శ్రీకాకుళం

ప్రతి నియోజకవర్గానికి 1350 ఇళ్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 11: రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 1350 ఇళ్లు బలహీనవర్గాలకు మంజూరైనట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖామంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం బెండికొండ వద్ద హుదూద్ తుపాన్‌లో నష్టపోయిన బాధిత కుటుంబాలకు రూ.7కోట్ల 46 లక్షలతో నిర్మించనున్న 192 ఇళ్లకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలకు పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యమన్నారు. హుదూద్ నష్టం కింద 10 వేలు ఇళ్లు మంజూరు కాగా జిల్లాకు 2500 ఇళ్లు వచ్చాయన్నారు. ఈ విపత్తులో నష్టపోయిన ప్రతి లబ్ధిదారునికి పక్కా ఇల్లు నిర్మించి అందివ్వడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా గృహనిర్మాణంలో కొంత వెనుకబాటు జరిగిందని మంత్రి అంగీకరించారు. ఇకనుంచి గృహనిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. కష్టకాలంలో అండగా ఉన్న మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన గురుతర బాధ్యత తమపై ఉందన్నారు. ఎంపి కె.రామ్మెహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షురాలు జి.శిరీష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి.విఠల్, హౌసింగ్ పిడి నరసింహాం, పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, ఎంపిపి వసంతస్వామి, జడ్‌పిటిసి నీలవేణి, మండల టిడిపి అధ్యక్షుడు శశిభూషణ్, ఎ ఎంసి చైర్మన్ శ్రీనివాసరావుపాల్గొన్నారు.
పోలీసుల ‘పనితీరు’పై ఇంటెలిజెన్స్ ఆరా!

శ్రీకాకుళం: చట్టం ముందు అందరూ సమానులే.. అందుకే లక్షలాది రూపాయల ‘షో’ కేసులో వార్తలకెక్కిన శ్రీకాకుళంలో కొంతమంది ప్రముఖ వైద్యుల తీరుపై వెలువడిన కథనాలు కావాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇక్కడి ఇంటెలిజెన్స్ అధికారులకు శనివారం హుకుం జారీ అయింది. దీంతో స్థానిక పోలీసుల తీరుపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు దృష్టిసారించారన్న విషయం అర్థమవుతుంది. సాధారణంగా అనుమానితులను, నిందితులను, ‘లోపల’ వేయడంలో ఇక్కడ పోలీసులు సిద్ధహస్తులు! తమ కన్నుపడిన మనిషి ఎంత అల్పజీవి అయితే వారికి అంత అలుసన్న విమర్శ లేకపోలేదు. ఫలానావాడు జేబుదొంగ అనో, యజమాని ఇంట్లో డబ్బులు కాజేశాడనో, ఎవరిదో సైకిలు ఎత్తుకుపోయాడనో ఫిర్యాదు అందిందే తడవుగా నిందితుడు ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి ‘లాకప్ మర్యాదలు’ చేయడంలో వీరిది మహాస్పీడు. అంతటి కార్యశూరులు ‘పేకాట’ శ్రీమంతులను మాత్రం కనుగొనలేక, జాడతెలియకుండా పక్కోడి పేర్లు నమోదు చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంగతి రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు ఎలా చేరిందో జిల్లా పోలీసుశాఖ ‘తీరు’పై రెండు రోజులుగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు మొదలెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నివేదికలు సేకరించడం, జిల్లాఅంతటా నేరాలు, ఘోరాలపై కేసులు నమోదులు, సెటిల్‌మెంట్‌లకు సంబంధించిన వివరాలన్నీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సేకరించి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేర్చినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం రాబట్టడం వెనుక ‘చినబాబు’ చేతిపనే ఎక్కువన్నది టిడిపి మంత్రులు, నేతల ద్వారా తెలిసిన సమాచారం.
ఇదిలావుండగా, కొంతమంది పోలీసులు నేతల అండదండలతో ఉన్నామంటూ ప్రచారం ముమ్మరం చేసుకుంటూ స్టేషన్ హౌస్‌ల్లో సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న విమర్శ రావడంతో ఎస్పీ కొంత మంది స్టేషన్ హౌస్ అధికారులను దండించడం, ప్రోత్సహిస్తున్న రాజకీయనేతలను అవినీతి ‘పోలీసు’లను ప్రోత్సహిస్తే లా అండ్ ఆర్డర్ చేయడం కష్టమంటూ పదేసార్లు ఎమ్మెల్యేలు, మంత్రుల కలెక్టర్ సమక్షంలో పేర్కొనడం వంటి పరిణామాల నడుమ జిల్లా పోలీసుశాఖ అవినీతి జలగలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టడం ఆ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్, 22న ఒక స్టార్ హోటల్లో ప్రముఖ డాక్టర్లు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల డైరెక్టర్లు, విద్యావేత్తలంతా పేకాటాడుతూ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వారి స్థానంలో బినామీలను పెట్టి వారి గౌరవాన్ని, పరువుప్రతిష్ఠలను పోలీసులు చాకచక్యంగా రక్షించారన్న ఆరోపణలపై తాజాగా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌శాఖ ఆరా తీస్తోంది. కాకి బంగారం, దొంగనోట్ల చలామణీ చేసే ‘నకిలీ’ముఠాను సెప్టెంబరు 28న పట్టుకున్న పోలీసులు మీడియాముందు నిలబెట్టిన కథనం, కేబుల్ టీవీల్లో ప్రసారం చేస్తానంటూ బెదిరింపులు చేసిన ‘నీలిచిత్ర’కారుడు కేసు వివరాలు, సిక్కోల్ శ్రీమంతులు పైడిభీమవరం సమీపంలో రిసార్ట్స్‌లో ప్రతీ వీకెండ్ నిర్వహించే ‘రేవ్’ కేకలపై నివేదికలు, ఏవోబీ - ఇచ్ఛాపురంలో గంజాయి రవాణాకు తెరుచుకున్న ద్వారాల వెనుక గల పోలీసు ‘దొంగ’ల వివరాలు, అలాగే సీతంపేట పోలీసుస్టేషన్ హౌస్ పరిధిలో ‘నాణేల’ముఠా కేసులో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ వివరాలతోపాటు ఆ కేసుకు సంబంధించిన సమాచారం.. ఇలా.. ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన మరుసటి నెల నుంచి జరిగే ప్రతీ క్రైం, రికవరీ వివరాలతో నివేదికలు కావాలంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌శాఖ ఉన్నతాధికారులు జిల్లాశాఖకు ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతోపాటు గత నెల చివరి రోజుల్లో శ్రీకాకుళం-విశాఖపట్నం జాతీయరహదారిపై ఒక కారులో మూడు కోట్ల రూ.ల పాతనోట్లతో ఒక ప్రముఖ వైద్యుడు పోలీసులకు చిక్కినా బయటకుపొక్కకుండా సర్దుబాటు చేశారన్న ఉదంతాలపై కూడా వివరణ కోరినట్టు సమాచారం. ఇలా నివేదికలు సుస్పష్టంగా ఇవ్వాలంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు కోరడం వెనుక రహస్యం ఏమిటో అని ఆ శాఖ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పలాస, డిసెంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మానసపుత్రిక డ్వాక్రా సంఘాలు అని, మహిళలంతా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే సి ఎం ఆకాంక్ష అని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. పలాస జూనియర్‌కాలేజి క్రీడామైదానం ఆవరణలో ఆదివారం గ్లో సంస్థ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి చంద్రన్న బీమా పథకాన్ని గ్లో సంస్థ నియోజకవర్గానికి సంబంధించిన మొత్తాన్ని చెక్కురూపంలో మంత్రి, కలెక్టర్‌కు గ్లో సంస్థ కార్యదర్శి వెంకన్నచౌదరి, గౌతు శిరీషాలు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌతు కుటుంబీకులకు ఈ ప్రాంతంలో వున్న ఆదరాభిమానాలకు వారు చలించి ప్రజల రుణాన్ని తీర్చుకునేందుకు చంద్రన్నబీమా పథకం మొత్తాన్ని పార్టీలకు అతీతంగా అందరికి చెల్లించి, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా పలాస నియోజకవర్గంలో జరిగిందన్నారు. సి ఎం చంద్రబాబునాయుడు నిత్యం మహిళల అభివృద్ధి కోసం తపన పడుతుంటారని, రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళలు ఆర్థికంగా పటిష్టత కోసం చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి దేశంలో ఏ పార్టీ చేయని విధంగా మహిళ సంఘాలను ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచారన్నారు. మహిళల ఆర్థిక పురోగతి కోసం శిక్షణ, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీమా సక్రమంగా అమలు కావాలనే ఉద్దేశ్యంతో సి ఎం చంద్రన్న బీమా నిర్వహణ మహిళ సంఘాలకే అప్పగించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మినృసింహం, ఎంపి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే శివాజీలు మాట్లాడుతూ సభకు వచ్చిన మహిళలను చూస్తుంటే సి ఎం సభ ఏమోనని అనిపిస్తుందన్నారు. ఈ ప్రాంతంలోని మహిళలు సి ఎంపై ఎంత మమకారం ఉందో, ఆదరాభిమానాలు తార్కాణాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వరరావు, వెలుగుపిడి రమణమూర్తి, మెప్మా పిడి త్రినాధరావు, పలాస మున్సిపల్ ఛైర్మన్ కోత పూర్ణచంద్రరావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ విఠల్, ఎ ఎంసి ఛైర్మన్ మల్లా శ్రీనివాసరావు, గాలి కృష్ణారావు, కౌన్సిలర్లు, దేశం నాయకులు పాల్గొన్నారు.

‘వర్ద’ తుఫాన్ హెచ్చరికలు
ఎచ్చెర్ల, డిసెంబర్ 11: బంగాళాఖాతంలో ఏర్పడిన వర్ద తుఫాన్ మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై జిల్లాలోని కళింగపట్నం తీరంలో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరికలను చేసింది. అలాగే అధికారులను అప్రమత్తం చేయడం వలన కంట్రోల్ రూమ్‌కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా తీర ప్రాంతాలు మండల తహశీల్దార్లను మరింత అప్రమత్తం చేసింది. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లవద్దని స్థానిక రెవెన్యూ అధికారులు దండోరా వేసి పకడ్భందీగా వేట నిషేదాజ్ఞలు అమలు చేశారు. ఇప్పటికే లోతట్టు గ్రామాలను గుర్తించి ఏ క్షణానైన తుఫాన్ కారణంగా భారీ వర్షాలు సంభవిస్తే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడిప్పుడే ఖరీఫ్‌లో సాగుచేసే వరి పంటను పొలం నుండి కల్లాలకు చేర్చే రైతులు మీడియా హెచ్చరికలపై అప్రమత్తపై ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. నూర్పులు పూర్తి చేసిన రైతులు ధాన్యం తడవకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుప్పలు వేసిన రైతులు వీటిపై తార్పణలు వేసి వర్షం నుంచి రక్షించే పనిలో బిజీగా ఉన్నారు. తీవ్ర పెనుతుఫాన్ ఎటువంటి నష్టాన్ని కల్గిస్తుందన్న భయం అన్నదాతలను మరింత కలవరపెడుతుంది.

హోరాహోరీగా పాలిటెక్నిక్ విద్యార్థుల క్రీడాపోటీలు
ఎచ్చెర్ల, డిసెంబర్ 11: మండలంలోని చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీశివానీ విద్యా సంస్థల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థుల క్రీడాపోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొదటి రోజు ప్రారంభమైన క్రీడా సంబరం ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని వెలికితీసేలా ముందుకు సాగుతుంది. బాలుర వాలీబాల్ పోటీల్లో నారాయణపై వెంకటేశ్వర, సీతంపేటపై ఆమదాలవలస, వైష్ణవిపై టివి ఆర్ కళాశాలలు విజయం సాధించాయి. బాల్‌బ్యాడ్మింటన్‌లో సిస్టమ్‌పై వెంకటేశ్వర, శ్రీకాకుళం మెన్ పాలిటెక్నిక్‌పై ఐతమ్ కళాశాలల జట్లు గెలుపొందాయి. బాలికల ఖోఖలో వైష్ణవిపై ఐతమ్, సీతంపేటపై శివానీ విజయం సాధించాయి. చెస్‌లో శ్రీకాకుళానికి చెందిన అనీల్‌పై సీతంపేటకు చెందిన యశ్వంత్ గెలుపొందారు. రెండవ రోజు బాల్‌బాడ్మింటన్ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు ఐతమ్‌పై విజయం సాధించారు. ఖోఖో బాలికల ఫైనల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ శ్రీకాకుళంపై టెక్కలి గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. టెన్నీకాయిట్ బాలికల విభాగంలో శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఎం.గౌతమి, శివానీ కళాశాల పి.స్వప్నపై విజయం సాధించింది. వాలీబాల్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ శ్రీకాకుళం సిస్టమ్‌పై గెలుపొందింది. వాలీబాల్ బాయ్స్ సెమీఫైనల్స్‌కు టివిఆర్ వెర్సస్‌పై శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ విజయం సాధించింది. వెంకటేశ్వర, సిస్టమ్ జట్లు పోటీ పడగా వెంకటేశ్వర గెలుపొందారు. టెన్నీకాయిట్ ఫైనల్స్‌లో ఫ్రభుత్వ పాలిటెక్నికల్ శ్రీకాకుళం విన్నర్స్‌గా నిలవగా, రన్నర్స్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం నిలిచాయి. ఈ పోటీలకు జిల్లా కో ఆర్డినేటర్‌గా డాక్టర్ తాత కొండలరావు, విశ్రాంత పిడి ఎస్.కె నాయుడు, శివానీ వ్యాయామ అధ్యాపకులు బాలాజీ, సూరన్నాయుడులు పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి.

బ్యాంకులకు వరుస సెలవులతో వినియోగదారుల ఇక్కట్లు
ఎచ్చెర్ల, డిసెంబర్ 11: పెద్దనోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, అభయహస్తం పింఛన్‌దారులు, గీత కార్మికులకు అందజేసే పింఛన్లు బ్యాంకుల ద్వారా అందివ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని వలన పండుటాకులు పడరాని పాట్లు పడుతున్నారు. బ్యాంకు సిబ్బంది పింఛన్‌దారులకు తగిన రీతిలో సేవలందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1న పింఛన్ అందుకోవాల్సిన అనేక మంది లబ్ధిదారులు నేటికీ పింఛన్ సొమ్ము చేతికి రాకపోవడంతో వారంతా ఒకింత ఆందోళనకు గురౌతున్నారు. అధికారులు పింఛన్‌దారుల ఖాతాల్లో మొత్తాన్ని విడతవిడతగా జమచేయడం వలన ఈ విషయం తెలియని అనేక మంది బ్యాంకుకు వెళ్లి నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యం మీదపడినవారు, అంగవైకల్యంతో బాద పడుతున్న వారు పింఛన్ సొమ్ము బ్యాంకు నుండి తీసుకునేందుకు భయపడుతున్నారు. పది రోజులు కావస్తున్న లబ్ధిదారుల సంఖ్యబ్యాంకుల వద్ద తరగకపోవడం సర్వర్లు పనిచేయకపోవడం ఓ కారణమైతే నేటికీ రూ.100, రూ.500నోట్లు బ్యాంకులకు చేరకపోవడంతో పింఛన్ పంపిణీ మరింత జెటిలంగా మారింది. ఇటువంటి కారణాలు లబ్ధిదారులను కలవరపెడుతున్నాయి. ఇంతలో శని, ఆది, సోమవారాలు సెలవులు కావడం వలన పింఛన్ డబ్బులు అందకపోవడం గ్రామాల్లో కూడా నగదులావాదేవీలు ఊపందుకోకపోవడం పరపతి కూడా కరువయ్యే పరిస్థితులు పండుటాకులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిత్యవసర సరుకులు, వైద్య సేవలకు ఈ మొత్తాన్ని పింఛన్ దారులు వినియోగించుకునే వారు. ఈనెల ఆ పరిస్థితి లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అనేక మంది పింఛన్‌దారులను ఇళ్లల్లో విడిచిపెట్టి వారి వారసులు బతుకుతెరువుకోసం దూర ప్రాంతాలకు వలసబాట పట్టారు. ఇటువంటి పండుటాకులు ఇతరుల సాయం కోసం బ్యాంకులకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్ధి పింఛన్‌దారులకు సత్వరంగా పైకము చెల్లింపులు జరపాలని కోరుతున్నారు.
పిఎన్ కాలనీ అభివృద్ధికి సమష్టి కృషి
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 11: నగరంలోని అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో పి ఎన్ కాలనీ ఒకటని వీటిని మరింత అభివృద్ధిచేసేందుకు స్థానికులంతా సమీష్టిగా కృషి చేయాలని విశ్రాంత న్యాయమూర్తి పప్పల జగన్నాధరావు అన్నారు. ఆదివారం సాయం త్రం తన్మయ ప్లాజాలో పి ఎన్ కాలనీ వాసుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన జగన్నాధరావు మాట్లాడుతూ స్థానిక సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు. కాలనీ ఏర్పడి దశాబ్ధాలు గడుస్తున్నా పలు రోడ్లు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదని, డ్రైనేజీ, తాగునీరు విద్యుత్ సదుపాయాలు లేవని ఈ విషయాలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పైడి వేణుగోపాలం మాట్లాడుతూ రిజర్వ్ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని వీటిని తొలగించి కంచె ఏర్పాటు చేసి సామాజిక అవసరాల కోసం వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కాలనీలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. తాజాగా నిర్మిస్తున్న రోడ్లు, డ్రైనేజి వంటి అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాలనీకి అనుబంధంగా ఉన్న ఆవాస్ ప్రాంతాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలన్నారు. ఈసమావేశంలో రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, రామలింగేశ్వరరావు, మాజీ బార్ కౌన్సిల్ అద్యక్షుడు పొన్నాడ వెంకటరమణ, పి.సూర్యనారాయణ, అందవరపు కొండబాబు, ఎం.సుకుమార్, మొదలవలస ధర్మారావు, చిగులిపెల్లి నర్శింగరావు, మొదలవలస చంద్రరావు తదితరులు ఉన్నారు.

ఏనుగుల దాడి
కుటుంబాలను ఆదుకుంటాం
* మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, డిసెంబర్ 11: ఏనుగులు దాడిలో గాయపడి మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర కార్మికశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల పాతపట్నంకు చెందిన ఓ వ్యక్తిని ఏనుగులు దాడిచేసి మృత్యవాతకు గురిచేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం స్పందించి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని చెక్కురూపంలో నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఆత్మస్థైర్యంతో కుటుంబాన్ని ముందుకు నడిపించాలని బాధితుని భార్యను సూచించారు. డి ఎఫ్‌వో శాంతిస్వరూప్, రేంజ్ అధికారి సోమశేఖర్, జడ్పిటీసి కో ఆప్షన్ సభ్యుడు సవర ముఖలింగంలు ఉన్నారు.
ఆదిత్యుని దర్శించుకున్న
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్
శ్రీకాకుళం(కల్చరల్), డిసెంబర్ 11: అరసవల్లి సూర్యనారాయణస్వామి వారిని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణరావు ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ విశిష్టతలు తెలియజేసి స్వామివారి తీర్థప్రసాదాలులు అందజేశారు. ఈవో వి.శ్యామలాదేవి , జిల్లా అధ్యక్షులు గుమ్మా నగేష్, కామేశ్వరరావు, నగేష్‌శర్మ, తదితరులు ఉన్నారు.