శ్రీకాకుళం

నాగావళి నదిలోకి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగర, జూలై 3: గత కొన్ని రోజులుగా తుపాను ప్రభావం వల్ల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మడ్డువలస గొర్లె శ్రీరాములనాయుడు ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతుంది. ఆదివారం వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి వచ్చిన నీటిని ప్రాజెక్టు మెయిన్ రెండు గేట్లు నుంచి 26,500 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు సిబ్బంది తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 63.55 మీటర్లు స్థాయిని స్థిరీకరిస్తూ దిగువ భాగానికి నీరు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఇంకా ప్రవాహం ఎక్కువైతే మరికొన్ని గేట్లు నుంచి నాగావళిలోకి నీరు విడిచిపెట్టనున్నట్టు తెలిపారు.

మోసగాళ్ళు దొరికారు
శ్రీకాకుళం, జూలై 3: మహిమగల నాణేలతో సొమ్మును రెట్టింపు చేసుకోవచ్చని, తాము అనుకున్నది సాధించుకోవచ్చని నమ్మబలికి అధికమొత్తంలో సొమ్మును దోచుకుంటున్న ముఠా సభ్యులను పాలకొండ పోలీసులు వలపన్ని అరెస్టు చేసారు. ఆదివారం ఇక్కడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి అత్యంత ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో ఇటువంటి మహిమలకు ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో వివరించారు. విజయనగరానికి చెందిన దేవుడుబాబు అనే వ్యక్తి గండ్రేటి సురేష్‌తోకలిసి శ్రీరామచంద్రులు బొమ్మవున్న ఓ నాణేన్ని సంపాదించి, దీంతో సొమ్మును ఏ విధంగా సంపాదించాలన్నదానికి ప్రణాళిక సిద్ధం చేసారు. వారు అనుకున్న ప్రకారం విశాఖపట్నానికి చెందిన వేమిరెడ్డి ప్రసాదు, కోరాడ రమేష్‌తో పాటు మరో ఇద్దరు గిరిజనులను వారి టీంలో చేర్చుకొని బాగా డబ్బున్న వారివద్దకు వెళ్ళి, ముందుగా వారికి నమ్మకం కలిగేలా, కొన్ని రసాయనాలతో డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మబలుకుతారు. అనంతరం వారితో డబ్బులు తేవాలని చెప్పి అక్కడ ఓ రంగుపూసిన చెంబులో కొన్ని బియ్యం గింజలు వేస్తారు. ముందుగానే సిద్ధం చేసిన కార్బన్ పేపర్‌తో రుద్దిన బియ్యాన్ని చెంబులోంచి తీసి బియ్యం రంగు మారిందని, తప్పక మీకు అనుకూలంగా జరుగుతుందని చెబుతారు. ఆ విధంగా నమ్మించిన తరువాత ఓ కాయిన్‌ను తీసి, ఇది సీతంపేట అడవుల్లో దొరుకుతుందని, దీనికి గిరిజనులు పూజలు చేస్తారంటూ నమ్మకం కలిగిస్తారు. ఈ క్రమంలో అవసరమైతే సీతంపేటలోని అడవుల్లోకి వారిని తీసుకువెళ్తారు. దీనిద్వారా అంతా మంచే జరుగుతుందని, దీని ఖరీదు లక్షల రూపాయలుగా చెబుతారు. అయితే ఈ క్రమంలో మోసపోయిన వ్యక్తికి ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడినప్పటికీ, ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా ప్రశ్నిస్తే ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం మరో ఇద్దరు వ్యక్తులు బొమ్మతుపాకిని చూపించి డబ్బును దోచుకుంటారు. ఈ విధంగా విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తివద్ద 50 లక్షల రూపాయలు దోచుకొని పరారుకాగా, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలకొండ డిఎస్పీ సిహెచ్.ఆదినారాయణ నేతృత్వంలో పాలకొండ, సీతంపేట సిఐలు వేణుగోపాలరావు, బి.యస్.ప్రకాష్‌లు తమ టీంతో నిందితులను పట్టుకొని అరెస్టుచేసారు. పోలీసులు అనుసరించిన వ్యూహాన్ని సైతం తిప్పికొట్టేలా నిందితులు సుమారు 30, 40 సెల్‌ఫోన్లు, సిమ్‌లు మార్చినట్లు విచారణలో తేలింది. వారివద్దనుండి 47 లక్షల రూపాయల నగదుతో పాటు వారు వినియోగించే బొమ్మ తుపాకి, డబ్బు లెక్కపెట్టడానికి ఉపయోగించే కరెన్సీ మిషన్, సెల్‌ఫోన్లు, మోసంలో భాగంగా డబ్బును రెట్టింపు చేయడానికి గాను వారు వినియోగించే దొంగనోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఏ నాణేనికి మహిమలు అంటూ ఏవీ ఉండవని, ఇటువంటి వారిని చూసి మోసపోవద్దని ఎస్పీ జిల్లా ప్రజలను హెచ్చరించారు. అనుమానితులు ఎవరైనా ఇటువంటివారు వస్తే వెంటనే దగ్గరలోగల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆయనతో పాటు సమావేశంలో డిఎస్పీలు కె.్భర్గవరావు నాయుడు, టి.మోహనరావు, సిహెచ్.వివేకానంద, ఎస్‌ఐలు ఉన్నారు.

జిల్లాకు మరిన్ని పరిశ్రమలు
శ్రీకాకుళం, జూలై 3: రాష్ట్ర విభజన నేపథ్యంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రానున్నాయని ఇందుకు అధికార యంత్రాంగం సహాయ సహకారాలు అవసరమని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంను ఎంపి కలిసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఐడియాలజీకి అనుగుణంగా భూమిని ఏ యే ప్రాంతాల్లో సేకరించాలన్న అంశంపై చర్చించారు. పరిశ్రమలు స్థాపిస్తామని ముందుకు వస్తున్న పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందించగలిగితే జిల్లా అభివృద్ది మరింత వేగవంతం అవుతుందన్నారు. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు స్వాగతించేలా కృషి చేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి జిల్లాలోని పరిశ్రమలు విరివిగా ఏర్పాటు చేయడం వలన ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ నిరుద్యోగ యువతకు లభించడమే కాకుండా ఆర్థిక పురోగతి సాధించడం మరింత సులువౌతుందన్నారు. ఎంపితోపాటు పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.

డిఎంహెచ్‌వో శ్యామల బదిలీ
శ్రీకాకుళంటౌన్, జూలై 3 : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ రెడ్డి శ్యామలకు గుంటూరు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణిగా బదిలీ అయ్యింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం డైరెక్టర్ వైద్య, ఆరోగ్య శాఖ జీవో విడుదల చేసింది. అయితే జీవోలో శ్రీకాకుళం జిల్లాకు వైద్య ఆరోగ్య శాఖాధికారిగా ఎవ్వరినీ నియమించ లేదు. పూర్తి బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. అలాగే డి ఎంహెచ్ ఓ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పని చేస్తున్న వీర్రాజుకు విమ్స్ పరిపాలనాధికారిగా బదిలీ అయ్యింది. డిఐవోగా పని చేస్తున్న నాయుడును ఎస్‌సిహెచ్‌వోగా ఆమదాలవలసకు పంపించారు. దీంతో డి ఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రధాన పోస్టులు అన్నీ ఖాళీ అయ్యాయి. వర్షా కాలం దృష్టిలో వుంచుకుని వ్యాధులు వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రధాన పోస్టులు ఖాళీ అవ్వడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్టస్థ్రాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సన్నాహాలు
బలగ, జూలై 3: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా రాష్టస్థ్రాయి సాఫ్ట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షుడు బడగల హరినాధరావు తెలియజేశారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా మూడవ రాష్టస్థ్రాయి జూనియర్ బాలురు, బాలికల సాఫ్ట్‌బాల్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు విచ్చేయనున్నారన్నారు. అందుకు కావల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని, క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలురకు బలగ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో, బాలికలకు ఆర్.సి.ఎం లయోలా, ఇల్లిసిపురంలో వసతి కల్పిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి 63 మంది వ్యాయామ ఉపాధ్యాయలను అఫీషియల్స్‌కు నియమిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా బయట నుంచి మొత్తం మీద వంద మంది అఫీషియల్స్, 600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలు ఇక్కడి కోడిరామ్మూర్తి స్టేడియంలో మూడు కోర్టులు వేయడం జరుగుతుందని, అదనంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో కోర్టులు వేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీలకు జిల్లా ఒలింపిక్ సంఘం, జిల్లా క్రీడాప్రాదికార సంస్థ, వ్యాయామ ఉపాధ్యాయులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తక్కువ సమయంలో జిల్లాలో ప్రాచుర్యం కలిగిన క్రీడ సాఫ్ట్‌బాల్ అని, సంఘం ఏర్పాటు అయిన తర్వాత అనతి కాలంలో అంతర్ జిల్లాల క్రీడాపోటీలు నిర్వహించడం సాహసోపేతమైన చర్య అన్నారు. ఈ క్రీడను రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలకు స్టేడియం వేదిక కావడంతో వారికి కావల్సిన సహకారాన్ని అందిస్తామన్నారు. జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి ఎం.వి.రమణ మాట్లాడుతూ రెండేళ్ల కిందట జిల్లాలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులకు తయారు చేశామన్నారు. గత ఏడాది రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపు నిర్వహించి 20 మంది వరకు జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటారన్నారు. గత ఏడాది స్కూల్ గేమ్స్‌లో జట్టు మొదటిస్థానంలో నిలిచిందని, అదే స్పూర్తితో ఈ ఏడాది రాష్టస్థ్రాయి పోటీలు నిర్వహించేందుకు ముందుకు వచ్చామని, దీనిని విజయవంతం చేయాలని జిల్లా క్రీడాకారులను కోరారు. విలేఖర్ల సమావేశంలో ఆ సంఘం కన్వీనర్ కిల్లంశెట్టి అరుణ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు వై.పోలినాయుడు, ఆ సంఘం సలహాదారుడు కె.రాజారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.రవికుమార్, ఎన్.వి.రమణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అది నకిలీ వెండే
ఆమదాలవలస, జూలై 3: దగదగ మెరిసే సేలం వెండి పట్టీలు ఇతర రకాల వెండివస్తువులు జిగిజిగి మెరుపులే తప్ప నాణ్యత శూన్యమని పోలీసుల విచారణలో వెల్లడైంది. తమిళనాడుకు చెందిన ఒక ఏజెంట్ ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఆధారిత పన్నులు చెల్లించకుండా అక్రమంగా వెండి పట్టీలు తరలిస్తూ పట్టుబడిన సరుకులపై పోలీసులు విచారణ పలు నిజాలు వెలుగు చూశాయి. పట్టుబడిన ఈ పట్టీలకు కనీసం 20 కేజీలు కూడా మంచి వెండి దిగుబడి అయ్యే అవకాశం లేదని స్థానిక జ్యూయలరీ వర్తకుల ద్వారా పోలీసులు నిర్థారించారు. జిల్లాకు భారీ ఎత్తున అక్రమంగా దిగుమతి అవుతున్న సేలం, నెల్లూరు వంటి ప్రాంతాలనుండి వెండి వస్తువులపై ఆదివారం పోలీసులు ఆరా తీయగా ఆయా ప్రాంతాల్లో వేల సంఖ్యలో వెండి వస్తువుల ఫ్యాక్టరీలు ఉన్నాయని అక్కడ తయారవుతున్న వెండి వస్తువుల్లో నాణ్యత లేదని పోలీసులు గుర్తించారు. ఈ వెండి వస్తువుల్లో 80శాతం వైట్ మెటల్, 20శాతం వెండి ఉంటుందని మరికొన్ని రకాల వెండి వస్తువులు ఆప్‌టచ్‌లో ఉంటున్నాయని స్థానిక జ్యూయలరీ వర్తకుల ద్వారా పోలీసులు కనుగొన్నారు. ఈ వెండి వస్తువులు మిషన్ పాలీస్ కారణంగా అసలైన నాణ్యతగల నెం.1 వెండి వస్తువులుగా పోలి ఉంటూ వినియోగదారులను సులువుగా మోసగిస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వస్తువులు వినియోగించిన కొద్ది రోజులకే నాణ్యత లేకపోవడం కారణంగా ఇనుము మాదిరిగా నల్లబడుతూ రంగు మారిపోతూ ఉంటాయని పోలీసులు తెలిపారు. నాణ్యత లేని ఈ వస్తువులను విక్రయిస్తున్న జిల్లాలో పలు జ్యూయలరీ దుఖాణం యాజమానులు మేలిమి వెండి ధరకే విక్రయిస్తూ దీనిపై భారీ ఎత్తున తయారీ ఛార్జీలు, వ్యాట్ వంటి అదపను ఛార్జీలను ఖాతాదారులపై వేసి మోసగిస్తున్నారని విజిలెన్స్ శాఖ గుర్తించింది. వీటిని తయారు చేసే కంపెనీలు 12.5 శాతం విలువ ఆదారిత పన్ను పేరుతో ఏటా ఏ.పి ప్రభుత్వానికి చెల్లించవలసిన కోట్లాది రూపాయల పన్నులను ఎగ్గొడుతున్నట్లు విజిలెన్స్ శాఖ గుర్తించింది. ఇక నుండి వెండి వస్తువులు అక్రమ దిగుబడి నాణ్యత లేని వస్తువుల వ్యాపారంపై, తయారీపై విజిలెన్స్ శాఖ దృష్టి సారిస్తుంది.

క్రీడల్లో ప్రావీణ్యంతో జీవితాలకు వెలుగు
బలగ, జూలై 3: విద్యతోపాటు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా జీవితాలకు వెలుగు చూపుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక చాపర వీధిలోని వాసవీ కళ్యాణ మండపంలో జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రధమ, ద్వితీయ బహుమతులు పొందిన విద్యార్థులకు ఆయన అభినందించారు. రావుల సాయిబాబాస్ కుంగ్‌ఫూ, మార్షల్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తాచాటడం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కఠినమైనదని, అయితే విద్యార్థులను తీర్చిదిద్దడంలో మాస్టర్ మండా విజయకుమార్ కృషి కొనియాడదగ్గదన్నారు. ఇదిలావుంటే నగరంలో పలువురు విద్యార్థులకు, క్రీడాకారులకు వాణిజ్యవేత్త కోణార్క్ శ్రీను సహాయ సహకారాలు మరువలేనివన్నారు. పేదలకు వైద్య చికిత్సలు, విద్యార్థులకు బట్టలు, క్రీడాకారులను ప్రోత్సహించి, ఆయన సంపాదించిన దాంట్లో సేవలకు వెచ్చించడం బలీయమైన పాత్రగా అభివర్ణించారు. క్రీడలతో జీవన విధానంలో మార్పువస్తుందని, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటికి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్లాక్‌బెల్ట్ జాతీయ ప్రధమ, ద్వితీయ బహుమతి గ్రహీతలు జి.రామారావు, వెంకటేశ్వరావులను జ్ఞాపిక, దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో కోణార్క్ శ్రీను, మామిడి శ్రీకాంత్, చల్లా రవికుమార్, రొక్కం సూర్యప్రకాష్, మండవల్లి రవి, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు చందు, కె.రవి తదితరులు పాల్గొన్నారు.

నాగావళి వంతెన రెడీ
శ్రీకాకుళం(టౌన్), జూలై 3: నాగావళి పాతవంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సుమారు 40 పరిసర గ్రామాలకు అందుబాటు రహదారిగా ఉన్న నాగావళి పాతవంతెనను 2013 ఆగష్టులో కూలదోసిన విషయం తెలిసిందే. అయితే 2014లో ప్రభుత్వం మారడం, పరిసర వాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయాన్ని నిరసన కార్యక్రమాల ద్వారా తెలియజేయడంతో స్థానిక శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి చొరవచూపించి నాగావళి వంతెన పూర్తికి కృషిచేసిన విషయం విధితమే. ఇందులో భాగంగా స్థానికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా వంతెన కిందినుండి ద్విచక్ర వాహనచోదకులకు కాజువే నిర్మించినప్పటికీ, నదిలో నీరు అధికం కావడం కాజువే కొట్టుకుపోవడం జరిగేది. దీనిని దృష్టిలో ఉంచుకొని కాజువే నిర్మాణం కంటే వంతెననే వేగవంతంగా నిర్మించాలన్న సంకల్పంతో గుత్తేదారులు, అధికారులతో పలుధపాలుగా స్థానిక ప్రజాప్రతినిధులు చర్చలు జరిపి వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇదిలావుంటే రెండు వైపుల తారు రోడ్డు నిర్మాణం మినహా వంతెన పూర్తికావడంతో శనివారం నుండి వంతెనపై నుంచి ద్విచక్రవాహనాలను అనుమతించారు.
దీంతో వంతెన నిర్మాణాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు. పూర్తిస్థాయిలో వంతెన నిర్మాణం ద్వారా నగరంతో పరిసర గ్రామాలకు మరింత అనుబంధం ఏర్పడుతుందని, పైగా ఇపుడున్న డే అండ్ నైట్ కూడలి వంతెనపై రాకపోకలు నియంత్రణ ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మరో నెలరోజుల్లో వంతెన పూర్తిస్థాయి నిర్మాణంతో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

దేశం పాలనలోనే పాడి పరిశ్రమ అభివృద్ధి
ఆమదాలవలస, జూలై 3: తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే పాడి పరిశ్రమ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రవికుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోగల కొత్తవలస గ్రామంలో ప్రభుత్వం అందించే రాయితీ పశుదానా ప్యాకెట్లను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ పాడి పరిశ్రమ వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించి ప్రతీ పంచాయతీకి ఒక పశువైద్య శాల, రాయితీపై పశువులు కొనుగోలు వంటి ప్రయోజనాలు కల్పిస్తుందన్నారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని ధర కూడా లభిస్తుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంత రైతులంతా ముందుకు రావాలని ఆయన సూచించారు. పాడి రైతులు ముందుకు రావాలని ఆయన సూచించారు. పశువుల పెంపకం ద్వారా రైతులకు ఎన్నో ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ గురుగుబెల్లి మోహనరావు, దేశం నాయకులు తమ్మినేని అమర్‌నాథ్, బొడ్డేపల్లి మాదురి, కోట గోవింద్, తమ్మినేని అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

లైన్స్‌క్లబ్ సేవలు విస్తృతం కావాలి
* తాజా, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు, ధర్మాన
నరసన్నపేట, జూలై 3: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నప్పటికీ స్వచ్ఛంద సేవాసంస్థల సేవలు కూడా అందించగలిగితే మరింత అభివృద్ధి సాధించగలమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం స్థానిక ప్రైవేటు పంక్షన్ హాల్‌లో లైన్స్‌క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఇప్పటికే లైన్స్‌క్లబ్ ద్వారాపలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వీటిని మరింత పటిష్టంచేస్తూ ముం దుకు వెళ్లవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో భాగంగా నూతన లైన్స్‌క్లబ్ అధ్యక్షుడిగా చింతు రామారావు, కార్యదర్శిగా పి.రమేష్, కోశాధికారిగా ప్రముఖ న్యాయవాధి జి.సత్యన్నారాయణలు ఎంపికయ్యారు. ఈకార్యక్రమంలో లైన్స్‌క్లబ్ ప్రతినిధులతో పాటు అదనపు డిఎం అండ్ హెచ్ వో ఎం.ప్రవీణ్, వైద్యులు వ్యయాతి, లక్ష్మణరావు, మోహనరావు, స్వామిబాబు తదితరులు పాల్గొన్నారు.