ఉత్తరాయణం

ఇవేం ఆలోచనలు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతి నేతల సృజనాత్మకత ప్రస్తుతం వెర్రితలలు వేస్తోంది. మేధావిగా, ఉన్నతాధికారిణిగా గుర్తింపు పొంది, ఇపుడు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్న కిరణ్ బేడీ- ‘టాయిలెట్లు వాడని గ్రామాలకు రేషన్ బియ్యం కట్ చేయాలం’టూ ఆదేశాలు జారీ చేయడం విడ్డూరం. పేదరికం వల్లనో, టాయిలెట్లను నిర్వహించేలా నీటి సరఫరా లేకనో, మరే గత్యంతరం లేని పరిస్థితుల్లో బహిర్భూమికి వెళితే, ప్రభుత్వ నిర్వాకానికి ప్రజలు శిక్ష పడాలన్న మాట. అయితే, విమర్శలకు జడిసి గవర్నర్ తన ఆదేశం వెనక్కి తీసుకొన్నారనుకోండి. అది వేరే విషయం. ఇక్కడ చూడాల్సింది వారి ఆలోచన తీరు. ఇంకో వార్త- ఢిల్లీలో ఎర్రకోటని నిర్వహించడానికి ప్రయివేటు కంపెనీ కావాలట ప్రభుత్వానికి. వేలంపాటలో 25 కోట్ల రూపాయలు ఇచ్చిన దాల్మియా కంపెనీ 5 సంవత్సరాలకు దాన్ని నిర్వహణ చేస్తుందట. జాతినుద్దేశించి ఏటా దేశ ప్రధాని ఆ కోట బురుజుల నుండి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇవ్వడం తొలినుండి వస్తున్న ఆచారం. జాతి ఘన వారసత్వ సంపదని, దాని పవిత్రతను కాపాడాల్సిన ప్రభుత్వం దాన్ని ఒక ప్రయివేటు ప్రచార వేదికగా దిగజార్చడం అతి తెలివి. ప్రధాని గంభీరంగా ప్రసంగిస్తున్నపుడు, బురుజులపై ‘దాల్మియా సిమెంట్‌నే వాడండి.. మన్నికకు మన్నిక.. చవక’ అంటూ ప్రకటన వస్తుంటే ఏం సబబు? వారసత్వ కట్టడాలు జాతి గౌరవాన్ని గుర్తుచేస్తూ స్ఫూర్తి నింపుతాయి. వాటిని కాపాడుకోలేమా? స్వతంత్ర దేశాన్ని స్వేచ్ఛా మార్కెట్‌గా ప్రకటించుకోవడం లక్ష్యమైతే ఇది కరెక్ట్ కావచ్చు కానీ జాతీయతా స్ఫూర్తి నింపాలంటే మాత్రం కలలో కూడా చేయకూడని నిర్ణయం. అపచారం.
-డా. డి.వి.జి. శంకరరరావు, పార్వతీపురం

మనం చేస్తే ఒప్పే..
ప్రధాని ఏం చేసినా విమర్శించాల్సిందే అన్న ధోరణిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోదీ ఉపవాస దీక్షను ఎద్దేవా చేశాడు. ‘దేశ ప్రధాని దీక్షలో కూర్చోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? హామీలు నెరవేర్చమంటే దీక్షలూ, ధర్నాలా?’ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. దీక్ష పేరిట మోదీ టెంట్ వేసుకొని కూచోలేదు. ఉపవాసం చేస్తూనే తన రోజువారీ పనులు మామూలుగా చేసుకుపోయాడు. మరి అంతలా విమర్శించిన బాబు చేస్తున్నదేమిటి? తన జన్మదినం నాడు పగటి పూటంతా దీక్షలో కూర్చుని నిరసన తెలపలేదా? మంచిదే.. మోదీని మనసారా తిట్టడానికి మరో అవకాశం కల్పించుకున్నాడు చంద్రబాబు!
-సౌందర్య, కాకినాడ

రాజధానిని నిర్మించుకుందాం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజలు రుణసహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వటం రాష్ట్భ్రావృద్ధిపై ఆయనకున్న తాపత్రయం ఎంతటితో తెలియజేస్తోంది. జాతీయ బ్యాంకులను, నగదు లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బంగారం, పొలాలు కొనుగోలు చేద్దామంటే ఆదాయపు పన్నుశాఖ కబంధ హస్తాలు, వ్యాపారంలో పెట్టుబడికి జిఎస్‌టి, షేర్ మార్కెట్ విలవిలలాడటం వంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎంత సొమ్మైనా ఇంట్లోనే దాచుకునే దుస్థితి దాపురించింది. ఏదైనా ఊరు వెళదామన్నా, ఇంట్లో ఉన్నా దొంగల భయంతో చాలామంది నిద్రకు దూరవౌతున్నారు. రాజధాని నిర్మాణానికి పెట్టుబడి పెడితే- రాష్ట్భ్రావృద్ధిలో మనం పాలు పంచుకున్నామన్న సంతోషంతోపాటు ప్రభుత్వం నుంచి అధిక వడ్డీ పొందవచ్చు. రుణాలిచ్చే వారికి ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కల్పించాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందు వరుసలో నిలిస్తే ప్రజలు నిర్భయంగా పెట్టుబడులు పెట్టి వారి రాజధానిని వారే నిర్మించుకుంటారు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

సత్తా చాటిన సర్కారీ బడులు
టెన్త్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటడం హర్షణీయం. తొలి నాలుగు స్థానాలను ప్రభుత్వ పాఠశాలలే కైవసం చేసుకున్నాయి. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆటపాటలతో కూడిన విద్య, విశాలమైన తరగతి గదులు, ఇతర సౌకర్యాలు, పబ్లిక్ పరీక్షలకు కొన్ని నెలలు ముందునుంచే స్టడీ అవర్స్ వంటివి ఉత్తీర్ణతాశాతం పెరగడానికి దోహదం చేశాయి. అయినా తల్లిదండ్రులు ఇవన్నీ గ్రహించక తమ పిల్లలను సుదూర ప్రాంతాలలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందడానికి, జ్ఞాన సముపార్జనకు, ఆటపాటలతో శారీరకంగా దృఢంగా ఉండటానికి ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమమని అందరూ గ్రహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి వాటిని కాపాడుకోవాలి.
-సరికొండ శ్రీనివాస రాజు, వనస్థలిపురం