శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎడతెరిపి లేని వర్షం-రైతుల హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, నవంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై పలు గ్రామాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. గురువారం కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మెట్టప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. వర్షం మోతాదు పెరిగితే సోమశిల నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ ఏడాది ఆయకట్టు రైతులకు సాగునీటికి ఢోకా ఉండదంటున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో ప్రధానంగా వర్షాధార పంటలైన మినుము, పెసర, కంది, మిరప, మొక్కజొన్న పంటలు సాగవుతుంటాయి. ప్రస్తుత సీజన్‌లో మినుము, మిరప, మొక్కజొన్న పంటలు సాగులో ఉన్నాయి. ఈ ఏడాది విత్తనాల పంపిణీ ఆలస్యం కావడంతో కంది, శనగ పంటలు సాగు ఆలస్యం అయ్యింది. మినుము, మిరప, మొక్కజొన్న పంటలు సాగులో ఉన్నాయి. అవి కూడా పూత దశలో ఉన్నందున ప్రస్తుతం కురుస్తున్న వర్షం వల్ల ఏ పంటకీ నష్టం వాటిల్లే పరిస్థితి లేదని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గజ తుఫాన్ ప్రభావం జిల్లాపై ఉంటుందని భావించిన రైతులు కొద్దిపాటి వర్షాలు వచ్చినా తమ పంటలకు ఇబ్బందిలేదని భావించారు. కానీ అధికారులను వణికించిన గజ తుఫాన్ రైతులను ఆదుకోలేకపోయింది. ఇక తమ పంటలపై ఆశలు వదులుకున్న తరుణంలో వారం తిరక్కమునుపే మరో వాయుగుండం జిల్లాను పలకరించింది. దీంతో ఇటీవలి వరకూ తమ పంటలకు విడతలవారీగా నీరు అందించి కాపాడుకున్న రైతులు బుధవారం నుండి వచ్చిన వర్షానికి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉంటే పంటలు చేతికంది అప్పుల తిప్పలు తప్పినట్లేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సోమశిల నీటిమట్టం పెరిగే అవకాశం
తమిళనాడుకు ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలోని చిట్టమూరు మండలంలో అత్యధికంగా 38.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు నియోజకవర్గంలో 10.7 మిమీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రాగల రెండు రోజుల్లో వాయుగుండ ప్రభావం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాలకు తోడు పైతట్టు జిల్లాల్లో వర్షాలు కురిస్తే సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. జలాశయంలో ప్రస్తుతం 38.393 టీఎంసీల వరకూ నీటి నిల్వలు ఉన్నాయి. జిల్లాలోని వాతావరణ పరిస్థితే పైతట్టున ఉన్న కడప, అనంతపురం జిల్లాల్లో కూడా ఉంటే జలాశయానికి వరద నీరు పెరిగే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు ఆచితూచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆయకట్టుకు ప్రాణాధారం కావడమే కాకుండా జలాశయ నీటిమట్టం పెరిగేందుకు కొంతమేర దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ప్రధానంగా ఈ ఏడాది మెట్టప్రాంత రైతాంగానికి సాగునీటి కష్టాల నుండి గట్టెక్కడమే కాకుండా పంట దిగుబడులు చేతికంది కాస్త ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా జిల్లావాసులకు తాగునీటికీ ఢోకా ఉండదని అంచనా.

టీడీపీ మంత్రులు జైళ్లకు వెళ్లడం తథ్యం
* బీజేపీ నేతల స్పష్టీకరణ
నెల్లూరుటౌన్, నవంబర్ 21: తెలుగుదేశం పార్టీ మంత్రులు చేస్తున్న అవినీతి వల్ల 2019లో జైలుపాలు కావడం తథ్యమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో రాష్ట్రంలో టీడీపీ నేతల భూదోపిడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కర్నాటి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు ప్రజల భూములనే ఆక్రమించి పట్టాలనే మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎంతో మంది పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణా, నీరు-చెట్టు లాంటి అనేక పథకాల పేరుతో వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సభలు, ధర్మపోరాట దీక్షల పేరుతో ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా పాలనను గాలికి వదిలేసి చంద్రబాబు దేశమంతా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంటే, ఆయనను గద్దె దించుతానని చంద్రబాబు అనడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చేసిన అవినీతి ఎక్కడ బయట పడుతుందనే భయంతోనే సీబీఐని రాష్ట్రానికి రానివ్వమని అంటున్నారని, అది మాటలకే పరిమితవౌతుందన్నారు. సురేంద్రరెడ్డి మాట్లాడుతూ సెజ్‌లు, విమానాశ్రయాలు, రాజధాని పేరుతో చంద్రబాబునాయుడు రైతుల నుండి భూములను లాక్కొని వాటిని బడా వ్యాపారులకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ భూదోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అగ్రిగోల్డ్ భూములను అతితక్కువ ధరలకు దక్కించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు పెద్ద కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 20 రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజల బలం ఉందని, నరేంద్ర మోదీని ప్రధాని కాకుండా అడ్డుకోవడం చంద్రబాబు వల్ల కాదన్నారు. మోదీ అవినీతి రహిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, 2019లో మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఆ ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. టీడీపీ తెలుగు దోపిడీ పార్టీ అని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నేతలు మిడతల రమేష్, కె.విజయలక్ష్మి, ఎం.ఈశ్వరయ్య, విజయకుమార్, ఎం.శ్రీనివాసులు గౌడ్, ఎస్పీ పరశురాం, కె.మధు, భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.