జాతీయ వార్తలు

ప్రధాని చర్చకు రావలసిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లపై చర్చకు రాకుండా తప్పించుకుంటున్నారంటూ ప్రతిపక్షం గురువారం రాజ్యసభను స్తంభింపజేసింది. నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే భోజన విరామం తరువాత ఆయన సభకు రాకపోవడంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. పెద్దనోట్ల రద్దుపై చర్చ జరిగినంత సేపూ మోదీ రాజ్యసభలో ఉండాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు. ప్రధాని ఉంటేనే కరెన్సీ రద్దుపై ప్రారంభించిన చర్చను ముందుకు సాగనిస్తామని ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి, సిపిఎం పక్షం నాయకుడు సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. దీనికి సభానాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ బదులిస్తూ ప్రధాని సభలో ఉన్నందున ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి బదులు పెద్ద నోట్ల రద్దుపై ప్రారంభించిన చర్చను ముందుకు కొనసాగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. దీంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ పెద్దనోట్ల రద్దు అంశంపై ఈనెల 16 తేదీనాడు ప్రారంభించిన చర్చను గురువారం మళ్లీ కొనసాగించారు. చర్చ దాదాపుగంట పాటు కొనసాగింది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు నరేష్ అగర్‌వాల్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఓబ్రేన్ తమ పార్టీల వాదన వినిపించారు. ఆఖరున మాయావతి కూడా కొద్ది సేపు మాట్లాడారు. ప్రధాని మోదీ భోజన విరామం తరువాత సభకు రాకపోతే చర్చ ముందుకు సాగే ప్రసక్తే లేదని ఆమె అప్పుడే తేల్చిచెప్పారు. సభ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం తీసుకుంది. మోదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ సభలోనే ఉన్నారు.
రాజ్యసభ 2 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు ఆయన సభకు రాలేదు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్షం ప్రధాని వచ్చేంత వరకూ సభను కొనసాగనిచ్చే ప్రసక్తే లేదంటూ అడ్డుపడ్డారు. పెద్దనోట్ల రద్దు చర్చ నుంచి ఆయన పారిపోయారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అంతేకాకుండా పోడియం వద్దకు దూసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీంతో రాజ్యసభ దద్దరిల్లిపోయింది. మోదీ భోజన విరామం తరువాత సభకురారని తాను ముందే చెప్పానని మాయావతి స్పష్టం చేశారు. ఇలా ఉండగా రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజి కురియన్ సభను మొదట మూడు గంటల వరకు, ఆ తరువాత శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ ఉదయం సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షం పోడియం వద్దకు వచ్చి నరేంద్ర మోదీ సభకు రావాలంటూ నినాదాలు ఇచ్చింది. కాంగ్రెస్ సభ్యులు ఎంకె ఖాన్, టి సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు విపక్ష సభ్యులు పోడియంను చుట్టముట్టి ఎన్‌డిఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. చేసేది లేక కురియన్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేసిన అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
లోకసభలోనూ అదే వరస
లోక్‌సభ గురువారం కేవలం 13 నిముషాల పాటు మాత్రమే కొనసాగింది. అది కూడా ప్రతిపక్షం, అధికార పక్షం సభ్యుల గొడవ, గందరగోళం మధ్య కొనసాగింది. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు తాము 56 నియమం కింద ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టనంత వరకు సభను ముందుకు సాగనివ్వమని ప్రతిపక్షం తేల్చిచెప్పింది. వాయిదా తీర్మానాన్ని చేపట్టేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించటంతో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి ఎన్‌డిఏ ప్రభుత్వం, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చాయి. లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ మొదట సంతాప తీర్మానాలు చేపట్టారు. ఆ తరువాత ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించగానే ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే లేచి వాయిదా తీర్మానాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక సభ్యుడు తన చేతిలోని పత్రాలు చింపి పోడియం వైపు విసిరివేసారు. దీంతో సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. సభ అదుపులోకి రాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు.
chitram...
గురువారం రాజ్యసభలో మాట్లాడుతున్న మాయావతి, సీతారాం ఏచూరి