సాహితి

తెలంగాణ సాహిత్యం - వర్తమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన, సృజనని స్థలకాలాలు నిర్దేశిస్తాయి. ఇప్పుడు స్థలం కొత్త రాష్ట్రం. కాలం రాష్ట్రావతరణ అనంతర సమయం. వీటి మధ్య జీవిస్తున్న తెలంగాణ ప్రజల జీవితమే వర్తమానం. ఈ వర్తమానాన్ని మానవీయంగా, ప్రజాస్వామ్యంగా, సుఖసంతోషాలతో తీర్చిదిద్దడమే కర్తవ్యం.
పదునెక్కిన పాళీలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, సమాజాన్ని, దోపిడి శక్తులను నిలువరించి, ప్రశ్నించి తోకముడిచేలా చేశాయి. సుమారు పధ్నాలుగేళ్ళపాటు పాళీలు కరవాలాలుగా పనిచేశాయి. స్వరాలు ఉద్యమ గీతాలైనాయి. కొత్త పల్లవులు నెగడుని సదా జ్వలింపచేశాయి. సాహిత్య కళారంగ చరిత్రలో అదొక ఉజ్వల ఘట్టం. కొనసాగుతున్న తెలంగాణా ప్రజల వారసత్వం అది. పాలకురికి సోమన ఘంటం మొదలు నేటి సరికొత్త పాళీవరకు అదే సంప్రదాయం. ఎన్ని ఆటుపోట్లు, అవాంతరాలు ఎదురైనా మడమ తిప్పనితనం.
ఇంకా పూర్తిగా తొలగని పరాయి పెత్తనపు ఛాయలు. సినిమా, పత్రికలు, చానెళ్ళలోంచి పాత సంస్కృతి మోహరింపు. ఆ పంచరంగుల మాయా ప్రపంచం దుపట్టాల మైకపు ఆవరింపు. మనిషిని మరింత లోబరుచుకుంటున్న మార్కెట్ వ్యామోహం. పెట్టుబడి సంకెళ్ళకి ‘నమో’ వాక్యాలు పలకడం నిత్యతంతు. కొత్త ప్రభుత్వానికి ప్రజలు పలుకుతున్న మద్దతుకన్నా, ప్రభుత్వం ప్రజలకు మరింత అధికంగా దగ్గర కావలసిన నవీన పరిస్థితి. పేదతనం మలుపు తిరగాలి. దీనత్వం స్థానే తలెత్తుకు బతికే పరిస్థితి ఏర్పడాలి. మాటల మత్తులోంచి చేతల వాస్తవంలోకి దారితీయవలసిన అగత్యం ఏర్పడి ఉంది. ఎలాంటి స్వార్థ రహితంగా ఉన్నది ఉన్నట్లుగా నిర్మొహమాటంగా చెప్పగలిగే సత్తా, బాధ్యత ఒక పాళీలకే ఉంది. అలాంటి పాళీలను గౌరవించడం అందరి బాధ్యత. ప్రస్తుతం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పేగుబంధంగా అక్షరమే వంతెనగా పనిచేస్తుంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటువల్ల ప్రజల జీవితంలో గణనీయ మార్పు సంభవిస్తుందనే ధీమా పెరగాలి. ప్రపంచ ఉద్యమచరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సరికొత్త అధ్యాయం లిఖింపబడాలని కలాలు ఆరాట పడుతున్నాయి. నినాదాలని జీవిత విధానాలుగా చేయాలి. ఆకలి, ఆత్మహత్యలు, హత్యలు, ఆంక్షలు లేని తెలంగాణాని చిత్రించాలని పాళీలు నిరీక్షిస్తున్నాయి. వాటి ఆరాటం అదే కదా. వర్తమానాన్ని సమీక్షించుకోవడమే దార్శనికత. అది ప్రజా రాజకీయార్థిక సిద్ధాంత భూమిక. ప్రభుత్వ శాఖలు సమీక్షలు నిర్వహించుకున్నట్లే, పాలక పార్టీలు కొత్త ఎత్తుగడలతో అంగలు వేస్తున్నట్లే, వామపక్ష విప్లవ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్లే, తెలంగాణాలో పాళీలు మేమెక్కడ ఉన్నాం అని తరచి చూసుకోవాలి. మార్గాన్ని మరింత సుగమం చేసుకుంటూ నడవాలి. వేగాన్ని, ప్రయాణ లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకోవడానికి గాను తమలోకి తాము, తమ కుబుసాల్ని వొలిచి కొత్త శక్తితో ముందంజ వేయాలి.

========================================================
(21 ఫిబ్రవరి 2016 నాడు తెలంగాణ రచయతల వేదిక మహబూబ్‌నగర్ జిల్లా మహాసభల సందర్భంగా...)

- జలజం సత్యనారాయణ 9849444944