శిప్ర వాక్యం

అవస్థల్లో ‘అపర చాణక్యుడు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజన’ హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. వివిధ రూపాల్లో ఆయన తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు ఇటీవల విజయవాడలో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. తాజాగా తిరుపతిలో ‘్ధర్మపోరాటం’ పేరిట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా తిరుపతిలో మోదీ మాట్లాడుతూ, ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. తిరుపతిలో మోదీ ప్రసంగించిన చోటే ఇపుడు తెదేపా ‘్ధర్మపోరాటం’ సభను నిర్వహించి వాస్తవ పరిస్థితులను జనం ముందు ఉంచింది. తిరుపతి సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టారు. తనది ‘్ధర్మపోరాటం’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, విశాఖ రైల్వేజోన్, పెట్రోకెమికల్ కారిడార్, జాతీయస్థాయి విద్యాసంస్థలు, దుగరాజపట్నం పోర్టు, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ, విజయవాడలకు మెట్రోరైల్, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, శాసనసభ సీట్లను పెంచడం వంటి పలు డిమాండ్లను తీర్చాలని కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి పెంచుతున్నారు. ఈ డిమాండ్లల్లో కొన్ని విభజన చట్టంలో లేవు. మరికొన్ని హామీలపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైంది. ‘ప్యాకేజీ’ ద్వారా గత నాలుగేళ్లలో కొన్ని సౌకర్యాలు పొంది, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ‘ప్రత్యేక హోదా’ కోసం చంద్రబాబు గళం విప్పడం చాలామందికి విస్మయం కలిగించింది. ‘హోదా సంజీవిని కాదు’ అన్న ఆయన ఇపుడు- అదే హోదా కోసం మోదీపై సమరభేరి మోగించడం వెనుక రాజకీయ కారణాలున్నాయన్నది సుస్పష్టం. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందన్నది కాదనలేని వాస్తవం. ఇలా జరగడానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా ఇతర పార్టీల నాయకులూ కారకులే. అన్ని పార్టీల నేతలూ కలసి ఏపీకి అన్యాయం చేశారు. తమ నిర్వాకాన్ని మరచిపోయి నేతలంతా ‘ఏపీకి అన్యాయం జరిగింద’ని గోలపెడుతున్నారు. రాష్ట్ర విభజన కోసం తెలంగాణ ప్రజల్లో తెరాస భావోద్రేకాలను రెచ్చగొట్టినట్లే ఇపుడు ఏపీలో చంద్రబాబు ‘ప్రత్యేక హోదా ఆంధ్రు ల హక్కు’ అనే నినాదాన్ని జనంలోకి తీసుకుపోయారు. ప్రజల్లో ‘మైలేజీ’ కోసం ఆయన కేంద్రంపై యుద్ధం ప్ర కటించారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు నష్టం కలిగించే ధోరణి అని వేరే చెప్పనక్కరలేదు. గుజరాత్‌లో రూ. 2500 కోట్లతో సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తున్న మోదీ సర్కారు- ‘ఏపీకి ప్రత్యేక హోదా’ను ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు నిలదీస్తున్నారు. అయితే, విగ్రహాల విషయంలో ఎవరికి తోచిన రాజకీయాలు వారు ఆడుతున్నారు. అమరావతిలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఆ డబ్బుతో దళితులకు ఉపాధి కల్పించినట్టయితే అంబేద్కర్‌కు ఘనంగా నివాళి అర్పించినట్టవుతుంది. యూపీ సీఎంగా ఉన్నపుడు మాయావతి కూడా విగ్రహాల ఏర్పాటుకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. భారీ విగ్రహాలు పేదల సమస్యలను తీరుస్తాయా? ఇదంతా వోట్ల రాజకీయం కాక ఇంకేమిటి?
కాగా, చంద్రబాబు ఇపుడు త్రిముఖ పోటీని ఎదుర్కొంటున్నారు. వైకాపా, జనసేన, భాజపాల నుంచి ఆయన సవాళ్లను ఎదుర్కొనక తప్పడం లేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను, భాజపాను వివాదాల్లోకి లాగేందుకు చంద్రబాబు వ్యూహాత్మక పథకాలను అమలు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ పరిణామాలు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు మహానందం కలిగించే విషయం. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు ఏపీకి అన్యాయం చేయడంలో అన్ని పార్టీలూ భాగస్వామ్యం వహించాయి. అయితే, అన్నింటికీ మోదీ ప్రభుత్వాన్ని దోషిగా చూపటం తగదు.
చంద్రబాబు పరిపాలనాదక్షుడే. నేర్పుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపినవాడే. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని ఏడు ముంపు గ్రామాలను ఏపీలో చేర్పించిన ఘనత ఆయనదే. సుమారు 35 వేల ఎకరాల పంట భూములను రాజధాని కోసం రైతుల నుంచి సేకరించడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు. పలు జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏపీకి మంజూరు కావడానికి ఆయన చేసిన కృషి అభినందించదగ్గదే. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో హైదరాబాద్‌లో ఐటీ రంగం కేంద్రీకృతం కావడంలో చంద్రబాబు పాత్ర ను విస్మరించలేం. ఇంతటి ఘనుడైనప్పటికీ తన కుమారుడికి మంత్రి పదవి కట్టబెట్టడం, తన సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం వంటి అంశాలు ఆయన ప్రతిష్ఠను తగ్గించాయన్న విమర్శలూ ఉన్నాయి.
కృష్ణా గోదావరి నదీ జలాల అనుసంధానంలో చంద్రబాబు కృషి అసాధారణమైనది. కృష్ణమ్మ వారధి వంటి నిర్మాణాలన్నీ ఈయన పరిపాలనా కాలంలోనే జరిగాయి. కాపు రిజర్వేషన్ ఉద్యమం రగిలించిన వేడిని ఆయన తట్టుకోగలిగాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వైభవం కోల్పోయినా ఆయన భయపడలేదు. అయితే, ‘అపర చాణక్యుడు’గా పేరొందిన చంద్రబాబు ఇటీవలి కాలంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? హిందువు కాదని ఆరోపణలున్న ఎమ్మెల్యే అనితను టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఆయన ఎందుకు నియమించారు? సామ దాన భేద దండోపాయాల్లో ఇక- దండోపాయం ప్రయోగిస్తామని చంద్రబాబు అనటం సమంజసమేనా? అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మోదీపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యక్తిగత ఆరోపణల వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందా? ‘ప్రత్యేక హోదా’ పోరాటంలో వైఎస్ జగన్ కన్నా ముందుండాలన్న ఆరాటం చంద్రబాబులో కనిపిస్తోంది. మరోవైపు తెదేపా, భాజపాల మధ్య వివాదం రాజుకోవడం వైకాపాకు సహజంగానే ఆనందం కలిగిస్తోంది. టీటీడీ పాలకమండలి నియామకంలో రాజకీయ కోణానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం కూడా వివాదాస్పద మవుతోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రత్యేక హోదా కోసం మోదీపై యుద్ధాన్ని చంద్రబాబు ఇంకెంత కాలం కొనసాగిస్తారు? ఎన్నికల సమయం వరకూ ఈ వేడి ఉంటుందా? రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, సమీకరణలు ఏ రూపు దాలుస్తాయి? కేంద్రంపై పోరాడుతున్న చంద్రబాబు ఏపీకి నిధులు రాబట్టుకోవడంలో విజయం సాధిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొంత కాలం నిరీక్షించాల్సిందే!

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668