శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్వర్ణముఖి నుండి చెరువులకు సాగునీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లకూరు, డిసెంబర్ 18: స్వర్ణముఖి నది సిస్టం కింద సాగుతువుతున్న పొలాలకు సాగునీరు అందించేందుకు గాను శ్రీకాళహస్తి ఇరిగేషన్ అధికారులు శుక్రవారం చెరువులకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ ఇఇ నజీర్ అహ్మద్ స్థానిక టిడిపి నాయకుల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి వద్ద నదిపై ఏర్పాటు చేసిన చెక్ డ్యాం వద్ద రెండులాకర్లు ఎత్తి సాగునీటిని విడుదల చేశారు. దీంతో నదిలోని సాగునీరు కాలువ గుండా ప్రవహించి మండల పరిధిలోని 18 చెరువులకు చేరుకొంది. మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే అనేక చెరువులకు దాదాపు 75 శాతం నీరు చేరింది. మిగతా 25 శాతం నిండే ప్రయత్నంలో అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇఇ మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఇరిగేషన్ సెక్షన్ పరిధిలో ఉన్న మండలంలో ఉన్న చెరువులన్నంటికి సాగునీరు అందించడమే తమలక్ష్యమన్నారు. సెంటు పొలం కూడా ఎండనివ్వకుండా రైతులకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఇ రాఘవేంద్రరావు, టిడిపి నాయకులు పేరం రమేష్ నాయుడు, గోపాల్ రెడ్డి, శివకుమార్ మొదలియార్, భూషణం, మురళీ తదితరులున్నారు.

బద్దెవోలులో ప్రబలిన విషజ్వరాలు
* 20మందికి పైగా విషజ్వరాలు
మనుబోలు, డిసెంబర్ 18: మండలపరిధిలోని బద్దెవోలు దళితవాడలో మళ్లీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఒకవైపు అధికారులు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నా జ్వరాలు ప్రబలుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ముందు బద్దెవోలు దళితవాడలో సుమారు 150 కుటుంబాలు ఉండగా, దాదాపు ప్రతి కుటుంబం జ్వరాలతో బెంబేలెత్తారు. వీరిలో అనేక మందికి డెంగ్యూ, టైపాయిడ్ వంటి జ్వరాలు రావడంతో ఆర్థికంగా చితికిపోయారు. వైద్యాధికారులు కాలనీలో శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వెళ్లి దోమలు ప్రబలుకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో జ్వరాలు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు బద్దెవోలు గ్రామం నీట మునిగింది. కాలనీలో అస్తవ్యస్తంగా డ్రైనేజి కాలువలు ఉండటంతోపాటు రోడ్డు బురదమయమైంది. డ్రైనేజి కాలువల్లో నీరు రోడ్డు పైకి చేరుతున్నాయి. ప్రస్తుతం సుమారు 20మందికి పైగా జ్వరాలతో మంచం పట్టారు. దీంతో మళ్లీ జ్వరాలు ప్రబలడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. కాలనీలో మమత, ఎస్.శీనమ్మ, సిగ భాస్కర్, సుగుణమ్మ, కోటమ్మ, సిగ సింధు, నరసయ్య, శాంతమ్మలతోపాటు మరో 10మందికి పైగా జ్వరాలతో బాధపడతున్నారు. ఇటీవల వరదలతో సర్వం కోల్పోయి ఆర్థికంగా చితికి ఉన్న సమయంలో మరోవైపు పులి మీద పుట్రలా జ్వరాలు రావడంతో ప్రభుత్వ వైద్య సేవలు అందించి ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

రైతులకు రుణాల రీ షెడ్యూల్
* లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు వెల్లడి
ఆత్మకూరు, డిసెంబర్ 18: ప్రభుత్వం అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాలను కరవుప్రాంతాలుగా ప్రకటించినందున అక్కడి రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి మరలా పంట రుణాలు ఇవ్వనున్నట్లు లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ఐదేళ్లపాటు ఈ రుణాల రీ షెడ్యూల్ జరుగుతుందని వివరించారు. శుక్రవారం ఆత్మకూరు మండల పరిషత్ సభామందిరంలో జాయింట్ లెవల్ బ్యాంకింగ్ సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి మంజూరైన సబ్సిడీ రుణాలకు సంబంధించి సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల నుంచి అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రుణాల మంజూరు ప్రక్రియలో డిఆర్‌డిఏ పాత్ర కీలకంగా ఉందన్నారు. లబ్ధిదారులు తాము ఎంచుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేసే వరకు ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంచాలంటూ స్థానిక అధికార్లకు సూచించారు. బ్యాంక్ లింకేజి ఉన్నందున లబ్ధిదార్లకు సబ్సిడీ అందేలా తప్పక చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రవౌళి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వేనాడులో ఘనంగా గంధోత్సవం
తడ, డిసెంబర్ 18: మండల పరిధిలోని వేనాడులో వెలసివున్న షేక్ దావూద్ వాలీ 20వ దర్గా గంధోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో దర్గాను సందర్శించుకున్నారు. దర్గా వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్గా సమీపంలో విద్యుత్ అలంకారంతో ఈఫిల్ టవర్, దర్గా వద్ద 786తో ఏర్పాటు తోరణాలు చూపరులను ఆకర్షించాయి. సాధారణంగా దర్గా గంధోత్సవం సమయంలో విపరీతమైన రద్దీ ఉండేది. ఈ సంవత్సరం రద్దీ లేక వెలవెలబోయింది. చెన్నైలో భారీ వరదల కారణంగా భక్తుల తాకిడి తక్కువగా కనిపించింది. ఆర్టీసీ సూళ్లూరుపేట నుండి వేనాడుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి హవాలీ, గంధోత్సవం గ్రామ పెద్ద ఇంటి నుండి ప్రారంభమైంది. పోలీసులు బందోబస్తు అధికంగా ఏర్పాటు చేశారు. సిఐ, ఆరుగురు ఎస్సైలు, వంద మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు.

‘పెంచిన వేతనాలు విడుదల చేయాలి’
నెల్లూరు , డిసెంబర్ 18: మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతన నిధులను వెంటనే విడుదల చేసి, సమ్మెకాలపు వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట శుక్రవారం పెంచిన వేతనాలు, సమ్మెకాలపు వేతనం విడుదల చేయాలంటూ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో సంఖ్య 224 ప్రకారం పెంచిన వేతనాలు ఇంతవరకు ఇవ్వకపోవటం దారుణమన్నారు. ధర్నా అనంతరం మేయర్ అబ్దుల్ అజీజ్, నగరపాలక కమిషనర్ మూర్తికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ 5రోజుల్లో కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మజ, యూనియన్ జిల్లా, నగర కార్యదర్శులు కె పెంచలనరసయ్య, అల్లాడి గోపాల్, బివి రమణారెడ్డి, దేశయ్య, మునెమ్మ, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.

‘కాల్‌మనీ దోషులను కఠినంగా శిక్షించాలి’
నెల్లూరు, డిసెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా బయటపడుతున్న కాల్‌మనీ వ్యవహారంపై సిబిఐచే దర్యాప్తు జరిపించి నిజానిజాలను నిగ్గుతేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక కుటుంబాలు కాల్‌మనీ ఉచ్చులో ఇరుక్కొని కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఈ వ్యవహారంలో అన్ని రాజకీయ పార్టీలే కాకుండా కమ్యూనిస్టు పార్టీ కూడా ఉండటం చూస్తుంటే ఎంతో ఆందోళన కలుగుతుందన్నారు. కాల్‌మనీ నిర్వాహకులు మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి వారి శీలంతో ఆడుకోవడం దుర్మార్గమని, వారిపై నిర్భయ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యాపారంలో టిడిపి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని టిడిపి అధిష్ఠానం పార్టీ నుండి బహిష్కరించి ప్రజాజీవన విలువలను కాపాడాలన్నారు. శాసనసభలో కాల్‌మనీపై అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉండగా, దురదృష్టవశాత్తు ప్రతిపక్ష నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి అందుకు సహకరించడం లేదన్నారు. ఆయన అపరిపక్వతతో వ్యవహరిస్తూ అసెంబ్లీ సమయాన్ని వృధాచేయడం శోచనీయమన్నారు. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరుపట్ల దేశ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు న్యాయస్థానం ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం సోనియా కుటుంబంపైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను, పన్నుల విధానాన్ని బలోపేతం చేసి జిఎస్‌టి బిల్లు రాజ్యసభ తీర్మానించాల్సిన సమయంలో దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ కాకుండా దేశ ప్రజలపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ఇలాగే కొనసాగితే తగిన సమయంలో దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో బిజెపి నాయకులు కె సుధాకర్‌రెడ్డి, ఎం శ్రీనివాసులు, నరసింహులు నాయుడు, బి శ్రీనివాసులు, కె మధు, కామేశ్వరమ్మ పాల్గొన్నారు.