర్నలిస్ట్ మిత్రుడొకడు-
‘‘ఇవాళ కోకెత్తాలి’’ అన్నాడు.
‘‘ఏ కోక?’’ అని అడిగాను
‘‘తక్కువలో వచ్చే కోక’’ అని అతను అన్నాడు
‘‘ఇప్పటిదాకా ఎన్ని కోకలెత్తావు?’’
‘‘నాకొచ్చే జీతంలో ఈ ఒక్క కోక ఎత్తడానికే తలప్రాణం తోకకొస్తున్నది’’ అని అతను అన్నాడు.
చిత్తూరు జిల్లాలో కోకెత్తడం అంటే చీర కొనడం; కింద ఉన్న చీరను చేతిలోకి తీసుకుని చూడడం అనే అర్థాలున్నాయని అతనితో కొనసాగించిన సంభాషణ వల్ల తెలిసింది. ప్రాంతాలను బట్టి కూడా పదాల అర్థాలు మారుతుంటాయి.
మళ్లీ ఈ కోక నిజామాబాద్‌లో ఎదురైంది.
‘‘సార్ కోక కాడ పంచాతి అయితున్నది’’ అని అప్పుడే బయటనుంచి వస్తున్న మా రిపోర్టర్ ఒకడన్నాడు.
‘‘గంత బాగుందా గా కోక?’’ అని అడిగాను.
‘‘కోక బాగునుండుడేంది?’’ అని అతను అన్నాడు.
చివరికి పాన్‌డబ్బాను నిజామాబాద్‌లో కోక అంటారని నాకు తెలిసింది.
ప్రతి జర్నలిస్టుకీ తాను బాగా రాయాలనే తపన ఉంటుంది. మంచి మంచి పదాలతో వార్తను ఒక పద చిత్రంగా మలచడానికి అతను నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు.
శంకర్ దయాళ్ శర్మ అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు నెలకోసారైనా తిరుపతికి వచ్చి వెంకటేశ్వరుని దర్శించేవారు. ప్రదక్షిణ చేసేవారు. గవర్నర్ అంగ ప్రదక్షిణ చేశారు అని రాసారు. ఆ ప్రముఖ దినపత్రికలో అలాగే అచ్చైంది.
రిపోర్టరో, సబ్ ఎడిటరో సరిగ్గా గుర్తులేదు. కానీ ఒక వార్తలో ‘చచ్చిన పీనుగులు’ అని రాసాడు.
‘‘ఏందివయ్యా గిట్ల రాసినావు’’ అని రాసిన వాడ్ని అడిగితే
‘‘్ఫర్స్‌గా జెప్పేతందుకే గట్ల రాసిన’’ అని చెప్పాడు.
‘‘సస్తెనే పీన్గలయితరు. పీన్గకు సచ్చుడు ఉండదు’’ అని అన్న
‘‘మల్ల చచ్చు పీనుగా అని తిడ్తరు గదా. గా దాన్కి మీరేమంటరు’’ అని అతను అడిగాడు.
‘‘గది ఒక తిట్టు. నిందార్థంల గాదాన్ని వాడ్తరు’’ అని జెప్పిన.
జర్నలిస్టుకు భాషపై అధికారం ఉండాలి. అందుకు వివిధ రకాల పుస్తకాల్ని చదవక తప్పదు. అధ్యయనం లేకపోతే అధ్వాన్నమైపోతారు.
మహామహులకే ఒత్తుల విషయంలో సందేహం వస్తుంటుంది. ఇక సామాన్య జర్నలిస్టుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. సాధారణంగా ఒత్తులు పెట్టదగిన అక్షరాలు పక్క పక్కనే వస్తుంటాయి. ఆ మూడంశాలను గుర్తుపెట్టుకుంటే ఒత్తుల మూలంగా వచ్చే తలనొప్పి నుంచి తప్పించుకోవచ్చు.
1. ఒత్తులు పెట్టదగిన అక్షరాలు పక్క పక్కనే వస్తే ఎక్కువగా రెండో అక్షరానికే ఒత్తు పెట్టాలి.
ఉదా: బాధ; సందర్భం; బాధ్యత; బీభత్సం; బోధన; బధిరుడు.
2. రెండో అక్షరానికి రేఫ ఉంటే తప్పనిసరిగా మొదటి అక్షరానికే ఒత్తు ఉంటుంది.
ఉదా: ఛత్రం, ఛిద్రం, భద్రం
3. దీంతో మొదటి అక్షరానికి ఒత్తులున్న పదాలను గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది.
ఉదా: ఖేదం, భేదం, ఖైదీ
మద్దతు, దాడి, రోదన, మద్యం, శబ్దం, వేదన వంటి పదాలకు ఒత్తులుండవు. కాని వేధించడంలో ఒత్తు ఉంటుంది.
తెనుగు భాషను తేనె అలుగుగా పండితులు అభివర్ణిస్తారు. సాహిత్య సృష్టికే కాకుండా సంగీతానికి కూడా అనువైన భాష తెలుగే. తెలుగులో అపారమైన పదసంపద ఉంది. ఎంత అధ్యయనం ఉంటే అంత పదసంపద లభ్యవౌతుంది. ఆంగ్ల పదాలను అనువదించేటప్పుడు దానికి సమానమైన పదం దొరక్కపోవచ్చును. అలాగే తెలుగునుంచి ఇంగ్లీషులోకి అనువదించే వారికీ ఈ సమస్య ఎదురవుతుంది. ‘పతివ్రత’ అనే పదాన్ని ఇంగ్లీషులోకి ఏమని అనువదిస్తారు. పతివ్రత ష్యశషళఔఆ ఆంగ్లేయులకు లేదు. పాత్రికేయులు కొత్త నిఘంటువుల్ని తయారు చేసుకోవలసిన అవసరముంది. ఇంతకుముందు కంప్యూటర్లు లేవు. ఇంటర్నెట్ లేదు, ఫేస్‌బుక్ లేదు. వీటిలో చాలా వాటికి పదాలను సృష్టించుకున్నాము
మన వృత్తిపదకోశాన్ని వయోధిక పాత్రికేయులు రూపొందించవలసిన అవసరముంది. భూకంపం సంభవిస్తే సమర్థుడైన ఉప సంపాదకుడు కూడా లీడ్‌ను కవితాత్మక వాక్యాలతో అసందర్భపు రాతలు రాస్తున్నాడు. వయోధిక పాత్రికేయుల అనుభవాన్ని, జ్ఞానాన్ని తెలుగు దినపత్రికలు ఉపయోగించుకుంటే బాగుంటుంది.

-తెలిదేవర భానుమూర్తి, 9959150491