ఉత్తరాయణం

ఫీజుల భారం మోయలేం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ నిరాటంకంగా సాగుతోంది. విద్యాబుద్ధులు బోధించి సరస్వతీ కేంద్రాలుగా వెలుగొందాల్సిన ప్రైవేట్ పాఠశాలలు అంగళ్లుగా మారాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వీర్యమైన కారణంగా సామాన్యులు సైతం ప్రైవేట్ విద్యాసంస్థలను ఆశ్రయించడంతో దోపిడీ విశృంఖలమైంది. చాలా పాఠశాలలు 25 శాతం దాకా ఫీజులను పెంచేసాయి. కంప్యూటర్ క్లాసులు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పెషల్ క్లాసులంటూ ప్రత్యేక ఫీజుల బాదుడు తప్పడం లేదు. యూనిఫామ్స్, పుస్తకాలు, స్కూలు బ్యాగులు తమ స్కూళ్ళలోనే కొనాలన్న నిబంధన పెట్టి మార్కెట్ ధర కంటే ఎక్కువగా అమ్మి తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. కట్టిన ఫీజులకు పూర్తి మొత్తానికి రశీదులు కూడా ఇవ్వడం లేదు. ఫీజుల పట్టిక బోర్డు విధిగా స్కూలు ఆవరణలో పెట్టాలన్న విద్యాహక్కు చట్టం నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఇదేమని అడిగిన తల్లిదండ్రులకు- ‘ఇష్టం లేకపోతే మా స్కూలులో మీ పిల్లలను చేర్చవద్దు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి విద్య పేరిట జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

మహిళల కోసం గ్రంథాలయాలు
ఒకప్పుడు స్ర్తిలు చదువులో వెనుకబడేవారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు. కొందరు సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా స్ర్తిలు కూడా విద్య నేర్చుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఏ పబ్లిక్ పరీక్షలలోనైనా, పోటీ పరీక్షలలోనైనా అమ్మాయిలే ఎక్కువగా ముందడుగు వేస్తున్నారు. ఉద్యోగినులు, గృహిణులు తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గ్రంథాలయాల ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రస్తుతం లైబ్రరీలు పురుషులకే అందుబాటులో ఉంటున్నాయి. మహిళలు గ్రంథాలయాలకు వెళ్ళడం మరీ తక్కువ. మహిళలు విజ్ఞానాన్ని పెంచుకోవడానికి, సమాజంలోని పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకోవడానికి వివిధ రకాల పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. వారికోసం ప్రత్యేకంగా గ్రంథాలయాలను స్థాపించాలి. అలా వీలుకాని చోట్ల గ్రంథాలయాలలో మహిళలకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి. మహిళలు కూడా టీవీ సీరియల్స్‌కు, స్మార్ట్ఫోన్లకు బానిసలు కాకుండా తీరిక సమయాన్ని పుస్తక పఠనంతో సద్వినియోగం చేసుకోవాలి. గ్రంథాలయాలలో సభ్యులుగా చేరి, ఇళ్ళకి పుస్తకాలను తెచ్చుకొని పఠించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం