శ్రీకాకుళం

బయోమెట్రిక్ అమలు డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: విద్యాలయాల్లో విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచే పటిష్ఠంగా బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలన్న ప్రభుత్వం ఆలోచన సాధ్యమయ్యే పరిస్థితులు కన్పించడం లేదు. అసలు కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలే ముందుకు రాకపోవడమే ప్రభుత్వం ముందువున్న పెద్ద సమస్య. ఉన్నత విద్యామండలి మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేసేందుకు మాత్రం పట్టుదలగా ఉంది. దీనిని ప్రభుత్వ కళాశాలలతోపాటు, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. సరైన హాజరు లేకుండా కొన్ని కళాశాలలు రీ యింబర్స్‌మెంట్ పొందడాన్ని కూడా నూతన విధానం ద్వారా నివారించవచ్చని విద్యామండలి భావిస్తోంది. అయితే, ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకతల మధ్య ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు సాధ్యపడుతోందో లేదో వేచి చూడాలి. జిల్లాలో అంబేద్కర్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అమలు చేయాలని ఉన్నతవిద్యామండలి ఆదేశించింది.
రాష్ట్రంలో 14 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లతో ఇటీవల నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో సైతం ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సుమితా దావ్రా తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు విధాలుగా బయోమెట్రిక్ హాజరు వల్ల ప్రయోజనం చేకూరుతుందని విద్యాశాఖ భావిస్తోంది. హాజరుశాతం పెరుగుదల ఒకటైతే, హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే రీ యింబర్స్‌మెంటు, ఉపకారవేతనాలు మంజూరు చేయచ్చన్నది రెండోది. విద్యార్థులు కనీసం 70 శాతం హాజరయితేనే రీ యింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. ప్రస్తుతం కొన్ని కళాశాలల నిర్వహణ చూస్తే బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా అమలు చేస్తే మూతపడే పరిస్థితులు సైతం కన్పిస్తున్నాయి.
అంబేద్కర్ యూనివర్సిటీలో 15 విభాగాలు ఉండగా, ఎఫిలియేషన్‌లో 12 ప్రభుత్వ, 88 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, 18 బి.యడ్ కళాశాలలు, 11 పీజీ కళాశాలలు, ఒక న్యాయకళాశాల ఉన్నాయి. జిల్లాలో మరోపక్క జేఎన్‌టీయూ ఏఫిలియేషన్‌లో ఎనిమిది ఎం.బి.ఎ. కళాశాలలు ఉన్నాయి. వర్సిటీలో పరిస్థితి గమనిస్తే కొన్ని విభాగాల్లో కనీసం తరగతులు నిర్వహించకుండా హాజరు మాత్రమే వేస్తున్నారు. లేదంటే ఈ కోర్సులు ఎత్తివేయాల్సిందే. సాంకేతికపరమైన సమస్యల అధిగమించేందుకే చేయాల్సివస్తుందన్నది అక్కడ అధ్యాపకుల వాదన. మరోపక్క ఏఫిలియేషన్ పరిధిలో ఉన్న న్యాయకళాశాల, బి.ఎడ్ కళాశాలల్లో తరగతులు కనీసం కూడా నిర్వహించడం లేదు. దూరవిద్యకంటే దారుణంగా కొన్ని కళాశాలల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. హాజరుకు సైతం విద్యార్థుల నుంచి తృణమో పణమో ఆశించే సందర్భాలు కూడా లేకపోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రీ యింబర్స్‌మెంట్ కోసం అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో ఎంటెక్, ఎంఫార్మశీ వంటి కోర్సులకు తరగతులు నిర్వహించకుండానే కొనసాగిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ కొందరు పీజీ కోర్సులు చదివేస్తున్నారు. విద్యార్థులు పరీక్షలకు వస్తే చాలు అన్నట్టు కొన్ని కళాశాలల్లో ఎం.బి.ఎ. కోర్సులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బయోమెట్రిక్ పక్కాగా జిల్లాలో అమలు చేస్తే పరీక్షలకు హారయ్యే విద్యార్థులు 50 శాతం కూడా ఉండకపోవచ్చు. అందుకే ప్రైవేటు కళాశాలలు బయోమెట్రిక్ అమలుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీతో సహా ఫ్యాకల్టీ సభ్యులకు బయోమెట్రిక్‌ను చాలా కళాశాలలు అమలు చేస్తున్నాయి. విద్యార్థుల విషయంలో అమలు చేయడంలో మాత్రం ముంకు రావడం లేదు. మరోపక్క ఉన్నతమండలి రీ యింబర్స్‌మెంట్‌ను పూర్తిగా తగ్గించుకునే పనిలో ఉంది. ఈ మేరకు కళాశాలలకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలో ఇప్పటికే చాలా ఇంజనీరింగ్ కళాశాలలకు తాళాలు పడ్డాయి. బయోమెట్రిక్ అమలు చేసినట్లయితే భవిష్యత్తులో కళాశాలల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో బయోమెట్రిక్ పద్ధతిని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. భవిష్యత్తులో బయోమెట్రిక్ హాజరు ఏ మేరకు అమలవుతుందో చూడాలి మరి!