శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మొక్కుబడిగా ‘గడప గడపకు వైకాపా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు సవివరంగా తెలియచెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ‘గడప గడపకు వైకాపా’ కార్యక్రమం జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయాలని పార్టీ నియోజకవర్గ నేతలకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసినప్పటికి ఏదో కొన్ని నియోజకవర్గాల్లో మినహాయించి మరెక్కడా కూడా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. ఈనెల 8వ తేదిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి జయంతినాడు ప్రారంభమైన కార్యక్రమంలో మొదటి రెండు, మూడు రోజుల పాటు జిల్లాలో ఘనంగా సాగింది. అయితే రానురాను ప్రస్తుతం అటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతోందనే విషయాన్ని కూడా కొందరు వైసిపి నేతలు మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ఆత్మకూరు, నెల్లూరురూరల్, సూళ్లూరుపేట, కావలి, సర్వేపల్లి వంటి వైసిపి ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాలతో పాటు ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లోనూ కాస్త హడావుడిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. గూడూరు, వెంకటగిరి, నెల్లూరు నగరం నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమం అమలు అంతంతమాత్రంగానే ఉంది. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఆ పార్టీ నియోజకవర్గ నేతలు చెబుతున్నారు. గూడూరు నియోజకవర్గం విషయానికొస్తే గతంలో వైసిపిలో ఉండి ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ టిడిపిలోకి రావడంతో ఇక్కడ గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే పట్టుదలతో మేరిగ మురళికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ అప్పగింతల కార్యక్రమం నుంచే ఇక్కడ అసమ్మతి రాజుకుంది. దీంతో ఈ నియోజకవర్గ పరిధిలో ఈ ప్రచార కార్యక్రమాన్ని మమ అన్నట్లు సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా కొన్నిచోట్ల విజయవంతంగానూ, మరికొన్నిచోట్ల ఊసే లేనట్లుగానూ ఈ కార్యక్రమం జిల్లాలో జరుగుతోంది. వారం వారం ఈ కార్యక్రమం ఏవిధంగా నియోజకవర్గాల్లో సాగుతున్నది పార్టీ అధినేతకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలనే ఆదేశాలు ఉండడంతో ఏదో ఒకచోట కార్యక్రమం నడిపించక తప్పని పరిస్థితి ఉన్నప్పటికి, అది కాస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తూ వైసిపి నేతలు ఏదో కానిచ్చేస్తున్నట్లు అనిపించుకుంటున్నారు.