శ్రీకాకుళం

సమగ్ర కార్మికచట్టం తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జనవరి 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, సమగ్ర కార్మిక చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. బలవంతపు భూసేకరణ రద్దు చేయాలని, ఆమదాలవలస సుగర్‌ఫ్యాక్టరీని సహకార రంగంలో తెరిపించాలని కోరుతూ గురువారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ప్రధానవక్తగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలను తగ్గించాలని కోరారు. నిరుద్యోగాన్ని నియంత్రించాలని, పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వం హరించివేస్తుందన్నారు. రోజురోజుకీ వ్యవసాయ రంగం సంక్షోభంలో నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ముందు ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గత ఏడాది కేవలం 1.50లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు. అభివృద్ధి పెరుగుతున్న స్థాయిలో ఉద్యోగాలు పెరగడం లేదన్నారు. సెజ్‌లు, కారిడార్‌ల కోసం వేలాది ఎకరాల రైతుల భూములను బలవంతంగా ప్రభుత్వం తీసుకుంటుందని, దానిని వ్యతిరేకించిన ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. రైతులకు రక్షణగా ఉన్న 2013 భూసేకరణ చట్టాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. లక్షలాది ఎకరాల భూములను పరిశ్రమ అధిపతులకు రియల్‌ఎస్టేటర్లకు, పెట్టుబడిదారులకు కారుచౌకగా అప్పజెప్పేందుకు భూ బ్యాంకును ఏర్పాటుచేసి రైతుల నుండి బలవంతపు భూసేకరణ చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలను సవరణ చేస్తూ కార్మికుల హక్కులను కూడా కాలరాస్తున్నారన్నారు. ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసిందని తెలియజేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన సుగర్‌ఫ్యాక్టరీ, జ్యూట్‌మిల్లులను తెరిపించి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. సిటు జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, టి.తిరుపతిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నారాయణరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, తిరుపతిరావు, షన్ముఖరావు, ఆనందరావు, వెలమల రమణ పాల్గొన్నారు.

స్వప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యత
* ధర్మాన కృష్ణదాస్
సారవకోట, జనవరి 19: రాష్ట్ర ప్రజల అవసరాలను, సంక్షేమాన్ని తుంగలో తొక్కి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తన స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని వైకాపా బిసి సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. మండలంలోని ధర్మలక్ష్మీపురం, పాటూరు, దాసుపురం గ్రామాల్లో గురువారం నిర్వహించిన గడపగడపకూ వైకాపాలో ఆయన మాట్లాడారు. తనతోపాటు రాష్టమ్రంత్రి దేవినేనికి లాభం చేకూర్చే విధంగా ప్రాజెక్టుల నిర్మాణంపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈవిషయంలో చంద్రబాబుకు భారీఎత్తున ముడుపులు అందుతున్నాయని కృష్ణదాస్ ఆరోపించారు. గ్రామాలలో నీరు-చెట్టు పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు లాభాలు చేకూర్చే విధంగా పనులు చేస్తున్నారని విమర్శించారు. రాజధాని, విమానాశ్రయాల నిర్మాణాల పేరుతో పేదల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఆయా ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న భూముల జోలికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడం లేదని, ఈ విషయాలను ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపే సత్తా చంద్రబాబుకు లేదని, నీటి సంఘాలకు నామినేటెడ్ కమిటీలను నియమించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నుండి చంద్రబాబు మితిమీరిన తప్పులు చేస్తున్నారని, రాబోవు ఎన్నికలలో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తప్పులు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల భరతం పడతామని ఆయన హెచ్చరించారు. ఈ మూడు గ్రామాలలో పర్యటించిన కృష్ణదాస్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికి తమ సమస్యలను ఏకరవు పెట్టారు. మండలాధ్యక్షుడు చిన్నాల కూర్మినాయుడు, సర్పంచ్ కాళ్ల సింహాచలం, పార్టీ నాయకులు వెంకటసత్యనారాయణ, గెల్లంకి వెంకటరావు, బాడాన కృష్ణారావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
* జిల్లా వైకాపా అధ్యక్షురాలు రెడ్డిశాంతి
సారవకోట, జనవరి 19: రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని సాగనంపడానికి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి స్పష్టంచేశారు. గురువారం పాతపట్నం వెళుతూ ధర్మలక్ష్మీపురంలో విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజావ్యతిరేక పాలనను సహించే స్థితిలో ప్రజలు లేరని ఆమె స్పష్టంచేశారు. ఇప్పటికే వివిధ రకాల పన్నుల విధించిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేసిందని ఆమె ఆరోపించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు చంద్రబాబు మోసపూరిత ప్రకటనలకు బలైపోయారని, ప్రస్తుతం ఎటువంటి రాయితీలు, పథకాలు లభించక అయోమయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఎన్నికలలో దేశం పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని ఆశలు కల్పించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత ఈ హామీలు నెరవేర్చడానికి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేకర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రజలు అందించడానికి వీలుగా రాజన్న రాజ్యం స్థాపనకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆమె కోరారు. పెద్దనోట్ల రద్దు వలన ప్రజలు సంక్రాంతి పండగలను నిరుత్సాహంగా జరుపుకొన్నారని, దీనికి రాష్ట్ర,, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. విలేఖర్ల సమావేశంలో ఎంపిపి కూర్మినాయుడు, పార్టీ నాయకులు బాడాన కృష్ణారావు, వెంకటసత్యనారాయణ పాల్గొన్నారు.

వంశధార కెనాల్ పనులు మరింత వేగవంతం
* జెసి చక్రధరబాబు
ఆమదాలవలస, జనవరి 19: మండలంలోగల వంశధార కెనాల్ పనులు మరింత వేగవంతం చేసేందుకే చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జా యింట్ కలెక్టర్ చక్రధరబాబు తెలిపారు. గురువారం మండలంలోని ఈసర్లపేట సమీపంలో ఉన్న వంశధార కెనాల్ నిర్మాణ పనులను పరిశీలించిన సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ కాలువ తవ్వకాల్లో రైతులకు ప్రభుత్వం అందించే పారితోషికం సకాలంలో అందిస్తామన్నారు. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు రైతులు సహకరించాలన్నారు. ఈ కాలువ డిజైన్‌ను ఆయన పరిశీలించి దీనికి భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో భూసేకరణ అధికారి బి.గోవర్దనరావు, సర్వేయర్లు శంకరరావు, సూర్యారావు, జయకుమారి పాల్గొన్నారు.

సమస్యల సాధనకే అంగన్‌వాడీల ఆందోళన
పొందూరు, జనవరి 19: అఖిలభారత అంగన్‌వాడీ ఉద్యోగుల యూనియన్ పిలుపుమేరకు జిల్లాలో శుక్రవారం ఆందోళన చేపట్టామని సంఘం జిల్లా గౌరవధ్యక్షురాలు జయలక్ష్మీ, జిల్లా కార్యదర్శి ఎన్. హిమప్రభ తెలిపారు. గురువారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఐసిడిఎస్‌కు 2017లో బడ్జెట్‌లో నిధులు పెంచాలని, టీమ్ వర్కర్లందరికీ వర్కర్లుగా పరిగణించాలని, అంగన్‌వాడీ వర్కర్లకు రూ.20వేలు కనీస వేతనం ఇవ్వాలని, హెల్పర్లకు రూ.17వేలు వంతున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వర్కర్‌కు రూ.2లక్షలు, ఆయాకు రూ.1లక్ష రూపాయలు గ్రాడ్యూటీతోపాటు చివరి నెలలో జీతంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలని, వేతనాల బకాయిలు కేంద్రాల అద్దెలు, గ్యాస్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్రీ స్కూల్ మార్పు చేస్తూ ఇచ్చిన మెమోను ఉపసంహించుకోవాలని, డిపోల ద్వారా ఇస్తున్న అంగన్‌వాడీ సరుకులకు రవాణా చార్జీలు ఇవ్వాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో పొందూరు, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేస్తే విమర్శలు ఉండవు
* విప్ రవికుమార్
ఆమదాలవలస, జనవరి 19: గ్రామాల్లో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే ఎటువంటి విమర్శలు ఉండవని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సూచించారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రతీ కుటుంబం ఏదో విధంగా ప్రభుత్వం నుండి లబ్ధిపొందుతోందని, అయినా కొంతమంది ప్రత్యర్థులు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పడం లేదన్నారు. నియోజకవర్గం చరిత్రలో ఏ ఎమ్మెల్యే తేలేనన్ని నిధులు తాను తెస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నానని, ఈ పనులన్నీ ప్రజల కోసమే అని పేర్కొన్నారు. వీటిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలన్నారు. అందరి సమష్ఠి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.

రూ.100కోట్ల స్ర్తినిధి రుణాల లక్ష్యం
* డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్
నరసన్నపేట, జనవరి 19: జిల్లాలో స్ర్తినిధి ద్వారా రూ.100కోట్లు రుణాలను అందించేందుకు ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నామని డిఆర్‌డిఏ పిడి జి.కిషోర్‌కుమార్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక వెలుగు కార్యాలయంలో ఐదు మండలాల సిఎఫ్‌ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించ లేకపోయామని, కేవలం రూ.50కోట్లు మాత్రమే స్ర్తినిధి ద్వారా సంఘాలకు రుణాలు మంజూరు చేశామన్నారు. నాబార్డు నిధుల ద్వారా ప్రతీ మహిళా సంఘ సభ్యులకు పాడి గేదెలను అందించే దిశగా కృషి చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఆయా సభ్యులను గుర్తిస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి అందించే పింఛన్ల విషయంలో జిల్లాలోని ఏ నియోజకవర్గం నుండి పూర్తిసమాచారం జిల్లాకు రాలేదని, దీనివలన పింఛన్లను అందించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కో-ఆర్డినేటర్ రాజ్‌కుమార్, మహిళా సంఘ అధ్యక్షులు పి.కల్పన పాల్గొన్నారు.

రూ.17కోట్లతో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణాలు
* ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, జనవరి 19: నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితెలిపారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ జలుమూరు, పోలాకి, నరసన్నపేటల్లో నాలుగు లింకురోడ్లకు సంబంధించి రోడ్లభవనాల శాఖ ద్వారా రూ.17కోట్లతో రహదారుల నిర్మాణాలను చేపడుతున్నామని, త్వరలోనే ఈపనులను ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే బిసి కార్పొరేషన్ పింఛన్లకు సంబంధించి పారదర్శకంగా అర్హత పొందిన ప్రతీ ఒక్కరికీ అందించే విధంగా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని, ఎక్కడా ఎటువంటి చెడ్డపేరు లేకుండా చూడాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గస్థాయి పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఫుట్‌బాల్ విజేత చిత్తూరు, అనంతపురం
* ముగిసిన అండర్-14 రాష్టస్థ్రాయి పోటీలు
* నేటి నుంచి అండర్-17 పోటీలు ప్రారంభం
బలగ, జనవరి 19: జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంతోపాటు శ్రీకాకుళం రూరల్ మండలం నైర వ్యవసాయ కళాశాల మైదానంలో జరిగిన గ్రూప్-3 అండర్-14 బాలురు, బాలికల రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీల ఫైనల్స్‌ల్లో బాలుర విభాగంలో చిత్తూరు, బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజేతలుగా నిలిచాయి. గురువారం ఉదయం క్వార్టర్ ఫైనల్స్ నుంచి ప్రారంభించిన పోటీల్లో బాలుర మొదటి సెమీఫైనల్స్‌లో చిత్తూరుపై అనంతపురం జట్టు 3-2 స్కోరు తేడాతో, అనంతపురం, కడపపై కర్నూలు జట్టు 3-1 స్కోరు తేడాతో కర్నూలు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మూడోస్థానం కోసం కర్నూలు, అనంతపురం జట్లు తలపడగా 3-0 తేడాతో కర్నూలు విజయం సాధించింది. ఫైనల్స్‌లో చిత్తూరు, కడప జట్లు తలపడగా 2-1 తేడాతో చిత్తూరు జట్టు విజేతగా నిలిచింది. అదేవిధంగా బాలికల విభాగంలో ఫైనల్స్‌లో అనంతపురం, కర్నూలు జట్లు తలపడగా 2-1 తేడాతో అనంతపురం విజేతగా నిలువగా, కర్నూలు జట్టు రెండోస్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం తలపడిన కడప, శ్రీకాకుళం జట్లలో 3-0 తేడాతో కడప జట్టు గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్స్ పోటీల్లో అనంతపురం, శ్రీకాకుళం జట్లు తలపడగా 4-0 తేడాతో అనంతపురం, కర్నూలు, కడప జట్ల మధ్య పోటీలో 2-0 తేడాతో కర్నూలు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
విజేతలకు బహుమతులు అందజేసిన జెసి-2
అండర్-14 రాష్టస్థ్రాయి బాలురు, బాలికల పోటీల్లో విజేతలకు జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపొందిన క్రీడాకారులు మరింత ఉత్తమ ప్రతిభ కనబర్చాలన్నారు. అలాగే ఓటమి పాలైన వారు నిరుత్సాహపడకుండా మరింత తర్ఫీదు తీసుకుని ప్రతిభను చూపాలన్నారు. రాష్టస్థ్రాయి నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులందరూ జాతీయస్థాయిలో కూడా సత్తాచాటాలని ఆకాంక్షించారు. అలాగే అండర్-17 పోటీలకు కూడా అందరూ సహకరించి విజయపథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు, శాప్ డిప్యూటీ డైరక్టర్ అజయ్‌కుమార్, ఫుట్‌బాల్ శిక్షకులు పాల్గొన్నారు. శుక్రవారం నుంచి జరుగుతున్న అండర్-17 బాలబాలికల లీగ్ పోటీలు వేర్వేరు వేదికలపై ప్రారంభవౌతాయి.