శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మత్స్యకారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 21: పర్యావరణాన్ని కాపాడడంతోపాటు మత్స్య సంపదను పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని స్థానిక టౌన్‌హాలులో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆప్కాబ్ చైర్మన్ కొండూరు పాలిశెట్టి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ 2014కు ముందు 20 నుండి 30 కోట్లకు పరిమితమైన మత్స్యకార సంక్షేమ బడ్జెట్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చాక పదిరెట్లు పెంచిందని ఆయన పేర్కొన్నారు. 386 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి మత్స్యకార సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 25 కోట్లతో వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. వేట సామగ్రి యూనిట్ విలువ పెంచడంతోపాటు సబ్సిడీని 50 నుండి 75 శాతానికి పెంచామన్నారు. వేట విరామ పరిహారాన్ని 2వేల నుండి 4వేల రూపాయలకు పెంచామన్నారు. ఆదరణ పథకంలో ఏ పరికరాలు కావాలన్నా తీసుకోవచ్చన్నారు. పర్యావరణ అసమతుల్యత వల్ల జలవనరుల్లో మత్స్యసంపద తరిగిపోతున్నందున అందరికీ దీనిపై అవగాహన కల్పించి వారి సూచనలు, సలహాలతో మత్స్య సంపదను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో యునైటెడ్ నేషన్స్ ఈనెల 21వ తేదీని ప్రపంచ మత్స్య దినోత్సవంగా గుర్తించిందన్నారు. ఈ మత్స్య దినోత్సవం 1998 సంవత్సరం నుండి జరుపుకుంటున్నామన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ముద్ర రుణాలు ఇస్తామని ఓవైపు ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం ఆధీనంలోని బ్యాంకులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని డిపాజిట్ చేసుకుని రుణాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలన్నారు. మత్స్యకార సామాజిక భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మత్స్యమిత్ర గ్రూపులన్నింటికీ రివాల్వింగ్ ఫండ్ అందేలా చూస్తామని ఆయన అన్నారు. రిజర్వాయర్లలో మంచినీటి రొయ్య స్కాప్ వదలడానికి తగిన ప్రతిపాదనలు చేయాలని ఆయన సూచించారు. ఆప్కాబ్ చైర్మన్ పోలిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మత్స్యకారులకు అందచేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలను వివరించారు. ఆదరణ పథకాన్ని మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 కమలకుమారి, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి శ్రీహరి, మత్స్య శాఖ సంచాలకులు సిహెచ్ వెంకటేశ్వర్లు, బీసీ కార్పొరేషన్ ఇడి వెంకటస్వామి, కావలి మత్స్యశాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ, తడ జడ్పీటీసీ బొమ్మన శ్రీ్ధర్, మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సోమిరెడ్డి చేతులమీదుగా 145 మంది మత్స్యకారులకు 264 లక్షల రూపాయల విలువచేసే ఐస్‌బాక్సులు, ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు 90 శాతం సబ్సిడీపై అందజేశారు.

ధర్మపోరాట దీక్ష విజయవంతం
* మంత్రి సోమిరెడ్డి స్పష్టం
పొదలకూరు, నవంబర్ 21 : నెల్లూరులో మంగళవారం జరిగిన ధర్మపోరాట దీక్షకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. పొదలకూరు పట్టణంలో రూ. 4.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎన్టీఆర్ జలసిరి తాగునీటి పథకానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఊహించిన దానికంటే ఈ సభ విజయవంతం అయ్యిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారని కొనియాడారు. జిల్లాకు 1.92 లక్షల ఎల్‌ఈడీ బల్బులు కేటాయించారని వాటి ఏర్పాటు కార్యక్రమం చురుకుగా సాగుతోందన్నారు. డిసెంబర్ 15వ తేదీ నాటికి అన్ని విద్యుత్ స్తంభాలకు ఎల్‌ఈడీ బల్బులను అమరుస్తామన్నారు. పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో ఇంటింటికీ కుళాయి పథకం అమలుకు రూ. 200 కోట్లు మంజూరయ్యాయని వీటికి సంబంధించి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా లీటరు శుద్ధ నీటిని 10 పైసలకు ఇవ్వనున్నామన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి వచ్చే సంక్రాంతికి ఈ ప్లాంటును ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. మండలంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా నియోజకవర్గంలో పలు పనుల కోసం రూ. 15 కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. నుడా పరిధిలో నియోజకవర్గానికి 7000 ఇళ్లు, ఎన్టీఆర్ హౌసింగ్‌లో మరో 1500 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. గత పాలకులు మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా ఆ అవకాశం తనకు ఇచ్చారన్నారు. రాజకీయంగా దిగజారాల్సిన అవసరం తనకు లేదన్నారు. జనంలో బతుకుతున్నాం.. జనం కోసమే పని చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొదలకూరు మాజీ జడ్పీటీసీ దేవరం అనూరాధ, నాయకులు మోపూరు శ్రీనివాసులురెడ్డి, దేవరం విజయమ్మ, రఘురామిరెడ్డి, పుల్లయ్యగౌడ్, షేక్ చాంద్ బాష, షేక్ జమీర్ బాష పాల్గొన్నారు.