శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రూ. 666.18కోట్లతో కార్పొరేషన్ బడ్జెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, మార్చి 30: నెల్లూరు నగరపాలక సంస్థ 2016-17 సాధారణ బడ్జెట్‌ను 666.18కోట్ల రూపాయలతో కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. గత ఏడాది 140 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఆమోదం పొందగా ఈ ఏడాది నగరపాలక సంస్థ బడ్జెట్ అంతకు నాలుగు ఇంతలు పెరిగింది. గత సంవత్సరం ప్రారంభ నిల్వ 45,27,85,207 కోట్ల రూపాయలు కలిసి ఈ ఏడాది జమలతో కలిపి 620కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో మొత్తం ప్రారంభం నిల్వతో కలిపి 666.18కోట్ల రూపాయల బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే ఈ ఏడాది ఖర్చుల కింద 660.67 కోట్ల రూపాయలను ఖర్చుల కింద చూపించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందుగా మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రెండు నిమషాల పాటు సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం అజెండాలోకి వెళ్లక ముందే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడానికి ఎందుకు ఇంత అలస్యం చేశారో వివరణ చెప్పి అజెండాలోకి పోవాలని పట్టుబట్టారు. దీంతో మేయర్ అబ్దుల్ అజీజ్ బడ్జెట్ సమావేశం ఆలస్యం కావడానికి గల కారణలను అధికారుల చేత కౌన్సిల్‌కు వివరణ ఇప్పించారు. కౌన్సిల్‌లో మేయర్‌కు అండగా ఉండాల్సిన తెలుగుదేశం పార్టీ సభ్యులే ఆయనకు ప్రతికూలంగా మాట్లాడంతో కౌన్సిల్‌లో ఎవరు ప్రతిపక్షమో, స్వపక్షమో కొంతమంది సభ్యులకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ కార్పొరేటర్ కినె్నర ప్రసాద్ తన సోదరుడిని బదిలీ చేయడంతో కౌన్సిల్‌లో ఉద్దేశపూర్వకంగా ఇరుకున పెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య కాసేపు వాదోపవాదాలు జరిగాయి. అదే విధంగా 4వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ మధు కూడా తన కులానికి చెందిన ఒక సీనియర్ శానిటరీ సూపర్‌వైజర్‌ను బదిలీ చేశారని ఉద్దేశంతో మేయర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఒక ప్రధానోపాధ్యాయుడిని తీసుకెళ్లి ఉపాధ్యాయుడు పోస్టు చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. అదే విధంగా మేయర్‌ను ఉద్దేశించి మేయర్‌ను కార్పొరేటర్ సీటులో కూర్చోమని చెపితే ఏలా ఉంటుందో అలా ఉంటుందని శానిటరీ సూపర్‌వైజర్ శివనాగేశ్వరరావును ఉద్దేశించి ప్రసంగించారు. కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ సభ్యులకు దీటుగా 21వ డివిజన్ కార్పొరేటర్ నూనె మల్లికార్జున్ యాదవ్ సమాధానం చెప్పారు. బడ్జెట్ సమావేశానికి ముందుగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా ఆ శానిటరీ సూపర్‌వైజర్ బదిలీని వెనక్కి తీసుకోవాలని మేయర్‌కు సూచించారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో కాసేపు గందరగోళం నెలకొంది. అనంతరం మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ బడ్జెట్ అనేది ఊహాజనితం మాత్రమేనని, అంకెలగారడీ కాదన్నారు. గతంలోలాగా కాకుండా వాస్తవాలకు దగ్గరగా ఉండేలా బడ్జెట్‌ను తయారుచేసి కౌన్సిల్ దగ్గరకు తీసుకుని వచ్చామన్నారు. తొలి విడతగా తయారు చేసిన బడ్జెట్ కాపీలో హడ్కో నుంచి అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పథకానికి దాదాపు 1100కోట్ల రూపాయలు వస్తాయని ఊహించామన్నారు. హడ్కో నుండి రుణం తీసుకుంటే ప్రజలపై భారం మోపాల్సి వస్తుందనే ఉద్దేశంతో జైకాతో ఒప్పందం చేసుకుని ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు రాబడుతున్నట్లు ఆయన వివరించారు. అమృత్ కింద 80కోట్ల రూపాయల దాకా డ్రైన్లకు నిధులు వస్తాయన్నారు. దీని వల్ల ఈ ఏడాది కార్పొరేషన్ బడ్జెట్ భారీ స్థాయిలో పెరిగిందన్నారు. శానిటరీ విభాగంలో కార్మికులకు మంజూరు చేసే సబ్బులు, కొబ్బిరి నూనె, యూనిఫారాలలో జరిగిన అవినీతిపై విచారించేందుకు అన్ని పార్టీలతో కలిపి ఫోర్‌మెన్ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. దీనిపై పూర్తి వివరణ వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటానని మేయర్ పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ కోరిక మేరకు స్పోర్ట్స్ బడ్జెట్‌లో కేటాయించిన దాని కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తానని చెప్పారు. బడ్జెట్‌పై ఏమైనా సూచనలు, సలహాలు సభ్యులు ఇస్తే వాటిని పాటించి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని మేయర్ చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్‌లో ఆమోదం పొందకే హడ్కో రుణం వెనక్కి
- వైఎస్‌ఆర్‌సిపి ఫ్లోర్‌లీడర్ రూప్ స్పష్టం
నెల్లూరు నగరానికి రాబోతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పథకం ప్రాజెక్టులు రాష్ట్ర బడ్జెట్‌లో ఆమోదం పొందకపోవడం వల్ల హడ్కో రుణం ఇవ్వలేదని చెప్పారు. గత బడ్జెట్‌లో స్కూల్స్ అభివృద్ధి కోసం 4కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు చూపించారని, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు. విద్యార్థుల పట్ల అంతా చులకన భావం ఉండకూడదన్నారు. గత రెండేళ్ల నుంచి అంకెల గారడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించడం మంచిది కాదన్నారు. వాస్తవాలకు దగ్గర ఉండే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్నారు. పండుగల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పారు. ఏ పండుగకు ఎంత ఖర్చు పెడుతున్నారో వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. శానిటేషన్ విభాగంలో ఎంతో అవినీతి జరుగుతుందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చాలా డివిజన్లలో కార్మికులు వేలిముద్రలు వేసి వెళుతున్నారే తప్ప పనులు చేయడం లేదన్నారు.
స్పోర్ట్స్‌కు ఎక్కువ నిధులు కేటాయించాలి
- డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్
మునిసిపల్ స్కూల్లో చదువున్న విద్యార్థులను క్రీడా రంగంలో ప్రోత్సాహించేందుకు అధిక నిధులు కేటాయించాలని మేయర్‌ను కోరారు. బడ్జెట్‌లో సూచించిన విధంగా ఏడాదికి 4కోట్ల రూపాయలను స్కూల్స్‌లో వౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నట్లు చూపిస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. ప్రజల దగ్గర స్కూల్స్ అభివృద్ధి కోసం సెస్సు రూపంలో వసూలు చేస్తున్న 3.6 శాతాన్ని పాఠశాలలకు ఖర్చు పెట్టాలని సూచించారు. నగరంలో ఉన్న హోర్డింగ్స్ మీద ఎంత ఆదాయం వస్తుందో చెప్పాలన్నారు. అక్రమంగా ఉన్న ప్రచార హోర్డింగ్‌లను గుర్తించాలని సూచించారు. హోర్డింగ్‌ల మీద సిటీ ప్లానింగ్ విభాగంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.
నిధులు రాబట్టేందుకే కృషి
- టిడిపి కార్పొరేటర్ జడ్ శివప్రసాద్
బడ్జెట్ అనేది ఆశావహ దృక్పథంతో తయారు చేస్తారని టిడిపి కార్పొరేటర్ జడ్ శివప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం నుండి ఏ గ్రాంటు రావాలన్నా బడ్జెట్ ఆమోదం పొందకతప్పదన్నారు. కార్పొరేషన్‌ను మంచిబాటలో నడుపుకునేందుకు సభ్యులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నగరపాలక సంస్థ తరుపున కులాలకు, మతాలకు అతీతంగా అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద ఖర్చు పెట్టడం జరుగుతుందన్నారు. దీనిపై ఎటువంటి అపోహ చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒక కులానికో, మతానికో మేయర్ కొమ్ము కాయడం లేదన్నారు.
సిఎఎం హైస్కూల్‌ను కాపాడండి
- కార్పొరేటర్ లక్ష్మీ సునంద
ఎంతో చరిత్ర గల సిఎఎం హైస్కూల్ అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని మేయర్‌కు కార్పొరేటర్ లక్ష్మీ సునంద సూచించారు. ఈ స్కూల్‌ను యథావిధిగా నడిపించాలని కోరారు. ఎంతోమంది విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించినా కొంతమంది స్కూల్‌ను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న ఈ పాఠశాలను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దాసరి రాజేష్, మనె్నం పెంచలయ్య, ఆనం రంగమయూర్‌రెడ్డి, బొబ్బిలి శ్రీనివాస యాదవ్, కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

దత్తత పల్లెలు ఎప్పటికయ్యేనూ మల్లెలు?
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 30: జిల్లాలో ఆకర్షణీయ గ్రామాలు, వార్డుల కార్యక్రమం తడబడుతుంది. దత్తత స్వీకారం ప్రకటనలకే పరిమితవౌతుంది. సంక్షేమాధివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, సాధికారత, భాగస్వామ్యం స్థానిక నాయకత్వ సహకారంతో ఉత్తమ ఫలితాలు గరిష్ట స్థాయిలో సాధించవచ్చనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ఏడు అభివృద్ధి మిషన్‌లు, ఐదు కార్యకలాపాలు, ఐదు గ్రిడ్‌లు, విద్యుత్, తాగునీరు, గ్యాస్, రహదారుల అనుసంధానం, బ్రాడ్‌బ్యాండ్ అనుసందానంతో ప్రతి గ్రామాన్ని, వార్డును ఆదర్శనీయంగా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమైనప్పటికి అడుగు ముందుకు పడటంలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2014 జనవరి 18న ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆకర్షణీయ గ్రామాలు, వార్డుల కార్యక్రమాలకు అంకురార్పణ చేసింది. అభివృద్ధి ప్రక్రియతో మార్గదర్శక తోడ్పాడుతో ప్రగతి ఉద్యమంలో చేరాలని ప్రజాప్రతినిథులు, ప్రవాస భారతీయులు, గ్రామానికి చెందిన నివాసేతర ఆర్థిక సంపన్నులు, వివిధ పరిశ్రమలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రముఖులు ఇందులో భాగస్వాములు కావాలని కోరింది. జిల్లాలోని 46 మండలాలు, 960 పంచాయతీలు, నగర కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రభుత్వ పిలుపుకు స్పందించిన వారు వందల సంఖ్యలో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ, వార్డులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. దత్తత కార్యక్రమంతో కొద్దిమంది మాత్రమే భాగస్వామ్యమయ్యారు. గ్రామ, వార్డుల స్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు దాతలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రతి పంచాయతీ, వార్డులకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. దాతలు అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేయటంలో వీరు ప్రధాన భూమిక పోషించారు. గ్రామాలను, వార్డులను కొందరు పేరు కోసం దత్తత తీసుకున్నారే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని స్పష్టవౌతుంది. మొదటలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు దాతలు, అధికారులు విస్తృత సమావేశాలు నిర్వహించి అనంతరం గాలికి వదిలేశారు. ఒకరో ఇద్దరో దాతలు దత్తత తీసుకున్న గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అలాంటి వారిలో పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న రాజ్యసభ సభ్యులు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కంపసముద్రాన్ని దత్తత తీసుకున్న ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కలెక్టర్ ఎం జానకి, మరికొంత మంది ప్రజా ప్రతినిధులు దత్తత తీసుకున్న వారిని మినహాయిస్తే ఎక్కడా దత్తత గ్రామాల ఊసే లేదు. వాస్తవానికి జిల్లా ఉన్నతాధికారులందరూ తలా ఒక గ్రామాన్ని దత్తత స్వీకరించినా వాటివైపు కనె్నత్తి చూసిన పాపాన పోలేదు. ప్రాథమిక సర్వే చేయకపోతే గ్రామాలు, వార్డుల్లో ఎలాంటి సర్వే కార్యక్రమాలు చేపట్టలేము, ఏడాదిగా సర్వే చేస్తున్నామని గ్రామ పంచాయతీ, వార్డుల అధికారులు చెపుతున్నా అవి ఇంతవరకు పూర్తి కావటం లేదు. చర్యలు తీసుకోవాల్సిన పాలన యంత్రాంగం నిస్తేజంగా ఉంది. ప్రస్తుతం ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో? ఎలాంటి వనరుల అవసరం ఉందో? పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించాల్సి ఉంది. అపుడే దాతలు, ప్రజలు, ప్రజా ప్రతినిథులను భాగస్వాములను చేసి క్షేత్ర స్థాయిలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. జిల్లాలో చాలామంది ప్రజా ప్రతినిథులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయినా పూర్తి స్థాయిలో ఎక్కడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. ముందుగా ప్రజా ప్రతినిథులు తమ దత్తత గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తే దానిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన వారు సైతం ముందుకు వచ్చి చురుకుగా పనిచేసే అవకాశం ఉంది. అధికారులు కూడా సమష్టిగా దత్తత స్వీకరించిన దాతలను ప్రోత్సహించి పనులు చేపట్టేలా చూసే బాధ్యత వారిపై ఉంది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ త్వరగా చేపట్టాలి
* జిల్లా కలెక్టర్ జానకి ఆదేశం
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 30: గ్రామాల్లో శ్మశాన వాటికల అభివృద్ధి, నిర్మాణాల కోసం ప్రతిపాదనలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ ఎం జానకి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం నుండి బుధవారం వివిధ పథకాలు, పనులపై సంబంధిత మండల, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, సంబంధిత ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. పింఛన్ల పంపిణీ, జాతీయ గ్రామీణ ఉఫాధి హామీ పథకంలో చేపట్టిన సిసి రోడ్లు, పంట గుంటలు, శ్మశానవాటికల అభివృద్ధి, నిర్మాణాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అందుకు నిర్ధేశించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహించుటలో ప్రత్యేక అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సిసి రోడ్ల నిర్మాణ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఆయా మండలాల ఉఫాధిహామీ, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొత్త పనులు చేపట్టేందుకు అవసరమైన అంచనాలు తయారు చేసి తగిన ప్రతిపాదనలు పంపాలన్నారు. శ్మశానవాటికలు గ్రామానికి ఒకటి చొప్పున అభివృద్ధి చేసి నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాలను గుర్తించి సేకరించాలన్నారు. పంట గుంటల ద్వారా చేపట్టే పంట సంజీవని పథకంలో నిర్మాణాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్యలను అధిగమించాలని ప్రత్యేకించి ఎన్‌టిఆర్ జలసిరి లక్ష్యాలను సాధించటంలో డ్వామా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆత్మగౌరవం కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఉఫాధిహామీ కూలీలతో పనులు చేపట్టాలన్నారు. ఇందుకోసం అన్ని స్థాయిల అధికారులు భాగస్వాములై నిర్ధేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జెసి ఎఎండి ఇంతియాజ్, డిఆర్‌డిఎ పిడి చంద్రవౌళి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ డి బుగ్గయ్య, సాగునీటి ఎస్‌ఇ సుబ్బారావు, జిల్లా ప్రణాళికాధికారి కెబికె మూర్తి, పౌర సరఫరాల అధికారి ధర్మారెడ్డి, మేనేజరు కొండయ్య, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఇ ఆర్‌వి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

షార్ ఉద్యోగులు వర్సెస్ సిఐఎస్‌ఎఫ్
* విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయింపు
* కంట్రోలర్ రంగంలోకి దిగడంతో సద్దుమణిగిన వివాదం
సూళ్లూరుపేట, మార్చి 30: షార్ కేంద్రంలో మరోసారి సిఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది, షార్ ఉద్యోగుల నడుమ తీవ్ర విభేదాలు తలెత్తడంతో శ్రీహరికోట రెండో గేటు సమీపంలో బుధవారం కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మిషన్ కంట్రోల్ సెంటర్, స్ప్రాబ్, ప్రయోగ వేదికలు తదితర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు షార్ బస్సులోనే విధులకు వెళ్తారు. రెండో ప్రధాన గేటు వద్ద ఉద్యోగులు తెచ్చుకున్న భోజన బ్యాగ్‌లు తదితర వాటిని బస్సుల్లోనే ఉంచి గేటు వద్దకు వెళ్లి పంచింగ్ చేసి మళ్లీ గేటు అవతల బస్సులు ఎక్కుతారు. ఉద్యోగులు అదే విధంగా బ్యాగ్‌లు బస్సులోనే పెట్టి వెళ్తుండగా అక్కడ విధినిర్వహణలో ఉన్న సిఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది బస్సులను ఆపి బ్యాగ్‌లు కూడా మీతోపాటే తేవాలి. తనిఖీ చేయాలి, అందరూ కిందకి దిగాలన్నారు. విధులకు పోయేటప్పుడు ఏమి తనిఖీలు, ముగించుకొని వచ్చేటప్పుడు కదా తనిఖీలు చేసేదని ఉద్యోగులు సిఐఎస్‌ఎఫ్ సిబ్బందితో వాదించారు. తనిఖీలు చేయనిదే పోనివ్వమని భద్రత సిబ్బంది ఉద్యోగుల బ్యాగులు తదితర వాటిని తనిఖీ చేసేందుకు ప్రయత్నించడంతో వారు ఆగ్రహానికి గురై ఉద్యోగులకే తనిఖీలా, ఇదేమి వివక్ష అంటూ భద్రత సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసి అందరూ బస్సులు దిగి అక్కడే రోడ్డుపై బైఠాయించి సిఐఎస్‌ఎఫ్ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించడంతో మొదటి గేటు వరకు ఎక్కడి బస్సులు అక్కడ నిలచిపోయాయి. ఉద్యోగులు చేసే నిరసనను సిఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ త్రిపాటి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన ఉద్యోగులు సెల్‌ఫోన్‌ను లాగేసుకునేందుకు కమాండెంట్ వైపు దూసుకెళ్లారు. దీంతో అక్కడ నుండి కమాండెంట్ ఉద్యోగులకు దొరక్కుండా వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి విధుల నుండి అసిస్టెంట్ కమాండెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. విషయాన్ని తెలుసుకొన్న షార్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌తో పాటు యూనియన్ నాయకులు అక్కడకు చేరుకొని భద్రతా సిబ్బంది తనిఖీల తీరును తప్పుబట్టారు. ఉద్యోగుల నినాదాలతో రెండో గేటు ప్రాంగణమంతా ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఉదయం 8గంటల నుండి 10గంటల వరకు కూడా ఉద్యోగులు రోడ్డుపైనే నిరసనలు చేశారు. 11గంటలకు మళ్లీ సిఐఎస్‌ఎఫ్ తనిఖీలకు అందరూ సహకరించాలని చెప్పడంతో మేము ఉద్యోగులమా, తీవ్రవాదులమా, విధులకు వెళ్లేటప్పుడు ఏమి తనిఖీలు, సాయంత్రం వచ్చేటప్పుడు తనిఖీలు చేసుకోండి, కొత్తకొత్త విధానాలు తెచ్చి ఉద్యోగులను అవమానపరచకండి అంటూ మండిపడ్డారు. మధ్యాహ్నం వరకు కూడా విధులకు హాజరుకాకపోవడంతో షార్ కంట్రోలర్ జెవి.రాజారెడ్డి రంగంలోకి దిగారు. వెంటనే కంట్రోలర్ అక్కడకు చేరుకొని ఇటు ఉద్యోగులతో, అటు భద్రతా సిబ్బందితో మాట్లాడి సర్ది చెప్పారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగవని ఉద్యోగులకు సర్దిచెప్పి కమాండెంట్‌తో మాట్లాడి శాంతింపచేశారు. దీంతో ఉద్యోగులు మెట్టుదిగి మధ్యాహ్నం 12:30 గంటల పైబడి విధులకు హాజరయ్యారు. గతంలో కూడా ఇలాంటి వివాదాలు తలెత్తి ఉన్నాయి. ఇలాంటి సంఘటలను పునరావృతం కాకుండా షార్ కంట్రోల్ విభాగంలో భద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అక్రమ సంబంధంతో ఒకరు దారుణ హత్య
నెల్లూరురూరల్, మార్చి 30: నగర శివారు ప్రాంతమైన కొత్తూరులోని చంద్రబాబునాయుడునగర్‌లో ఉమ అనే మహిళతో సహజీవనం చేస్తున్న పురుషోత్తంరెడ్డి (45) ఆమె చేతిలోనే దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పురుషోత్తంరెడ్డి గత కొంతకాలంగా ఉమ అనే మహిళతో సహజీవనం చేస్తూ చంద్రబాబునాయుడునగర్‌లో కాపురం పెట్టాడని, ఆ మహిళకు అదేప్రాంతంలో ఓ గృహాన్ని కూడా నిర్మించి ఇచ్చాడని తెలిపారు. పురుషోత్తంరెడ్డికి ఉమకు మధ్య విభేదాలు రావడంతో తాను కట్టించిన ఇంటిని అమ్మకానికి పెట్టాడని, అందుకు ఉమ విభేదించినట్లు స్థానికులు తెలిపారు. ఇల్లు అమ్మిన నగదు మొత్తం తనకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసిందని, ఈ నేపధ్యంలో బుధవారం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు చెప్పారు. మంగళవారం రాత్రి ఉమ సోదరుడు ఇంటికి వచ్చాడని, అక్కా తమ్ముడు కలసి పురుషోత్తంరెడ్డిపై ఇనుపరాడ్‌లు, ఇతర మారణాయుధాలతో దాడి చేయడంతో ఆయన మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతిచెందిన వెంటనే వారిరువురూ పరారయ్యారని, ఇంట్లో మనుషులు ఎవరూ లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా పురుషోత్తంరెడ్డి రక్తపుమడుగులో మృతి చెంది ఉన్నాడని, వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. పురుషోత్తంరెడ్డిది నగరంలోని జడ్పీకాలని అని కొందరు, రాపూరు గ్రామం అని మరికొందరు తెలుపుతున్నారు. ఇప్పటికే ఇతనికి వివాహమైందని, అయినా ఉమతో సహజీవనం సాగిస్తున్నాడని వారు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టినట్లు ఎఎస్సై నరసింహారావు తెలిపారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఐపివి వ్యాక్సిన్‌పై అవగాహన అవసరం
* డిఎంహెచ్‌ఓ వరసుందరం సూచన
సూళ్లూరుపేట, మార్చి 30: సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలను జిల్లా వైద్యాధికారి పి.వరసుందరం బుధవారం పరిశీలించి అక్కడ వైద్యుల పనితీరును అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలకు పేదలు ఎక్కువగా వస్తారని, వారికి అన్ని సేవలు అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. విధి నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వైద్యశాలలో సిబ్బంది పనితీరు ఇంకా మెరుగు పడాలన్నారు. గర్భిణులందరూ కాన్పులకు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేలా నమ్మకం కలిగించాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఐపివి వ్యాక్సిన్ పై సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలియో చుక్కలకు బదులు ఈ వ్యాక్సిన్ కొత్తగా వచ్చిందన్నారు. 6, 14వారంలో ప్రతి చిన్నారికి 0.1 ఎమ్‌ఎల్ సూది రూపంలో వ్యాక్సిన్ వేయాలన్నారు. ఏప్రిల్ 26 నుండి దీనిని ప్రారంభిస్తామని, సిబ్బంది అందరూ గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై అవగాహన కల్పించాలన్నారు. పోలియో మూడు రకాలు ఉంటుందని, అందులో మొదటి రకం పూర్తిగా నిర్ములించామని తెలిపారు. ఐపివి వ్యాక్సిన్ రెండు, మూడో రకాలకు సంబంధించిన వ్యాక్సిన్ అని పేర్కొన్నారు. ఇంతకు ముందు పోలియోకు చుక్కల మందు వేసేవాళ్లమని, ఇప్పుడు ఐపివి వ్యాక్సిన్‌ను కుడిచేతి కింద భాగంలో సూది రూపంలో వేయాలన్నారు. డయేరియాను పూర్తిగా నిర్ములించేందుకు రోటా వైరస్ కూడా అందుబాటులోకి తెచ్చామని, దీనిపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలన్నారు. డయేరియా బారిన పడి అనేక మంది చిన్నారులు మృతి చెందుతున్నారని, రోటా వ్యాక్సిన్ 6,10,14 వారాల్లో వేయాలన్నారు. వైద్యశాల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత సిబ్బందేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఓ మస్తానమ్మ, క్లస్టర్ సిబ్బంది సుధారాణి, పరమేశ్వరి, దయాకర్ పాల్గొన్నారు.

దళారులపాలవుతున్న ధాన్యం
కొండాపురం, మార్చి 30: మండలంలో అరకొర పండిన ధాన్యం దళారుల పాలవుతోంది. దీంతో ఏమీచేయలేక చేతులెత్తేస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ నెలలో వర్షాలు విస్తృతంగా కురిసాయి. దీంతో రైతులు వరిపైరును సాగు చేశారు. ఆ తరువాత ఒక్కసారికూడా వర్షం కురవకపోవడంతో చెరువుల్లోని నీరు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో అన్ని గ్రామాల్లో చివరి తడికి నీరు తగ్గింది. దీంతో అరకొరగా పంట దిగుబడి వచ్చింది. గత 20రోజులుగా రైతులు వరిపంట కోతలు ప్రారంభించారు. మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా పనిమొదలు పెట్టలేదు. దీంతో రైతులు తాము పండించిన పంటను దళారులకే విక్రయించుకోవాల్సి వస్తోంది. ఇందువల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. మండలంలో ఎక్కువగా రైతులు ఏ గ్రేడు రకాన్ని సాగు చేశారు. ప్రభుత్వ ధరకంటే దళారులు ధాన్యాన్ని అత్యంత తక్కువ ధరకు రైతుల నుండి కొనుగోలు చేస్తున్నారు. కాటా విషయంలో కూడా ప్రతి బస్తాకు 2నుండి 4కిలోల వరకు ఎక్కువగా వేస్తున్నారు. కొందరు రైతులు దీనిని గమనించినా ఏమీ చేయలేక, చెప్పుకునే దిక్కులేక వౌనంగా ఉంటున్నారు. పంట సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీ పెరగకుండా తీర్చాలంలే పంట త్వరగా అమ్ముకోవాల్సి వస్తోందని, ప్రభుత్వ కేంద్రాలు పనిచేయక పోవడంతో దళారులకే ఎంత నష్టానికైనా అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రైతులు దళారుల చేతిలో దగాకు గురవుతున్నారు.

విద్యుత్‌షాక్‌తో విద్యార్థిమృతి
విడవలూరు, మార్చి 30: మండలంలోని చౌకచర్ల గ్రామంలో బుధవారం సాయంత్రం విద్యుత్ షాక్ తగిలి బుధవారం సాయంత్రం ఆరవ తరగతి విద్యార్థి సాయికిరణ్ (11) మృతి చెందాడు. గ్రామంలోని పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా సీరియల్ విద్యుత్ బల్బులు వేసి వుండగా వాటిని విద్యార్థివాటిని కొరకడంతో షాక్ తగిలి మృతి చెందాడు. పాఠశాల వార్షికోత్సవం కొంతసేపటిలో జరగనుండగా ఆరవ తరగతి విద్యార్థి మరణించడంతో పాఠశాలలో విషాదచాయులు అలుము కొన్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమలింగేశ్వరరావు విద్యార్థికి నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ సమాధి కృష్ణవేణి విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించారు.

విషాదంతోనే టెన్త్ పరీక్షకు హాజరైన ఖాజామొహిద్దీన్
వింజమూరు, మార్చి 30: తండ్రి మృతి చెందిన విషాదంతోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితి వింజమూరుకు చెందిన ఖాజామొహిద్దీన్‌కు ఏర్పడింది. వింజమూరు పోస్ట్ఫాస్‌లో కాటేపల్లి, చాకలికొండ సబ్ సెంటర్లకు పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్న ఖాజానాయబ్ రసూల్ విధి నిర్వహణలో హృద్రోగానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మంగళవారం మధ్యాహ్నం మరణించారు. ఈయన గత ఇరవై సంవత్సరాల నుంచి పోస్ట్ఫాస్‌లో పనిచేస్తున్నాడు. కుటుంబ యజమాని మరణంతో భార్య, ముగ్గురు పిల్లల సంతానం దిక్కులేని వారయ్యారు. తండ్రి మృతదేహాన్ని ఇంటిలో ఉంచుకునే పుట్టెడు దుఃఖంతో అతని కుమారుడు ఖాజామొహిద్దీన్ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షలు రాసి వచ్చిన అనంతరం అంతిమయాత్ర నిర్వహించారు.