శ్రీకాకుళం

నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌ఎన్ పేట, నవంబర్ 29: నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. మంగళవారం మండలంలోని తురకపేట, దబ్బపాడు గ్రామాల్లో పథకాల అమలు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా చేపట్టి తద్వారా ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించడానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, వర్మీకంపోస్టులు, ఇంకుడుగుంతలు వంటి పథకాలు పూర్తి చేయడంలో లక్ష్యాలను సాధించిన పంచాయతీలకు
ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు శతశాతం పూర్తి చేస్తే రూ.5 లక్షలు, ఫారంఫాండ్స్‌కు రూ.4 లక్షలు, 50 వర్మీకంపోస్టులకు రూ.2 లక్షలు, ఇంకుడు గుంతలకు రూ.2 లక్షలు, మూడు కిలోమీటర్ల రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడానికి రూ.2 లక్షలు అందచేస్తున్నామని చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు పరిరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు పథకాల ప్రగతిపై అధికారుల నుంచి వివరాలను సేకరించారు. దబ్బపాడు గ్రామంలో 143 వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమని గుర్తించగా 58 పూర్తి చేయగా, 25 మందికి బిల్లులు అందాయని ఎంపిడిఓ మోహన్‌ప్రసాద్ తెలిపారు. తురకపేటలో 18 వర్మీకంపోస్టులు పూర్తి చేసినట్టు తెలిపారు. పంచాయతీకి 72 మంజూరైనట్టు వివరించారు.
అమ్మో... ఒకటో తారీఖు!
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
నోట్ల రద్దుతో వ్యాపారం సరిగా నడవక ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు.. పింఛనే ఆధారంగా బతికే పండుటాకులు.. కనీస అవసరాలకు అంతంతమాత్రంగా సరిపడే జీతభత్యాలు అందుకునే సగటు మనిషి.. ఆర్థిక అక్షరాస్యతకు ఆమడదూరంలో జీవనం సాగిస్తున్న పేదోళ్ళు, నగదు రహితంగా బ్యాంకుల ద్వారా జీతభత్యాలు అందుకునే మధ్యతరగతి ప్రైవేటు ఉద్యోగులు.. ఇలా అన్నీ వర్గాలవారికి ఈ సారి ఒకటోతారీఖు కష్టాలు తెచ్చిపెట్టడం ఖాయం! అందుకే రోజువారి కూలీ సంపాదించుకునే కార్మికుడు నుంచి గెజిటెడ్ ఉద్యోగి వరకూ అంతా ఒకటోతారీఖు అంటూ భయపడుతున్నారు. ఏ రోజు కష్టంతో ఆ రోజు బతుకు ఈడస్తున్నవారు బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక అల్లాడున్నారు. బ్యాంకుల్లో తగినంత డబ్బులు రాక నానా అవస్థలు పడుతున్నారు.
పాత నోట్లు ఎవరూ తీసుకోవడం లేదని, ఇంటి కిరాయి, పాలు, పిల్లల స్కూల్ ఫీజులు ఇలా నెలవారీ ఖర్చులకు ఏంచేయాలో తెలియడం లేదని, ఒక్కమాటలో చెప్పాలంటే రోడ్డుమీదకి బతుకు లాగేశారంటూ సామాన్యులు ఉత్కంఠకులోనవుతున్నారు. ఉన్నదానితో గోప్యంగా సంసారం సాగించుకుంటూ పిల్లల చదువులకు చాలిచాలని ఫీజులు సర్దుబాటులు చేసుకుంటూ, నెలవారీ కిరాణా సామానులు కొనుగోలు చేసుకుంటూ నెలంతా సౌమ్యంగా సాగే సామాన్యుడి బడ్జెట్ బతుకులకు నోట్లు రద్దు బ్రేకులు వేసింది. పెద్దోళ్ళు, నల్లధనం దాచుకున్న కుబేరులివి ఒకటోతారీఖు అవస్థలు అసలు అంటిముట్టని పరిస్థితి! కానీ, సామాన్యులకు మాత్రం జేబుల్లో, చేతుల్లో డబ్బులు ఆడుతాయన్న ఆలోచనకంటే - బ్యాంకుల నుంచి వచ్చిరాని కరెన్సీతో ఎలా బతుకుబండిని లాగుతానుమా.. బాబూ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. గంటలసేపు క్యూలో నిలుచుంటే బ్యాంకులో రూ.2000 నోటు ఇస్తున్నారని, వాటికి చిల్లర దొరకడంలేదని, ఏం చేయాలో అర్థం కావడంలేదని చిరువ్యాపారి ‘ఆంధ్రభూమి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.
రోజువారీ ఆరు వేల రూ.లు అమ్మకాలు చేసుకునే ఒక తోపుడుబండి చిరువ్యాపారి..నోట్లు రద్దయిన రోజు నుంచి రెండు వేల రూపాయలు కూడా అమ్మలేకపోతున్నారని, చిల్లర సమస్య చాలా ఉందని చెప్పుకొచ్చాడు. కార్మికులు, కర్షకులు, చిరువ్యాపారులు, ఉద్యోగులు ఎవరిని కదిలించినా ఇలాగే చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రజాపంపిణీ వ్యవస్థతోపాటు, అన్నీ కార్యకలాపాలు నగదురహితంగా జరగాలంటూ కొద్దిరోజులుగా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం నేతృత్వంలో జిల్లా అధికారులంతా ఆర్థిక అక్షరాస్యత శాతం పెంచేందుకు గ్రామాల నుంచి నగరాల వరకూ కసరత్తు చేస్తునేవున్నారు. కేవలం నల్లధనం రూపుమాపేందుకు చేపట్టిన పెద్దనోట్ల రద్దు, నగదురహిత కార్యకలాపాలను ప్రతీ ఒక్కరూ సహకరించాలంటూ జిల్లా యంత్రాంగం అష్టకష్టాలు పడుతోంది.
బ్యాంకు ఎటీఎంలు, రూపేకార్డులు, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్, ఎన్‌ఎఫ్‌టి, మోబైల్ బ్యాంకింగ్ వంటి మార్గాలను ఎంచుకోవాలంటూ ప్రజల్లో చైతన్యం కలిగించే అధికారుల ప్రయత్నం మధ్యతరగతి కుటుంబాల వరకూ చేరుతున్నాయే తప్ప, నిరక్ష్యరాసులు, కూలీల వరకూ చేరలేకపోయాయి. సగటు జనాభాలో వీరి శాతమే అధికంగా ఉండడంతో ఒకటోతారీఖు వస్తుందంటే వారంతా హాడలెత్తిపోతున్నారు. వివిధ స్థాయిలో, చాలా వేదికల ద్వారా పెద్దనోట్లు రద్దయిన నాటి నుంచి జిల్లా అధికారులు నగదురహిత కార్యకలాపాలపై చేపట్టిన అవగాహన సదస్సులన్నీ దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి, పండుటాకులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయన్న విమర్శలు లేకపోలేదు.
రూపే కార్డులతో సామాజిక పింఛన్లు, ఎఫ్.పి.షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందించాలని అధికారులు హుకుం జారీ చేశారు. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా సంబంధిత అధికారులు పూర్తిచేసేందుకు అవస్థలు పడుతున్నారు. అయితే - 30 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో నగదురహిత లావాదేవీల భయం అధికారులను సైతం భయపెడుతోంది. ఈ విధానం విజయవంతంగా అమలుకాకుంటే ఉన్నతాధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులు అందుకోవల్సివస్తుందన్న భయం ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పింఛను కోసం పండుటాకులు ఎప్పుడప్పుడా అంటూ ఎదురుచూస్తున్నవారంటా కార్డుల గందరగోళం వారిని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో సామాజిక పింఛన్లు జమచేస్తామన్న మాట సులువుగా ఉన్నప్పటికీ, వృద్ధాప్యంలో గల లబ్ధిదారులు దీనిని అందుకునేందుకు బ్యాంకులకు ఎలా వెళ్తారన్న ప్రశ్న అటు అధికారులను, ఇటు సామాన్యులకు సందేహాలు కలిగిస్తోంది. నగదు లావాదేవీల దారులు రోజురోజుకూ మూసుకుపోవడంతో చిల్లర సమస్య కంటే - నేరప్రవృత్తి పెరిగే ప్రమాదం పొంచి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత ఏది?
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 29: దశాబ్దకాలంగా ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేస్తూ రెగ్యూలర్ అధ్యాపకులతో సమానంగా అంకింత భావంతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అధ్యాపకుల జెఏసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు వారు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ముఖ్యమంత్రితోపాటు మంత్రివర్గ ఉపసంఘానికి మంత్రులకు, ఎమ్మెల్సీలకు పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. ఉపసంఘం వేసి 26 నెలలు గడిచిన నేటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. నవంబర్ 16 నుండి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మంగళవారం ఛలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చినట్టు స్పష్టంచేశారు. డిసెంబర్ 2న 5వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులతో చలోవిజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈకార్యక్రమానికి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావుతోపాటు ఆ పార్టీ నాయకులు హాజరై తమ మద్దతును తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి కాంట్రాక్టు లెక్చలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. కె ఎస్ యాదవ్, కె.నారాయణరావు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

వెంకయ్యవి కడుపునిండిన మాటలు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 29: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కడుపునిండిన ప్రకటనలు చేస్తున్నారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని, లాకర్లలో ఉన్నవాటిని బహిర్గతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్‌జివో హోమ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, 14 ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే వెంకయ్యనాయుడు బంద్‌కు స్పందన లేదని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. సాధారణ పౌరుడు మరణిస్తే వారి అంత్యక్రియల కోసం బ్యాంకులో ఉన్న రూ.40వేల మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ముఖ్యమంత్రి సిఫార్సు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కుమార్తె పెళ్లికి రూ.70లక్షలు ఖర్చు చేస్తే గాలి జనార్దనరెడ్డి రూ.500కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాయుడికి సమస్య లేదని సామాన్య ప్రజలకు సమస్య లేదని అనుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. పెళ్లికోసం రూ.2.50లక్షలు బ్యాంకు నుండి డ్రా చేసేందుకు అనుమతి ఇచ్చారని ఇది పెళ్లి ఖర్చులకు సరిపోతుందా అని ప్రశ్నించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు పెద్దనోట్ల రద్దువలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బిజెపి నాయకులు జనం దగ్గరకు పోతే సమస్యలు తెలుస్తాయని స్పష్టంచేశారు. బీజేపి నేత హర్షవర్థన్ ఏటి ఎం వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు బట్టలు చించి బాదారని గుర్తు చేశారు. విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ మనీ రూ.80లక్షల కోట్లు తెప్పించాలన్నారు. భారతదేశంలో రూ.31లక్షల కోట్లు నల్లడబ్బు అవినీతి పరులు, మైనింగ్ మాఫియా వ్యక్తుల వద్దే ఉందని తెలియజేశారు. గ్లోబల్‌ప్రోప్‌కండ్ మానుకోవాలన్నారు. ఆర్ బి ఐ గవర్నర్ 20 రోజుల తరువాత నోరు తెరిచారని ఆయనను వెంటనే తొలగించి సమర్థుడైన వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం పోరాటం సాగిస్తామన్నారు. విలేఖర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యన్నారాయణ మూర్తి, జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, చాపర సుందరలాల్ తదితరులు ఉన్నారు.

రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

నరసన్నపేట, నవంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని సదుపాయాలను ఎప్పటికప్పుడు కల్పిస్తోందని అంతర్జాలం, సెల్‌ఫోన్‌ల ద్వారా ఆ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు పంటల క్షేమసమాచారాలు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా మన ప్రాంతాల్లో వరిపంటపైనే రైతులు ఎక్కువగా ఆధారపడుతున్నారని పంట మార్పిడి విధానాన్ని అవలంబించగలిగితే ఎంతో లాభం చేకూరుతుందన్న విషయాన్ని రైతులు గుర్తించాలని ఆయన వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేట్ డైరెక్టర్ రీసోర్స్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఏడాదిలో మూడు పంటలు వేసుకునే అవకాశం ఈ ప్రాంత వాసులకు ఉందని అయితే సరైన అవగాహన లేకపోవడం వలనే రైతులు ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నారని వివరించారు. కృషి విజ్ఞాన కేంద్ర శాస్తవ్రేత్తలు డి.చిన్నంనాయుడు, పి.అనీల్‌కుమార్, ఎఎంసి అధ్యక్షుడు బైరి భాస్కరరావు, ఏడిఏ జి.సత్యవతి, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

‘ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి’
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 29: ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎన్ జివో హోమ్‌లో చర్చావేదిక నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈచర్చావేదికలో వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ మైనారిటీలకు ప్రభుత్వ రంగంలో మాదిరిగానే ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయాలన్నారు. రాష్టర్రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వ తరహాలో కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలకు ఫీజుల నియంత్రణ అమలు చేయాలన్నారు. ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల హాస్టళ్లను నిర్వహించాలన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించాలన్నారు. దళిత గిరిజన బలహీనవర్గాలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలన్నారు. జాతీయ బీసీ కమీషన్‌కు చట్టబద్ధత కల్పించి వెంటనే బీసీ జనగణన చేసి అధికారికంగా ప్రకటన చేయాలన్నారు. బీసీలకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి జెవి సత్యన్నారాయణ మూర్తి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, చాపర సుందరలాల్, లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట పోలినాయుడు, డిపి దేవ్, చంద్రపతిరావు, నాయకులు పాల్గొని మాట్లాడారు.

లబ్ధిదారుల ఖాతాలను తెరిపించండి
సారవకోట, నవంబర్ 29: వృద్ధాప్య పింఛన్, వికలాంగులు, వితంతు పింఛన్ల దారుల ఖాతాలను బ్యాంకుల్లో సత్వరమే తెరిచేందుకు గ్రామపం చాయతీ కార్యదర్శులు పూర్తిబాధ్యత వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదురహిత పరిపాలన అమలు చేస్తున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులతోపాటు ఉపాధి హామీ వేతనదారులకు కూడా బ్యాంకుల ద్వారా నగదురహితంగా పైకము చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ఆయా బ్యాంకులలో ఖాతాలు ప్రారంభించే బాధ్యత గ్రామపంచాయితీ కార్యదర్శులు తీసుకోవాలని సూచించారు.
అదే విధంగా ఉపాధి హామీ వేతనదారులందరికీ బ్యాంకులలో ఖాతాలను తక్షణమే తెరవాలని ఇందుకు ఏపివో బాధ్యత వహించాలని స్పష్టంచేశారు.
ఈ ప్రక్రియను నిర్లక్ష్యం వహిస్తే క్షమించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎంపిడివో లవరాజు, డుమా ఏపివో అప్పలసూరి, పంచాయితీ విస్తరణాధికారి ఈశ్వరరావు, ఉపాధి హామీ, వెలుగు సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి
* జెసి చక్రధరబాబు
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 29: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు విరివిగా మొక్కలు నాటాలని జెసి చక్రధరబాబు పిలుపునిచ్చారు. రోటరీక్లబ్, న్యూసెంట్రల్ స్కూల్ సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణపై సైకిల్‌ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన జెసి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవగాహన కల్పించడం వలన ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందని తెలిపారు. వాయు, జల కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుందని మానవాళి మనుగుడకు ఆటంకంగా మారిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలియజేశారు. రోటరీక్లబ్ కన్వీనర్ నటుకుల మోహన్, న్యూసెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్ బలివాడ మల్లేశ్వరరావు, డైరెక్టర్ పి.శ్రీకాంత్, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చంద్రన్న సంచార చికిత్స సేవలను పర్యవేక్షించాలి
* డిఎం అండ్ హెచ్‌వో తిరుపతిరావు
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 29: చంద్రన్న సంచార చికిత్స సేవలను పర్యవేక్షక సిబ్బంది పరిశీలించి లోపాలు వెంటనే పై అధికారులకు తెలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సనపల తిరుపతిరావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా స్థాయి వైద్య, ఆరోగ్య సేవలపై మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మాస్టర్ మహిళ హెల్త్‌చెకప్ వివరాలను వెంటనే ఆన్‌లైన్ యాప్ ద్వారా అప్‌డేట్ చేయాలని సూచించారు. ఈనెల 28 నుండి ప్రారంభమైన వ్యాసక్టమి పక్షోత్సవ కార్యక్రమానికి క్షేత్రస్థాయి ప్రణాళికలు తయారు చేసుకొని నిర్వహణకు సమాయత్వం కావాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. మాతాశిశు సంరక్షణా సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, రాష్ట్రీయ బాల స్వస్థకార్యక్రమం, క్షయవ్యాధి నివారణ చర్యలపై చర్చించారు. జి.రత్నకుమారి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి.జగన్నాధరావు, డాక్టర్ ఎం.ప్రవీణ్, జిల్లా సమన్వయ అధికారి డి.్భస్కరరావు, క్షయ నివారణ అధికారి కె.శంకరనారాయణ, పి.విశ్వనాథం పాల్గొన్నారు.
అందరికీ ఉపాధి పనులు
ఎచ్చెర్ల, నవంబర్ 29: జాబ్‌కార్డుదారులందరికీ ఉపాధి హామీ పనులు కల్పించేందుకు గ్రామ సభలు నిర్వహించి పనులు గుర్తిస్తున్నామని ఏపివో సత్యన్నా రాయణ తెలిపారు. అల్లినగరం గ్రామంలో ఉపాధి హామీ పనులపై మంగళవారం సర్పంచ్ బాషా అమ్మాజీ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. చెరువులు, కాలువలు గ్రావెల్ రోడ్లు నిర్మాణాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించి పనులు ప్రతిపాధించారు. ఈ నివేదికల ప్రాప్తికే నిధులు మంజూరు అవుతాయని స్పష్టంచేశారు. ఎంపిటిసి సభ్యురాలు మాడుగుల రూపవతి, జన్మభూమి కమిటీసభ్యులు బండారు అనసూయ, ఉరిటి భార్గవప్రసాద్ తదితరులు ఉన్నారు.
‘యాత్ర’లతో పథకాలపై అవగాహన
* ఎమ్మెల్యే లక్ష్మీదేవి
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 29: ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసేందుకే జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెలిపారు. నగరంలో 15వ వార్డులో మంగళవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వార్డుపరిధిలో ర్యాలీ నిర్వహించి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళాపక్షపాతిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలిచారన్నారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ వాటిని అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రికి బాసటగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, వార్డు ఇంఛార్జ్ పార్వతీశం, చిట్టి నాగభూషణం, జామి భీమశంకర్, పివి రమణ, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

డిసెంబర్ 4న
స్థారుూ సంఘ సమావేశాలు
బలగ, నవంబర్ 29: వచ్చేనెల 4న జిల్లా పరిషత్ స్థారుూ సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సిఈవో బి.నగేష్ తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు రెండోస్థాయి సంఘ సమావేశం, 11.30 గంటలకు నాల్గవ సంఘ సమావేశం, 12:30గంటలకు 1,7 స్థాయి సంఘ సమావేశాలు, మధ్యా హ్నం 2గంటలకు 3వస్థాయి సంఘ సమావేశం, 3గంటలకు అయిదోస్థాయి సంఘ సమావేశం, 4గంటలకు 6వ సంఘ సమావేశాలు జరుగుతాయని తెలిపారు.
‘నగదు రహిత’పై
విద్యార్థులకు అవగాహన
బలగ, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు వలన తాత్కాలిక ఇబ్బందులకు గురవు తున్నప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని కెనరాబ్యాంకు మేనేజర్ ప్రసన్నకుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ బాలురు, బాలికోన్నత పాఠశాలల ఆవరణలో నగదురహిత లావాదేవీలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఆధునిక భారతదేశంగా ఆవిర్భవించేందుకు పెద్దనోట్ల రద్దు ఉపయోగపడతాయన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం జి.రాజేంద్రప్రసాద్, బాలికోన్నతపాఠశాల హెచ్‌ఎం సరోజిని, కెనరాబ్యాంకు మార్కెటింగ్ అధికారి కె.మధనగోపాల్, ఉపాధ్యాయులు ఎం.సత్యన్నారాయణ, వేణుగోపాలరావు, లీలామోహన్, డి.బారతీ, సుజాత, సుబ్బలక్ష్మి, సావిత్రి, విద్యార్థులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 29: మండలంలోని రాగోలు సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పారాపురం గ్రామానికి చెందిన అల్లు గోవిందరావు(29) మృతిచెందాడు. గోవిందరావు శ్రీకాకుళంనుండి పారాపురంవైపు మోటార్ సైకిల్‌పై వెళ్తూ రాగోలు సమీపంలో మైలురాయిని ఢీకొనడంతో తలకు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.