తూర్పుగోదావరి

జిల్లాలో 58 కాల్‌మనీ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ఎస్పీ రవిప్రకాష్ వెల్లడి
అమలాపురం, డిసెంబర్ 18: జిల్లాలో ఇప్పటివరకు 58 కాల్‌మనీ కేసులు నమోదు చేశామని, 100 మంది నిందితుల్ని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ ఎం రవిప్రకాశ్ తెలిపారు. శుక్రవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇంతవరకూ 48 మందిని అరెస్టు చేశామని, మిగిలిన వారు పరారీలో ఉన్నారని వారిని కూడా అరెస్టు చేస్తామని ఆయన హెచ్చరించారు. బాధితుల నుండి బలవంతంగా ఖాళీచెక్కులు, ప్రాంశరీ నోట్ల మీద సంతకాలు తీసుకుని వేధిస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు మలికిపురం, అమలాపురంలో రెండు కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. విజయవాడ తరువాత తూర్పుగోదావరిలోనే కాల్‌మనీ కేసులు నమోదయ్యాయన్నారు. లైన్ బిజినెస్ పేరుతో ప్రజల్ని వేధించేవారిపైనా పోలీసు కొరడా జుళిపిస్తామన్నారు. అమలాపురంలో రౌడీయిజాన్ని ఏరిపారేస్తామన్నారు. రౌడీయిజానికి అడ్డాగా మారిన అమలాపురంపై ఇక నుండి ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. సమావేశంలో డిఎస్పీ ఎల్ అంకయ్య, సిఐలు వైఆర్‌కె శ్రీనివాస్, జి దేవకుమార్, వైవి కృష్ణారావు, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల మధ్యలో మద్యం షాపుపై మహిళల ఆందోళన
సామర్లకోట, డిసెంబర్ 18: సామర్లకోట పెద్దాపురం రోడ్డులో విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరువలో టెండర్ పొందిన నమ్మాలరావు అనే యజూచిక్తి మద్యం దుకాణం ఏర్పాటుచేయబోగా, శుక్రవారం రాత్రి విషయం తెలుసుకున్న మహిళలు మద్యం షాపు ఇళ్ల మద్యలో పెట్టవద్దంటూ ఆందోళనకు దిగారు. గతంలో కృష్ణుని గుడి సమీపంలో నిర్వహించిన మద్యం షాపు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని, ఆ షాపును అక్కడి నుండి తొలగించుటకు తాము అనేక ఇక్కట్లు పడ్డామని, తాజాగా ఇదే ప్రాంతంలో మద్యం షాపు పెడితే తమ సంసారాలు గుల్ల అవుతాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుచేయుటకు వీలులేదని తాము అంగీకరిచేంది లేదని పలువురు మహిళలు పోలీసులకు పోన్‌లో పిర్యాదు చేశారు. మద్యం షాపు పెడితే ఊరుకోబోమని కొంత సేపు నిరసనగా నినాదాలు చేస్తూ ఆ ప్రాంత మహిళలు ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో మహిళలు కొండమ్మ, దుర్గ, లక్ష్మి, సత్యవతి, బ్రహ్మనాయుడు వెలమ సంక్షేయ సంఘం నాయకుడు ఆదపురెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై వివరణకు ఎక్సైజ్ ఎస్‌ఐ వివరణ కోరుటకు యత్నించగా ఆయన సెలవులో ఉన్నట్లు చెప్పారు.
ఏజెన్సీ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం
రాజవొమ్మంగి, డిసెంబర్ 18: నిరక్షరాస్యులు అధికంగా ఉన్న ఏజెన్సీ 11 మండలాల్లో 50 వేల మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించామని వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ పి లక్ష్మీబాయి అన్నారు. మండలంలో నిరక్షరాస్యుల వివరాలు సేకరించేందుకు ఆమె శుక్రవారం రాజవొమ్మంగి వచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సాయంత్రం 6 నుండి 8 గంటలవరకు అక్షర గోదావరి పాఠశాలలను ఏర్పాటు చేస్తామని, అంగన్‌వాడీ వర్కర్ లేదా ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఇన్‌స్ట్రక్టర్‌గా నియమిస్తామన్నారు. ప్రతి 20 మందికి ఒకరిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ఎంపిడివో వీరన్న, ఎంఇవో వరలక్ష్మి నుండి పలు వివరాలు ఆమె సేకరించారు. కార్యక్రమంలో డిడి వెంట ఎపివో బాలయోగి ఉన్నారు.
వైభవంగా శ్రీ పుష్పయాగం
శంఖవరం, డిసెంబర్ 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామివారి నూతన టోల్‌గేట్ ఎదురుగా గల శ్రీ వల్లీ దేవ సేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పుష్పయాగ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు స్వామి, అమ్మవార్లను పలురకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో అలంకరించి మండపంలో ఆశీనులు గావించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శ్రీ పుష్పయాగ మహోత్సవ విశేషాలను వివరించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
మావోయిస్టుల కదలికలు లేవు: ఎస్పీ
ఉప్పలగుప్తం, డిసెంబర్ 18: జిల్లాలో మావోయిస్టుల కదలికలను పూర్తిగా అరికట్టినట్టు ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఉప్పలగుప్తం పోలీసుస్టేషనును ఆయన సందర్శించి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 75 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, వారి కార్యకలాపాలు అరికట్టేందుకు గిరిజన యువతను విద్యావంతులను చేసేందుకు శిక్షణ ఇస్తామన్నారు. చింతూరు, భద్రాచలం, మోతుగూడెంలో శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. జిల్లాలో కాల్‌మనీ కేసుల్లో లైసెన్స్ లేని 120 మందిని గుర్తించి 40 మందిపై కేసులు నమోదు చేసామన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని, సక్రమమైన ఫిర్యాదులైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమలాపురంలో 60 మంది రౌడీలను అరెస్టు చేశామన్నారు. ఫ్లెక్సీలు తొలగించే పని ఆయా పంచాయితీలు, మున్సిపాలిటీలే చేపట్టాలని, వారికి పోలీసులు సహకరిస్తారన్నారు. అనంతరం స్టేషనులో రికార్డులు పరిశీలించారు. సమావేశంలో డిఎస్పీ ఎల్ అంకయ్య, సిఐ టి దేవకుమార్, ఇన్‌చార్జి ఎస్సై దుర్గాశేఖర్ పాల్గొన్నారు.
జగన్ దిష్టిబొమ్మ దగ్ధం
మలికిపురం, డిసెంబర్ 18: అసెంబ్లీలో జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా మండల దేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు జగన్మోహనరెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేసారు. బిఆర్ అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా జగన్ వ్యవహరించటం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు గెడ్డం సింహా, అడబాల యుగంధర్,జిల్లా కార్యదర్శి ఎ సాయిబాబు, జి నరసింహారావు,చెల్లింగి సత్యనారాయణ, గోనిపాటి రాజు, ఆర్ శ్రీనివాసరాజు,పిండిసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘కోట’ రైల్వే స్టేషన్‌లో డిసిఎం ఆకస్మిక తనిఖీలు
సామర్లకోట, డిసెంబర్ 18: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో శుక్రవారం విజయవాడ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వై పుల్లారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నెల 22వ తేదీన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పర్యటన నేపధ్యంలో డిసిఎం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టేషన్‌లో ప్లాట్‌ఫారాల నిర్వహణ, స్టేషన్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫారాలపై ఎటువంటి టిక్కెట్లు లేకుండా తిరుగుతున్న పలువురి నుండి కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేశారు. ఈ సందర్బంగా స్టేషన్ ఆవరణలో నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పెట్టినవారి నుండి కేసులు నమోదు చేసి అపరాధ రుసుములు వసూలు చేశారు. ప్లాట్ ఫారాలపై పారిశుద్ద్యం నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ, తినుబండారాల ధరలు, టిక్కెట్ కౌంటర్ల వద్ద ప్రయణీకుల వసతులు, పార్శిల్ విభాగం సేవలు, విధులను డిసిఎం తనిఖీలు చేసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ పర్యటనకు సంబందించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ సత్యన్నారాయణను ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిసిఎం వెంట స్టేషన్ మేనేజర్ సత్యనారాయణ, హెల్త్ ఇన్స్‌పెక్టర్ వాసుదేవరావు, పార్శిల్ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌చే ఆర్డీవో కార్యాలయం ముట్టడి
అమలాపురం, డిసెంబర్ 18: ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందాకృష్ణమాదిగ ఆదేశాలు మేరకు ఎస్సీ వర్గీకరణకోసం శుక్రవారం అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట కోనసీమ ఎమ్మార్పీఎస్ నాయకులు దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. కోనసీమ అధ్యక్షుడు గంపల సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు దండోరా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగిలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అంబేద్కర్ ఆశయసాధనలో భాగమైన సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూటికుర్తి సత్యనారాయణ, పెదపూడి కృష్ణారావు, కాకిలేటి ఆశీర్వాదం, గంధం యాకోబు,సత్తాల డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
రూ.3 లక్షలు అప్పిచ్చి భూమి కాజేసారు

60 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామంటున్నారు :ఎస్పీ ఎదుట భార్యభర్తల ఫిర్యాదు
అమలాపురం, డిసెంబర్ 18: కుటుంబ కష్టాల కారణంగా మూడు లక్షలు అప్పుతీసుకున్నాం, దానికోసం 36 సెంట్ల తమ భూమిని వడ్డీ బకాసురులు కాజేసారు. తమ ఇంటిలోని టివి, ఫ్రిజ్, చివరికి అన్నం తినే కంచం, గ్లాసు కూడ వదలకుండా పట్టుకుపోయారు. ఇంకా 60లక్షలు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారికి భయపడి విజయవాడలోని మారుమూల ప్రాంతంలో కూలిపని చేసుకుంటూ తలదాచుకున్నామని అమలాపురం రవణం మల్లయ్యవీధికి చెందిన రవణం బాల వెంకన్నాయుడు, అతని భార్య లక్ష్మీనారాయణమ్మ ఎస్పీ ఎం రవిప్రకాశ్ ఎదుట భోరున విలపిస్తూ చెప్పారు. భూసారపు సుబ్రహ్మణ్యం, బొప్పే కోటేశ్వరరావు, గంధం వెంకట సూర్యనారాయణ, రావూరి వెంకటేశ్వరరావు తమ ఇంటిని కాజేసారని, అప్పు మొత్తం చెల్లించినా ఇంకా కట్టాలంటూ తమకున్న 36 సెంట్ల ఖరీదైన భూమిని బలవంతంగా రాయించుకుని 36 లక్షలకు అమ్మేసుకున్నారు. బొప్పే కోటేశ్వరరావు తమకున్న ఆరుసెంట్ల భూమిని కాజేసారు. రావూరి మాణిక్యాలరావు దుర్మార్గంగా తమ ఇంటిలో ఉన్న సామాన్లు పట్టుకుపోయాడని, తాము అన్నం తినే స్టీలు కంచం, స్టీలు గ్లాసు కూడ లేకుండా పట్టుకుపోయాడని లక్ష్మీనారాయణమ్మ బోరున విలిపిస్తూ చెప్పింది. ఇంకా తమను 60 లక్షలు ఇమ్మని లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారి నుండి తమను రక్షించాలని ఎస్పీ ఎదుట లక్ష్మీనారాయణమ్మ బోరున విలపిస్తూ చెప్పింది. ఈమేరకు ఫిర్యాదును ఆయనకు అందజేసారు. తాను న్యాయం జరిగేలా చూస్తానని, వారిపై కేసు నమోదుచేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ వారికి ఆభయం ఇచ్చారు.

రికార్డులు సరిలేకపోతే చర్యలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు జెసి సత్యనారాయణ హెచ్చరిక
రామచంద్రపురం, డిసెంబర్ 18: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయంట్ కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఉన్న తహసీల్దార్లు, పిఎఎంలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల రికార్డులను జెసి పరిశీలించారు. దీనిలో మండపేట మండలం తాపేశ్వరం, బిక్కవోలు మండలం కొమరిపాలెం పిఎసిఎస్‌లో ధాన్యం కొనుగోలు రికార్డులు సరిగా లేవని గుర్తించారు. వారు నిబంధనలు పాఠించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా తహసీల్దార్లను ఆదేశించారు. ప్రధానంగా తహసీల్దార్, పౌర సరఫరాల సిబ్బంది తరచు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రంగు మారిన ధాన్యం ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస మద్దతు ధర చెల్లించి త్వరితగతిన రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 23 నుండి 26 వరకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు రేషన్ కార్డు దారులందరికి ఈ పాస్ యంత్రం ద్వారా పంపిణీ చేయాలన్నారు. కొత్తకార్డు దారులకు కూడా సరుకులు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్డీవో కె సుబ్బారావుతో పాటు డివిజన్ పరిధిలో ఉన్న తహసీల్దార్లు, పౌరసరఫరా అధికారులు పాల్గొన్నారు.