శ్రీకాకుళం

‘రాజకీయ’ దండయాత్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: రాజకీయ చాణుక్యుడు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంపై చేస్తున్న పొలిటికల్ దండయాత్ర..అన్నీ దిక్కుల నుంచి అష్టదిగ్బంధం చేసే వ్యూహాం..గుండ రాజకీయాలు బలహీనపరిచే పన్నాగం..అభివృద్ధి సూత్రం - వౌలిక మంత్రం మధ్య జరిగే వైరానికి సాక్షీభూతం. అదే - ధర్మాన రాజకీయ యుద్ధం. కత్తిపట్టకుండానే కాలంతోపాటు రాజకీయ చరిత్ర కరిగిపోయేలా వేసే కుయుక్తులే - ధర్మాన దండయాత్ర! దీనికి తొలి ప్రస్థానం నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలతోపాటు శ్రీకాకుళం నియోజకవర్గంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి హాజరుకావడం, సందర్భంలేకుండానే సభల్లో ప్రసంగాలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాత్రను డమీ చేసే ఎత్తుగడ గత కొద్దినెలలుగా సజావుగానే సాగుతోంది. పార్టీలు ఏవైనా, పొలిటికల్ సెనారీలు ఎలాగున్నా, ఎవరి శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆ భౌగోళిక, రాజకీయ హద్దులకే పరిమితం. అలాగే, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాగే ప్రాంతీయ రాజకీయం. కాని - గత రెండేళ్ళుగా మంత్రి కాదు, ప్రభుత్వ విప్ కాదు, జెడ్పీ ఛైర్‌పర్సన్ కాదు, చివరికి ఎం.పి. కూడా కాదు. పొరుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే. అటువంటి సాధారణ ఎమ్మెల్యే పోస్టుతో శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పెత్తనం చేసేందుకు ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పటికీ, పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించడం లేదు. జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించడం లేదు. ఎవరినైనా ముక్కుసూటిగా విమర్శించే ప్రభుత్వ విప్ వౌనం వహిస్తూన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు పట్టించుకోవడమే లేదు. వీరందరూ సంధించాల్సిన ప్రశ్నలు ఒకేసారి గొంతెత్తి దిక్కులు అదిరిపోయేలా అడగాలని ఉన్నా..స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అడిగేందుకు సాహసించడం లేదు. ఇటువంటి సంకట రాజకీయ పరిస్థితులకు మూలం ధర్మాన అంటూ తాజాగా ఒక ఆరోపణ బట్టబయలు అయ్యింది. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శ్రీకాకుళం నగరపాలక సంస్థలో జరిగే కార్యక్రమాలకు హాజరుకావడం పట్ల సర్వత్ర విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆయన పాలనాపరమైన పరిధి కాదు. ఓట్లు వేసి గెలిపించే ప్రజలు లేరు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రచారం చేయాల్సిన వారిపై కర్రపెత్తనం చేసేందుకు పక్క నియోజకవర్గానికి వస్తున్న దారికి ధర్మాన - కింజరాపుల మధ్య కుదిరిన సఖ్యతే బలమైన కారణమంటూ బహిరంగ రహస్యం శనివారం జరిగిన దోమలపై దండయాత్ర కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హాజరై ప్రసంగాలు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీని మూలాలను పసిగట్టలేక నగర తమ్ముళ్ళు తలలుపట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న మంత్రి అచ్చెన్న ఆకర్ష్ ఆఫర్ అంటూ వైసీపీ శ్రేణులకు గాలం వేసే ప్రసంగం చేయడం ఇక్కడ తమ్ముళ్ళుకు మింగుడుపడని విషయంగా మారింది. దీనికితోడు బగ్గు రమణమూర్తి హాల్‌చల్ వెనుక ధర్మాన వ్యూహం దాగివుందని మరో రూమర్ పుట్టుకొచ్చింది. మరికొద్ది నెలల్లో ఎన్నికల నగారా మ్రోగనున్న తరుణంలో ఇటువంటి పరిణామాలు గుండ కుటుంబానికి గుదిబండగా మారింది. మొదట కార్పొరేషన్ ఛైర్మన్ అజాతశత్రువే అంటూ ఆ పార్టీలో ఒక వర్గం ప్రచారం వేగవంతం చేస్తున్న తరుణంలో జిల్లా మంత్రి అచ్చెన్న వ్యూహాత్మకంగా ఆకర్ష అస్త్రాన్ని సంధించడం మరో వర్గం ఆశలు పెంచుకుంటుంది. అయితే, కరెన్సీ కట్టలు పెట్టుబడితో నిర్మాతగా నిలిచేది ఎవరన్న ప్రశ్న కూడా అధికార, విపక్షాల్లో చర్చ మొదలైంది. 50 డివిజన్లుకు 5 - 10 కోట్లు బడ్జెట్ కార్పొరేషన్ ఎన్నికలకు అవసరమన్నది రాజకీయ నిపుణులు అంచనా. ఈ మొత్తాన్ని అధికార పార్టీకి అధినేత చంద్రబాబునాయుడు సమకూర్చుతారన్న వాదన వినిపిస్తున్నప్పటికీ, బలమైన అభ్యర్థి కరువు కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. విపక్షానికి నగరంలో పట్టువున్నప్పటికీ, వార్డుల వారీగా ఓటర్ల బలం దండిగావున్నా పెట్టుబడిపెట్టే నేత లేకపోవడం, ఆ పార్టీ అధినేత నిధులు సమకూర్చరన్న అపనమ్మకం వెరసి ఇక్కడ వైకాపా అభ్యర్ధులను పీడిస్తుంది. ఈ నేపథ్యంలో పక్క నియోజకవర్గం నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నగరంలో పెత్తనం వెనుక గుడుపుఠాణీ రాజకీయాలు దాగివున్నాయని ధర్మాన - కింజరాపు వర్గాలతో సన్నిహితంగా ఉన్నవారంతా బహిరంగం చేస్తున్నారు. దీనికి బలం చేకూరేలా సీనియర్లు సైతం దివంగతనేత ఎర్రన్న, మాజీ మంత్రి ధర్మాన పాతరోజులు (2005 మున్సి‘పోల్స్’) గుర్తుచేస్తూ సరికొత్తగా అచ్చెన్న - ధర్మాన స్నేహం ఈ నగరపాలక ఎన్నికలు కుదిర్చిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో గుండ కుటుంబం ఓటమీ - 2019 సార్వత్రిక ఎన్నికల్లో ధర్మాన విజయం వెనుక నడిచే కుతంత్రమే ఈ ‘రాజకీయ’ దండయాత్ర!! పల్స్ సర్వే ఆధారంగా కులాలవారీగా డివిజన్ల పరిశీలన కమిటీలో అచ్చెన్నకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కొసమెరుపు!

సిక్కోల్‌కు ‘రక్తహీనత’
శ్రీకాకుళం, సెప్టెంబర్ 25: జిల్లాలో చాలా గ్రామాలతోపాటు ముఖ్యంగా గిరిజన గూడల్లో నివాసం ఉంటున్న మహిళల్లో రక్తహీనత కనబడుతుందని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు, బాలబాలికల్లో 8 గ్రాముల హెమోగ్లోబిన్ ఉందని, ఇందుకు చర్యలు తక్షణమే వైద్య,ఆరోగ్యశాఖతోపాటు ఐ.సి.డి.ఎస్. అధికారులు తీసుకోవాలంటూ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని వైద్యశాఖాధికారులను సూచించారు. వైద్య,ఆరోగ్యశాఖతోపాటు సిబ్బంది, ఎ.ఎన్.ఎం.లు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే తప్ప సిక్కోల్ ఆరోగ్యానికి రక్తం ఎక్కించలేమన్నారు. గ్రామాలోగల బాలలు, గర్భిణీ స్ర్తిల వివరాలు ఆధారంగా వారికి పౌష్టికాహారం అందించడం వారి ఆరోగ్య నివేదిక పరిశీలించి తదనుగుణంగా చర్యలు చేపట్టడం చేయాలన్నారు. ఆదివారం ఇక్కడ కలెక్టర్ కార్యాలయం సమావేశమందిరంలో వివిధ శాఖలతో కలెక్టర్ సమీక్షించారు. జమ్ము, తామరాపల్లితోపాటు గిరిజన గ్రామాల్లో పర్యటించామని, అచ్చట మహిలల్లో చాలా తక్కువ హెబోగ్లోబిన్ ఉందన్నారు. ఇది మంచి పరిణామం కాదని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రులలో బయోమెట్రిక్ విధానంపై నివేదికను సమర్పించాలని అన్నారు. అపతి ఆసుపత్రిలోనూ సీసీ కెమోరాలను ఏర్పాటు చేయుటకు అంచనాలు తయారు చేయాలన్నారు.దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అన్నారు. అన్ని పంచాయతీలు, మున్సిపాల్టీల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి మరణాలు ఇప్పటి వరకు నమోదు కాలేదని పేర్కొంటూ అంటు వ్యాధులు ప్రభలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉండాలని అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థను సమీక్షిస్తూ పేదరికం నుంచి ఎన్ని కుటుంబాలను బయటకు తీసుకురాగలమో ఆలోచించాలన్నారు. ఇప్పటి వరకు అందించిన పథకాలు, కార్యక్రమాల ద్వారా ఏ మేరకు పేదరికం తగ్గిందో నవిదిక సమర్పించాలని డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరక్టర్ జి.సి.కిషోర్‌కుమార్‌ను ఆదేశించారు. దాదాపు లక్షకుపైగా కుటుంబాలు పథకాల ద్వారా లబ్ది పొందాయని, ప్రస్తుతం 53 రూరల్ రిటైల్ మార్ట్‌లను ఏర్పాటు చేసామని, వన్ స్టాప్ స్టాల్‌ను ఏర్పటు చేయుటకు ప్రయత్నిస్తున్నామని పి.డి. తెలియజేయగా పథకాల ద్వారా లబ్దిపొందిన వారి వివరాలను అధ్యయనం చేయాలని సూచించారు. జిల్లాలో అన్నా కేంటీన్లను స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. అక్షయపాత్ర స్వచ్చంద సంస్థ ద్వారా కేంటీన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. పాలేకర్ విధానం అమలు చేస్తున్న 10 క్లష్టర్లలో దిగుబడులను గమనించాలని అన్నారు. జిల్లాలో చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆత్మా ద్వారా యాత్రీకరణ 40 శాతం మాత్రమే ఉందని దీనిని మెరుగుపరచాలని అన్నారు. జిల్లాలో పశుసంపదను వృద్ధిచేయాలని ఆదేశించారు. పశుదాణాను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి జిల్లా చేరాలని అన్నారు. వరి, జొన్న పెద్దఎత్తున జిల్లాలో సాగు అవుతుందని, దాణాను అధికంగా ఉత్పత్తి చేయడంలో మస్య ఉండబోదని చెప్పారు. మత్స్యశాఖను సమీక్షిస్తూ చేపల పెంపకం, వచ్చే ఆదాయంపై రైతుల్లో అవగాహన కల్పించాలని అన్నారు. నీరు ప్రగతి క్రింద వచ్చే సీజన్‌లో పనులు చేపట్టుటకు ఇప్పుడే ప్రతిపాదనలు సమర్పించి ఆమోదం పొందాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్ద చెరువులను పూర్తిగా ఆధునీకరణకు అయ్యే వ్యయానికి అంచనాలు రూపొందించాలని అన్నారు. జిల్లాలో సౌరవిద్యుత్ వినియోగంపై తగు చర్యలు చేట్టాలని ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీరు డి.సత్యన్నారాయను సూచించారు. రిమ్స్‌లోను, రాజాం పురపాలక సంఘం కార్యాలయంలోను ఏర్పాటు చేసామని వాటి పరిస్థితిని అంచనా వేయాలని అన్నారు. పాతపట్నం, భామిని, ఇచ్చాపురం ప్రాంతాల్లో ఎన్టీఆర్ జలసిరి క్రింద బోర్లు వేసి ఆ ప్రాంతంలో కూరగాయలు వంటి పంటలు వేయుటకు ప్రోతహించాలన్నారు. వంగర మండలం ఎం.సీతారాంపురం పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడు మరుగుదొడ్డి మంజూరుకు ఐదు వందల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని, అతనిని సస్పెన్షన్ చేయలాని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ ఆర్.కూర్మనాథ్‌ను ఆదేశించారు. చంద్రన్న గ్రామీణ సీసీ రహదారుల ప్రగతి తక్కువగా ఉందని వాటిపై దృష్టి సారించాలని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు ఏ.మోహన మురళీని ఆదేశించారు. చేనేత జౌళిశాఖ కింద నిర్మితం అవుతున్న 17 క్లస్టర్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉత్పత్తి అవుతునన్న సిల్క్‌యార్న్‌ను స్థానికంగానే ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. శ్రీముఖలింగంకు బైపాస్ రహదారి నిర్మాణానికి పరిశీలించాలని ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీరు వి.రామచంద్రను ఆదేశించారు. ప్రస్తుత రహదారిని వెడల్పు చేయుటకు రెండుకోట్లు మంజూరు అయిందని రామచంద్ర తెలిపారు. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామ పరిధిలో తాగునీటి సమస్య ఉన్నట్లు వినతులు అందాయని, అక్కడ పరిస్థితులను పరిశీలించి తాగునీటిని కల్పించుటకు చర్యలు చేపట్టాలని గ్రామీణనీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరను, మత్స్యశాఖ ఉపసంచాలకులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.శివరామనాయకర్, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు, వంశధార పర్యవేక్షక ఇంజనీరు బి.అప్పలనాయుడు, డిపీవో కోటేశ్వరరావు, సాక్షరభారత్ ఉపసంచాలకులు జి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

అసాంఘీక కార్యక్రమాలపై ఉక్కుపాదం
ఆమదాలవలస, సెప్టెంబర్ 25: నియోజకవర్గంలో ఖైనీ, గుట్కా డాన్‌లు, రౌడీలు, నీలిచిత్రాలను చిత్రీకరించే ముఠాలను వేటాడి వీరిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ జిల్లా పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఆదివారం ఇక్కడి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో కొందరు ఇంటర్నెట్ నిర్వాహకులు సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి నీలిచిత్రాలు చిత్రీకరించి మహిళల మనోభావాలను తీవ్ర దెబ్బతీస్తున్నారని ఈ ముఠాలను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని ఆయన హెచ్చరించారు. కిరాణా, పాన్‌షాప్ వర్తకులపై ఒక సామాజిక వర్గం పేరుతో దాదాగిరి, రైడీయిజానికి పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెంచి రౌడీషిటర్లుగా గుర్తించి వీరికి తాటతీయాని రవికుమార్ ఆదేశించారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ముప్పు తెచ్చే ఎటువంటి వ్యక్తులైనా, ఏ సామాజిక వార్గనికి చెందినవారైనా తాను క్షమించేది లేదని విప్ హెచ్చరించారు.
* ఆకర్షణలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు: విప్
నియోజకవర్గంలో విద్యావంతులైన యువతీ యువకులు ప్రేమ, ప్యాషన్, ఆర్థిక అవసరాలు,వ్యామోహం వంటి ఆకర్షణలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విప్ రవికుమార్ సూచించారు. ప్రభుత్వం వీరి కోసం ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పెరుగుతున్న సాంకేతిక టెక్నాలజీని కంప్యూటర్,సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ సేవలను అసంఘీక కార్యక్రమాలకు ప్రోత్సహించవద్దని రవికుమార్ సూచించారు. ఈ టెక్నాలజీ ప్రజలకు సేవచేసే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో అలజడులు సృష్టించి వ్యవస్థలో గందరగోళం చేసే వ్యక్తులపై పోలీసులు నిఘా వేసి కఠిన చర్యలు తీసుకోవాలని విప్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత, దేశం నాయకులు ఎం.రమేష్, తమ్మినేని విద్యాసాగర్, బోర గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమించాలి
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 25: మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపి మహిళా టీచర్ల ఫోరం రాష్ట్ర కన్వీనర్ కె.విజయగౌరి అన్నారు. ఆదివారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మహిళా టీచర్ల ఫోరం ఆధ్వర్యంలో పాఠశాల విద్య మహిళాటీచర్లు బాలికల స్థితిగతులు అనే అంశంపై సదస్సు జిల్లా కన్వీనర్ బి.్ధనలక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రతీ ప్రయోజనం, ఉద్యమాలు, పోరాటాల ద్వారానే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. కెజిబివి విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ విధానం పోవాలన్న మోడల్ స్కూల్స్ ఇతర యాజమాన్యాల పాఠశాలల్లో మహిళా టీచర్ల సమస్యలు పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి జరుగుతున్న ఉద్యమాల్లో మహిళా టీచర్లు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సదస్సుకు అధ్యక్షతన వహించిన ధనలక్ష్మీ మాట్లాడుతూ మహిళలు భాగస్వామ్యంతో జరిగిన ఉద్యమాలన్నీ విజయవంతం అయ్యాయని , భవిష్యత్ ఉద్యమాలలో మహిళల పాత్ర పెరగాలని కోరారు. యూ టి ఎఫ్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె.రామలక్ష్మీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ స్వర్ణలత మాట్లాడుతూ మహిళలు, బాలికల సమస్యలు ప్రస్తావించి మహిళలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. యూ టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ పనిచేస్తున్న పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని, మహిళా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా సహాధ్యక్షులు ఎం.వాగ్ధేవి, కార్యదర్శులు పి.పద్మజ, విజయకుమారి, ఎస్.కిషోర్‌కుమార్, కె.మణిమాల, కె.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. * మహిళా ఫోరం నూతన కార్యవర్గం ఏర్పాటు:
ఆదివారం జరిగిన మహిళా సదస్సులో జిల్లా మహిళా టీచర్ల ఫోరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌గా బి.్ధనలక్ష్మీ, కో కన్వీనర్లుగా కె.రామలక్ష్మీ, ఎం.వాగ్ధేవి, కె.మణిమాల, పద్మశ్రీ, విజయకుమారి, సిహెచ్ సుబ్బలక్ష్మీ, శైలజ, మహాలక్ష్మీ, బాలామణిలను ఎన్నుకున్నారు. సభ్యులుగా రాజకుమారి, జి. ఉషారాణి, సుమలత, కల్పనారాణి, సుజాతమ్మ, జె. ఉష, విశాలాక్షి, సౌజన్య, వసుందరదేవి, పద్మావతి, రమణమ్మ, లక్ష్మీ, రమణి, ఇందిరమ్మ, పద్మావతి, ప్రభావతి, భాగ్యలక్ష్మీ, సన్యాసమ్మ, శివశ్రీ, మాలతి, సుధారాణి, సరోజనమ్మ, శారదలు ఎన్నికయ్యారు.

యువత సేవాదృక్పథం అలవరచుకోవాలి
* వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 25: యువత సామాజిక అంశాలతో పాటు సేవా దృక్పథం అలవరచుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం స్థానిక రైతుబజారు ఎదురుగా వినాయక ఉత్సవాల ముగింపునుపురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత ఇటువంటి ఉత్సవాల్లో భాగస్వాములు కావడం సంతోషదాయకమయినా, సేవా దృక్పథం కలిగివుండటం వలన మరింతమందికి మేలుచేకూరుతుందన్నారు. సుమారు ఐదువేల మంది అన్నప్రసాదం స్వీకరించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పైడి మహేశ్వరరావు, హరికా ప్రసాద్, అప్పి తదితరులు పాల్గొన్నారు.

వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
* మాజీ మంత్రి ధర్మాన
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 25: శారీరక వ్యాయామంవలన ఆరోగ్యం నిలకడగా ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక అరసవల్లిరోడ్డులో ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో శ్రీఋషియోగా శిక్షణ అధినేత ఉపేంద్రసాయి యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. యోగా, ధ్యానం ఆసనాల వలన జరిగే ప్రయోజనాల గూర్చివివరించారు. పూర్వకాలంలో నీరు తోడటం, ధాన్యం, పప్పులు దంచడం వలన మెట్లు ఎక్కడంవలన మనకు తెలియకుండా శారీరక వ్యాయామం జరిగేదని ఆదునీకరణ వలన సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ప్రజలు బద్దకిష్టులుగా తయారై అనారోగ్యం పాలౌతున్నారన్నారు. శర్వాణి విద్యా సంస్థల అధినేత అందవరపు సూరిబాబు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబ వ్యవస్థ సమాజ వ్యవస్థ బాగుటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపేంద్రసాయి గురూజీని సన్మానించారు. ఈకార్యక్రమంలో లక్ష్మణరావు, రాజు, రమణ, రత్నాల నర్శింహమూర్తి, బలివాడ పద్మజ, జి.రామారావు, గణపతి, రవి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పిడిఎస్ బియ్యం పట్టివేత
సీతంపేట, సెప్టెంబర్ 25: ప్రైవేటు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. శనివారం రాత్రి సీతంపేట నుంచి కొత్తూరు వైపు వెళుతున్న వ్యాన్‌లో అక్రమంగా తరలుతున్న 30 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ జి.చంద్ర విలేఖర్లకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనంతో పాటు బియ్యాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. దీనిపై సిఐ మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి ఆదేశాలు మేరకు తాము శనివారం రాత్రి సమయంలో అక్రమంగా తరులుతున్న బియ్యంతో ఉన్న వాహనాన్ని దాడి చేసి మార్గమధ్యంలో పట్టుకున్నామన్నారు. అయితే వాహన యజమాని ఈ బియ్యం కోసం ప్రశ్నించగా జిసిసికి చెందిన బియ్యమని చెప్పడంతో ఆదివారం ఉదయం గిరిజన సహకార సంస్థ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో గొడౌన్ రికార్డులను కూడా పరిశీలించడం జరిగిందన్నారు. అయితే తమ పరిశీలనలో ఏడు బస్తాలు మాత్రమే తేడా ఉన్నట్టు గుర్తించామన్నారు. వాహనంలో ఉన్న బియ్యం, వాహనంపై కేసు నమోదు చేసి సీతంపేట రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. వారు వాహనంతో పాటు బియ్యం ఎవరివని దర్యాప్తు నిర్వహించి నివేదిక అందజేసిన అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
* బియ్యం ఎక్కడివి...
రాత్రి సమయంలో అక్రమంగా తరలుతున్న పిడిఎస్ బియ్యం ఎక్కడవని ప్రశ్న పలువురిలో సందేహాలకు తావిస్తుంది. గిరిజన సహకార సంస్థకు చెందిన గోనెలతో కూడిన ఈ బియ్యం తమవి కాదంటే తమవి కావని ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడంతో ఈ అక్రమ బియ్యం తరలింపు ఎక్కడ నుంచి జరిగిందో సంబంధిత అధికారులు నిజానిజాలు తేల్చాల్సి ఉంది.

రు.1.35 కోట్లతో పుట్‌పాత్
* శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే లక్ష్మీదేవి
శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 25: నగరంలో వివిధ అభివృద్ధి పనుల్లో బాగంగా స్థానిక డే అండ్ నైట్ కూడలి నుండి ఎచ్చెర్ల మండలం సీపన్నాయుడుపేట జాతీయరహదారి సింహద్వారం వరకు పుట్‌పాత్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1.35 కోట్ల రూపాయల వుడా నిధులతో నిర్మించనున్న ఈ ఫుట్‌పాత్ పూర్తయితే హైదరాబాద్ ట్యాంకుబండ్ మాదిరి తయారు కాగలదని ఆమె పేర్కొన్నారు. నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు. రోడ్లు లేని వీధుల్లో వెంటనే సిసి రోడ్లు నిర్మించేలా, కాలువలు, డ్రైనేజీ సిస్టమ్‌ను మెరుగు పరచే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమెతో పాటు శంకుస్థాపన కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, వార్డు ఇంచార్జి సీపాన మల్లేశ్వరరావు వుడా ఇఇ శ్రీనివాసరావు, ఎఈ దుర్గాప్రసాదు తదితరులున్నారు.

ఇక నుంచి ‘ఖేల్ ఇండియా’
బలగ, సెప్టెంబర్ 25: ప్రభుత్వాలు మారుతుంటే పథకాల పేర్లు మారుతుంటాయి.. దానికితోడు మరిన్ని జోడించి ప్రవేశ పెడుతుంటారు మన ప్రభుత్వాలు. దేశంలో క్రీడల అభివృద్ధి చేసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన నిర్ణయాల్లో భాగంగా ఈ ఏడాది నుంచి ఖేల్ ఇండియాగా పథకాన్ని మారుస్తూ, అన్ని క్రీడా పోటీలు, టాలెంట్‌ను గుర్తించడం, అత్యాధునిక సౌకర్యాలన్నీ ఒక గొడుగులోకి తీసుకు వచ్చి క్రీడాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడమని ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. పైకా (పంచాయతీ యువ క్రీడా అభియాన్) స్థానంలో ఆర్‌జికె ఎ (రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్) మార్చగా.. అదే స్థానంలో ఖేల్ ఇండియా అనే స్లోగాన్‌తో ఈ ఏడాది నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా స్థానాల్లో పతకాలు పొందిన క్రీడాకారులు నగదు రూపంలో ప్రోత్సాహకాలతోపాటు ప్రశంసాపత్రాన్ని అందించే ఈ స్కీమ్ రూపొందించారు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు ఆయా స్థాయిల బట్టి అదే ఏడాదిలో గౌరవ భృతిని నెలవారీ ఇవ్వనున్నారు. మండలస్థాయిలో మొదటి మూడు స్థానాలకు గాను 250, 150, 100 రూపాయలు జిల్లాస్థాయి క్రీడాకారులకు 350, 250, 150 రూపాయలు, రాష్టస్థ్రాయి క్రీడాకారులకు 500, 300, 200 రూపాయలు, జాతీయస్థాయి క్రీడాకారులకు 2500, 1500, 1000 రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. దేశంలో ఎక్కడ నైపుణ్యంగల క్రీడాకారులు ఉంటే వారిని గుర్తించేందుకుగాను ఈ ప్రోత్సాహకాలు పనిచేస్తాయి. నైపుణ్యాన్ని గుర్తించడంలో భాగంలో దేశంలో 651 జిల్లాల నుంచి 9,765 మంది క్రీడాకారులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రతి జిల్లా నుంచి 15 మంది క్రీడాకారులను తీసుకొంటూ వారికి గౌరవ భృతి కింద 500 రూపాయలు నెలవారీ ఇవ్వనున్నారు. ఇందులో మూడో అంశమైన అధునిక సౌకర్యాల కల్పన ముఖ్యమైనది క్రీడా మైదానాలు నిర్మించుకోవడం వంటి కోట్లాది రూపాయలతో కూడుకున్న పని కావున ఎంపి ల్యాడ్ స్కీమ్ కింద 50 శాతం వరకు వెచ్చించుకోవచ్చునని ఖేల్ ఇండియాలో పొందపర్చి ఉంది. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లో నిర్మించనున్న మినీ స్టేడియంలు ఈ పథకంలోకి వస్తాయి. ఈ ఖేల్ ఇండియా పథకం ద్వారా అటు క్రీడాకారులు, ఇటు అధునిక సౌకర్యాలు లాభిస్తుందని క్రీడాసంఘాలు పేర్కొంటున్నాయి.

గ్రామ గ్రామాల్లో వైదిక సాంస్కృతి నెలకొనాలి
* స్వామి శ్రీనివాసానంద
నరసన్నపేట, సెప్టెంబర్ 23: సమాజంలో దేశ రాష్ట్రాల్లో భారతీయ సాం స్కృతిని, వైదిక సాంస్కృతిక పెంపొందించే విధంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉత్తరాంధ్రా సాదు సంక్షేమ కార్యదర్శి స్వామిశ్రీనివాసానంద తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక గీతామందిరంలో ఏర్పాటు చేసిన శ్రీరామ పాదుకల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాటి రామరాజ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులుగాని, కరువు కాటకాలు గాని లేకుండా ఉండేవని అయితే ప్రస్తుతం అన్నిరకాలుగా ప్రజలు ఇబ్బందులు పాలౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యంగా వైదిక సాంస్కృతి పట్ల హిందువులు ముందుచూపు లేకుండా వ్యవహరించడమే ముఖ్యకారణంగా తెలుస్తుందని ఈ సాంస్కృతిని పెంపొందించే విధంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని స్పష్టంచేశారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరామపాద పట్ట్భాషేక సామూహిక ఉత్సవాల్లో భాగంగా ఆయన పాదుకలను భక్తులకు అందజేశారు. ఈకార్యక్రమానికి ముందు పాదుకలతో ఆయన తిరువీధిని నిర్వహించారు. ఈకార్యక్రమంలో సమరసత సభ్యులు సూరప్పడు, బాలమురళీ, జి.మోహనరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.