శ్రీకాకుళం

అతిథులను ఆస్పత్రి పాల్జేసిన శుభకార్యంలోని భోజనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జూలై 4: ఓ శుభకార్యంలో పాల్గొని, అక్కడి భోజనాలు చేసిన పలువురు అతిథులు ఆస్పత్రి పాలయ్యారు. మండల కేంద్రం కొత్తూరు చెవిటమ్మతల్లి ఆలయం సమీపంలో ఉన్న సారిపల్లివీధికి చెందిన సుమారు 50 మంది విషాహారం తిని సోమవారం అస్వస్థతకు గురయ్యారు. బాధితులను పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చెవిటమ్మతల్లి సమీపంలో నివాసముంటున్న మాధవరావు అనే ఉపాధ్యాయుడు కుమార్తె శుభకార్యంలో భోజనాలు ఆరగించిన స్థానికులు వాంతులు, విరేచనాలతో సోమవారం ఉదయం కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మడపాన ప్రసాద్, నవీన్, మహేష్, కోటేశ్వరరావు, షర్మిల, జ్యోత్స్న, తరుణ్, చోడవరపు భాస్కరరావు, తేజ, కరణం ఉపేంద్ర, గవర రాంప్రసాద్‌తో పాటు మరికొంతమంది వాంతులు, విరేచనాలతో పాటు జ్వరాలు రావడంతో వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య చికిత్సలు నిమిత్తం చేరారు. వీరికి వైద్యాధికారి కృష్ణమోహన్, కె.కిషోర్‌కుమార్‌లు వైద్యసేవలందించారు. వాంతులు, విరేచనాలకు గల కారణాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆదివారం జరిగిన విందు భోజనంలో నిల్వా ఉంచిన పుట్టకొక్కు కూర తిన్నామని, అందువల్లనే ఈ అస్వస్థత చోటు చేసుకున్నట్టు బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం వైద్యాధికారులు ధ్రువీకరించారు. సమాచారం తెలిసిన వెంటనే పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, తహశీల్దార్ పి.రామకృష్ణలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విషాహారం ఆరగించిన బాధితులను పరామర్శించారు. అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యాధికారులు ధ్రువీకరించడంతో బాధితులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, విషాహారం తీసుకున్నవారు మరికొందరు ఆసుపత్రికి చేరుకోకపోవడంతో సారిపల్లి వీధిలోనే ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి బాధితులకు వైద్యసేవలు అందించారు. ఎమ్మెల్యే వెంట వైస్ ఎంపిపి అగతముడి బైరాగినాయుడు, కర్లెమ్మ ఎంపిటిసి సభ్యులు లోతుగెడ్డ భగవాన్‌దాసునాయుడు, పడాల లక్ష్మణరావు, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.