ఉత్తరాయణం

బిజెపికి డాక్టర్ లక్ష్మణ్ చికిత్స..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కె. లక్ష్మ ణ్ నియమితులయ్యారు. శుక్రవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం ఘన సన్మానం కూడా జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ లక్ష్మణుని ముందు పలు సవాళ్ళు ఉన్నాయి. ముందుగా పట్టణాలకే బిజెపి పరిమితం అనే ముద్రను తొలగించుకోవాల్సి ఉంది. జాతీయ స్థాయిలో బిజెపి హవా కొనసాగితే తప్ప ఇక్కడ ఓట్లు రాలవన్న అభిప్రాయాన్నీ దూరం చేయాలి. అంతేకాదు ఉన్నతవర్గాల పార్టీ అనే మరో ముద్రను తొలగించుకోవాల్సిన అవశ్యకత ఉన్నది. బిజెపి శాఖలను గ్రామాల్లోకి విస్తరించాల్సి ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపి హైదరాబాద్‌లో ఐదు స్థానాలను కైవసం చేసుకున్నది. పూర్వ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రా రెడ్డి, రాజాసింగ్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా ఆ పార్టీ గెలుపొందలేదు. మనుగడ కూడా కనిపించడం లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను పార్టీ అధిష్ఠానం డాక్టర్ లక్ష్మణ్ భుజస్కందాలపై ఉంచిం ది. టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కాదు బిజెపినే అనే విధంగా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సంకేతాలు పంపించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా ఇది బరువైన బాధ్యతే. తెలంగాణలో బిజెపి శాఖలను నలుమూలల విస్తరించి, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ పార్టీగా మార్చాలంటే, తలపాగ చుట్టినంత తేలిక కాదు. ఈ విషయం పార్టీ జాతీయ నాయకత్వానికీ తెలుసు. అయినప్పటికీ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు ఆశించినంత బలం గా లేనందున, పార్టీని ప్రజల మధ్య కు తీసుకెళ్ళి పటిష్టపరచాల్సిన బాధ్య త డాక్టర్‌పై ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బిజెపి శాఖకు రెండో అధ్యక్షుడని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగక ముందు ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కిషన్‌రెడ్డి కొనసాగారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వారిలో ఎక్కువ మంది ఉన్నత కులానికి చెందిన వారే ఉన్నారు. ఎం. వెంకయ్య నాయుడు, చిలకం రామచంద్రారెడ్డి, వి. రామారావు, ఎన్. ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రావు, జి. కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. బిసి అయిన బండారు దత్తాత్రేయ తర్వాత లక్ష్మణ్‌కే అవకాశం లభించింది. రాష్ట్ర విభజన తర్వాత జనాభాలో కులాల వారీగా చూస్తే బిసిలే అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి డాక్టర్ లక్ష్మణ్ బిసిలను బిజెపి వైపు ఆకర్షింపజేయడంలో ఏ విధంగా అడుగులు ముందుకేస్తారోనని పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. బిజెపి ఒక మతానికి, ఒక కులానికి పరిమితం కాదని, బిసిలకు అండగా ఉంటుందని చెప్పడమే కాకుండా, అన్ని కులాలను, మతాలను కలుపుకుని పోవాలి. లేకపోతే పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయ డం సాధ్యం కాదు.
ఇక లోగడ పలువురు నేతలు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ తేడా ఉంది. లోగడ పార్టీ ఇతర పార్టీలతో జత కడితే తప్ప మనుగడ సాధించలేక పోయిం ది. ఇప్పుడు పరిస్థితులు భిన్నం గా ఉన్నాయి. తెలుగు దేశం పార్టీతో జత కట్టాలంటే కష్టంగానే ఉంది. సమైక్యాంధ్ర పార్టీగా ముద్ర పడిన టిడిపిని వదులుకుంటే తప్ప తెలంగాణలో బిజెపికి భవిష్యత్తు లేదని ఆ పార్టీ నాయకులు అధిష్టానం వద్ద బల్లగుద్ది వాదిస్తున్నారు. 1982లో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించడంతో గాలి అటువైపు వీచి బిజెపి భవిష్యత్తుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత 1985లో అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బిజెపి, టిడిపి, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. 1994 సంవత్సరంలో టిడిపితో కలిసి పోటీ చేసి 12 సీట్లు కైవసం చేసుకుంది. 2009లో ప్రతిపక్షాలు టిఆర్‌ఎస్‌తో సహా మహాకూటమిగా ఏర్పాడి పోటీ చేశాయి. 2014లో మళ్ళీ టిడిపితో బిజెపి కలిసి పోటీ చేసింది. ఇలా ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేయడం వల్లే పార్టీ యంత్రాంగం డీలా పడుతోంది. ద్వితీయ శ్రేణి నాయకులు నిరాశ చెందుతున్నారు. అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేసే రోజులు రావా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేలా కొంత మంది బిజెపి నాయకులు కష్టించినా, ఆ సీట్లను పొత్తులో టిడిపి తన్నుకుని పోయిన దాఖలాలు ఉన్నాయి. ఇలాగైతే పార్టీ కనుమరుగు కావడం అనే భావన నేతల్లో కనిపిస్తున్నది. కాబట్టి టిడిపితో పొత్తు వద్దనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మెజారిటీ అభిప్రాయాన్ని పార్టీ గౌరవించాలి.
టిడిపితో పొత్తు లేకుండా పార్టీని ముందుకు నడిపించడం అంత తేలికైన అంశమేమీ కాదు. టిడిపి బలహీనపడి ఉండవచ్చు, కానీ ఆ పార్టీకీ ఓటు బ్యాంకు అనేది ఉం ది. ఒకప్పుడు బిసిలు టిడిపిని అపూర్వంగా ఆదరించారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి గెలుపు-ఓటమిలను ఒకటి, రెం డు శాతాలే తారు-మారు చేస్తుంటాయి. బిజెపి అంటే హైదరాబాద్‌కే లేదా పట్టణ పార్టీ అనే ముద్రను తొలగించుకుని, గ్రామాల్లోకి విస్తరించేందుకు డాక్టర్ లక్ష్మణ్ కా ర్యాచరణ సిద్ధం చేసుకోవాల్సి ఉంది. మరోవైపు పార్టీలో కొంత మందితో బేదాభిప్రాయాలు వచ్చి చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్న గోషామహల్ బిజెపి ఎమ్మె ల్యే రాజా సింగ్‌ను అక్కున చేర్చుకోవాల్సి ఉంది. మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డినీ చేరదీయాల్సి ఉంది. సీనియర్లను, జూనియర్లను కలుపుకుని, సమన్వయంతో ముందుకు నడిపించాలి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచాల్సి ఉంది. టిఆర్‌ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అనే విధంగా పార్టీ కార్యకర్తల్లో ‘జోష్’ పెంచాల్సి ఉంది.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి