సాహితి

తెలుగుభాషా పండితులకు, నిఘంటు నిర్మాతలకో మనవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్‌సైజు ఆక్స్‌ఫర్డు ఇంగ్లీషు డిక్షనరీ (2011 ప్రచురణ- పునర్ముద్రణ 2013)లో ఇంగ్లాండు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇండియా, రష్యా, జపాన్, చైనా తదితర దేశాలకు చెందిన అనేక భాషలలోని పదాలు ఎన్నో యథాతథంగా స్వీకరింపబడి, ప్రాంతీయ వైవిధ్యంతో కూడిన స్టాండర్డు ఇంగ్లీషుగా ప్రకటింపబడ్డాయి. భారతదేశంలోని సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం మొదలగు భాషలకు చెందిన పదాలు కూడా అత్యధిక సంఖ్యలో స్వీకరింపబడ్డాయి. ముఖ్యంగా సంస్కృతం, తెలుగు, (ప్రచారంలో వున్న కొన్ని హిందీ ఉర్దూతో కలిపి) భాషా పదాలు షుమారు 300 దాకా వున్నాయి. ఉస్తాద్, ఊతప్పం, వడ, ఇడ్లీ, వర్ణ, వేదాంత, వీణ, వరండా, వట్టివేర్, విదేశీ, విన్యాస, వజీర్, యంత్ర, యాత్ర, యోగ, యోగి, యోగిని, యోని, జమీందార్, జమీందారీ, జనానా, జిల్లా వంటి వందలాది అన్య భాషా పదాలు నిఘంటువులకెక్కాయి. ప్రపంచ భాషగా ఇంగ్లీషు అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి గల అనేక కారణాలలో ఒక కారణంగా ఈ సర్వసంగ్రాహక దృష్టిని కూడా పేర్కొనవచ్చు. ఆంగ్ల భాషీయులు అన్యభాషా పదములను అస్పృశ్యములుగా భావించకుండా, వానిని నిషేధించకుండా, వానిని ఆంగ్ల భాషా పదాలుగానే స్వీకరిస్తున్నారు. వానిని తమ వానినిగా చేసుకొని, తమ భాషను సుసంపన్న మొదించుకుంటున్నారు. కాని మన దృష్టి ఎలా ఉంది? మనకు దేశంలోని ఇతర భారతీయుల భాషలలోని పదాలు కూడా అస్పృశ్యములవుతున్నాయి. వానిని వాడితే మన భాష మైలపడిపోతుందేమోనని మనం భయపడుతున్నాము. ‘ఋ, బు’ అనే అక్షరాలనూ, తెలుగు అక్షరమయిన ‘ఱ’నూ నిషేధించుకుంటున్నాము. మనల్ని మనం కుంచించుకుంటున్నాము, వంచించుకుంటున్నాము. ఇంగ్లీషులో 26, తమిళంలో 26 అక్షరాలు మాత్రమే ఉండగా మనకు 56 ఎందుకని అంటున్నాం. పరాయి వారి పాలన వలన అయితేనేమి, ఈనాటి మెకాలే మానసపుత్రుల బానిస మనస్తత్వ పరిణామ మాత్రమయిన ఆంగ్ల భాషావ్యామోహము వలన అయితేనేమి, మన దేశంలో ఎన్నో అరబిక్, ఉర్దూ పదాలు, ఇంగ్లీషు పదాలు ప్రజల దైనందిన జీవనంలో అమితంగా చోటుచేసుకున్నాయి. వీని అన్నింటినీ త్రోసిరాజని, వానికి ప్రత్యామ్నాయ పదాలను సృష్టించుకొని, వాడుకలోకి తెచ్చే ప్రయత్నం ప్రశంసనీయమే. స్వాభిమానంతో కూడిన అలాంటి ప్రయత్నాన్ని కాదనరు. కాని ప్రజాజీవితంలో లోతుగా పాతికొనిపోయి ఉన్న అన్యభాషా పదాలను మీరు తొలగించగలరా? ప్రత్యామ్నాయ శబ్దాలను సృష్టించి, వానిని ప్రచారంలోకి తేగలరా? ఒకవేళ మీరు ఏవో పదాలు సృష్టించి, నిఘంటువులలోకి ఎక్కించినా అవి ప్రజల నోళ్లకు పడతాయా? వివిధ పత్రికలు, సినిమాలు, టీవి చానెళ్లు మొదలైన మీడియా ప్రపంచంలో విరివిగా ఉపయోగించే ఆంగ్ల పదాలను మీరు నిరోధించగలరా? మన నిత్య వ్యవహారంలో అందరికీ అందుబాటులో ఉండి, అంతగా ఇంగ్లీషు రాని గ్రామీణ స్ర్తిపురుషులు సైతం నిత్యమూ ప్రయోగించే ఆంగ్ల పదాలు ఎన్ని ఉన్నాయో గమనించారా?
అర్జంటు, అంకుల్, అండర్‌వేర్, యూనియన్, వార్నిష్, వీటో, విలన్, వయొలిన్, వలంటీర్, ఓటు, ఓటరు, వెయిటర్, వెయిటింగ్ రూము, వార్డు, వార్నింగు, గ్యారంటీ (వారంటీ), వాష్‌బేసిన్, వెబ్‌సైట్, ఎజిల్, వైఫై, విల్లు, రెంచి, రిస్టువాచి, రాంగ్, జిప్పు, జీరో, జోన్, జూ వంటి ఆంగ్ల పదాలు ఎన్నో వాడకంలో ఉన్నాయి. ఇంగ్లీషు పదాలు, యిలాగే యింకా ఎన్నో తెలుగు ప్రజల జిహ్వాగ్రములపై నర్తిస్తున్నాయి. వీటికి సరియైన తెలుగు పదాలను సూచించవలసిన బాధ్యత తెలుగు నిఘంటు నిర్మాణ కర్తలయిన పండితులపై ఉంది. అలా చేయకపోతే, లేదా చేయలేకపోతే, ఈ పదాలను తెలుగు పదాలుగా స్వీకరించి, తెలుగు నిఘంటువులలో వాటికి చోటు కల్పించండి. తెలుగు భాషకు అనుకూలమైన రీతిలో మలుచుకోవచ్చును. హాస్పిటల్‌ని ఆసుపత్రిగా మార్చి ఎకాడమీ నిఘంటువులో వ్రాసినట్లు. అంతేగాని, నిత్య వ్యవహారంలో సర్వేసర్వత్రా ఉన్నప్పటికీ, తెలుగు నిఘంటువులలో ఈ పదాలు కన్పడకపోతే దాని అర్థం ఏమిటి? మనం కళ్లు తెరచి లోకాన్ని చూడటం లేదనేకదా!
ఉదాహరణకు ఫోను విషయమే తీసుకుందాము. మొబైల్ ఫోనులో అందరూ ముందుగా ‘హలో’ అంటున్నారు. పసి పిల్లలు సైతం ఎరిగిన మాట ఇది. కాని ఈ ‘హలో’ అనే పదం, కనీసం ఫోను, సెల్ అనే పదాలు మన నిఘంటువులలో కన్పించవేమి? తెలుగు ప్రజలు నిత్యమూ వాడుకలో మాట్లాడే మాటలే తెలుగు భాష అంటే అది అచ్చ తెలుగా, సంస్కృతమా, తత్సమమా, అన్య దేశమా అనేది ప్రజలకు అనవసరము. ‘ఇంటర్నెట్’ అనే పదం అందరికీ తెలిసిందే. అది కాదని ‘అంతర్జాలం’ అని చెబితే ఎవరికి అర్థం అవుతుంది? రైలు అంటే ధూమశకటం, పొగబండి ఇత్యాదులు అర్థాలు చెబుతారే ఎకాడమీ నిఘంటువులో! ఆ పదాలు ఎవరికైనా తెలుసా వాడుకలో. ఇప్పుడు పొగబండ్లు (్ధమ శకటాలు) ఉన్నాయా, డీజిల్ ఇంజన్లు, ఎలెక్ట్రికల్ ట్రయిన్లు మాత్రమే కదా! మనం అసలు ఈ లోకంలో ఈ కాలంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇలా మడికట్టుకొని, ఇంకా బి.సి. నాటి ఆ పదాలనే, కాలం చెల్లిన ఆ భాషనే పట్టుకొని వేలాడుతామంటే కుదురుతుందా? కాలం ముందుకు సాగిపోతోంది. గతంలో నుండి వర్తమానంలోకి, వర్తమానంలోండి భవిష్యత్తులోకి వెళ్లవలసిన వాళ్లం యింకా మునివ్రేళ్ల మీద నిల్చొని, తలలు వెనుకకు త్రిప్పి, గతంలోకే చూస్తూ కూర్చుంటామంటే కాలపురుషుడు క్షమిస్తాడా? గతంలో ఉన్న భాష మనకు తప్పక తెలియవలసిందే. ఆ మాటలకు అర్థాలు తెలియకపోతే, పూర్వీకులు మనకు యిచ్చిపోయిన సాహిత్య సంపదను ఎలా పంచుకోగలం? కాని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి కూడా. తెలుగు భాష సంస్కృత భాష ‘ఆక్టోపస్’ (అష్ట్భుజి) వంటివి. ఆ జంతువు తన పొట్ట క్రిందికి వచ్చిన ప్రాణులను ఎనిమిది కాళ్లతో అదిమి పెట్టుకొని, తన పొట్టలోకి లాక్కొని జీర్ణం చేసుకుంటుంది. అలాగే మన భాషలో ఉన్న అంతశ్శక్తి కారణంగా అన్య దేశములను తెలుగు భాషా పదములుగా మార్చుకోగలము, లేదా అలాగే స్వీకరించి, స్వంతం చేసుకోగలము.. ఆ విధంగా మన తెలుగు భాషను సుసంపన్నమొనర్చుకోగలం.
ఈనాడు తెలుగు ప్రజలంతా నిత్యమూ మాట్లాడుకొనే ఇంగ్లీషు పదాలు అన్నీ తెలుగు పదాలుగా స్వీకరిస్తే ఏమవుతుంది? మన భాష మైలబడిపోదు. ఆ పదాలు మన భాషతోమమేకమయిపోతాయి. ఆక్సుఫర్డు నిఘంటుకారుల నుండి తెలుగు భాషా పండితులు గ్రహించవలసిన, అనుసరించదగిన అంశం ఇది.

- దోనెపూడి వెంకయ్య, 9640110105