జాతీయ వార్తలు

స్టాలిన్‌కే డిఎంకె పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 4: డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధినేత ఎం కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. దీంతో ఇప్పటివరకు కరుణానిధికున్న అన్ని అధికారాలు స్టాలిన్‌కు లభించినట్లయింది. బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయం ‘అణ్ణా అరివాలయం’లో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో 63 ఏళ్ల స్టాలిన్‌ను వర్కింగ్ ప్రెసిండెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరుణానిధి వారసుడు స్టాలినేనన్న విషయం ఎప్పుడో తెలిసినప్పటికీ 93 ఏళ్ల కరుణానిధి ఇటీవలి కాలంలో రెండుసార్లు అనారోగ్యానికి గురయిన నేపథ్యంలో స్టాలిన్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం గమనార్హం. జయలలిత మృతితో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని వార్తలు వస్తున్న తరుణంలో స్టాలిన్‌ను డిఎంకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం రాజకీయ వర్గాల్లో అసక్తిని రేకెత్తిస్తోంది. కాగా, ఈ సమావేశానికి కరుణానిధి హాజరుకాలేదు. 50 ఏళ్ల పార్టీ చరిత్రలో కరుణానిధి పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి. అంతేకాదు 60 ఏళ్ల డిఎంకె చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును సృష్టించడం కూడా ఇదే మొదటిసారి. స్టాలిన్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడానికి సమావేశంలో పార్టీ నియమావళికి అసవరమైన సవరణలు కూడా చేశారు. ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా ఉన్న స్టాలిన్ కొత్త పదవితోపాటుగా ఆ పదవిలోను కొనసాగుతారని కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి స్టాలిన్ పేరును ప్రతిపాదిస్తూ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన కార్యదర్శి అన్బళగన్ ప్రకటించారు.
స్టాలిన్‌ను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకొన్న వెంటనే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద, అలాగే స్టాలిన్ నివాసం వద్ద ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి తమ ఆనందాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్ క్షీణిస్తున్న తన తండ్రి ఆరోగ్యం గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. గతంలో అయితే కొత్త బాధ్యతలను అప్పగించినప్పుడు తాను గర్వంగా, సంతోషంగా భావించి ఉండేవాడినని, అయితే ఇప్పుడు భారమైన గుండెతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘అందరి సలహాలు, సూచనలు తీసుకుని, సీనియర్ నేతలు చూపిన బాటలో నడుస్తూ మీ అందరి మద్దతుతో పార్టీ కార్యక్రమాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని స్టాలిన్ అన్నారు. తన తండ్రి కరుణానిధిని అలుపెరుగని నేతగా ఆయన అభివర్ణిస్తూ, అలాంటి నేతకు ఇప్పుడు కాస్త విశ్రాంతి అవసరమైందన్నారు.

చిత్రం... డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అనంతరం తండ్రి కరుణానిధి ఆశీర్వాదం తీసుకుంటున్న స్టాలిన్. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ప్రతినిధులు