శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పేదలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 23: పేద ప్రజలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. చింతారెడ్డిపాళెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అవసరమైతే కనీసం మూడేళ్లు నిరీక్షణ ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఎవరు ఆన్‌లైన్ ద్వారా రిలీఫ్ ఫండ్‌కు నమోదు చేసుకున్నా, లేక స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేసుకున్నా వెనువెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందని తెలిపారు. ఇప్పటివరకు నెల్లూరు నగరంలో 321 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగిందని, నాలుగు కోట్ల 49 లక్షల 53 వేల 825 రూపాయలు ప్రజలకు అందించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుకు రెండు కళ్లులాంటివని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత 191 సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. అక్టోబరు నుంచి యువనేస్తం ద్వారా నిరుద్యోగ యువతకు వెయ్యి రూపాయలు పింఛను అందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సమర్థులైన నాయకులుంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చంద్రబాబునాయుడే అందుకు నిదర్శనం అన్నారు. ఒక పక్క పోలవరం, మరో అమరావతి నిర్మాణం ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతుందంటే చంద్రబాబునాయుడు పరిపాలనాదక్షతకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, మంత్రి కుమార్తె సింధూ, అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

బొమ్మిరెడ్డిని కలిసిన ఆదాల
* సరైన సమయంలో నిర్ణయం : ఆదాల
నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 23: రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంఘటన విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఇంటికి మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి వెళ్లి సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. వీరిరువురు కొంతసేపు రాజకీయ చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాఘవేంద్రరెడ్డిని ఓదార్చడానికి వచ్చానే తప్ప మరొకటి కాదన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం బొమ్మిరెడ్డి తీసుకుంటారని ఆయన తెలిపారు. ఆ మాటకు బొమ్మిరెడ్డి కూడా అవును అనే సమాధానమిచ్చారు. మొత్తంమీద బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని తెలుగుదేశం పార్టీకి చేరువ చేయడానికి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తాను కూడా అధికార పార్టీ టీడీపీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు ఒప్పుకున్నారు. గడిచిన మూడున్నరేళ్లుగా వైకాపాలో ఉంటూ వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే టిక్కెట్ తనకే వస్తుందని ఆశాభావంతో ఉన్న బొమ్మిరెడ్డికి ఆనం రామనారాయణరెడ్డి రూపంలో షాక్ తగలడంతో మనస్థాపానికి గురై వైకాపాకు రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేయలేదని, కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమిస్తారని తెలుగుదేశం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని కలిసిన వారిలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనం జయకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

కులమతాలకు అతీతంగా రొట్టెల పండుగ
* రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు
నెల్లూరు, సెప్టెంబర్ 23: కుల మతాలకు అతీతంగా నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రాష్టస్థ్రాయిలో రొట్టెల పండుగ నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక బారా షాహిద్ దర్గాలో దర్శనం అనంతరం రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ స్వర్ణాల చెరువులో రొట్టెను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండుగ అయిదు రోజుల పాటు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారని అన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేశామని, తద్వారా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారని అన్నారు. ఆదివారం సుమారు 10 లక్షల మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. రొట్టెలు అందుకుని వారివారి కోరికలైన విద్య, విజయం, అభివృద్ధి, ధన, నివాస తదితర కోరికలు తీర్చుకున్న తరువాత సంవత్సరం వచ్చి ఆయా రొట్టెలను విడవడం ఆనవాయితీ అన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రికి మేయర్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు.