ఉత్తరాయణం

నకిలీ విత్తనాలతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురుస్తున్నాయి. రైతన్నలు తమ భూములలో విత్తనాలు నాటడానికి సిద్ధమవుతున్నారు. రైతులు ఇప్పటికే తమ వ్యవసాయ భూములను శుద్ధి చేసుకుని ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. ప్రత్తి, మిరప విత్తనాలను కొనుగోలు చేసుకుంటున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పురుగుల మందుల దుకాణాల యజమానులు, బ్రోకర్లు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో రైతుబంధు చెక్కులను అందుకున్న కర్షకులు విత్తనాలు అమ్మే దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వందలాది రకాల పత్తి విత్తనాలు బస్తాల రూపంలో, ప్యాకెట్ల రూపంలో వివిధ కంపెనీలవి అందుబాటులో వున్నాయి. టీవీలలో, పత్రికలలో సైతం ఫలానా కంపెనీ పత్తి విత్తనాలను వాడండి, అధిక దిగుబడిని పొందండి.. అంటూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పురుగు మందులు, విత్తనాలు అమ్మే వ్యాపారులు తమకు లాభసాటి అయిన కంపెనీల విత్తనాలనే రైతులకు అంటగడుతున్నారు. ఇదే అదనుగా భావించి పక్క రాష్ట్రాల నుండి నకిలీ విత్తనాలను తెప్పించి విక్రయిస్తున్నారు. రైతులు ఏటా నకిలీ విత్తనాలను నాటి దిగుమతి రాక నష్టపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటుచేసి మేలైన పత్తి, మిరప విత్తనాల గురించి ప్రచారం చేయడంలో వెనుకంజ వేస్తున్నారు. నకిలీ విత్తనాలను అమ్మే దుకాణాలపై అధికారులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారు. దీంతో నకిలీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోతున్నారు. ఆర్థిక నష్టాలతో కొందరు కర్షకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. నకిలీ విత్తనాలు అమ్మే షాపుల లైసెన్సులను రద్దుచేయాలి. నమ్మకమైన దుకాణాల వద్ద విత్తనాలను, ఎరువులను రైతులు కొనుగోలు చేయాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

‘బెజవాడ’గా పేరు మార్చాలి
బెజవాడ పట్టణానికి ‘విజయవాడ’ అన్న పేరు పెట్టడం 1940 ప్రాంతాలలో కీ.శే. అయ్యదేవర కాళేశ్వరరావు (ఆ తరువాత అసెంబ్లీ స్పీకరు) ప్రోద్బలంతో జరిగిందన్నది గతంలో జరిగిన ప్రచారం. కాగా, బెజవాడ అని పలకడం చాలా తేలిక. పైగా అసలు పేరు అదే. మధ్యలో వచ్చిన విజయవాడ పేరును తొలగించి బెజవాడ అని మళ్లీ పేరు పెడితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. విజయవాడ పేరు మార్చాలంటే- కొందరు ‘వంగవీటి రంగా’ పేరు పెట్టాలని గొడవ చేస్తారేమో!
-ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్

మన రోడ్లకు బోర్డులెందుకు?
ప్రతి రోజూ ఏదో ఒక సమస్యను బయటకు తెచ్చి భాజపాని తిట్టిపోయనిదే ఏపీ సీఎం చంద్రబాబుకు రోజు గడిచేటట్టు కనిపించడం లేదు. ఆయన తాజాగా జాతీయ రహదారి సంస్థపై పడ్డారు. ‘మీరు రోడ్లు వేయకపోతే మేమే వేసుకొని ఇది మా రోడ్డు అని బోర్డులు పెట్టుకుంటాం’ అని చంద్రబాబు అనడం విడ్డూరం. మనవాళ్లు ఎంత బాగా రోడ్లు వేస్తారో మనకు తెలిసిందే కదా. ఆరు నెలల్లోగా గోతులు పడి గతుకులు ఏర్పడ్డాయి. వాటికి మరమ్మతు చేయడానికి మన ఇంజినీరింగ్ సిబ్బందికి తీరికే ఉండదు. ప్రత్యేకంగా బోర్డులు అక్కరలేదు. గతుకులు కనిపిస్తేచాలు- ఇది మన అధికారులు వేసిన రోడ్డు అని తెలిసిపోతూనే ఉంటుంది! జాతీయ రహదారుల సంస్థవి కాదని ఇంక బోర్డులెందుకు?
-ప్రవీణ్, కాకినాడ

పెట్రో మంటలకు రాజకీయాలా?
రాజకీయ సెగతో పెట్రోల్ పెరగడం, తగ్గడం జరగడం మొదలుపెడితే, ఇక అన్ని రకాల సరుకుల రేట్లకి రాజకీయ రంగు అంటుకోవడం తథ్యం. కర్నాటక శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పెట్రో ధరలను కేంద్రం పెంచలేదు. ఓట్లను కొల్లగొట్టడానికి ఇదో అస్త్రంగా పాలకులు భావిస్తే వారికి భవిష్యత్‌లో చేదు ఫలితాలు తప్పవు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పెట్రోధరలను రాజకీయాలతో ముడిపెట్టలేదనేది జగమెరిగిన సత్యం. నేటి రాజకీయాలు ప్రజల జీవితాలతో ఆడుకోవటం దారుణం. రానున్న కాలంలో జనం ప్రతీకారం తీర్చుకోవడం తథ్యం.
-సి.వి.ఆర్.కృష్ణ, హైదరాబాద్