శ్రీకాకుళం

వ్యవసాయ కూలీ నేత్రాల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, డిసెంబర్ 2: మండలంలోని సవరడ్డపనస గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చల్ల మల్లేసు(65) నేత్రాలను ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. మృతుని కుమారుడు నారాయణరావు 104 వాహనంలో పైలట్‌గా పనిచేస్తున్నారు. పొలంలో పనిచేయడానికి వెళ్లిన మల్లేసు మంగళవారం సాయంత్రం గుండెపోటుతో పంటపొలంలోనే మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నారయణరావు కుటుంబ సభ్యులను సంప్రదించి మృతుని నేత్రాలను దానం చేయడానికి నిర్ణయించారు. ఈమేరకు రెడ్‌క్రాస్ సొసైటీకి సమాచారం ఇవ్వగా సొసైటీ వైద్య సిబ్బంది కృష్ణమూర్తి, జగన్నాధం, సవరడ్డపనస చేరుకొని మల్లేసు మృతదేహం నుండి నేత్రాలను సేకరించారు.

టిడిపి పేదల పక్షపాతి: జెడ్పీ చైర్‌పర్సన్
ఎచ్చెర్ల, డిసెంబర్ 2: ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతిగా నిలుస్తూ వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించిందని జెడ్పీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకు నడిపిస్తున్నారన్నారు. బుధవారం మండలంలోని కొత్తపేట, దోమాం గ్రామాలలో జనచైతన్య యాత్రలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం లోట్‌బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఎన్నికలహామీలను దశలవారీగా అమలుచేస్తూ ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. వౌలిక సదుపాయాలతోపాటు విద్యాబలోపేతానికి అదనపు భవనాలు, మరుగుదొడ్లు నిర్మాణాలకు నిధులు కేటాయించారన్నారు. ఈకార్యక్రమాలను ప్రజలకు వివరించి చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపరిచేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పార్టీ శ్రేణులు వ్యవహరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా టిడిపి పూర్వపుఅధ్యక్షులు చౌదరి బాబ్జీ, ఎంపిపి బల్లాడ రమణారెడ్డి, మండల పార్టీఅధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, సర్పంచ్‌లు పొన్నాడ తులసమ్మ, బి.కోటిరెడ్డి, ఎంపిటీసీలు అనె్నపు వరలక్ష్మీ, పొన్నాడ అప్పలనాయుడు, అనె్నపు శ్రీమన్నారాయణ, భువనేశ్వరరావు, వావిల్లపల్లిరామకృష్ణ, పి.వెంకటరమణమూర్తి, ఏ ఎంసి డైరెక్టర్లు సురేంద్ర, వెంకటరావు, గాలి వెంకటరెడ్డి, పంచిరెడ్డి కృష్ణారావు, గూరు జగదీశ్, భీమారావు ఉన్నారు.

‘సహకార చక్కెర కర్మాగారం ఏర్పాటును స్వాగతిస్తాం’
శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 2: జిల్లాలోని ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారం ప్రారంభం అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, వైకాపా హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చక్కెర కర్మాగారం ప్రారంభం కాబోతుందని, కోర్టు ప్రాథమిక తీర్పు ఇచ్చిందని, పరిశ్రమపై కోర్టుకు వెళ్లిన వారికి ఇస్తామన్న సొమ్ముకు మరికొంత ముట్టజెబితే సమస్య పరిష్కారం అవుతుందని కొంతమంది వ్యక్తులు పేర్కోవడం నమ్మశక్యంగా లేదన్నారు. అసలు కోర్టు తీర్పు ప్రాథమిక, మద్య, అంతిమ తీర్పు అంటూ ఉంటుందా? అంటూ ఎద్దేవా చేసారు. పరిశ్రమ మూసివేసి 13 ఏళ్లుకాగా మూలధనంపై వడ్డీనే సుమారు 16 కోట్ల రూపాయలు అవుతుందని తెలిపారు. అయితే పరిశ్రమ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు తప్ప దానిని ప్రభుత్వ రంగ సంస్థగానా, ప్రైవేట్ రంగ సంస్థగా ప్రారంభిస్తారా స్పష్టం చేయాలన్నారు. ఏదేమైనా పరిశ్రమ ప్రారంభమైతే తాము స్వాగతిస్తామని చెప్పారు. ఇదిలావుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం సాధించిందని జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిన చంద్రబాబు నాయుడు వీటిని జనచైతన్య యాత్రలు అనే బదులు జనమోసం యాత్ర అని చెబితే బాగుంటుందని ఎద్దేవా చేసారు. సమావేశంలో ఎన్ని ధనుంజయ, రొక్కం సూర్యప్రకాశరావు, శ్రీనివాస పట్నాయక్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పేడాడ అశోక్ తదితరులు పాల్గొన్నారు

‘మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించాలి’
పాతశ్రీకాకుళం, డిసెంబర్ 2: నచ్చిన రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్ధికంగా స్వావలంబన సాధించాలని శ్రీకాకుళం శాసనసభ సభ్యురాలు గుండ లక్ష్మీదేవి అన్నారు. స్థానిక పాలకొండ రోడ్డులోగల సృజన వికాస సంక్షేమ సొసైటీ భవనంలో బుధవారం ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఫ్యాషన్‌డిజైనింగ్ రంగంలో మంచి అవకాశాలున్నాయని అన్నారు. భారత ప్రభుత్వ మినిస్టీరియల్ టెక్స్‌టైల్స్ మరియు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక సలహా సంస్ధ( ఎపిట్కో) ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా స్వావలంబన సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఎపిట్కో రీజనల్ అధికారి జి.సత్యన్నారాయణ మాట్లాడుతూ టెక్స్‌టైల్ రంగంలో ఉపాధి విస్తృతంగా అవకాశాలున్నాయని వివరించారు. మెప్మా పధక సంచాలకులు త్రినాధ్, ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ క్రిష్ణవేణి, జిల్లా కో- ఆర్డినేటర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

‘4.50 లక్షల మందికి ఉపాధే లక్ష్యం’

జలుమూరు, డిసెంబర్ 2: జిల్లాలో 4.50 లక్షల మంది కూలీలకు ఉపాది కల్పించడమే గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యమని ఈ శాఖ ప్రాజెక్ట్‌డైరెక్టర్ ఆర్. కూర్మనాథరావు అన్నారు. ఉపాధి హామీ పథకంలో యలమంచిలి, వెంకటాపురంలో పెంచుతున్న మామిడి, కొబ్బరిమొక్కల పరిస్థితిని బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా కలిసిన విలేఖర్లతోమాట్లాడుతూ తమ శాఖ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుతం ఈ ఏడాది 3.10లక్షల మందికి ఉపాది కల్పించినట్లు దీని కోసం రూ.210కోట్లు ఖర్చు అయిందని ఆయన స్పష్టంచేశారు. మరో రూ.200కోట్లు మార్చిలోగా ఖర్చుచేస్తామని తెలిపారు. జిల్లాలో కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని 18 మండలాల్లో ఇప్పటివరకు 250 ఎకరాల్లో పశుగ్రాసం పండిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు పెంచే లబ్ధిదారులు మరింత ఉత్సాహంతో పెంచాలని సూచించారు. ఏపిడి శైలజ, ఏపివో సీతారాం, టెక్నికల్ అసిస్టెంట్‌లు ఉన్నారు.

‘న్యాయవ్యవస్ధపై నమ్మకం కలిగించాలి’
పాతశ్రీకాకుళం, డిసెంబర్ 2: ప్రజలకు న్యాయవ్యవస్ధపై నమ్మకం కలిగించేలా న్యాయవాదులు, న్యాయమూర్తులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.అప్పారావు అన్నారు. జిల్లా బార్ సమావేశమందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజలకు న్యాయవ్యవస్ధపై అపార నమ్మకం, గౌరవం ఉన్నాయన్నారు. న్యాయమూర్తులు,న్యాయవాదులు ఒకే కుటుంబమన్నారు. ఇద్దరు సమన్వయంతో పనిచేస్తేనే కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. న్యాయవ్యవస్ధపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈనెల 12న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు. సీనియర్ న్యాయవాది చెల్లూరు సూర్యనారాయణ చిత్రపటంను ఆవిష్కరించారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక సూర్యారావు జరిగింది. 1వ అదనపు జిల్లా న్యాయమూర్తులు సత్యశ్రీ, గౌతమ్‌ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మేరీ గ్రేసీకుమారి, పి.అన్నపూర్ణ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి రాజేంద్రప్రసాద్, జ్యూడీషియల్ ఫస్టుక్లాసు మెజిస్ట్రేట్ నాగమణి, ఎక్సైజ్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు, మొబైల్ మెజిస్ట్రేట్ సాయిసుధ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మజ్జి సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు పార్దసారధి, సీనియర్ న్యాయవాదులు రమణదయాల్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

‘గ్రామాల్లో జనవరి నుండి నెలవారీ విద్యుత్ బిల్లులు’
నరసన్నపేట, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇకపై నెలవారి బిల్లులను వసూలు చేస్తామని స్థానిక విద్యుత్ శాఖ ఎడిఇ రామినాయుడు తెలిపారు. బుధవారం ఇక్కడి ఆశాఖ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఎఇలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం పట్టణ ప్రాంతాల్లోమాత్రమే నెలవారీ బిల్లులను నిర్వహిస్తున్నామని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రెండునెలలకొకసారి వసూలు చేసేవారమని తెలియజేశారు. వచ్చే జనవరి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెలవారీ బిల్లులు వసూలు చేస్తామన్నారు. పోలాకి, నరసనన్నపేట, జలుమూరు, కోటబొమ్మాళి ఏ ఇ లు పాల్గొన్నారు.

7న సిఎం రాక
ఆంధ్రబూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 2: ఈనెల 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు అందిన సమాచారం ప్రకారం వజ్రపు కొత్తూరు మండలంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు

ఆఫ్రికా కందిపప్పు రూ. 123కే అమ్మాలి
* కల్తీని సహించేది లేదు: జెసి
శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 2: ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఆఫ్రికన్ కందిపప్పును జిల్లాలోని అందరు రిటైల్ వర్తకులు 123 రూపాయలకే అమ్మాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశాలు జారీచేసారు. బుధవారం స్థానిక ఆయన ఛాంబర్‌లో మోనిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన హోల్‌సేల్ వర్తకులు, రిటైల్ వర్తకులు, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కందిపప్పురిటైల్ విక్రయాల గూర్చి వివరించగా, హోల్‌సేల్ వర్తకులు 120 రూపాయలకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసారు. అనంతరం కందిపప్పుపై రంగులు చల్లుతున్నారని, అటువంటివాటిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చేపల మార్కెట్‌లో ఇప్పటికీ రాళ్లు వినియోగించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఎలక్ట్రానిక్ కాటాలనే ఉపయోగించాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. జిల్లాలో పలాస, నరసన్నపేట, టెక్కలి, పాలకొండల్లో మొబైల్ రైతు బజార్లు ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు తయారుచేసామని, వాటి ఏర్పాట్లు ఎంత వరకూ వచ్చాయని మార్కెటింగ్ సహాయ సంచాలకులను ప్రశ్నించారు. వాటిని మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేయడానికి వీలులేనందున, స్థలసేకరణకై ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన జవాబిచ్చారు. జిల్లా పౌరసరఫరా అధికారి సీతారామారావు, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు, రైతు బజారు ఎస్టేట్ అధికారి డి.లక్ష్మణరావు పాల్గొన్నారు.

వంశధార సాక్షిగా ఎన్టీఆర్‌ను మరచిన తమ్ముళ్లు!
జలుమూరు, డిసెంబర్ 2: దేశ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించి, తనకంటూ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదింకున్న దివంగత ఎన్టీ ఆర్ అస్థికలు కలిపిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం. వంశధార నది సాక్షిగా నాటి తెలుగుదేశం తమ్ముళ్లు ఇచ్చిన హామీ రెండు దశాబ్దాలు గడిచినా నెరవేరకపోవడం విమర్శలకు గురి అవుతున్నది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ 1995 జనవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. అయన అంత్యక్రియలు అనంతరం అస్థికలు(చితాభస్మం) టెక్కలి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నుండి నేరుగా అధికార లాంఛనాలతో నాటి రాష్ట్ర మంత్రి తమ్మినేని సీతారాం, ప్రభుత్వ విప్ కింజరాపు ఎర్రన్నాయుడు, ఎమ్మెల్యే అప్పలసూర్యనారాయణ, శ్యాం సుందరశివాజీ, బగ్గు లక్ష్మణరావులు తదితరులు కలిసి శ్రీముఖలింగం వంశధార నదిలో కలిపారు. ఆ మహానేత చితాభస్మాన్ని ఇక్కడ కలుపుతూ ఈ ప్రాంతాన్ని (పుట్టరేవు) ఎన్టీఆర్ ఘాట్‌గా నామకరణం చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అప్పుడు ఆ నేతలు ఇచ్చిన హామీ మూట నేటికి నెరవేరలేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి చితాభస్మం సాక్షిగా ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చకపోవడంపై ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా జిల్లాలోని తెలుగుదేశం నేతలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పుట్టరేవును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఎన్టీఆర్‌కు నివాళి అర్పించాలని కోరుతున్నారు. మహానేతకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధానికి ఒక రూపం కల్పించాలని కోరుతున్నారు.

రేపటి నుంచి కార్తీక కళామహోత్సవం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 2: జిల్లాలో సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కార్తీక కళా మహోత్సవాలను ఈనెల 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. బుధవారం ఇక్కడి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవాన్ని సంగీత నాట్య కళా గురుకులం (సంప్రదాయం) ఆధ్వర్యంలో నిర్వహించనున్నామన్నారు. సంప్రదాయం సంస్థ ప్రతి ఏటా కార్తీక కళా మహోత్సవాన్ని నిర్వహించేందుకు తలపెట్టిందని, అందులో బాగంగా జిల్లాలో ఈనెల 4నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహోత్సవంలో జాతీయ స్థాయి కళాకారులు, స్థానిక కళాకారుల సమ్మిళితంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో జిల్లా సాంప్రదాయం కలకాలం ఉండాలని, ఈ ప్రాంత కళావికాసానికి దోహదం కావాలని ఆకాంక్షించారు. 4వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడి బాపూజీ కళామందర్‌లో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన పద్మశ్రీ శోభానాయుడు శ్రీకృష్ణ పారిజాతం నృత్యం ఉంటుందన్నారు. దీంతో పాటు సుందరపల్లి శ్రీను మంగళధ్వని, తిమ్మరాజు నీరజ బృందంచే నేనే శ్రీకాకుళం ప్రార్థనా నృత్యం, పాణిగ్రాహి ఘంటసాల ఆరాధన, మంతెన వాసుదేవరావు గజల్స్, ఎల్.నందికేశ్వరరావు మిమిక్రీ ఉంటాయన్నారు. 5వ తేదీన బండారు చిట్టిబాబు బృందంచే లలిత సంగీతం, శివ బృందం నాట్యరూపకం, ప్రధాన ఆదినారాయణ గజల్, మావుడూరు సత్యన్నారాయణ శర్మ వయోలిన్, డాక్టర్ మీగడ రామలింగస్వామి శ్రీకాళహస్తి మహాత్మ్యం ఉంటాయని తెలిపారు. 6వ తేదీన ముంగండి లోకేష్ మంగళధ్వని, దూసి కనకమహాలక్ష్మి అన్నమయ్య పాటలు, తిమ్మరాజు నీరజ గిరిజా కళ్యాణం, వేదుల శ్రీనివాస్ మాట్లాడే బొమ్మ, సంజయ్‌కుమార్ జోషి కథక్ నృత్యం ఉంటాయని చెప్పారు.
* సంప్రదాయం నిర్మాణ బాధ్యతలు జెఎన్‌టియుకెకు
సంప్రదాయం సంస్థ నిర్మాణ బాధ్యతలను కాకినాడ జెన్‌టియుకె వారు చేపట్టారని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 28వ తేదీన సంప్రదాయ ట్రస్టు ప్రథమ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించి, ఇందులో సంస్థ నిర్మాణ బాధ్యతను జెఎన్‌టియుకెకు అప్పగించడమైందన్నారు. జిల్లా సంస్కృతికి అద్దంపట్టే విధంగా నిర్మాణాలు, సంస్థ కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సాయం అందించనుందన్నారు. బెంగుళూరుకు చెందిన వారణాసి సత్యప్రకాష్ అర్కిటెక్టుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలు తాత్కాళికంగా స్వాతి సోమనాథ్‌కు అప్పగిస్తూ ట్రస్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే మే, జూన్ నాటికి నిర్మాణాలు పూర్తికాగలవని, ఇది పూర్తిగా గురుకులం పద్ధతిలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ పురుషుల కళాశాలలో కళల్లో డిప్లొమో కోర్సును ప్రారంభించి, అక్కడ సర్ట్ఫికేట్ కోర్సుకు శిక్షణ నివ్వనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి, జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు తదితరులు పాల్గొన్నారు.

కల్తీ మద్యం విక్రయాలు!
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
మద్యం వ్యాపారులకు కొద్దిరోజులుగా గోల్డెన్ డేస్ ఆరంభమయ్యాయి. సిండికేట్‌గా సర్కార్ ఎం.ఆర్.పి.ని బ్రేక్ చేసినా...మరో అడుగు ముందుకు వేసి ఎన్-ఎం-పి (నార్మల్- మీడియం -ప్రీమియం) గ్రేడులకే ఎసరుపెట్టి కల్తీ వ్యాపారానికి తెరలేపారు. మందుబాబులు జేబులు చిల్లుపెట్టి మీడియం గ్రేడ్ మద్యం సీసాల్లో నార్మల్ గ్రేడ్ మద్యాన్ని కల్తీ చేసి విక్రయించే విధానానికి జిల్లాలో మద్యంవ్యాపారులు అలవాటుపడ్డారు. మంగళవారం రాత్రి రణస్థలం జాతీయ రహదారిలో గల ఒక దాబాలో మద్యం దుకాణం సిబ్బందికి, మందుబాబుల మధ్య ఘర్షణ రేగింది. దీనికి కల్తీ మద్యమే కారణమంటూ ఎక్సైజ్ సిబ్బంది పోలీసులు ధ్రువీకరించడం, మందుబాబులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తామంటూ హెచ్చరించడంతో మద్యం సిండికేట్ పెద్దలు, కల్తీ మద్యం తాగిన మందుబాబుల మధ్య స్థానిక అబ్కారీ, పోలీసులు కొంతమంది సంధి కుదర్చినప్పటికీ, అందులో ఒక మద్యంప్రియుడు న్యాయవాది కావడంతో బుధవారం వినియోగదారుల ఫోరంకు జిల్లాలో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతుందని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... జిల్లాలో 232 మద్యం దుకాణాలకుగాను ప్రతీ రోజూ 300 నుంచి 450 కేసుల వరకూ చీప్‌లిక్కర్ (నార్మల్ గ్రేడ్) ఎ.పి.బేవరేజిస్ నుంచి మద్యం దుకాణాలకు చేరుతుంటాయి. ఇందులో ప్రతీ రోజు ఒక లారీ లోడు అంటే 455 కేసుల గోల్డ్‌రేస్ (180 ఎం.ఎల్), ఎనీటైం (లీటర్ బాటిల్స్) చీప్‌లిక్కర్ జిల్లాలో మద్యం దుకాణాలు నడుపుతున్న సిండికేట్ కార్యాలయానికి చేరుతున్నట్టు అబ్కారీ లెక్కలు చూపుతున్నాయి. కాని - ఈ చీప్‌లిక్కర్ మద్యం రిటైల్ దుకాణాల్లో అక్కడక్కడ కన్పిస్తాయి. కేవలం సిండికేట్ గొడౌన్‌లకే పరిమితంగా ఉంటాయి. మీడియం గ్రేడ్‌కు చెందిన విస్కీ 750 ఎం.ఎల్. బాటిల్‌లో 190 రూపాయల ఎం.ఆర్.పి. గల ఎనీటైం లీటర్ బాటిల్ కల్తీ చేసి అమ్మకాలు చేస్తున్న వైనం ఆలస్యంగా మందుబాబులు పసిగట్టారు. అలాగే, 50 రూపాయలు ఎం.ఆర్.పి. గల గోల్డ్‌రేస్ 180 ఎం.ఎల్. బాటిల్‌ను ప్రీమియం 750 ఎం.ఎల్. బాటిల్‌లో కల్తీ చేస్తున్నట్టు మద్యంప్రియులే గ్రేడింగ్‌లో తేడాను కనుగొన్నారు. ఈ రెండు బ్రాండుల నార్మల్ గ్రేడ్ మద్యం మీడియం, ప్రీమియం మద్యం బాటిళ్ళలో మద్యం దుకాణాల యజమానులు ప్రత్యేక బృందాలతో నిష్పత్తి ప్రకారం కల్తీ చేయిస్తూ రిటైల్ దుకాణాలకు తరలిస్తున్న వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించేందుకు సంసిద్ధంగా లేదనే చెప్పాలి. రణస్థలంలో జాతీయ రహదారి పక్కనే గల దాబాకు ఆనుకుని ఉన్న మద్యం దుకాణంలో కల్తీ మద్యం వెలుగులోకి వచ్చింది. ప్రతీ నెల వందల వేల పెట్టేల మద్యం ప్రీమియం నుంచి మీడియం, నార్మల్ గ్రేడ్‌ల వరకూ మద్యం సిండికేట్ కొనుగోలు చేస్తారు. అయితే, దుకాణాల్లో మాత్రం కొన్ని రకాల బ్రాండ్‌లే కన్పిస్తాయి. ప్రధానంగా సామాన్యులకు అందుబాటులో ఉండే కొన్ని రకాల బ్రాండ్లు కనిపించకుండాపోతాయి. ఐ.ఎం.ఎల్. డిపో నుంచి ఈ రకాలైన మద్యాన్ని ఇండెంటుపెట్టి, చలానాలు చెల్లించినప్పటికీ, అవి దుకాణాల్లో కన్పించవు. ప్రధానంగా గోల్డ్‌రేస్, ఎనీటైం బ్రాండ్లు చీప్ లిక్కర్ కోవలోకి వస్తాయి. ఇవి 180 ఎం.ఎల్. (క్వార్టర్) 50 రూపాయలకే ఎం.ఆర్.పి. ఉంటోంది. అయితే, గత కొనే్నళ్లుగా ఈ బాటిళ్లు ఎందులో కలుస్తున్నాయో అటు మద్యం వ్యాపారులకు, ఇటు ఎక్సైజ్ సిబ్బందికి మాత్రమే తెలిసిన లోగుట్టు. ఎందుకంటే ఈ రెండు రకాల బ్రాండ్‌లను పేరున్న బ్రాండ్‌లలో కల్తీ చేసి అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో 70 శాతం దుకాణాల్లో మద్యం భారీ ఎత్తున కల్తీ జరుగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. రణస్థలం మండల కేంద్రంలో ఒక దుకాణంలో కొంతమంది యువకులు రాయల్‌స్టాగ్ బ్రాండ్‌ను కొనుగోలు చేసి వారు మద్యం సేవించగా అది కల్తీకి గురైనట్లు గుర్తించి ఆ దుకాణం సిబ్బందితో ఘర్షణకు దిగారు. అయితే, సిబ్బంది కాంప్రమేజ్‌కు వచ్చి వారిని శాంతింపజేసారు. జిల్లాలో ఎక్కువగా రాయిల్‌స్టాగ్, ఎం.సి.విస్కీ, ఎ.సి.ప్రీమియం బ్రాండ్లు ఎక్కువగా కల్తీ అవుతున్నాయి. అంతేకాకుండా ఎక్కువగా అమ్మకాలు జరిగే బ్రాండ్లను కల్తీ చేస్తున్నారు. ఐ.ఎం.ఎల్. డిపో నుంచి విడుదల చేసే చీప్ లిక్కర్ దుకాణంలో కనబడకపోయినా ఇటు అబ్కారీశాఖ, అటు ఎన్‌ఫోర్సుమెంటు సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు. ఇది సామాన్య మద్యంప్రియులు పట్టించుకోవడం లేదుకనుక, గుట్టుచప్పుడుగా కల్తీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా మద్యం కల్తీ చేయడానికి కొన్ని బృందాలు కూడా పనిచేస్తున్నాయి. వంద మద్యం బాటిళ్ళు కల్తీ చేయడానికి ఈ బృందాలు గుత్తగా ఒప్పందం చేసుకుంటాయి. ఎవరికీ అనుమానం లేకుండా బాటిల్ కప్పులు తెరచి ఎక్కువగా అమ్మకాలు జరిగే బ్రాండ్‌లలో చీప్‌లిక్కర్‌ను కల్తీ చేస్తారు. వీటిపై నిఘా ఉండాల్సిన అబ్కారీ ఎన్‌ఫోర్సుమెంటు, కల్తీ నిరోధకశాఖలు ఆ ఊసే లేకుండా ఉన్నాయి. చివరికి మందుబాబే వినియోగదారుల ఫోరంకు కల్తీ మద్యం కథ చేర్చాడు!