సంజీవని

అజీర్తిని ఎదుర్కోండి ఇలా..! (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రసన్నలక్ష్మి.కె, చీరాల
ప్ర: ఆకలి పూర్తిగా తగ్గిపోయింది. కొద్దిగా తింటే చాలు కడుపు నిండిపోతోంది. గ్యాసు ఇబ్బంది పెడుతోంది. ఉపాయం చెప్తారా సార్?
జ: జీర్ణశక్తి జఠరాగ్నివలన కలుగుతుంది. జఠరాగ్ని మందగించటాన్ని అగ్నిమాద్యం (డిస్పెప్సియా) అంటారు. ఇది అకస్మాత్తుగా రావచ్చు. దీర్ఘకాలికంగానూ బాధించవచ్చు.
జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతినటంవలన డిస్పెప్సియా వస్తుంది. ఏమీ తినకుండానే కుత్తికబంటిగా తిన్నట్టు, మీది పొట్ట నిండిపోయినట్టు అనిపించటం దీనిలో కనిపించే ముఖ్య లక్షణం. గుండెలో మంట, వాంతి, వికారం, త్రేన్పులు, మీదిపొట్టలో నొప్పి లాంటి బాధలు తరచూ తిరగబెడుతుంటాయి.
తరచూ ఈ లక్షణాలు కనిపిస్తున్నపుడు ఇదేదో అజీర్తిలెమ్మని అశ్రద్ధ చేసే వ్యాధి కాదు. రాబోయే పేగుపూతకూ, గ్యాస్ట్రైటిస్‌కూ ఇంకా ఇతర జీర్ణకోశ వ్యాధులకు ఇది పూర్వరూపం అని గుర్తించాలి. పూర్వరూపం అంటే మొదటి లక్షణాలు.
పేగు పూత ఏర్పడని స్థితి, పేగు పూతతో కూడుకున్న స్థితి అని డిస్పెప్సియా రెండు రకాలుగా వస్తుంది. సాధారణ స్థితిలో ఉన్నపుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది అల్సర్లదాకానూ, ఆపరేషను దాకానూ పోకుండా ఉంటుంది.
అగ్నిమాంద్యం వలన అన్నం జీర్ణం కాకపోయినా, పులిసిపోయినా, కడుపులో యాసిడ్లు పెరిగిపోతాయి. అన్నం అధికంగా తినడంవలన మాత్రమే ఈ అగ్నిమాంద్యం ఏర్పడాలని లేదు. అతిగా ఉపవాసాలు చేసినా అగ్నిమాంద్యం ఏర్పడుతుంది.
ఉడికీ ఉడకని వడ్డనలన్నీ అజీర్తిని తెచ్చేవే! వేళాపాళా లేని ఆహార అలవాట్లు కూడా అగ్నిని చల్లార్చేస్తాయి. విందు భోజనాలు, హోటల్ భోజనాలు మితిమీరితే అగ్ని చల్లారిపోతుంది.
స్వీట్లు, హాట్లు, బిరియానీలు, పులిహోరలు రోజువారీ భోజనాల్లో ఉంటే అగ్ని చల్లారేది ఖాయం. వాటిని అరిగించుకోగల జీర్ణశక్తి లేకపోతే అవి అపకారం చేసేవే! చాలా ఆహార పదార్థాలు సరిపడకపోతే, తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, దురదలు, దద్దుర్లు, వాంతులు, విరేచనాలు- ఇలాంటివి కలగటానికి జీర్ణశక్తి తక్కువగా ఉండటమే కారణం. ఒక హోటలుకు నలుగురు మిత్రులు వెళ్లి ఒక కుండలో బిరియానీ తెప్పించుకుని తింటే ఆ నలుగురిలో అగ్ని బలాన్ని అనుసరించి లక్షణాలు కనిపిస్తాయి. అగ్నిబలం బాగా ఉన్నవాడు తక్కిన ముగ్గుర్నీ ఆస్పత్రికి తీసుకవెడతాడు. ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. అగ్నిబలం బాగా ఉన్నపుడు కఠిన ఆహార పదార్థాలు తిన్నా పేగులు తట్టుకోగలుగుతాయి. జఠరాగ్ని మందగిస్తే మంచినీళ్లు కూడా సరిపడకుండా పోతాయి.
కల్తీలమయంగా ఉన్నా ఈనాటి పంపిణీ వ్యవస్థలో నెయ్యి, నూనెల మంచి గురించి మాట్లాడలేకపోతున్నాం. పూర్తిగా నెయ్యి, నూనెలు లేని ఆహారాన్ని రూక్ష ఆహారం అంటారు. రూక్ష పదార్థాలు అనేక వాత వ్యాధులకు కారణం అవుతాయి. జీర్ణశక్తిని చంపుతాయి. అందుకని పరిమితంగా నెయ్యి వాడుకోవటంలో తప్పులేదు. స్వంతంగా ఇంట్లో కాచుకున్న నెయ్యి అయితే పరిమితంగా వాడుకుంటే అగ్నిబలం పెరుగుతుంది. నెయ్యిని పోసుకోకుండా కొద్ది చుక్కలు వేసుకుని తినటం మంచిది.
తరచూ జ్వరాలు, కీళ్లవాతం, ఇతర దీర్ఘవ్యాధులతో బాధపడేవారు అనేక మందులు వాడాల్సి వచ్చినపుడు ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోకపోతే అది ఎసిడిటీ పెరగటానికి కారణం అవుతుంది.
అజీర్తిగా ఉన్నపుడు తేలికపాటి ఆహారం తీసుకుంటే సమస్య తేలికగా పరిష్కారకం అవుతుంది. తరచూ విరేచనాలకు వేసుకుంటే మంచిది. శొంఠిని నేతి చుక్కలు వేసి బాగా వేయించి మెత్తగా దంచి బెల్లం వేసి నూరి చిన్న ఉండలు కట్టుకుని ఓ సీసాలో భద్రపరచుకోండి. అగ్నిమాంద్యం అనిపించినపుడు ఈ ఉండలు నమిలినా లేదా నేరుగా మింగినా జఠరాగ్ని జ్వలిస్తుంది.
ధనియాలు, జీలకర్ర, శొంఠి సమభాగాలుగా తీసుకోండి. వీటిని విడివిడిగా వేయించి మెత్తగా దంచిన పొడిని తగినంత ఉప్పు కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ పొడిని అన్నంలో కారప్పొడిగా వాడుకోవచ్చు. గ్లాసు మజ్జిగలో ఒక చెంచా పొడిని కలుపుకుని తాగితే వెంటనే కడుపులో ఏర్పడ్డ అజీర్తి బాధలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.
కడుపులో వాతం ఎక్కువగా చేరినప్పుడు శబ్దాలు చేస్తూ అపానవాయువులు వెళ్తున్నవారు ఈ పొడిని తప్పనిసరిగా వాడుకోవటం మంచిది.
ఇడ్లీ అట్టు, పూరీ, ఉప్మా, బజ్జీ, పునుగు ఇలాంటి టిఫిన్లన్నీ జఠరాగ్నిని దెబ్బతీసేవే! అగ్నిబలం తక్కువగా ఉన్నవారు ఉదయం పూట కొద్దిగా మజ్జిగ అన్నం తినటం వలన పేగులు సురక్షితంగా ఉంటాయి.
హింగ్వాష్టక చూర్ణం, శంఖవటి, అష్టాంగ లవణం లాంటి అనేక ఆయుర్వేద మందులు అజీర్తిని తగ్గించేవి అనేకం ఉన్నాయి. ఆహారం విషయంలో క్రమశిక్షణ ఉంటే అజీర్తి దరికి రాదని గమనించాలి.
మూత్రపిండాల్లో రాళ్లు
ప్ర: మూత్రపిండాల్లో రాళ్లున్నాయి. ఈ రాళ్ళవలన కడుపునొప్పి బాగా వస్తోంది?
-జాన్సర్ చెరుకూరి, సికిందరాబాద్
జ: మూత్రపిండాలకు సంబంధించిన అనేక వ్యాధుల్లో కడుపులో నొప్పి రావచ్చు. ఒకటీ లేదా అనేక రాళ్ళున్నప్పుడు అవి కదిలి బయటకు కొట్టుకురావటానికి చేసే ప్రయత్నంవలన కడుపులో నొప్పి రావచ్చు. వెనకవైపు డొక్కల్లో నొప్పి మొదలై అది మెలిక తిరిగి ఎదురు గజ్జల్లోకి పాకుతూ వస్తుంది. మూత్రం మంటగా వెళ్తుంది. వాంతులు, జ్వరం కూడా వస్తాయి. తట్టుకోలేనంతగా కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయే అవకాశం వుంది. శరీరంలో వేడి పెరిగినపుడు మూత్రపిండాల్లో కలిగే సంచలనం వలన ఈ నొప్పి ఏర్పడే పరిస్థితులు వస్తాయి. వేడి ఎక్కువగా ఉండటమే రాళ్ళు ఏర్పడటానికి ముఖ్య కారణం. తరచూ మూత్రంలో మంట ఏర్పడుతోంటే రాళ్ళు ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయని అర్థం.
మూత్రపిండాల్లో రాళ్ళు, తదితర వ్యాధులు ఉన్నవాళ్ళు బాగా చలవచేసే ఆహార పదార్థాలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. మామూలు నీళ్లకన్నా పలుచని మజ్జిగ తాగితే ఫలితం కనిపిస్తుంది. ఉలవలను ఉడికించిన నీటిని రోజూ తాగుతుంటే మేలు కలుగుతుంది.
పల్లేరుకాయలు కిరాణా కొట్లలో కూడా దొరుకుతాయి. వీటిని పైపైన దంచిన పొడిని ఒక పెద్ద గ్లాసులో ఒక చెంచా మోతాదులో వేసి మరిగించి వడకట్టిన నీటిని రోజూ తాగుతూ ఉంటే రాళ్ళు ఏర్పడే పరిస్థితి తగ్గుతుంది. గోక్షురాది చూర్ణం పేరుతో ఆయుర్వేద మందుల షాపుల్లో దొరికే ఔషధాన్ని ఒక చెంచాపొడి చొప్పున మజ్జికలో కలుపుకుని రెండు పూటలా తాగవచ్చు. చంద్ర ప్రభావటి అనే ఔషధం ఈ వ్యాధిలో బాగా పనిచేస్తుంది. వైద్యుని సలహామీద వాడండి.
రాళ్ళు పెద్దవిగా వుంటే శస్తచ్రికిత్స ద్వారా తీయించుకోవటమే మంచిది. ఒకసారి రాయి ఏర్పడిన పరిస్థితులు పదే పదే రాళ్లను ఏర్పరుస్తాయి. కాబట్టి, పైన చెప్పిన జాగ్రత్తలు కొనసాగించటం అవసరం.

**
డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, ఔఖూశ్ఘష్ద్ఘశజూపభఘౄజ.ష్యౄ