వినదగు!

ఎదిగేది ఆత్మ... తరిగేది తనువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మవసాదయేత్’ అంటుంది భగవద్గీత. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం - అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని. ఇదీ మన మానవ జన్మ రహస్యం. మనల్ని ఉద్ధరించుకోవటానికి మరొకరి సాయం అవసరమా అంటే అవసరం లేదు అని అంటుంది గీత. ఉద్ధరణ కార్యక్రమంలో మనకు మనమే మిత్రులం! ఉద్ధరించుకోలేకపోతే మనకు మనమే శత్రువులం - ఇదీ మరణ రహస్యం. నిజానికి దేహం తనను తాను ఉద్ధరించుకోలేదు.. కారణం డెపెండెంట్ కాబట్టి. అయితే ఆత్మ తనను తాను ఉద్ధరించుకోగలదు కాబట్టి ఇండిపెండెంట్.
‘అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్’ అని కదా కృష్ణ గీత అంటోంది. అంటే ఆత్మతో మగ్నం కాగలిగితే మనకు మనమే మిత్రులం. ఆత్మధర్మానికి మగ్నం కాలేక శరీర ధర్మానికే కట్టుబడి పోతుంటే మనకు మనమే శత్రువులం. ఇలా ఉద్ధరణ ప్రాతిపదికన ఆత్మ అంటే ఎదిగేది, దేహం అంటే తరిగేది. కాబట్టి ఎదగటానికి మనం ఆత్మసంపన్నులం కావాలి.
ఆత్మ ఎదగటం లేదా ఆత్మ ఉద్ధరింపబడటం అంటే ఆత్మ పరిణామం అనే. దీనే్న ఆత్మ ప్రయాణం అనీ అంటుంటాం. ఆత్మ కాలానికి తలవంచి ప్రయాణాన్ని మానుకోదు కానీ దేహం మాత్రం కాలానికి బద్ధమయ్యే ఉంటుంది. ఆత్మ పరిణామానికి ఏ ఆధారమూ అవసరం లేదు. అలాగే ఆత్మ దిక్కులతో సంబంధం లేకుండా పరిణమించ గలుగుతుంది. పరిణామ క్రమంలో దాన్ని ఏ శక్తీ నిరోధించలేదు. పైగా ఆత్మ రోదసిలోకీ దూసుకుపోగలదు. పాతాళంలోకీ చొచ్చుకు పోగలదు. ఇంకా చెప్పుకోవాలంటే దేహాన్ని కాదనీ ప్రయాణించగలదు. కాబట్టే దేహాన్ని పూర్తిగా విడిచిపెట్టిన తరుణంలో అంటే తనువు చాలించిన తర్వాత ఆత్మ సంపూర్ణంగా స్వతంత్రిస్తుంది. అంతకాలం దేహ బాధ్యతను వహిస్తూ వచ్చినా దేహాన్ని మృత్యువుకు వదిలేసి ఆత్మ సర్వ స్వతంత్రమవుతుంది.
దేహ రూపాన్ని ఆశ్రయించి ఆత్మ పుడమి పైకి వచ్చినా అదే దేహాన్ని విసర్జించి ఆత్మ పుడమిని వీడినా తానే శాశ్వతమనీ, తనను ధరించిన దేహం అశాశ్వతమనీ ఆత్మకు తెలుసు. ఈ ‘ఎరుక’ను ఎరుకపరిచేదే గీత. దీన్నిబట్టి మనకు స్పష్టమయ్యేదేమిటంటే ఎటువంటి ఆచ్ఛాదనా లేనిది ఆత్మతత్వం అని. ఇలా ఆత్మతత్వం వారినే మనం స్పిరిట్యుయలిస్ట్‌లు అని అంటున్నాం. ఇంతకీ స్పిరిట్యుయలిస్ట్ అంటే ఆత్మ తత్వాన్ని అంగీకరిస్తూ ఆత్మజ్ఞానంతో గిక పరిణతిని పొందటం.
స్పిరిట్యయలిజమ్ పరంగా మనల్ని మనం ఉద్ధరించుకోవటం అంటే మానవ సంక్షేమాన్ని కాంక్షించటం.. హిత స్వభావమే ఆత్మ పరిణతికి హేతువు కావటం.. సహ జీవన సౌభాగ్యాన్ని అనుభవించటం. నిజానికి ఆత్మ జాగృతమయ్యేది హిత కాంక్షతోనే. అంటే మానవ తత్వాన్ని త్యజించి కేవలం దివ్యత్వం వెంటపడ్డా ఆత్మజ్ఞత సాధ్యం కాదు. కాబట్టి మానవ తత్వంతో ఆచరణాత్మకం కావటమే ఆత్మ పరిణామశీలం కావటం. ఆత్మ తొలి ప్రయాణం మానవ ప్రాంగణం నుండే.. మరి ప్రయాణం దివ్య ప్రాంగణం నుండి. అంటే ఆత్మ ప్రయాణం ‘మన’ నుండి ప్రారంభమై పదుగురి ‘హితం’తో ఆచరణబద్ధమై దివ్యత్వంగా పరిణమిస్తుంది.
మన ఆత్మ తొలి దశలో తన తనానికే పరిమితమై ఉంటుంది. అంటే మానవ మనుగడపైనే దృష్టి అంతా. అలా వర్తమానమంతా మానవత్వంతోనే. అయితే కర్మాచరణతో జ్ఞాన విజ్ఞాన ‘అన్విత’మైన ఆత్మ తన పరిణామాన్ని గురించి వివేచిస్తూ ఇటు మానవ తత్వంతోను, అటు దివ్యత్వంతోను చరించటం ప్రారంభిస్తుంది. అంటే మానవత్వ దివ్యత్వాల సమ్మేళనం ఆత్మపరంగా మలి పరిణామం. దివ్య ప్రాంగణంలోకి అడుగిడిన ఆత్మశక్తి మరోమారు గతంవైపు మరలకుండటం అద్భుత పరిణామం. ఇలా గతాన్ని వీడిన ఆత్మ దివ్యసంభరితం అవుతుంది. ఆత్మ పరిణామంలో ఇది మలి పరిణామం. అంటే మానవ రూపం అరూపం అయ్యేలోపు విశ్వాత్మగా పరిణమించటాన్ని ఆత్మ తన శాశ్వతత్వంగా పరిగణిస్తుంది.
* * *
ఆత్మ పరిణామంతో మానవతత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని వేరువేరుగా చూడలేం. రెండూ బింబ ప్రతిబింబాలుగా పరిణమించటమే ఆత్మ పరిణతి. అంటే మానవ దేహంలోని ఆత్మ వైయక్తికంగాను, ప్రాకృతికంగాను విశ్వజ్ఞతతో విశ్వ పరిణామ హేతువు అవుతుంది. ఈ స్థితితో మన వర్తనం ఉన్నతవర్తనం అవుతుంది. మనల్ని మనం ఉద్ధరించుకోవటం అంటే ఇదే.
ఇటువంటి పరిణామంలో ఆత్మకు కాలంతో ప్రాంతంతో పని ఉండదు... రూపంతో, అరూపంతో పని ఉండదు.. మతంతో, సమాజంతో పని ఉండదు. తనకు తానుగా మిగలటమే ముఖ్యం. తన చైతన్యమే తన ఆత్మజ్ఞత. ఇలా పరిణమించటానే్న ‘తృప్తాత్మ’ కావటం అంటుంది గీత.
‘జ్ఞాన విజ్ఞానా తృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియః’
మనం తృప్తాత్మలం కావాలంటే మన అంతఃకరణం జ్ఞాన విజ్ఞాన సంపూర్ణం కావాలి... మనం వికార రహితం కావాలి.. ఇంద్రియ నిగ్రహం సాధ్యమై జితేంద్రియులం కావాలి. ఇటువంటి సమాన దృష్టే ఆత్మ దృష్టి అంటుంది కృష్ణగీత.
ఇలా ఆత్మను గురించి తెలుసుకొనటం ఆత్మ విద్య.. ఆచరణ శీలం కావటం ఆత్మసాధన.. సంయమ స్థితిని చేరుకోవటం ఆత్మయోగం - ఇలా మూడు పాయలుగా సాగిపోయేదే భగవద్గీతలోని ఆత్మ సంయమయోగాధ్యాయం. ఆరవ అధ్యాయంగా గీతలో కృష్ణుడు ఈ యోగావిష్కరణ చేయటం కాకతాళీయం కాదు.. ఆత్మ విశ్వాత్మగా పరిణమించటంలో యోగ సాధనాపరమైన షట్చక్ర సాధన ఎంత అవసరమో గీతను జీవన గీతగా మలచుకోవటంలోను ఈ అధ్యాయ ఆకళింపు, ఆచరణ, సాధన అంతే అవసరం.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946