సంజీవని

సైనసైటిస్ సులభ నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: సైనసైటిస్ చాలా నెలలుగా బాధిస్తోంది. ఎన్ని మందులు వాడినా తగ్గటంలేదు. నివారణ సూచించగలరు.
-జి.దివాకరబాబు, సికింద్రాబాద్
జ: ముక్కుతో మనం పీల్చుకున్న గాలి బుగ్గలమీంచి గొంతులోకి, అక్కడినుండి ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. ముక్కు నుండి గొంతు దాకా గాలి మలుపులు తిరిగిన గొట్టాలలోంచి ప్రసరిస్తుంది. ఈ దారుల్నే సైనసులంటారు. ఈ దారిలో జలుబు చేరి, సూక్ష్మజీవుల ప్రభావంవలన ఆ లోపలి భాగం అంతా పుండు పట్టినౌతుంది. దీన్ని సైనసైటిస్ అంటారు. జలుబువలన కలిగిన అపకారం కాబట్టి రైనో సైనసైటిస్ అని కూడా పిలుస్తారు. అందుకు వైరస్, బాక్టీరియా, ఫంగస్‌లాంటి సూక్ష్మజీవులు ఏవైనా కారణం కావచ్చు.
సైనసైటిస్ 4 వారాల నుండి 12 వారాలకు పైబడి నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా వైరస్ కారణంగానే సైనసైటిస్ వస్తుంటుంది. జలుబుని అదుపు చేయగలిగితే యాంటీ బయాటిక్స్ అవసరం లేకుండానే ఈ సైనసైటిస్ తగ్గిపోతుంటుంది. చాలామంది నాకు సైనస్ ఉన్నదండీ అంటుంటారు. సైనసులు అందరికీ ఉంటాయి. వాటిలో సూక్ష్మజీవుల చేరికవలన బుగ్గల దగ్గర వాపు, నొప్పి, తలనొప్పి, గాలి పీల్చుకోలేకపోవటం లాంటి బాధలు కలుగుతాయి. సూక్ష్మజీవుల దాడి బలంగా వున్నపుడు చీము ఏర్పడుతుంది. అలాంటప్పుడు యాంటీ బయాటిక్స్ తప్పనిసరి అవుతుంది. పడిశెంగానీ, కళ్ళెగానీ గట్టిగా పచ్చగా ఉన్నదంటే దానిలో తెల్ల రక్తకణాలు ఉన్నాయని అర్థం. శరీరానికీ, సూక్ష్మజీవులకూ మధ్య జరిగే యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లు ఈ తెల్లరక్తకణాలు. ఇదిముందరి అనేక ఇతర సమస్యలకు దారితీయకమునుపే జలుబును, చీమును అదుపు చేయటం అవసరం అవుతుంది.
జ్వరం, ముఖ కండరాల నొప్పులు, బుగ్గలమీద నొక్కితే తీవ్రమైన పోటు, వాసన తెలియకపోవటం, చెవుల్లో దిబ్బడ, దగ్గు, ఆయాసం, ముక్కులోంచి ఒక విధమైన దుర్వాసనగా అనిపించటం, వాంతి వికారం లాంటి బాధలు తోడౌతాయి.
వైరస్‌వలన వచ్చే సైనసైటిస్ జలుబు ఎక్కువగా ఉంటుంది. ముక్కు కారిపోతూ ఉంటుంది. గొంతు మంట, గొంతులో గరగర ఎక్కువగా ఉంటాయి. ఓ వారం రోజులపాటు ఈ బాధలు ఉండవచ్చు.
బాక్టీరియాలవలన వచ్చే సైనసైటిస్‌లో పడిశెం, కళ్ళె చిక్కగా ఉంటాయి. 10-15 రోజులపాటు ఈ బాధలుంటాయి. ఇది ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడని వ్యాధి. అది తలలో చీము గడ్డలు, మెదడు వాపు లాంటి కొత్త సమస్యలకు దారితీయవచ్చు.
ఎలర్జీలవలన కలిగే జలుబు సైనసైటిస్ వ్యాధికి కారణం అయినపుడు ముక్కు దిబ్బడ అధికంగా ఉంటుంది. జలుబు భారం తీవ్రంగా ఉంటుంది. తుమ్ములు కూడా తోడౌతాయి. ముక్కులు, కళ్ళు, చెవులు దురద బెడుతుంటాయి. ముక్కు ధారాపాతంగా కారుతూ ఉంటుంది. ఎలర్జీలవలన కలిగే సైనసైటిస్ నెలల తరబడి బాధపెట్టవచ్చు కూడా! అర్థరాత్రి, తెల్లవారు ఝామున దగ్గు తీవ్ర ఇబ్బంది పెట్టవచ్చుకూడా!
ఇలా బాక్టీరియా దోషం ఉన్నపుడు మాత్రమే యాంటీ బయాటిక్స్ అవసరం అవుతుంటాయి. జలుబు వచ్చిన మొదటిరోజే జాగ్రత్తపడితే సైనసైటిస్ రాకుండా ఉంటుంది. అది దీర్ఘవ్యాధిగా మారకుండా ఉంటుంది. ఇక్కడ చర్చనీయాంశం జలుబు తగ్గటానికి ఏ మందులు వాడాలన్నది కాదు. దాని కారణాలను నివారించటంలో రోగి పాత్ర ముఖ్యమైన అంశం. జలుబును పెంచే ఆహార విహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచినీళ్ళు, పెరుగు, మజ్జిగ లాంటివి అతి చల్లగా తీసుకోవటం ఆపాలి. పులుపు పదార్థాలు మానాలి. నూనె పదార్థాలు, ముదిరిన కొబ్బరి, ఊరుగాయ పచ్చళ్ళు, పులిసిన పదార్థాలు జలుబును పెంచుతాయి. కష్టంగా అరిగే పదార్థాలన్నీ జలుబును పెంచేవే! తేలికగా అరిగే ఆహార పదార్థాలు తీసుకోవాలి!
దీర్ఘ వ్యాధిగా మారిన సైనసైటిస్ విషయంలో ఆయుర్వేద ఔషధాల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. రసేంద్రవటి, విజయభైరవి, లక్ష్మీ విలాస రసం, తాళీసాది చూర్ణం, సితోపలాది చూర్ణం లాంటి ఆయుర్వేద ఔషధాలు మంచి ఫలితాలనిస్తాయి.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com