శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ముదురుతున్న చుక్కల భూముల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మే 2: ఆత్మకూరు కేంద్రంగా రెవెన్యూ డైగ్లాట్‌లో చుక్కలున్న భూముల రైతుల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ ఆందోళనలకు అఖిలపక్షంగా రాజకీయ పార్టీలన్నీ మద్దతివ్వడం గమనార్హం. ఈ నిరసనల నేపథ్యంలో చుక్కల భూములేమిటి? అంటూ అంతటా సందేహాలు రేకెత్తుతున్నాయి. దీని గురించి అనుమానాల నివృత్తికి వెళ్లాలంటే 108 సంవత్సరాలకు పూర్వం చోటుచేసుకున్న వివిధ సంఘటనల సమాహారంపై ప్రస్తావించుకోవాలి. అప్పట్లో దేశాన్ని ఏలుతున్న బ్రిటీష్ దొరలు ప్రజలందరి వద్దా భూమి శిస్తు వసూలు చేస్తుండటం కఠినంగా ఉండేది. వివిధ ప్రాంతాల్లో తమకు పంటలు సజావుగా సాగు కావడం లేదంటూ భూమి శిస్తు నుంచి మినహాయింపుకోరుతూ వచ్చారు. అదే సందర్భంలో భూముల వివరాల సమగ్ర నమోదుకై డైగ్లాట్ ఆర్‌ఎస్‌ఆర్ (రీ సెటిల్‌మెంట్ రిజిష్టర్)లను తయారు చేశారు. ఆర్‌ఎస్‌ఆర్ తయారీ సందర్భంలో బ్రిటీష్ ప్రభుత్వ సిబ్బంది వచ్చినప్పుడు గందరగోళానికి తావిచ్చింది. భూముల వివరాలను తెలియజేస్తే, ఆ తరువాత నుంచి పన్ను చెల్లించాల్సి వస్తుందనే ఆందోళనకు తావిచ్చింది. సర్వేయర్ వచ్చిన సందర్భంలో భూముల వివరాలను తెలియచేయకుండా చాలామంది మొఖం చాటేయడం, నిరాకరించడం జరిగింది. ఈ క్రమంలో డైగ్లాట్ ఆర్‌ఎస్‌ఆర్‌లో వివరాలు తెలపని సర్వే నెంబర్లలో సిబ్బంది చుక్కలు పెట్టి అంతటితో వదిలేశారు. అలా చుక్కలు పెట్టడం వెనుక, ఎవరికీ సంబంధించని, అనాదీనం భూములంటూ తెలియజేస్తుండటమే ప్రధాన కారణం. వాస్తవంలో చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయా భూములను సదరు రైతులు, వారి వారసులు సాగుచేసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. పోలీస్‌శాఖలో ఉండే ఐపిసి (ఇండియన్ పీనల్ కోడ్-1885), రెవెన్యూలో ప్రాథమికంగా ఉండే డైగ్లాట్-1908 వంటివి బ్రిటీష్ పాలనలో తయారైనవే నేటికీ వినియోగంలో కొనసాగుతున్నాయి. కాలక్రమంలో స్వతంత్ర భారతావనిలో సదరు రైతులకు ఆయా చుక్కల భూములకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు, 1బి వంటివి మంజూరవుతుండటంలోనూ ఎలాంటి ఇబ్బందుల్లేవు. అయితే 2008లో కృష్ణపట్నం పోర్టుకు భూసేకరణ ప్రక్రియ జరిగేటప్పుడు తొలుత ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పోర్టు యాజమాన్యం తమకు ఎలాంటి వివాదాల్లేని భూములే తీసుకోదలిచారు. చుక్కల భూములను ఏ పద్దులోకి తీసుకురావాలనే అంశంపై తర్జనభర్జనలు చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వ భూమిగానే పరిగణించారు. చుక్కల భూముల రైతులు అంతటా చూసినప్పుడు చాలా పరిమితంగా, కొన్ని ప్రదేశాల్లో మాత్రం అధికంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో మాత్రమే ఈ భూములున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాలకు సంబంధించి డైగ్లాట్‌లో చుక్కలున్నాయి. అనంతపురంలో అంతకంటే అధికంగా ఒకటిన్నర లక్ష ఎకరాల వరకు ఇలా చుక్కలుండటం లెక్కల్లో తేలింది. అలాగే కర్నూలు, కడప జిల్లాల్లో కూడా కొంత మేర భూములకు చుక్కలున్నట్లు సమాచారం. రైతు కుటుంబాలు వారసత్వంగా విభజించుకునైనా వినియోగించుకునే సందర్భంలో ఎలాంటి ఇబ్బందుల్లేవు. మరొకరికి విక్రయించుకోవాలంటే భూముల యాజమాన్య హక్కుపై స్పష్టత కరవు. ఆ భూములు క్రయవిక్రయాలకు సాధ్యపడటం లేదు. గతంలో ఆత్మకూరుకు చెందిన బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు చెరుకూరి రమణయ్యనాయుడు తన భూమిని విక్రయించుకునే సందర్భంలో రిజిస్ట్రేషన్, రెవెన్యూశాఖల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకున్నారు. ఆయన అంటే పెద్ద తలకాయ కావడం వల్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా అనుకూల ఫలితాన్ని పొందగలిగారు. అలాంటి తీర్పును చుక్కల భూముల రైతులందరికీ వర్తించేలా ప్రభుత్వ ఆదేశాలు వెలువడితే సరిపోయేది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాయిదాలు వేస్తూ రావడంతో ఎక్కడో ఒక చోట సమస్య రాజుకుంటూనే వస్తోంది. ఎకరా, రెండు ఎకరాలు వంటి సన్న, చిన్నకారు రైతులు కోర్టును ఆశ్రయించాలంటే సాధ్యపడే అంశం కాదు.
పోరాట కమిటీ ఆవిర్భావం: కన్వీనర్‌గా నలిశెట్టి శ్రీ్ధర్
తనకు జరిగిన భంగపాటు బాటలోనే పలువురు రైతుల్ని కూడగట్టుకుని దశలవారీ పోరాట కార్యక్రమాలకు ఆత్మకూరుకు చెందిన ప్రముఖ యువ వ్యాపార వేత్త నలిశెట్టి శ్రీ్ధర్ శ్రీకారం చుట్టారు. ఆత్మకూరు పురపాలక పరిధిలోనే వెయ్యి ఎకరాలకు పైగా చుక్కల భూములు ఉన్నాయి. మున్సిపాలిటీలో అంతర్గతంగా భూమి అంటే విలువైనదే. అయితే హక్కుపై స్పష్టత లేక భూ యజమానుల సమస్యలు వర్ణనాతీతం. కొన్ని కుటుంబాల సంతతి పెళ్లిళ్లకు సైతం ఈ సమస్య గుదిబండగా పరిణమిస్తోంది. పోరాట కమిటీకి కన్వీనర్, దిక్సూచిలా వ్యవహరిస్తున్న నలిశెట్టి శ్రీ్ధర్‌కు ఆత్మకూరు జాలయ్యనగర్ వద్ద ఉన్న స్థలంలో గతంలో ప్రైవేట్‌గా మహాలక్ష్మి గ్యాస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. తన భూమికి డైగ్లాట్‌లో ఉన్న మాదిరిగానే గ్యాస్ వ్యాపారంలోనూ నలిశెట్టి శ్రీ్ధర్‌కు చుక్క ఎదురైంది. అలా గ్యాస్‌లో చేతులు కాల్చుకున్నా విలువైన భూమి ఉండటం వల్ల లే అవుట్ల వ్యాపారంతో ఆర్థిక ఉన్నతికి ప్రయత్నించాడు. లే అవుట్లను కొనుగోలుదారులు కూడా విచారించుకున్నప్పుడు చుక్కల సర్వే నెంబర్ స్థలం అనగానే వెనుకడుగు వేసే దుస్థితి. ఈక్రమంలో గత వారంగా ఆత్మకూరులో ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
* రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి ధ్వజం
నెల్లూరు రూరల్, మే 2: ప్రజల సమస్యలు తీర్చడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నెల్లూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైకాపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడంలో విఫలం చెందారని అన్నారు. ఎమ్మెల్యేలకు గ్రాంటు ఇవ్వడంలో గత ప్రభుత్వాలు బాధ్యతగా ఉండేవని, ప్రస్తుతం తెలుగుదేశం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడంలో అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. గ్రామాలలో రైతులు సాగునీరు కోసం నానాయాతన పడుతున్నారని, వారికి కనీసం బోర్లు వేసి ఇద్దామన్నా శాసనసభ్యులకు నిధులు లేకపోవడం బాధాకరమని అన్నారు.
టేకు దొంగలను కాపాడుతున్న ప్రభుత్వం : ఆనం విజయ
నరసింహస్వామి పొలాలు లీజుకు తీసుకొని అందులో ఉన్న టేకుచెట్లను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్న వారిపట్ల ప్రభుత్వం మెతకవైఖరి అవలంబిస్తోందని వైకాపా నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి ఆరోపించారు. ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టేకు దొంగలు నెల్లూరులోనే ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే పోలీసు శాఖ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. వారిని పట్టుకోని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. వీరు చేస్తున్న నేరాలు, ఘోరాల వల్ల నరసింహస్వామి వంటి పుణ్యక్షేత్రాలు అరాచకాలకు అడ్డాగా మారాయన్నారు. దేవుడి సొమ్ము తింటూ మరో పక్క దేవుడి ఆస్తులను సొంతం చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తుంటే దేవాదాయ శాఖ ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. టేకు దొంగలను పోలీసులు అరెస్టు చేయని పక్షంలో జిల్లా స్థాయిలో ఉద్యమానికి ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు ఆయన అన్నారు. అనంతరం తహశీల్దార్ వెంకటేశ్వర్లకు, ఎంపిడిఓ వసుమతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మండలస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నార్తు మోపూరులో హత్య
అల్లూరు, మే 2: మండలంలోని నార్తుమోపూరు దళితవాడలో సోమవారం కొమ్మి కొండయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దళితవాడలో స్వల్ప వివాదం చోటు చేసుకోవడంతో ప్రత్యర్థులైన కొమ్మి దాసు, కొమ్మి సుగుణమ్మ, కొమ్మి సుధీర్‌లు కలిసి దాడి చేయడంతో కొండయ్య అక్కడికక్కడే కూప్పకూలిపోయాడు. బంధువులు అల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు హుటాహుటిన తరలించారు. ప్రభుత్వ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధులు నిర్వహించే నర్సు ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడకు తీసుకెళ్లగా అప్పటికే కొండయ్య మరణించి ఉన్నాడు. అల్లూరు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విహార యాత్రలో విషాదం
అల్లూరు, మే 2: మండలంలోని ఇస్కపల్లి సముద్ర తీరంలో సోమవారం సరదాగా కుటుంబసభ్యులతో విహార యాత్రకు వెళ్లిన లక్ష్మీనారాయణ (42) అనే వ్యక్తి సముద్ర తీరంలో మునిగి మరణించాడు. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుదామని సముద్ర వద్దకు తీసుకెళ్లిన లక్ష్మీనారాయణ భార్య చెంచమ్మ, కుమార్తెల కళ్ల ముందే తీరంలో గల్లంతు కావడంతో గుండెలవిసేలా విలపించారు. అక్కడే ఉన్న పలువురు మత్స్యకారులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం స్వగ్రామమైన మండలంలోని ఉజ్జపుగుంటకు మృతదేహాన్ని తరలించారు.

హిమ్ కేసులో దర్యాప్తు పూర్తి
త్వరలో చార్జిషీటు దాఖలు
నెల్లూరు, మే 2: జిల్లాలో సంచలనం సృష్టించిన హెవెన్లీ ఇంటర్నేషనల్ మిషన్ (హిమ్) కేసులో సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును కోర్టులో దాఖలు చేయనున్నట్లు సమాచారం. సిఐడి ఎస్‌పి బ్రహ్మారెడ్డి సోమవారం నెల్లూరుకు వచ్చారు. రాష్టవ్య్రాప్తంగా హిమ్ కేసులను విచారిస్తున్న డిఎస్‌పిలందరితో నెల్లూరు సిఐడి కార్యాలయంలో సమావేశం నిర్వహించి చార్జ్‌షీటు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. బిట్రగుంటకు చెందిన జాన్‌ప్రభాకర్ 2010లో హిమ్ గొలుసుకట్టు మనీ స్కీమ్‌ను తనతోపాటు తన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. నెల్లూరుతోపాటు రాష్టవ్య్రాప్తంగా ఇతర జిల్లాల్లోను, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఏజంట్లను ఏర్పాటు చేసుకొని మనీస్కీమ్ గురించి విస్తృత ప్రచారం చేశారు. ప్రజలు రూ. 5,500 చెల్లిస్తే 11 నెలల్లో రూ. 60 వేల వంతున చెల్లిస్తామంటూ ఆశ చూపించి ప్రజలను మభ్యపెట్టి రూ. 375 కోట్లకు పైగా వసూలు చేశారు. ఈ సొమ్ముతో రాష్ట్రంతోపాటు చెన్నై, బెంగళూరులలో విలాసవంతమైన భవనాలు, ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేశారు. 2011లో వీరి మోసం బయటపడటంతో వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జాన్ ప్రభాకర్‌ను చెన్నై పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టుచేసి తొమ్మిది నెలలు చెన్నైలోని జైలులో ఉంచారు. సుమారు 275 కోట్ల ఆస్తులను కనుగొని వాటిని చెన్నై కోర్టు ఆధ్వర్యంలో ఉంచారు. అనంతరం జాన్ ప్రభాకర్ భార్య సుకన్య, మరో డైరెక్టర్ గొల్లపల్లి కృపాకర్‌లను సిఐడి అధికారులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి పెద్దఎత్తున ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముందుకు సాగలేదు. బాధితుల నుంచి వస్తున్న ఒత్తిడికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం మనీస్కీమ్ కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని సిఐడి అధికారులను ఆదేశించింది. ఈక్రమంలో సిఐడి ఎస్‌పి బ్రహ్మారెడ్డి సోమవారం నెల్లూరుకు చేరుకొని కేసును పరిశీలించి చార్జ్‌షీటు తయారుచేస్తున్నారు.

కారు ఢీకొని ఒకరు మృతి
మనుబోలు, మే 2: పని ముగించుకుని ఇంటికి వెళుతున్న బేల్దారిని ఓ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం స్థానిక బైపాస్‌రోడ్డులో చోటు చేసుకుంది. స్థానిక దళితవాడకు చెందిన దూడల రమణయ్య (50) కోదండరామపురంలో ఉన్న సంజీవయ్య కాలనీలో బేల్దారి పని కోసం సోమవారం ఉదయం ఇంటి నుండి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం కోసం రోడ్డు దాటుతుండగా తిరుమల నుంచి గుంటూరు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణయ్య కాళ్లకు, తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఖాళీ బిందెలతో నిరసన
చిల్లకూరు, మే 2: చిల్లకూరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం వైకాపా జడ్పీటిసి సభ్యురాలు ఓడూరు యమునమ్మ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టాట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచక పాలన సాగిస్తోందని, దీనికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డ్వాక్రా రుణాల మాఫీ ఉసే లేదన్నారు. 200 కోట్ల రూపాయలు తాగునీటి అవసరాల కోసం కేటాయించినా నేటికి ఆ నిధులను ఖర్చు చేయలేదన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 4500 కోట్లు కేటాయించగా ఆ నిధులను 2500 కోట్లతో సిసి రోడ్లు, 1500 కోట్లు నీరు-చెట్టుకు కేటాయించి ఉపాధి హామీ కూలీల పొట్ట కొట్టారని విమర్వించారు. ఇన్‌పుట్ సబ్సిడీకి 1000 కోట్ల కేటాయించగా ఆ నిధులు నేటికీ మంజూరు కాలేదన్నారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు బాలకృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

మద్యం మత్తులో యువకుల విధ్వంసం
* ఇద్దరికి తీవ్రగాయాలు
నెల్లూరు, మే 2: మద్యం మత్తులో నలుగురు యువకులు నగరంలో కారును నిర్లక్ష్యంగా నడుపుతూ ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు కావడానికి కారణమయ్యారు. సేకరించిన సమాచారంతోపాటు పోలీసుల కథనం మేరకు.. నగరంలోని మాగుంట లే అవుట్‌లోని వెంకటేశ్వరస్వామి దేవస్థాన సమీపంలో నలుగురు యువకులు మద్యం సేవించి కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపారు. దారి వెంట వచ్చే వాహనాలను పట్టించుకోకుండా రోడ్డుపై వీరంగం సృష్టిస్తూ వాహనాన్ని నడిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను వారు వేగంగా ఢీకొట్టారు. కారు రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఆయా మోటార్‌సైకిళ్లను నడుపుతున్న షేక్ ఖాదర్‌బాష, మహేష్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ఎస్సై బలరామయ్య సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. కారు కె.రాఘవరెడ్డి అనే వ్యక్తి పేరుపై ఉన్నట్లు పోలీస్ వారు తెలిపారు.
కేసు తారుమారుకు యత్నాలు
ఈ ప్రమాదానికి కారణమైన యువకులు నగరంలో పలుకుబడి, ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో కేసును పక్కదారి పట్టించే చర్యలు జరుగుతున్నాయి. యువకులు కారు నడిపే సమయంలో మద్యం తాగి ఉన్నారనీ, ప్రమాదం జరిగిన కారులో మందు బాటిళ్లు, ఇతర వస్తువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పల్టీకొట్టిన కారు నుంచి యువకులు ఒక్కొక్కరుగా బైటకు వచ్చి తూలుతూ వెళ్లారు. పట్టపగలు నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరిని ప్రాణాపాయస్థితికి నెట్టిన వ్యక్తుల గురించి పోలీస్‌లు దర్యాప్తు వేగవంతం చేయకపోవడం గమనార్హం. కారు ప్రమాదం జరిగిన 12 గంటల వరకూ కూడా కారులో ఎవరు ప్రయాణిస్తున్నారో తెలియదని పోలీసులు చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత కొంతకాలంగా మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, ఇస్కాన్ సిటీ ప్రాంతాల్లో కార్లు, బైకులు నిర్లక్ష్యంగా, అతివేగంతో నడుపుతున్న కొందరు యువకుల గురించి పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ వారు పలుకుబడి కలిగిన కుటుంబాలకు చెందిన వారు కావడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం జరిగిన సంఘటనపై కూడా పోలీసులు అంత ఆసక్తిని కనబర్చడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.
వడదెబ్బకు వృద్ధురాలు మృతి
బుచ్చిరెడ్డిపాళెం, మే 2: వడదెబ్బకు గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలో చోటుచేసుకుంది. స్థానిక రాఘవరెడ్డినగర్ కాలనీలో నివాసం ఉంటున్న గుర్రం కొండమ్మ (65) మధ్యాహ్నం నుండి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి నిద్రకు ఉపక్రమించింది. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత కుమార్తె ఆమెను లేపేందుకు ప్రయత్నించింది. ఎంతకూ లేవకపోవడంతో కొండమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కొండమ్మ భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తూ మృతి చెందడంతో ఆమె గత కొన్ని సంవత్సరాలుగా కుమార్తె ఇంట్లోనే ఉంటుంది. మధ్యాహ్నం వరకు బాగున్న కొండమ్మ హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది.
అనుమసముద్రంపేటలో...
అనుమసముద్రంపేట: మండలంలోని హసనాపురంలో పుల్లల చెరువుకాశయ్య (45) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం కూలీ పనులకు వెళ్లి సాయంత్రం వరకు ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బ తగిలింది. ఇంటికి వచ్చిన వెంటనే మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య, బిడ్డలు ఉన్నారు.

11న స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
నెల్లూరుసిటీ, మే 2: నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 11వ తేదీన విడుదల చేయునున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభం అవుతుందన్నారు. మొత్తం 5 మంది సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. 11వ తేదీ నుంచి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. 16వ తేదీన స్క్రూట్ని కార్యక్రమం జరుగుతుందన్నారు. 21వ తేదీన ఎన్నికలు జరుగుతాయన్నారు.
పండ్ల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు కలెక్టరేట్, మే 2: జిల్లా కేంద్రంలోని చిన్నబజారులో ఉన్న పండ్ల దుకాణాలపై ఆహార పరిరక్షణ అధీకృత అధికారి వి ఆనందరావు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు పండ్లను కృత్రిమంగా రసాయనిక పద్ధతిలో మాగబెట్టవద్దని హెచ్చరించారు. నిషేధించబడిన, హానికరమైన కాల్షియం కార్బైడ్, ఇథోఫిల్ ఫెస్టిసైడ్‌లను చల్లి ఫలాలను మాగబెట్టవద్దని వ్యాపారులకు హితవు పలికారు. ఫలాలు నాణ్యంగా కనపడేందుకు వాటిపై ఫారఫిన్ వ్యాక్స్ కోటింగ్ వేయరాదన్నారు. ఈ రసాయనిక ఫలాలు ఆరోగ్యంపై తీవ్ర విష ప్రభావాన్ని చూపుతాయన్నారు. ప్రత్యేకించి శ్వాస, జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వివరించి వ్యాపారులు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఫలాల నమూనాలను సేకరించి పరిశీలన కోసం ఫల పరీక్షా కేంద్రాలకు పంపారు. ఆయన వెంట ఆహార పరిరక్షణ అధికారులు టి లలితకుమారి, జి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

భగవద్రామానుజుల గ్రామోత్సవం
నెల్లూరు కలెక్టరేట్, మే 2: జిల్లా కేంద్రంలోని రంగనాయకులపేట తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో శ్రీ్భగవద్రామానుజుల గ్రామోత్సవం సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారి 999 అవతారోత్సవాల నిర్వహణలో భాగంగా రెండవరోజైన సోమవారం గ్రామోత్సవం నిర్వహించి ఆలయంలోని అద్దాల మండపంలో స్వామివారికి అర్చక స్వాములు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.