సాహితి

అవగాహన లేని విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యం
పరిణామాలు, ఒక పరిశీలన
(వ్యాస సంపుటి)
రచయిత: అజ్మీరు వీరభద్రయ్య
వెల: రు.70/- ప్రతులకు:
రచయిత, మక్కపేట పోస్టు - 521 190,
వత్సవాయి మండలం, ఆంధ్ర ప్రదేశ్.

తెలుగు భాషా సాహిత్యాభిమానం గల వీరభద్రయ్య రాసిన 26 వ్యాసాల సంపుటి ఇది. ‘‘ప్రజా సాహిత్యంకోసం నిరంతరం తపించే తెలుగు ప్రజలకు’’ అంకితమన్నారు. నిరంతరం తపిస్తున్నవారు కనబడటం లేదు. పరిపాలకులకు ఏమీపట్టదు. ఈ వ్యాసాలు లోతుగా అధ్యయనంచేసి రాసినవి కావు. ‘‘పరిణామాలు’’ అన్నది అల్లాటప్పా అంశం కాదు. సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాలతో కూడుకొన్నది. అభిమానంతో చదవటం వేరు- విమర్శించటం వేరు. విమర్శకి పూర్వాపరాలు, సమకాలీనతలతోపాటు సందర్భోచితాలు కూడా అవసరం. ప్రబంధాలలో శృంగారం తప్ప ఏమీలేదనడం సమంజసం కాదు. భక్తి ప్రబంధాలున్నాయి గదా! అదొక కొత్త ధోరణిగా భావించాలి. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వ్యాసాన్ని అర్థంచేసుకుంటే రాయలకాలంలో ‘రసికత’ ఉందని తెలుస్తుంది. జాషువా కూడా గబ్బిలంలో రాయల పాలనావైభవాన్ని దేవేంద్ర వైభవంతో పోల్చారు. కావ్యాలు తగలబెట్టడం, పాతిపెట్టడం, చాటుపద్యాలు... వీటిని అంత ప్రామాణికంగా, సాక్ష్యాలుగా స్వీకరించలేం. ఈ అవగాహన లేకుండా సిద్ధాంతాలు చేయడం సముచితం కాదు. వరూధినీ ప్రవరుల కథని కేవలం శృంగారపరంగా చూడడం పాక్షికమే! అందులో మానవ ధర్మం, దాంపత్య ధర్మం, భోగలాలసత... వంటి అంశాలను పరిశీలించాలి. గతానుగతికంగా ఎవరో పలికిన మాటలనే పదే పదే పలకడం సరైన దృక్పథం కాజాలదు.
మొల్ల గురించి వీరభద్రయ్య వెల్లడించిన అంశాలలో కొన్ని వాస్తవాలున్నాయి. ‘‘నాకేమీ తెలీవు రాముడి దయవల్ల రాసాను’’ అని వాపోయింది. ఏమీ రాకుంటే రామాయణాన్ని అంత సంగ్రహంగా, అంత సరళంగా, అంత రామణీయకంగా రాయగలదా? ఆనాటి స్థితి అది! ‘‘దేశభాషలందు తెలుగు లెస్స’’ అని చాటిన శ్రీకృష్ణదేవరాయలు ‘‘దేశి’’ని పట్టించుకోలేదన్న వీరభద్రయ్యతో ఏకీభవిస్తారు. ‘‘అల్లసాని పెద్దన అటుఇటుగా ఏడ్చాడు- ముక్కుతిమ్మన ముద్దుముద్దుగా ఏడ్చాడు, భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు’’ అన్నది వీరభద్రయ్యకి సరిగా అర్థంకాలేదు. అది విమర్శకాదు- ఆయా పాత్రల స్వభావాలు, ఆయా సందర్భాల విశేషాలు! ‘‘కోపంలోకూడా అందంగా ఉన్నావే’’ అనటం లేదూ? కొన్ని గారాబం ఏడుపులు, ప్రణయ కలహపు ఏడుపులు అందగిస్తాయి. వీటిని రసానందంగా అనుభవించకుండా ఏదేదో రాస్తే ఎలా? శృంగార కీర్తనలు... పదాలు... రాసలీలలు ఈ రచయితకి అర్థంకావు. భగవంతుని లీలలలో నిమగ్నమైతే తప్ప ఓ పట్టాన అర్థంకావు. వేటిని ఎలా చూడాలో అలాగే చూడాలి. శ్రీశ్రీ ఎముకలు కుళ్ళిన, వయసు మళ్ళిన వారిని చావమన్నాడు. చావమనటం- అసలైన అర్థంకాదు. పక్కకి తప్పుకోమని అర్థం. ‘‘యక్షగానం’’ అనేది ‘‘కొరవంజి’’ అనే ప్రాచీన జానపద ప్రదర్శన కళారూపంనుంచి వచ్చినదని పరిశోధకులు నిర్ధారించిన అంశాన్ని ఈ రచయిత పట్టించుకోలేదు. సాహిత్యోద్యమాల పట్ల పరిపూర్ణమైన అవగాహన లేకుండా పై పై విమర్శ చేశారు. ‘‘వంటిల్లు’’ కవితలో నాలుగు పంక్తులు తప్ప మిగిలినవన్నీ అసంగతాలు. ఆ ఊపులో రాసి పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యం- నా పరిశీలన- నా అభిప్రాయాలు’’ అని పుస్తకానికి పేరుపెడితే కొంత సబబుగా వుండేది. సాహిత్య నేపథ్యం గలవారే విమర్శకు పూనుకోవాలి.

- ద్వా.నా.శాస్ర్తీ, 9849293376