శ్రీకాకుళం

‘అణు’వణువు సర్వే!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 17: అణువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి చేయాల్సిన సర్వేకు మత్స్యకారులు అంగీకరించారు. అమరావతి కంటే మెరుగైన ప్యాకేజీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో అణువణువూ సర్వేకు గంగపుత్రులు సహకరిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో రణస్థలం మండలం కొవ్వాడ గ్రామంలో మంగళవారం అణుపార్కు నిర్మాణానికి అడ్డంగా నిలిచిన సర్వేకు మత్స్యకారుల సహకారం కోరేందుకు నిర్వహించిన గ్రామసభలో గంగపుత్రులు అనుకూలంగా స్పందించారు. కొవ్వాడలో రెవెన్యూ అధికారులు నిర్వహించనున్న సామాజిక ప్రభావిత మదింపు సర్వేకు మత్స్యకారులు తమ అంగీకారం తెలిపారు. కొవ్వాడలో కేంద్ర ప్రభుత్వం లక్షకోట్ల రూపాయలతో అణువిద్యుత్ పార్కు ఏర్పాటుకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భూసేకరణ పునరావాసానికి రూ.390కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల రణస్థలం తహశీల్దార్ కార్యాలయంలో అణుపార్కు ప్రభావిత గ్రామాలైన కొవ్వాడ, చిన్నకొవ్వాడ, జీరుకొవ్వాడ, రామచంద్రాపురం, కోటపాలెం, అల్లివలస గ్రామాల నాయకులు, మత్స్యకారులతో రెవెన్యూ, భూసేకరణ, అణువిద్యుత్ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ప్యాకేజీ వివరాలు వెల్లడించి సర్వేకు సహకరించాల్సిందిగా కోరారు. అయితే, అణుపార్కుకి ఎక్కువగా కొవ్వాడకు చెందిన ప్రాంతీయులే ఎక్కువమంది ఉన్నారు కావునా గ్రామంలో గ్రామ సభ నిర్వహించాల్సిందిగా కోరడంతో మంగళవారం గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రామ సభను అడ్డుకుంటామని వామపక్షనాయకులు ముందుగానే హెచ్చరించడంతో పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టి వారిని అడ్డగించారు. పాతర్లపల్లి రోడ్డులో గ్రామసభకు వస్తున్న సిఐటియు నాయకులు సిహెచ్.నర్శింగరావు, భవిరి కృష్ణమూర్తి, తులసీదాసు, గోవిందరావులను అడ్డుకున్నారు. తమ భావాలను గ్రామ సభలో వెల్లడిస్తామని చెప్పడంతో కొంతమందిని పోలీసులు విడిచిపెట్టారు. కొవ్వాడ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో తొలుత శ్రీకాకుళం ఆర్డీవో బి.దయానిధి మాట్లాడుతూ కొత్త భూసేకరణ బిల్లు ప్రకారం సర్వే నిర్వహించాల్సి ఉందని అందుకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. అదే విధంగా కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఏయే విధంగా నష్ట పరిహారం చెల్లించవచ్చో కొవ్వాడ అణువిద్యుత్ భూసేకరణ అధికారి సీతారామారావు వెల్లడించారు. ఈ దశలో సిఐటియు నాయకులు నర్శింగరావు కల్పించుకుంటూ కొవ్వాడలో అణువిద్యుత్ పార్కు ఏర్పాటుకు ఎన్‌పిసిఐఎల్ దరఖాస్తు చేసుకోకుండానే ప్రక్రియ ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీయడంతో గందరగోళం ఏర్పడింది. మత్స్యకారులను మోసగిస్తూ అణువిద్యుత్ పార్కు నిర్మాణానికి ప్రయత్నించవద్దని ఆయన అనడంతో మత్స్యకారులు వారికి అడ్డుతగిలారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడులు తొలుత అణుపార్కు కొవ్వాడలో ఏర్పాటు చేయనివ్వమని చెప్పి తరువాత వారు అనుకూలంగా వ్యవహరించారని అందుకే పార్టీలతో సంబంధం లేకుండా అణుపార్కు ఏర్పాటుకు తాము సహకరిస్తామని అయితే మెరుగైన ప్యాకేజీ ఇవ్వకపోతే తాము సహకరించమని మత్స్యకార నాయకులు అల్లిపల్లి రాముడు, మైలపల్లి జగ్గులు, చీకటి నర్శింహమూర్తి, పట్టయ్య తదితరులు పేర్కొన్నారు. ప్రధానంగా గ్రామంలో ఐదేళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడం, రెవెన్యూ పరంగా రికార్డులను సరిచేయకపోవడంతో అందరూ ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని సరి చేసిన తరువాతే ఏ పనైనా ముందుకు వెళ్లాలని వారు సూచించారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ భూకంపాల జోన్‌లో ఉన్న కొవ్వాడలో అణుపార్కు పెట్టడం తగదన్నారు. ఉద్యోగాలు, ఉపాధి పునరావాసం అన్ని అభూతకల్పనలేనని దీనిని మత్స్యకారులు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ మైలపల్లి పోలీస్ మాట్లాడుతూ గ్రామంలోవౌలిక సదుపాయాలు కల్పించకపోవడం తమకు ఆందోళన కలిగిస్తుందని తక్షణం మంచినీరు, ఇతర సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వం చేపట్టే సామాజిక ప్రభావిత మదింపు సర్వేకు సహకరిస్తామని ఆయన ప్రకటించారు. అయితే, ప్రతీ వ్యక్తి కుటుంబ, భూములు వివరాలను పూర్తిస్థాయిలో సర్వే చేయాలని, అదే విధంగా రాజధాని నిర్మాణానికి, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి చేస్తున్న భూసేకరణకు ఏ విధమైన నష్టపరిహారం ఇస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మత్స్యకారుల విన్నపాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రామంలో రెవెన్యూ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆర్డివో దయానిధి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో కొంతసేపు మత్స్యకారులకు, వామపక్ష నాయకులకు వాగ్వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగింది. గ్రామ సభ నిర్వహణ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.సురేష్, కొవ్వాడ అణుపార్కు సహాయ ఇంజినీరు దేవర పాల్గొన్నారు.