జాతీయ వార్తలు

ఉప్పు తిప్పలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరత ఏర్పడిందన్న వదంతులు
ఒక్కరోజులో 40% పెరిగిన ధర
హైదరాబాద్ పాతబస్తీలో కిలో రూ. 300కు అమ్మకం
ఏపీలోనూ ధరలకు రెక్కలు
హోల్‌సేల్ దుకాణాల వద్ద క్యూలైన్లు.. క్షణాల్లో స్టాక్ ఖాళీ

ఢిల్లీ/ హైదరాబాద్/ విజయవాడ, నవంబర్ 12: ఉప్పుకు కొరత ఏర్పడిందన్న వదంతులు దేశాన్ని కుదిపేశాయి. ఢిల్లీ, ముంబయి వంటి మహానగరాల్లో ఉప్పు కొని నిల్వ చేసుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు కిలో ఉప్పును వందల్లో అమ్మారు. అయితే దేశంలో ఉప్పుకు ఎలాంటి కొరతా లేదని ఆర్థిక మంత్రి జైట్లీ, ఉప్పు తయారీదారుల సంఘం ఇచ్చిన భరోసాతో సాయంత్రానికి వదంతులు సద్దుమణిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ‘ఉప్పు’ ముప్పుతిప్పలు పెట్టింది. నాణ్యమైన ఉప్పు్ధర రిటైల్ మార్కెట్లో నిన్నటి వరకు కిలో 15 రూపాయలు ఉండగా, శనివారం మధ్యాహ్నానికి 25 రూపాయలకు పెరిగింది. అంటే 40 శాతం పెరిగింది. అలాగే సాధారణ ఉప్పు కిలో 7 రూపాయలు ఉండగా, ఈ ధర వందశాతానికి పెంచి 14 రూపాయలకు విక్రయించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట గంజ్ (రాజధానిలోని ప్రధాన గంజ్‌లలో ఒకటి) లో హర్ష్ ట్రేడింగ్ కంపెనీ (ఉప్పు హోల్‌సేల్ దుకాణం) యజమాని మహేష్ శనివారం సాయంత్రం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, తాను శనివారం ఉదయం నుండి టాటా, ఆశీర్వాద్, ఆంకర్ తదితర బ్రాండ్లకు చెందిన అయోడైజ్డ్ ఉప్పు కిలో 15 రూపాయలు, సాధారణ ఉప్పు కిలో 7 రూపాయలకు విక్రయించానని చెప్పారు. ఎవరికి ఎన్ని కిలోలు కావాలన్నా అందించానని చెప్పారు. తన వద్ద స్టాకు అయిపోయిందని, దాంతో దుకాణం మూసివేశానని వివరించారు. హైదరాబాద్‌లోని పెద్ద గంజ్‌లతో పాటు జడ్చర్ల, మిర్యాలగూడ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం తదితర నగరాల్లో ఉప్పు హోల్‌సేల్ దుకాణాల వద్ద శనివారం పెద్ద క్యూలైన్లు కనిపించాయి. రిటైల్ దుకాణాల్లో ఉప్పు ప్యాకెట్ల విక్రయం విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ పాతనగరంలోని గుల్జార్‌హౌజ్‌లో కిలో ఉప్పు 300 రూపాయలకు విక్రయిస్తున్న మహ్మద్ షరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఉప్పు స్టాకు లేదని, కొరత ఏర్పడిందని మంగళవారం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరగడంతో ‘బ్లాకు’మార్కెట్లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి నెలకు ఒక కిలో ఉప్పు అవసరం అవుతుందని భావించినా, తెలంగాణ రాష్ట్రానికి ప్రతినెలా దాదాపు 10 వేల టన్నుల ఉప్పు అవసరం అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని హోల్‌సేల్ దుకాణదారుల వద్ద దాదాపు 500 టన్నుల వరకు ఉప్పు నిలువలు ఉన్నట్టు తెలిసింది. ఈ లెక్కలను సంబంధిత అధికారులు ధృవీకరించడం లేదు. రాష్ట్రంలో అవసరమైన మేరకు ఉప్పు నిలువలు ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన ద్వారా చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు.
టాటా కంపెనీ ఉప్పు మహారాష్ట్ర నుండి, ఆశీర్వాద్ ఉప్పు బెంగుళూరు నుండి, అంకుర్ ఉప్పు గుజరాత్ నుండి, సాధారణ ఉప్పు తమిళనాడు నుండి వస్తోంది.

ఎపిలోనూ ప్రకంపనలు

విజయవాడ గుంటూరు, చిలకలూరిపేట, బాపట్ల, తెనాలి, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు, కావలి వంటి పట్టణాల్లో శనివారం ఉదయం నుంచే ప్రజలు ఉప్పు కోసం బారులుతీరి కనిపించారు. 10 నుంచి 18 రూపాయల వరకూ ఉన్న ఉప్పు ప్యాకెట్ ధర ప్రాంతాలను బట్టి 100 నుంచి 250 వరకూ అమ్మడంతో జనం బేజారయ్యారు. ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా జనం ఉప్పు కోసం ఎగబడుతుండటంతో అటు రిటైల్, హోల్‌సేలర్లు కూడా ఆలోచనలో పడ్డారు. తర్వాత న్యూస్ చానెళ్లలో బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రేపటి నుంచి ఉప్పు ధర 500 రూపాయలవుతోందంటూ ఏకబిగిన వస్తున్న వార్తల కారణంగానే తమకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు నిర్ధరించుకున్నారు. దానితో ఉప్పు ప్యాకెట్ 100 నుంచి 250 రూపాయల వరకూ అమ్మడంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని కిరాణా షాపులు, రిటైల్-హోల్‌సేల్ షాపుల్లో ఉప్పుప్యాకెట్ల స్టాక్ ఖాళీ అయ్యాయి.
హోల్‌సేల్ వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కల్లు ఉప్పు బస్తా 200 నుంచి 250, 300 రూపాయలకు పెరిగింది. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఉప్పు తయారుచేసే ఉప్పుకొండూరులో కూడా స్టాక్ అయిపోయింది. డిమాండ్‌ను వ్యాపారులు, బ్రోకర్లు బాగా సొమ్ము చేసుకున్నారు. ఉప్పు తయారయ్యే కల్లూరు, నెల్లూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
‘ఇది మేం కావాలని పెంచిన ధర కాదు. జనాలే వచ్చి ఎగబడుతుంటే అసలు విషయమేమిటో మేం తర్వాత తెలుసుకున్నాం. వాళ్లకు అవసరం. మాకు డబ్బులు ముఖ్యం కదా? ఇందులో మా తప్పేమీలేదు’ అని విజయవాడకు చెందిన ఒక రిటైల్ వ్యాపారి వ్యాఖ్యానించారు. నిన్నంతా కష్టపడి బ్యాంకుల్లో రెండువేలు తీసుకుంటే అందులో నాలుగు ఉప్పు ప్యాకెట్లకే 500 అయిపోయాయ’ని ఒక మహిళ తన ఆవేదనను వెల్లడించారు.

ధర పెరగలేదు: సాల్ట్ అసోసియేషన్

ఉప్పు్ధర పెరగలేదు. ఇప్పట్లో పెరిగే అవకాశాలూ లేవు. పాత పంటనే ఇంకా ఉంది. త్వరలో కొత్త పంట కూడా రాబోతుంది. మరి జనం ఎందుకు హడావిడి పడుతున్నారో మాకూ ఆశ్చర్యంగానే ఉందని సాల్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చేబ్రోలు సత్యనారాయణ ఆంధ్రభూమికి చెప్పారు. మరోవైపు ఉప్పు్ధర పెరగలేదని పౌరసరఫరాల శాఖ కూడా ప్రకటించింది. విజిలెన్స్‌కూ షాపులపై నిఘాకు ఆదేశించామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

ఢిల్లీలో పోలీసులపై రాళ్లు

ఉప్పు ధరలు అమాంతంగా పెరిగాయంటూ ఉత్తరప్రదేశ్ నుండి సమాచారం వచ్చిందని ముంబాయి పోలీసులు తెలిపారు. ఢిల్లీ జామియానగర్ ప్రాంతంలో ఉప్పుకోసం ఆందోళన చెలరేగడంలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు వాహనాలపై వచ్చిన పోలీసుపై ప్రజలు రాళ్లురువ్వారు. ఈ సంఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఉప్పు్ధరలు పెరగలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దంటూ ప్రజలకు పోలీసలు వివరించి, శాంతింపచేశారు.
ఉప్పు కొరతపై ఢిల్లీలో ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ కొందరు పనిగట్టుకుని రకరకాల వదంతులు సృష్టిస్తున్నారనీ, ఉప్పు కొరత అలాంటిదేననీ వ్యాఖ్యానించారు. దేశంలో ఉప్పుకు కొరత లేదన్నారు. కాగా భారత ఉప్పుతయారీదారుల సంఘం కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. దేశంలో కావలసినన్ని ఉప్పు నిల్వలు ఉన్నాయని సంఘం అధ్యక్షుడు భారత్ రావల్ వెల్లడించారు.

చిత్రం.... మీరట్‌లో శనివారం ఉప్పు ప్యాకెట్లను కొనుక్కుపోతున్న ఓ వినియోగదారుడు